కొంచెం దూరంలో ఒక ఆడా మగా... "ఛీ!ఛీ" అంటూ రెండు చేతులతో మొహం కప్పుకుంది శబరి. జాన్ దగ్గరగా రెండు చేతులూ పట్టుకున్నాడు. శబరి అరుస్తూ ఒక మూలకు పరుగుతీసింది. మూగ వెలుగులో, గోడకు చేరగిలబడి కూర్చున్న ఆకారం ఒకటి లేచి నిల్చుంది. నిటారుగా నిల్చుంది. ఆరు అడుగుల యెత్తు నగ్నంగా వున్న అతన్ని చూసి "కెవ్వు"న అరుస్తూ విరుచుకొని పడిపోయింది శబరి. కొందరు శబరి చుట్టూ చేరారు. జాన్ శబరి ముఖం మీద నీళ్ళు చల్లాడు.
"శబరీ!"
"ఊ!"
"కళ్ళు తెరువు!"
"నేను వెళ్ళిపోతాను! జాన్! ఇక్కడ్నుంచి తీసుకెళ్ళు!"
"నువ్వు థ్రిల్ కావాలని వచ్చావ్!"
"నో!నో! నేను వెళ్ళిపోతాను! నన్ను ఇక్కడ్నుంచి తీసుకెళ్ళు. వెళ్ళిపోతాను!"
"శబరీ! భయపడ్డావా?"
"ఈ మురికి, యీ ఛండాలం నేను భరించలేను. మీరు మనుషులుకారు. దెయ్యాలు... కొరివి దెయ్యాలు నేను వెళ్ళిపోతున్నాను నో!నో! యీ థ్రిల్ నాకొద్దు!" కళ్ళు మూసుకునే అరిచింది శబరి.
"బేబీ! కళ్ళు తెరువు! ఈ మాత్ర వేసుకో!" తల నిమురుతూ మృదువుగా అన్నది ఓ ఆడ కంఠం. శబరి కళ్ళు తెరిచి చూసింది.
శబరి ఉన్నట్టుండి చివ్వునలేచి బయటికి పరుగుతీసింది. జాన్, మరొకడూ కలిసి బలవంతంగా లోపలకు తీసుకొచ్చారు.
"శబరీ! నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావ్!"
"ఛ! మీకు మానాభిమానాలుంటేగా అవమానించడానికి?" శబరి అరుస్తూ అన్నది.
"మరెందుకు వచ్చావ్. ఇప్పుడెలా వెళతావ్? ఇప్పుడు యీ స్థితిలో అర్థరాత్రి బయటికి వెళితే మనల్ని పోలీసులు పట్టుకుంటారు. ఈ రాత్రికి ఇక్కడే ఎలాగో గడిపేద్దాం. ఇంకెవరూ నీ జోలికి రారు. చూడు! ఎవరి గొడవల్లో వాళ్లున్నారు."
శబరి భయం భయంగా నలువేపులా చూపులు సారించింది. కొందరు పూర్తి మత్తులో చిత్తుగాపడి వున్నారు. అడ్డదిడ్డంగా పడివున్నారు.
ఇంకా కొందరు పూర్తి మత్తులోకి జారిపోలేదు. కాని యీ ప్రపంచంలో లేరు.
"నువ్వు నా దగ్గరే వుండు!" జాన్ చేతిని గట్టిగా పట్టుకొన్నది.
"ఇదుగో! ఈ మాత్ర వేసుకో! హాయిగా నిద్రపడుతుంది."
"నేను వేసుకోను!"
"అయితే నేను వేసుకుంటాను. నా నరాలు పీకుతున్నాయి. ఇంతమంది మధ్య నువ్వొక్కదానివీ చూస్తూ కూర్చోవాలి. ఆలోచించు!"
శబరి భయపడి పోయింది. "ఇలాతే" అంటూ చేతిలోని మందు లాక్కుంది. జాన్ నల్లమందు ఇచ్చాడు. అర్థగంటలోనే శబరిని మత్తు చుట్టెయ్యసాగింది. పక్కనే వున్న జాన్ మెడచుట్టూ చేతులు వేసింది.
"బేబీ!" అంటూ శబరిని దగ్గరకు తీసుకున్నాడు.
24
మర్నాడు మధ్యాహ్నం శబరి మత్తునుంచి బయటపడింది. కళ్ళు విప్పింది. తను ఎక్కడ వుంది? బెడ్ యింత హార్డుగా వున్నదేమిటి?
తను వట్టినేలమీద గతుకుల నేలమీద పడివున్నది. శబరి చూపుల్ని నలువేపులకూ తిప్పింది. తనవేపే చూస్తూ నవ్వుతున్న యువతిమీద ఓ క్షణం దృష్టి నిలిపింది ఎవరామె? తను ఎక్కడ వున్నది? చివ్వున లేచి కూర్చున్నది. వేసుకున్న షర్టు ఛాతీమీద చిరిగి వున్నది. రెండు చేతులనూ మోకాళ్లకు చుట్టి, ఛాతీని మోకాళ్ళమధ్య దాచుకున్నది. కొద్దిగా తలెత్తి ఆ యువతికేసి చూసింది. ఆమె అదోలా నవ్వుతున్నది.
"ఎవరు నువ్వు? జాన్ ఎక్కడ?" ముడుచుకుపోతూ అడిగింది.
"నాపేరు లిండా! జాన్ అందరితో కలిసి బజారుకు వెళ్ళాడు. నువ్వు డబ్బు తెచ్చావుగా? ఇవ్వాళ మనం పండుగ చేసుకుందాం! కావాల్సినన్ని డ్రగ్స్ ఇవ్వాళ. ఎవరికి ఏది ఇష్టమో అదే తీసుకోవచ్చును!"
"జాన్ ఎప్పుడొస్తాడు? నా తల పగిలిపోతున్నది. కాఫీ దొరుకుతుందా?"
"లే! వెళదాం! ఆ ఎదురుగా వున్న హోటల్లో దొరుకుతుంది.
"ఎలా? నా షర్టు పూర్తిగా చినిగిపోయింది. ఎవరు చింపారు?"
లిండా అదోలా నవ్వింది.
"ఎందుకు నవ్వుతావు?"
లిండా లేచివెళ్ళి ఓ మూల గుట్టపడివున్న బట్టల్లోంచి ఒక షర్టు తెచ్చి అందించింది. చిరుగులతో మురికి ఓడుతున్న ఆ షర్టును ఏవగింపుగా చూస్తూ "ఇది ఎవరిది?" అన్నది శబరి.
"అందరిదీ! ఇక్కడ వున్న ప్రతి వస్తువూ అందరికీ చెందినదే!"
శబరి అయిష్టంగానే శరత్ తగిలించుకున్నది. లేచి నిల్చుంది. అప్రయత్నంగా ఓ మూల గోడకు చేరబడి వున్న ఆకారం మీద దృష్టి పడింది. స్థాణువులా నిల్చుండిపోయింది. క్రితం రాత్రి నగ్నంగా, నిటారుగా నిల్చుని వున్న వ్యక్తిని చూసి తను పడిపోవడం గుర్తుకొచ్చింది.
ఇప్పుడు అతను నగ్నంగా యోగి వేమన ఫోజులో కూర్చుని వున్నాడు. తల స్థానం లావుపాటి నున్నటి బుర్ర వున్నది. పొడవాటి కాళ్ళూ చేతులూ వెదురుబద్దల్లా వున్నాయి. బిగిసిపోయి ఉన్న శబరి భుజం తట్టింది లిండా.
"భయం వేస్తోందా? అతని పేరు రాజేంద్ర. పంజాబీ యువకుడు. ఎవర్నీ ఏమీ చెయ్యడు. అతను నిర్వాణానికి దగ్గరలో వున్నాడు!"
శబరి గొంతు తడారిపోతున్నది.
"ఆ- అతను! అలా చూస్తున్నాడేం?"
"అతను ఎవర్నీ చూడటంలేదు. డ్రగ్ లో వున్నాడు. దానిమీదే బతుకుతున్నాడు. ఒకప్పుడు ఎంత అందంగా వుండేవాడనుకున్నావ్? ఉత్సాహంగా వుండేవాడు. ఎలిజబెత్ అంటే పడిచచ్చిపోయేవాడు."
"ఎలిజబెత్ ఎవరు?"
"మాతో వుండేది!"
"ఇప్పుడు ఏమైంది?"
"జైల్లో వున్నది!"
"ఎ - ఎందుకు?"
"డ్రగ్ కోసం ఏదో లాడ్జికి వెళ్లింది, పోలీసులు పట్టుకున్నారు. త్వరలో వచ్చేస్తుంది."
శబరి మాట్లాడలేదు. ఆలోచిస్తూ వుండిపోయింది.
"అతని వయసు ఎంతో చెప్పగలవా?"
శబరి అతనికేసి పరిశీలనగా చూసింది.
"చెప్పు! చూద్దాం!"
"ఏభయ్ వుండొచ్చు!"
లిండా పకపక నవ్వింది.
ఈమెకు నవ్వెలా వస్తుందో! హారిబుల్!'
"ఇరవై ఆరేళ్ళు!"
శబరి కళ్ళలోనుంచి ఆశ్చర్యం తొంగి చూసింది.
"ఇక్కడ ఎవరూ ముప్పయ్ కి పైబడ్డవాళ్ళులేరు!"
"నిజంగా! నీవయసెంత?" లిండా కళ్ళచుట్టూవున్న నల్లటి వలయాలను చూస్తూ అడిగింది.
"పద్దెనిమిది!"
శబరి నమ్మలేనట్టు చూసింది.
"నమ్మకంగా లేదా?"
శబరి పలకలేదు. లిండా నవ్వింది.
"నాది చాలా ఫాస్టులైఫ్! ఎన్నో జాతుల మగవాళ్ళను చూశాను."
శబరి భయంగా చూస్తూ వుండిపోయింది. లిండా తన ధోరణిలో చెప్పసాగింది.
"తుర్కులు ఒడ్డూ పొడవూ వుంటారు. కాని మొరటువాళ్ళు!"