Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 38


    "సరే, మీరు ముగ్గురూ వెళ్ళిరండిరా!" అన్నాడు మాధవయ్య చిన్నవాడిని ఎత్తుకుంటూ.

 

    గదిలోంచి మూలుగు ఇంకా గట్టిగా వినవస్తోంది. మాధవయ్య వూపిరి బిగపట్టి వింటున్నాడు. అంతలోనే మూలుగు ఆగిపోయింది. ఎడంగా బల్లమీద కూచున్న పురోహితుడు త్రిపురయ్యగారి కళ్ళల్లోకి ఆదుర్దాగా చూశాడు.

 

    పురోహితుడు చేతిలో పంచాంగాన్ని తెరచిచూచి, గోడమీద గడియారంవైపు వోసారి చూసి అన్నాడు. "ఇప్పుడే సూర్యగ్రహణం పట్టింది. సూర్యభగవానుడు రాహువు నోట్లో చిక్కుకున్నాడు."

 

    "ఇంకెంతసేపటికి?" దీర్ఘ విశ్వాసం తీశాడు మాధవయ్య.

 

    గదిలోనుంచి మళ్ళీ మూలుగు వినిపించింది. చేతిలో పిల్లాడు 'బార్' మన్నాడు. "భయంలేదు బాబూ! ఏడవకు. ఇప్పుడే అమ్మదగ్గరకెళదాం, ఒరేయ్ రాముడూ!" పాలేరును కేకవేశాడు మాధవయ్య.

 

    "ఏందయ్యగోరూ!" అంటూ వచ్చాడు పాలేరు.

 

    "చంటోణ్ణి తీసుకెళ్ళు. వెళ్ళు బాబూ! రాముడుతో వెళ్ళు. తువ్వాయి ఏం చేస్తోందో చూసిరా!" అన్నాడు మాధవయ్య.

 

    తువ్వాయి పేరు వినగానే పసివాడు మాధవయ్య చేతుల్లోంచి దిగి రాముడు చెయ్యి పుచ్చుకొని గొడ్లపాకవైపు నడిచాడు.

 

    మాధవయ్య ఆత్రంగా పురోహితునివైపు చూశాడు.

 

    "ఇంకా ఏడు నిముషాలకు గాని, సూర్యభగవానుడు విముక్తుడు కాడు!" అన్నాడు త్రిపురయ్య.

 

    "దీనివల్ల దోషం?" మాధవయ్య గొంతులో ఏదో అడ్డుపడింది.

 

    "ఉంటేనేం, దానికి తగ్గ శాంతిలేదూ? భయపడకండి! ఇలాంటి అన్ని దుర్ముహుర్తాలకు ఏదో శాంతి వుండనే వుంది" అన్నాడు త్రిపురయ్య ధీమాగా, అన్ని అమంగళాలకు ఉపశమనం తన చేతుల్లోనే ఉన్నట్టు.

 

    మాధవయ్య భయం రాహువు సూర్యుణ్ణి మింగేసి తన పొట్టలోనే పెట్టుకుని పారిపోతాడని కాదు_ భార్య పున్నమ్మ గర్భస్థ శిశువు ఏ ప్రమాదం లేకుండా వెలుగును చూడగలుగుతుందా అనే!

 

    "అది కాదు నా భయం. ఇలాంటి సమయంలో జన్మించిన శిశువులకు అంగవైకల్యం సంభవిస్తుందంటారు గదూ?" మాధవయ్య గుండెల్లో చెప్పలేనంత దిగులు పొంగుకొచ్చింది.

 

    "అన్నిటికీ ఆ శ్రీమన్నారాయణుడే వున్నాడు. భగవంతుని ప్రార్ధించండి" అన్నాడు కళ్ళు మూసుకుంటూ త్రిపురయ్య.

 

    "తమ నోముల పంట ఆడపిల్లే పుట్టి.....దానికి ఏదైనా అంగ వైకల్యం ప్రాప్తిస్తే?"

 

    నుదుటి మీద స్వేదబిందువుల్ని పై పంచెతో అద్దుకుంటూ పట్టు తప్పిపోతున్న కాళ్ళను నిలదొక్కుకుంటూ హృదయ స్పందనాన్ని అణచుకుంటూ, గది ద్వారానికి దగ్గరగా వెళ్ళి నుంచున్నాడు మాధవయ్య.

 

    పురిటింట్లోంచి "గణ గణ" వెండి పళ్ళెం మోత వినబడింది మాధవయ్య గుండెలు దడదడలాడాయి.

 

    "కేర్ కేర్" మన్న శిశురోదన. పున్నమ్మ మూలుగు ఆగిపోయింది.

 

    పురోహితుడు త్రిపురయ్య లేచి నిలుచున్నాడు. రెండు చేతులు పైకెత్తి నమస్కరించి మంత్రోచ్చారణ చేసి, మాధవయ్యవైపు తిరిగి అన్నాడు. "సూర్య భగవానుడికి విముక్తి కలిగింది."

 

    "అవును విముక్తి కలిగింది. భార్యా బిడ్డా గండం గడిచి బయటపడ్డారు." మనసులోనే అనుకున్నాడు. కాని బిడ్డ ఏం బిడ్డ? అంగవైకల్యంలాంటిది ఏమీ లేదుగదా? "ఓ భగవంతుడా! మగపిల్లవాడైనా ఇష్టమే కాని అంగవైకల్యంతో ఆడబిడ్డ మాత్రం వద్దు స్వామీ!" మనసులోనే వడ్డీకాసులవాడికి మొక్కుకున్నాడు.

 

    పురిటిగది తలుపులు తెరుచుకున్నాయ్. వేడి గాలీ, వాసనా బయటకు తోసుకొచ్చినై.

 

    మాధవయ్య మేనత్త బయటకొచ్చింది. మాధవయ్య ఆదుర్దాగా ఆమె చేతులు పట్టుకుని "అత్తయ్యా!" అని మాత్రమే అనగలిగాడు.

 

    "ఒరేయ్ మాధవుడూ! ఆడపిల్లరా! నీకు ఆడపిల్ల పుట్టిందిరా! నీకు కూతురు పుట్టిందిరా పిల్ల కుందనపు బొమ్మ!" అంది మాధవయ్య మేనత్త.

 

    మాధవయ్య హృదయం ఆనందంతో వెల్లువయింది. అతని హృదయాంతరాళాల్లో చెలరేగిన గిలిగింతలు, మాధవయ్య అలాంటి కేక పురిటింట్లోనుంచి చాలాసార్లు విన్నాడు. ఒకటా రెండా! నాలుగుసార్లు విన్నాడు.

 

    కాని ఈ ఏడుపు లోగడ విన్నదానికంటే భిన్నంగా వున్నట్లనిపించింది. అంతలోనే మాధవయ్య మనస్సులో ఓ సందేహం మెదిలింది.

 

    "అత్తయ్యా! బిడ్డకు ఏ అంగవైకల్యమూ లేదుగా?"

 

    బంగారమ్మ మాధవయ్య ముఖంలోకి చిత్రంగా చూసింది.

 

    "అదేమిటిరా మాధవుడా! అలాంటి అపశకునపు మాట లంటున్నావు? పిల్ల బంగారుబొమ్మ. లక్షణంగా వుంది."

 

    మాధవయ్య ఆత్రంగా గదిలోకి వెళ్ళబోయాడు.

 

    "ఆఁ ఆఁ ఉండు. ఇప్పుడే నువ్వు రాకూడదు" అంటూ మాధవయ్య అత్త లోపలకు వెళ్ళి తలుపు ఓరగా వేసింది.

 

    మాధవయ్యకు పున్నమ్మ మెరిసే కళ్ళలోకి ఎప్పుడు చూద్దామా అని వుంది కదూ మరి! నలుగురు మగాళ్ళ తరువాత పుట్టిందాయె ఆడపిల్ల! ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టింది. తనంత అదృష్టవంతుడు ఆ పల్లెపాలెంలోనే లేడు.

 

    "మాధవయ్యగారూ!" పురోహితుడు స్వరంలో ఏదో అపశ్రుతి వినిపించి ఉలిక్కిపడి చూశాడు. అంతవరకూ మాధవయ్య అతని వునికినే మర్చిపోయాడు ఆనందంలో.

 

    "బిడ్డ భూమిమీద పడింతరువాత ఐదు సెకండ్లకు కాని సూర్యభగవానునికి విముక్తి దొరకలేదు."

 

    "సూర్యభగవానుడి విముక్తి కోసం ఎవరేడుస్తున్నారయ్యా యిక్కడ?" అనాలనిపించింది మాధవయ్యకు.

 

    "అందువల్ల బిడ్డజన్మించినకాలం ఆపదకాలం. శాంతి చేయించాలి" అన్నాడు పురోహితుడు.

 

    "అంతేగదా! చెప్పండి, శాంతికి ఎంతవుతుందో! వెంటనే అదేదో జరిపించేయండి" అంటూ లోపలకు వెళ్ళి ఏభయ్ రూపాయలు తెచ్చి యిచ్చాడు మాధవయ్య.

 

    "సరిపోతుందా?"

 

    "భేషుగ్గా సరిపోతుంది. తమరి చెయ్యి మహా దొడ్డచెయ్యి." పంచాంగం చేతిలోకి తీసుకుంటూ లేచి నిలబడి అన్నాడు త్రిపురయ్య.

 

    "ఇంకా డబ్బు కావాలంటే సందేహించకండి."

 

    "తమరి ఉదారత్వం ఎవరికి తెలియంది? అవసరమైతే మళ్ళీ అడుగుతాను. వస్తాను" అంటూ త్రిపురయ్య సంతృప్తిగా వెళ్ళిపోయాడు.

 

    ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి. మాధవయ్య మేనత్త బయటకొచ్చి "వెళ్ళరా, మాధవుడూ! వెళ్ళి కూతుర్ని చూసుకో!" అంది.

 

    మాధవయ్య గబగబా గది లోపలికి వెళ్ళాడు. పిల్ల వంకా తల్లి వంకా ఇంతింత కళ్ళు చేసుకొని చూశాడు. పున్నమ్మ భర్తవంక చూసి నీరసంగా నవ్వింది. తన బాధ్యత నెరవేర్చుకున్నట్లు తృప్తిగా భర్త కళ్ళలోకి చూచింది.

 

    నేటికి తన భార్య నోములు ఫలించాయి. కడుపు పండింది. ఆడబిడ్డను కన్నది అనుకున్నాడు మాధవయ్య. భార్య పక్కలో నున్న పసికందును కనులార చూసుకున్నాడు.

 

    "ఎలా వుందండి?" అంది పున్నమ్మ. నీరసంగావున్న గొంతులో ఆనందం గంటలా ఖంగ్ మనిపించింది.

 

    "కుందనపు బొమ్మ. అచ్చం నీ పోలికే!" పున్నమ్మవైపు కొంటెగా చూస్తూ అన్నాడు మాధవయ్య.

 

    పున్నమ్మ పాలిపోయిన బుగ్గల్లోకి రక్తం చిమ్మింది. సిగ్గుతో ముఖాన్ని దిండులో దాచుకుంది.

 

    ఇంతలో పెద్దపిల్లలు ముగ్గురూ బిలబిలలాడుతూ లోపలికి పరుగెత్తుకొచ్చారు. మంచం చుట్టూ మూగారు.

 

    "మీకు చెల్లాయి పుట్టిందిరా!" అన్నాడు మాధవయ్య.

 

    "అమ్మా, చెల్లాయికి బాలనాగమ్మ పేరు పెట్టుకుందామే!" అన్నాడు సుబ్బారాయుడు మంచంమీదకు వంగుతూ.

 

    పున్నమ్మ భర్త ముఖంలోకి చూసింది.

 

    "అలాగే చెల్లాయికి నాగమ్మ అని పేరు పెట్టుకుందాం!" అన్నాడు మాదహ్వయ్య.

 

    "అమ్మా! చెల్లాయి కళ్ళు తెరవలేదేమే?" అన్నాడు రామదాసు బిడ్డ ముఖంలోకి ముఖంపెట్టి చూస్తూ.

 

    "అమ్మా! చెల్లాయి చూడమ్మా? ఎట్టా గుప్పెళ్ళు మూసిందో! అబ్బ, ఎంత బుజ్జి బుజ్జి పాదాలో!" అంటూ పాదాలు పట్టుకోబోయిన నాగభూషణం చేతిని పట్టుకున్నాడు మాధవయ్య.

 

    "అలా ముట్టుకోకూడదు, చెల్లాయికి నొప్పి పెడుతూంది" అన్నాడు రామదాసు.

 

    ఇలా పిల్లలు తండ్రిని ప్రశ్నలతో వేధిస్తుంటే పున్నమ్మ నిండుగా సంతృప్తిగా నవ్వుకుంటూ పడుకొంది.

 

    ఇంతలో చిన్నవాడు పరిగెత్తుకుంటూ తల్లిమంచందగ్గరకొచ్చాడు. తల్లి పక్కలో మరో పిల్ల ఉండటం చూసి బిక్కమొహం వేశాడు. పున్నమ్మ పడుకొనే సత్యాన్ని దగ్గరకు రమ్మని చెయ్యి చాచింది. వాడు అడుగు ముందుకు వెయ్యలేదు. కళ్ళార్పకుండా పున్నమ్మ పక్కలో పిల్లనే చూస్తూ నిల్చున్నాడు.

 

    "రారా బుజ్జీ, నీకు చెల్లాయి పుట్టింది చూడు" అన్నాడు మాధవయ్య.

 

    "నాకు చెల్లాయి వద్దు. నాకు అమ్మ కావాలి" అంటూ బావురుమన్నాడు పసివాడు. ఆ క్షణంనుంచి ఆ యింట్లో తన స్థానాన్ని ఎవరో ఆక్రమించుకున్నట్లు పసికట్టింది ఆ పసిమనసు.

 

    "మా అమ్మ కదూ! ఏడవబాకు రా! నా దగ్గరకు రా నాన్నా!" అంది పున్నమ్మ.

 

    "నువ్వు పడుకో! వాణ్ణి నేను తీసుకువెళ్ళి సముదాయిస్తాలే" అంటూ మాధవయ్య పసివాణ్ణి ఎత్తుకున్నాడు.

 

    "నాకు నువ్వొద్దు. అమ్మే కావాలి. ఆ పిల్లను తీసిపారేయ్, అమ్మదగ్గర్నుంచి" అని మారాం చేస్తున్న సత్యాన్ని ఎత్తుకుని బయటకువస్తూ "మీరంతా బయటకు రండి!" అన్నాడు మాధవయ్య.

 

    అలసివున్న పున్నమ్మ మగతగా, తృప్తిగా కళ్ళు మూసుకుంది.


                                        3


    మాధవయ్య దంపతులు కూతుర్ని ఇరవై ఒకటో రోజు ఉయ్యాల్లో వేశారు. ఊరంతా పెద్ద బంతి పెట్టారు. పున్నమ్మ పుట్టలో పాలు పోసి నాగమ్మకు బంగారు పడగ చేయించి పూజ చేసింది.

 

    పిల్లకు బాలనాగమ్మ అని నామకరణం చేశారు.

 

    "దీర్ఘ సుమంగళీభవ" అని దీవించిన పురోహితుడి చేతులో మరో ఏభయ్ రూపాయలు పెట్టి మాధవయ్య శాంతి చేయించాడు. సూర్యగ్రహణం తాలూకు దోషం పూర్తిగా పోయిందని గంట వాయించి చెప్పాడు త్రిపురయ్య.

 

    బీదసాదలకు అన్నదానం చేశాడు మాధవయ్య. ఆ సంగతి విని చుట్టుపక్కల ఊళ్ళనుంచి వచ్చిన బిచ్చగాళ్ళందరికీ లేదనకుండా అన్నం పెట్టించాడు. అందరూ తృప్తిగా తిని బిడ్డను దీవించారు.

 

    భోజనానికి వచ్చిన ఆడంగులంతా మాధవయ్య దంపతులు అదృష్టవంతులన్నారు. నలుగురు మొగపిల్లల తరువాత కలిగిన ఆడపిల్ల అదృష్టవంతురాలన్నారు. ఈ శుభకార్యానికి మాధవయ్య వెయ్యి రూపాయలకు పైగానే ఖర్చు చేశాడు.

 

    కాశీ మజిలీ కథలోని రాజకుమారిలాగ బాలనాగమ్మ నలుగురు అన్నదమ్ములు మధ్య అల్లారుముద్దుగా పెరుగుతూంది. పిల్ల "ఊఁ" కొడుతూందని, పారాడుతుందని, "అత్త" అంటూందని, తరచూ ఏదో శుభకార్యం జరిపిస్తూనే వుంది పున్నమ్మ. మాధవయ్య కూడా దేమనేవాడుకాదు. బాలనాగమ్మకు జరగని ముద్దుముచ్చట్లు లేవు.

 

    పెద్ద అన్నలు ముగ్గురూ చాలా ముద్దుగా చూసేవారు చెల్లాయిని. పోటీలుపడి ఆడించేవారు. కాని చిన్నవాడు మాత్రం సందు దొరికితే చాలు, కొట్టో,గిల్లో, ఏడిపించి పారిపోయేవాడు. ఒకటి రెండుసార్లు సత్యం తల్లిచేత దెబ్బలు కూడా తిన్నాడు.

 

    మాధవయ్య దంపతుల ఆరచేతుల్లో పెరిగిన బాలనాగమ్మ ఐదేళ్ళదయింది. పున్నమ్మ ఊళ్ళో ఉన్న రత్తయ్య పంతుల్ని పిలిపించి అక్షరాభ్యాసం చేయించింది. ఆనాడు ఆ స్కూల్లో పిల్లలందరికీ భోజనాలు పెట్టి, అందరికీ పలకలూ బలపాలూ ఇప్పించింది. పట్టుపావడా కాళ్ళకింద పడుతుంటే, చేతిలో పలక పట్టుకొని, రత్తయ్య పంతులు చేయిపట్టుకుని నడిపించగా, స్కూలుకు పోతున్న బాలనాగామ్మను చూస్తూ పున్నమ్మ ఆనందంతో పరవశించిపోయింది.

 

    మధ్యాహ్నం పొలంనుంచి వస్తూ పెద్దన్న సుబ్బారాయుడు స్కూలుకు వెళ్ళి నిద్రపోతున్న బాలనాగమ్మణు భుజాన వేసుకొని వచ్చాడు.

 

    "అమ్మా! బాల చూడమ్మా, ఎంత అలసిపోయి నిద్రపోతుందో?"

 

    "నా తల్లే, ఎంత సొక్కిపోయిందో, ఏదో ముచ్చటగా ముద్దు తీర్చుకోవటానికి బళ్ళో వేయించాను. రోజూ అది బడికి వెళ్ళి బాధపడితే నేను చూళ్ళేను. అదేం చదివి ఊళ్ళేలాలా, ఉద్యోగాలు చెయ్యాలా! నా తల్లికేం తక్కువ? నలుగురు అన్నలకు ఒక్కగానొక్క చెల్లెలు!" అంది పున్నమ్మ మురిసిపోతూ.

 

    "బాల వచ్చిందా?" అంటూ మాధవయ్య నిద్రపోతున్న పిల్లను ముద్దు పెట్టుకున్నాడు.

 

    "ఊరుకుందురూ మీ ముద్దు మీరూనూ? ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరుకదా. అలా నిద్రపోతున్న పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదని ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాను.!" మెత్తగా మందలించింది భర్తను పున్నమ్మ.

 

    "పెద్దోడికీ, నాకూ అన్నం వడ్డించు. త్వరగా కళ్ళంకాడికెళ్ళాలి" అన్నాడు మాధవయ్య కాళ్ళు కడుక్కొచ్చి పీట మీద కూర్చుంటూ.

 

    "రామదాసు రాలేదా?" అని అడిగింది పున్నమ్మ, కంచాలు తీసుకొని పెరట్లోకి కడగటానికి వెళుతూ.

 

    "వాడు కూడా వస్తే ఎట్లా? చిన్న సన్నాసి పొద్దుగూకులు కళ్ళం దగ్గర ఎక్కడ వుంటాడు? మేము వెళ్ళి వాణ్ణి పంపించేస్తాం!"

 

    అప్పటికే పెద్దకొడుకు సుబ్బారాయుడూ, రెండోవాడు రామదాసూ చేతికంది వచ్చారు. మాధవయ్యకు పొలం పనుల్లో సాయంగా వుంటున్నారు. మూడోవాడు థర్డ్ ఫారం చదివి మానేశాడు. కాని వాడికి పొలం వెళ్ళటం, కాయకష్టం చెయ్యటం అంటే మహా బద్ధకం. స్నేహితులతో ఊరంతా కలియ తిరుగుతూంటాడు. తండ్రి మందలిస్తే భయపడతాడు కాని మాధవయ్యే "చిన్న సన్నాసి, గాలి ఆర్చుకోనియ్!" అనుకునేవాడు. నాలుగోవాడు సత్యనారాయణ సెకండ్ ఫారం చదువుతున్నాడు. చాలా చురుకైనవాడు. ఆ స్కూల్లో ప్రతి సంవత్సరం ఫస్టుప్రయిజు వాడిదే.

 Previous Page Next Page