Previous Page Next Page 
పిపాసి పేజి 37


    రెండో ఉత్తరం తీసింది. "అమ్మా రాధికా నామీద నీకు చాలా కోపంగా వుండొచ్చును. ఇదీ ఒక అమ్మేనా? అని సహజమే. ఏనాటి పాపమో. ఎవరి శాపమో చిన్ననాడే తల్లీబిడ్డలను వేరు చేశాయి. తల్లీ బిడ్డల అనుబంధపు రుచి నీకు తెలీకుండా చేశాయి. ప్రస్తుతం ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, మీ నాన్నగారికి బి.పి. ఎక్కువయితే, హాస్పిటల్లో చేర్పించాము మీ తమ్ముళ్ళ సంపాదనంటూ ఏముంది? అందుకే, నిన్ను వేడుకుంటున్నాను నువ్వు ఆదుకోకపోతే, నాన్నగారికి మందులు కొనడం కూడా కష్టమయిపోతుంది. ఇప్పటికే, ఇహ ఎవరూ ఇవ్వనంటున్నాడు, ఏమిటో! ఇలా అడుగుతూన్నందుకు ఏమీ అనుకోకు.

                                                                                  ఇట్లు,

                                                                                  అమ్మ.


    రెండు ఉత్తరాలు రెండు రకాలుగా, రెండేళ్ళ గతంలోకి లాక్కుపోయాయి. కన్నబిడ్డని చూసి అగౌరవమని బిడ్డగా పరిచయం చెయ్యలేకపోయిన తల్లిదండ్రులూ, పిక్నిక్ లో, ఎవరో తనని గురించి ఎగతాళిగా మాట్లాడితే అదేదో పెద్ద తనకే అవమానమని భావించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడిన చెల్లెలూ, ఈనాడు ఇద్దరూ, తన డబ్బుకోసం, తన పలుకుబడి కోసం పరితపిస్తూ ఉత్తరాలు రాశారు. డబ్బు...... డబ్బుకోసం..... వారికి నేను కావాలి. లేకపోతే? ఛీ...... ఛీ....... వెధవ డబ్బు...... అనుకునేసరికి, తల్లీ తండ్రీ చెల్లెలు వీళ్ళందరితోపాటు, మధన్ కూడా అదే వరసలో కనిపించాడు. క్షమాపణ కోరుకుందామన్న ఉద్దేశ్యం మారిపోయి, ఆ స్థానంలో, అందరిమీదా కోపం, కసి, పగ, పంతం ఆక్రమించుకున్నాయి. భర్త, తల్లీ, చెల్లీ అందరూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా అనిపించారు. అసహ్యంతో అసహనంతో, మంచం మీద వాలిపోయింది రాధిక. కాసేపటికి తేరుకుని మిసెస్ రాఘవన్ కోసం కబురు పెట్టింది. "ఏస్ మేడమ్" అంటూ ఎదురుగ్గా నుంచుంది మిసెస్ రాఘవన్," ఏమైనా డబ్బుందా మన దగ్గర?" ప్రశ్నించింది రాధిక." ఇప్పుడే ఆంధ్రకళాసమితివారు రాజమండ్రిలో ప్రోగ్రాం కావాలని వచ్చారు. నాలుగువేలు అవుతుందని చెప్పాను, రెండువేలు అడ్వాన్సు ఇచ్చి వెళ్ళారు. నేనే తెచ్చి ఇద్దామనుకుంటున్నాను. మీరు పిలిచారు." అని పర్సు తెరచి డబ్బుతీసి రాధిక కివ్వబోయింది. "వద్దు ఉంచండి. ఆ డబ్బుని ఈ ఎడ్రస్ కి మనియార్డర్ చెయ్యండి." అంటూ, తల్లి అడ్రస్ రాసిచ్చింది. ఓ......కే. మేడమ్" అంటూ వెళ్ళిపోయింది ఆమె.


    ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి తలనొప్పి వస్తే, అమృతాంజనం పట్టించి పడుకుంది, అప్పుడే ఇంటికొచ్చిన మధన్ గదిలో దీపం లేకపోవడం వల్ల ఎవరూ లేరనుకుని, దీపం వేశాడు. తలకి బట్టకట్టుకుని గాఢ నిద్రలో మునిగిపోయిన రాధికకేసి ఆప్యాయంగా చూశాడు. సూర్యరశ్మికి వాడిపోయిన కమలంలా ఆమె ముఖం ముడుచుకుపోయింది. అలసట, ఆవేదనా స్పష్టంగా మొహంలో కనబడుతూ వుంటే, జాలిగా, ప్రేమగా, ఆమెకేసి చూస్తూండిపోయాడు. శరీరానికి జబ్బొస్తే ఎలా కృంగిపోతామో, మానసికంగా బాధ కలిగినా అంతే అని ఆమె మొహమే నిరూపించింది. దగ్గరికెళ్ళి లాలించాలనిపించింది. బుజ్జగించాలనిపించింది. నేను డబ్బు మనిషిని కాదని ఒప్పించాలనిపించింది. అంతలోనే "నువ్వన్నట్టు నీ అంతట నీకు నా మీద నమ్మకం కుదిరేదాకా, నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు ప్రామిస్" అని ఆనాడు తాను చేసిన వాగ్ధానం జ్ఞాపకం వచ్చి, మనసు ముందుకు లాగినా, కాళ్ళు వెనక్కి లాగాయి. పెద్ద దీపం ఆర్పేసి, బెడ్ లైట్ వెలిగించి వెళ్ళి తనగదిలో పడుకున్నాడు, ఆలోచనా పరంపరలను ఆపలేని నిస్సహాయుడై.  


    మనస్సు బాగా లేకపోవడంవల్ల నైతేనేం? ఒంట్లో బాగులేకపోవడం వల్ల నైతేనేం ఆనాడు రాజమండ్రి ప్రదర్శన సరిగ్గా జరగలేదు "మేడమ్ ఏమిటి మీ రివాళ అదోలా వున్నారు ప్రోగ్రామ్ కూడా మామూలుగా జరిగింది. ఒంట్లో బాగుండలేదా?" అడిగింది మిసెస్ రాఘవన్, భోజనాలయి నిద్దరపోయే ముందు.   


    "అవును మిసెస్ రాఘవన్. ఈరోజు అసలు నాట్యం చెయ్యాలనిపించలేదు" ముక్తసరిగా అంది రాధిక.


    ఇద్దరిమధ్యా రెండు నిమిషాలు నిశ్శబ్దం తాండవం చేసింది. మళ్ళీ మిసెస్ రాఘవనే మొదలెట్టింది. "మేడమ్ మీరేమీ అనుకోకపోతే ఒక సలహా మీ స్వంత విషయాల్లో జ్యోక్యం చేసుకుంటూన్నందుకు ఏమీ అనుకోకండి. మీరూ మధన్ గారూ ఇలా క్షోభపడడం ఏమీ బాగులేదు. చిలకా గోరింకల్లా వున్న మీరిద్దరికీ, ఏ కారణాలవల్ల అపోహలొచ్చాయో కానీ, అవి ఇలా నిలిచిపోయి, మనసుల్ని కలిచేస్తూ, సంసారం నరకం చేశాయి. మేడమ్ కోపానికి కూడా పట్టూ, విడుపూ లేకపోతే, తన కోపమే తన పాలిట శాపమై మనిషిని తినేస్తుంది. నిజంగా మధన్ గారికి మీమీద ఇష్టం లేకపోతే ఈపాటికి డైవర్స్ కోరేవారుగా! మళ్ళీ పెళ్ళి చేసుకునేవారుగా మీ ఎదుటనే వుంటూ, మనసును పాడుచేసుకుంటూ, ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారు. అన్ని సుఖాలకూ దూరమై ఇలా బతకడం అనవసరం. ఆలోచించండి మేడమ్ గుక్కతిప్పకుండా చెప్పేసి, ఆమె సమాధానం కోసం ఎదురు చూడసాగింది మిసెస్ రాఘవన్.  


    "హో బంగారు గుడ్డుపెట్టే కోడిని ఎవరైనా ఒదులుకుంటారా మిసెస్ రాఘవన్. అతను విడాకులెందుకు అడుగుతారు?"


    "మీరనేది నాకర్థం కావడం లేదు."


    "అయితే చెప్తా వినండి మీరు నాకు తోబుట్టువులాంటి వారు 'నా వాళ్ళు' అనుకున్న వాళ్ళందరూ. నా విషయాలేవీ పట్టించుకోలేదు మీకూ నాకూ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, నా శ్రేయస్సు కోరుకున్నారు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. లేకపోతే, గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూన్న, నేను కాలిపోతానే కాని నా బాధ బయటికి తెలియనివ్వను. ఈ రోజు మీరు ఒక ఆప్తురాలిగా, నా బాధని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తప్పక చెప్తాను వినండి. చిన్ననాడే తెలిసీ తెలియని వయస్సులోనే ఒక దౌర్భాగ్యపు ముఠాకోరు చేతిలో పడి, తల్లిదండ్రుల ప్రేమకి దూరమయ్యాను. వాడు నాకు సంగీతం, నాట్యం నేర్పించాడు. ఆ తరువాత నా శరీరానికి వెలకట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు ససేమిరా వాడికి లొంగక పారిపోవడానికీ, ఆత్మహత్య చేసుకోవడానికీ ప్రయత్నించాను. అదీ వీల్లేకుండా నిర్భందించాడు వాడు. అయినా నేను లొంగలేదు. రోజుల తరబడి పస్తుండేదాన్ని చివరికి పస్తులతోటే చచ్చిపోతాననుకున్నాడేమో ఏదో ఒక విధంగా నావల్ల డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. నా తండ్రిగా చలామణి అవుతూ వచ్చాడు. ఒకరోజున ఒక ప్రదర్శనలో, మధన్ నన్ను చూసి గుర్తు పట్టాడు. ఆ తరువాత, ఆ కసాయివాడి చేతుల్లోంచి నన్ను తప్పించి, నా తల్లిదండ్రులే నన్ను చేరదియ్యడానికి వెనకాడినా, మధన్ నన్ను పెళ్ళి చేసుకున్నారు కానీ కానీ "మరి మాట్లాడలేకపోయింది దుఃఖాన్నాపు కోవడానికి ఎంత ప్రయత్నించినా, గొంతు పూడుకుపోవడంచేత, మాటరాక, రెండు చేతుల్తో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.

 Previous Page Next Page