Previous Page Next Page 
పిపాసి పేజి 38


    "మేడమ్ క్షమించండి. మీ స్వంత విషయాలడిగి మీ మనస్సుని కష్టపెట్టాను."  


    "ఫరవాలేదు అభిమానంతో అడిగినవారికి, మనస్సు విప్పి చెప్పుకుంటే గుండెల్లోని భారం తగ్గినట్టుంటుంది." అంటూ మళ్ళీ మొదలెట్టింది.   


    కానీ మావారు కూడా నన్ను కాకుండా, నా సంపాదనను ప్రేమించే డబ్బు మనిషిగా మారడం నా దురదృష్టం."


    మీ వారు డబ్బు మనిషిగా మారారని మీరు ఎందుకనుకుంటున్నారు. మీ నాట్యం మీద వుండే మక్కువతోనే నాట్యం చెయ్యమన్నారేమో డబ్బుకోసమని ఎందుకనుకోవాలి" అడిగింది మిసెస్ రాఘవన్.       


    "డబ్బుకోసం కాకపోతే, ఇన్నాళ్ళ నుంచి నేనిస్తూన్న డబ్బుని ఎందుకు తీసుకుంటున్నారు. మాటవరసకయినా వద్దనడంలేదే? ఉద్యోగం మానేసి సంవత్సరం కావస్తోంది. మామగారి మందులకీ ఇంటి ఖర్చులకీ బోలెడు ఖర్చవుతోంది. ఈ డబ్బంతా ఎక్కణ్నుంచొస్తోంది. ఆ ఇంట్లో ఎవరికీ నేనఖ్కరలేకపోయినా, నేను సంపాదించిన డబ్బు మాత్రం కావాలి. మాటా మాటా అనుకుని పౌరుషంతో నాతో మాటలు మానెయ్యొచ్చుకానీ, డబ్బు మాత్రం పుచ్చుకోవచ్చునా? మిసెస్ రాఘవన్!


    డబ్బు వాడుకుంటున్నారని కాదు నా బాధ నన్నర్థం చేసుకోలేకపోయారే అనే. నేను పలకరించినా పలకరు, అత్తగారూ, మామగారూ. నా కంటికే కనపడరు మావారు, అటువంటప్పుడు వాళ్ళని డబ్బు మనుషులనక మరేమనాలి" ఏడవటం వల్ల వెక్కిళ్ళొచ్చాయి కూజాలోంచి మంచి నీళ్ళు గ్లాసుల్లో పోసుకుని తాగుతూ, చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటూన్న రాధికకేసి జాలిగా చూసింది మిసెస్ రాఘవన్.  


    తన పర్సులోంచి చిన్న పాస్ బుక్ తీసి రాధికకి చూపించింది. అది రాధిక పాస్ బుక్ ఇంతవరకూ తన పేరిట జమ అయిన డబ్బు ఎనభై రెండు వేలు, తన కళ్ళని తానే నమ్మలేకపోయింది రాధిక.


    "ఇంత డబ్బే ఎక్కణ్ణుంచొచ్చింది?" అయోమయంగా అంది.


    "మీవారు మీరు ఎప్పటికప్పుడు ఆయన చేతికిచ్చిన డబ్బు బ్యాంకులో వెయ్యమని నాకిచ్చేవారు.


    "అంటే ఆ డబ్బుని ఆయన వాడుకోవడం లేదా?"


    "లేదు."


    ఆశ్చర్యంతో గుడ్లప్పగించింది రాధిక.


    "మరి ఇంటి ఖర్చు మందుల ఖర్చులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయ్?"


    "మేడమ్ నిజంగా ఆ విషయాలు నాకు తెలీదు కానీ వాళ్ళూ వీళ్ళూ అనుకోవటమేమిటంటే అతను తన స్నేహితుని గదిలో కూర్చుని బొమ్మలువేసి, ఆ పెయింటింగ్సుని అమ్ముతున్నారట. బహుశా ఆ డబ్బుతోనే ఇల్లు గడుపుతున్నారేమో."    


    రాధిక ఈసారి మరింత ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఏదో మైకం కమ్ముతూన్నట్లు, తలతిరిగిపోయింది. ఒక ఇంట్లో వుంటూ ఏం జరుగుతోందో తెలుసుకోలేని తన అజ్ఞానానికి సిగ్గుపడింది ఎవరికీ అక్కరకురాని ఈ డబ్బు అన్యోన్య దాంపత్యంలో అపోహలు సృష్టించి, వారి ఎడబాటుకు కారణభూతమైన ఈ డబ్బు ఎనభై రెండువేలు తనని చూసి నవ్వుతూన్నట్టనిపించింది, నోట మాటరాక మౌనంగా అలా వుండిపోయింది రాధిక.    


    "మేడమ్ ఇప్పటికయినా మీ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పెరిగితే అదే సంతోషం ఒకరినొకరు అర్థం చేసుకుని సుఖంగా వుండండి" ఆశీర్వదించింది ఆమె కళ్ళనుంచి కన్నీళ్ళు జలజలా రాలాయి.     


    మీరూ ఏడుస్తున్నారా మిసెస్ రాఘవన్. నా తెలివితక్కువతనం నన్ను ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుసుకోనీకుండా చేసింది నన్ను అందలమెక్కించిన నా భర్తని నన్ను అధఃపాతాళానికి తొక్కెయ్యాలనుకున్న ఆ దుర్మార్గుడితో పోల్చి అనరాని మాటలన్నాను. ఎంతగానో అతణ్ని కించపరచాను. ఈపాటికి మధన్ మనసు విరిగిపోయుంటుంది" సోఫా మీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.    


    "మేడమ్. మీలాగే నేనూ అర్థంలేని అహంకారంతో, నా జీవితాన్ని నేనే శపించుకున్నాను దాని ప్రతిఫలమే ఈనాడు అనుభవిస్తున్నాను."   


    "మీరా?"                           

 Previous Page Next Page