"ఎప్పుడొచ్చారు? బాగున్నారా?"
రమణమూర్తికి గొంతు పెగల్లేదు.
"నిన్న వచ్చాడమ్మా!" రామనాధం సమాధానం చెప్పాడు.
రమణమూర్తి ఆమె ముఖంలోకి వెర్రివాడిలా చూస్తూ నిలుచున్నాడు.
"అదేమిటయ్యా అలా పిచ్చివాడిలా చూస్తావేం? సమాధానం యివ్వవే" గలగల నవ్వింది సావిత్రి.
ఆ నవ్వు కూడా సహజంగా అనిపించింది. ఆమె చిరునవ్వు భయంకరంగా వుంది.
"తీసుకొస్తాడులే! ఎలాగున్నావమ్మా!" రామనాధం అడిగాడు.
"నాకేం! బాగానే ఉన్నాను. రేపు తప్పక యింటికి తీసుకు వెళ్ళాలి" మారాం చేస్తున్నట్టు అంటూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసింది.
రమణమూర్తి కెవ్వున కేక వేయబోయి అతి బలవంతం మీద ఆపుకున్నాడు.
రామనాధం భయపడలేదు.
"రేపు తప్పక తీసుకెళతాను తల్లీ" అంటూ మెడమీదున్న చేతుల్ని చిన్నగా విడదీశాడు.
"అనసూయను తీసుకురండీ! దాన్ని చూసి చాలా కాలమైంది." అన్నది సావిత్రి.
రమణమూర్తి ఆశ్చర్యంతో తలమునకలై పోతున్నాడు.
"ఏమండీ మాట్లాడరు? అనసూయను తీసుకొస్తారు కదూ?"
"తీసుకొస్తాను" ఎలాగో అన్నాడు.
అవును! అనసూయ కూడా యిక్కడికే రావాల్సి వస్తుందేమో!
రమణమూర్తి మనసులో ఏదో కస్సున దిగినట్టు విలవిలలాడిపోయాడు.
"బలే! బలే! మా అనసూయ వస్తుంది. మీరు చాలా మంచివారు."
తనను చూడగానే మీదపడి రక్కుతుందని భయపడ్డాడు రమణమూర్తి. అలా చెయ్యకపోగా అతన్ని మంచివాడనటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
"అమ్మా!"
అంతలోకే సావిత్రి చూపులు మారిపోయాయ్.
"ఏయ్ ఎవరు నువ్వు! నీకు నేను అమ్మనా? బలే! బలే! ఈ ముసలాడికి అమ్మనట. ఏయ్! నీకు కూడా అమ్మనేనా!" రమణకేసి చూస్తూ అడిగింది.
"అమ్మో అదుగో డాక్టరమ్మ వస్తోంది అంటూ గిర్రున తిరిగి వెళ్ళసాగింది."
అలా వెళుతున్న సావిత్రిని కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు రమణమూర్తి.
సావిత్రి గాలిలో చేతులు తిప్పుతూ, తనలో తనే మాట్లాడుకుంటూ వెళుతున్నది.
సావిత్రి విసిరికొట్టిన మామిడి పండ్లను మరో స్త్రీ వచ్చి తీసుకుంది. అంతలోనే వదిలేస్తూ "అమ్మో కాలిపోతున్నాయ్" అంటూ వదిలేసి వెళ్ళిపోయింది.
రమణమూర్తి రామనాధం కేసి చూశాడు.
రామనాధం వెళ్ళిపోతున్న కూతుర్నే చూస్తూ నిలబడ్డాడు.
ఆమె తోటపని చేస్తున్న వాళ్ళతో కలిసిపోయింది.
రామనాధం పై పంచతో కళ్ళు తుడుచుకున్నాడు.
భారంగా అడుగులు వేస్తూ, ఎనభయ్ ఏళ్ళ వృద్ధుడిలా నడుస్తున్నాడు రామనాధం.
రమణ గుండె చిక్కబట్టింది.
గొంతు పొడారిపోతున్నది.
అనసూయ! తన అనసూయ కూడా ఇలాగే అవుతుందా?
రమణమూర్తికి వెన్నెముకలోకి ఏదో జరజర పాకినట్టు అయింది.
కళ్ళముందు అనసూయ చప్పట్లు కొడుతూ నవ్వుతూ, ఆ పిచ్చివాళ్ళమధ్య, పచ్చంచు ముతక తెల్లచీరలో కన్పించినట్టయింది.
"వీల్లేదు! వీల్లేదు అనసూయ ఎన్నటికీ కాదు. కేవలం అనసూయకు తనంటే భయం ఏర్పడింది. సావిత్రికి పిచ్చనీ, అందువల్లనే ఏవేవో ఊహించుకొని కథలు చెప్పేదని తెలిస్తే అనసూయకు భయం పోతుంది. కాని సావిత్రి పిచ్చిదై పోయిందంటే నమ్ముతుందా?"
ఇద్దరూ రోడ్డుమీదకు వచ్చారు.
ఎవరికీ మాట్లాడాలనిపించలేదు.
"బాబూ! సావిత్రిని చూశావుగా? ఆమాటే అనసూయకు చెప్పు. ఆమె భయం పోతుంది" అన్నాడు రామనాధం.
"నేను చెబితే తను నమ్మందండీ"
"అలాగా!" ఆలోచిస్తూ నడుస్తున్నాడు రామనాధం.
"మీరు వచ్చి..." అంటూ ఆగిపోయాడు రమణమూర్తి.
"అలాగే బాబూ, సాయంత్రం బయలుదేరుదాం. మీ పిన్నిని కూడా తీసుకొస్తాను. మేమిద్దరం అమ్మాయికి అసలు విషయం చెబుతాము. ఆమె భ్రమలు తొలగిపోతాయ్. కనీసం ఈకాస్త మంచి పనైనా చేస్తే నా సావిత్రి మామూలు మనిషయి తిరిగి వస్తుందేమో" గద్గద కంఠంతో అన్నాడు.
"థాంక్యూ బాబాయ్!" సంతోషంగా అన్నాడు రమణ.
"సావిత్రిని ఆ ఆసుపత్రినుంచి డిస్ ఛార్జి చేయించి భయంకరం నర్సింగ్ హోమ్ లో చేర్పిద్దాం బాబాయ్. ఆయన చాలా గొప్ప సైకియాట్రిస్టు. సావిత్రికి తప్పక నయమవుతుంది."
"నిజంగానా బాబు! సావిత్రికి నయమవుతుందా?" రామనాధం ఆగి రమణ రెండుచేతులూ పట్టుకున్నాడు.
"తప్పక నయమవుతుంది. మీరు వస్తున్నారుగా. భయంకరంతో మాట్లాడదాం" అన్నాడు రమణమూర్తి.
రామనాధం పెద్ద పెద్ద అంగలువేస్తూ నడవసాగాడు. అతని మనసు తేలిగ్గా గాలిలో తేలిపోతున్నట్టుంది.
--------శుభం------