Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 38

   
                                       కరాచీతో ఢిల్లీ
    
    దువ్వకు దుండుగులను, కాల్
    ద్రవ్వకు చివ్వకు, వృథా క్రుథన్ బ్రువ్వకు, రాల్
    రువ్వకు పొరుగిండ్లపయిన్,
    గవ్వకు కొఱగాని నాటకము లాడకుమా !
    
    చిమ్మకుము ప్రజల నెత్తురు !
    క్రుమ్మకు మాప్తులను కోరకొమ్ముల తోడన్ !
    అమ్మకుము దేశ మొరలకు !
    నమ్మకుము కరాచి ! నంగనాచి పెకింగున్ !
    
    చైనా చూపిన యెంగిలి
    చై నాకి మదించి తోక జాడించకు; మే
    మైనా పెకింగు పెంపుడు
    "మైనా" వైనావ! మంచి మాటలు రావా !
    
    వాయించిరి చెంపలు; సము
    దాయించిరి; వీపు వంచి తాషామరపా
    వేయించిరి; మా సేనలు
    మూయించిరిలే భవచ్చమూవదనంబుల్.
    
    చీచీ! వెలికిల బడిన తి
    వాచీ! గతిచెడిన రిష్టువాచీ! విడుమీ
    పేచీ! ప్రేలకుమీ దు
    ర్వాచికములు, మైత్రి కాలరాచి కరాచీ!
    
    వేషాలు విప్పి, మత వి
    ద్వేషాలకు స్వస్తిచెప్పి, తీయని హృదయా
    శ్లేషాలు శాంతిమయసం
    తోషాలు భజించి ప్రజలతో సుఖపడుమా !
    
                                                  యాహ్యా సప్తకము
    
    'కంసుం'డంచు 'నృశంసు'డంచు నిను లోకంబెల్ల దూషించె; నీ
    హింసాకాండలతో శ్మశానమయిపోయెన్ తూర్పు బెంగాలు; వి
    ధ్వంసం బయ్యెను మానవత్వము; నిరాధార ప్రజావాహినీ
    మాంసోన్మత్త మహాపిశాచములు యుష్మత్ సైనికానీకముల్ !!
    
    పల్లెల్ గూల్చి, గృహాలు గాల్చి, ప్రజలన్ బాధించి, నీ అక్కలన్
    చెల్లెండ్రన్ చెఱపట్టి, యెల్ల జగముల్ చీకొట్ట దేశమ్మునే
    అల్లాడించిన నీవు వీరుడవ? రెహ్మాన్ ద్రోహియా? యాహియా !
    'అల్లా' మెచ్చునె నీ కిరాతకపు చర్యల్ !! నిన్ను మన్నించునే !!
    
    కారాగారములోన బెట్టితివి 'బంగ్లాబంధునిన్'; శాంతికిన్
    'గోరీ కట్టితి' వింటిలో; 'మరతుపాకుల్' 'టాంకులే' నీ కళా
    కారుల్ ! మారణహోమ సాక్ష్యములు 'ఢాకా' విశ్వవిద్యాలయ
    ద్వారమ్ముల్ ప్రకటించు నేటికిభవద్ భస్మాసుర క్రీడలన్ !!
    
    'పాకు' తుపాకిగుండ్లు పసిపాపల మెత్తని గుండెకాయలన్
    దాకుచునుండ చూచిన 'ఖుదా' కను లెంతగ నీరు నిండెనో !!
    కాకులు గ్రద్దలున్ బొడువగా నడివీథుల నెత్రు చింది 'చీ
    కా' కగుచున్న కాయముల గాంచి 'ఖురాన్' కడు పెంతమండెనో !!
    
    రష్యారాజ్యము సంధిచేసికొనె మా రాజ్యమ్ముతోడన్; చిరా
    యుష్యం బబ్బెను శాంతిభద్రతల కోహో ! యాహియా! ఏషియా
    'యేష్యం' బంతయు మాఱిపోయెను; జగ మ్మీ సంధిసూత్రాలకున్
    'భాష్య' మ్మప్పుడే చెప్పె; సాగ విక వాక్ పౌరుష్య వైదుష్యముల్.
    
    చిక్కని దేశభక్తుడగు 'షేక్ ముజబూర్ రెహమాను' చేతికిన్
    జిక్కె' నటంచు నిక్కకుము! చీకటిమాటున శాంతి గొంతుకన్
    నొక్కకు! దమ్ములుండిన గనుంగొనుదున్ పదిమంది ముందటన్
    రక్కసిబుద్ధి మాని బహిరంగ విచారణ నిర్వహింపుమా !!
    
    పాకీస్థానము చీలిపోవుటయె దౌర్భాగ్యంబు ! అదట్లుండగా
    నీ కీ స్థానము సంక్రమించుట మహానిష్టంబు! మా యిండియా
    పాకీస్థానము లేకమై నిలిచి సౌభ్రాత్రంబు పాటించినన్
    లోకుల్ మెత్తు; రమాయిక ప్రజకు గల్గున్ శాంతి సౌభాగ్యముల్ !
    
                                    అనుగుతల్లి ఆహ్వానం
    
    జిందారహో బేటా రెహమాన్ !
    క్షేమంగా ఉన్నావా మేరీ జాన్ !
    నేను నీ మాతృశ్రీని బాంగ్లాదేశాన్ని
    నీకు పంపుతున్నాను బాష్పసందేశాన్ని,
    పదిలక్షలమంది బాంగ్లామృతవీరుల
    కదుష్ణ రుధిరధారలతో
    కోటిమంది కాందిశీకుల
    కన్నీటి ధారలతో
    నీ కీ లేఖ వ్రాస్తున్నా
    నీ రాకకోసం నిత్యమూ ఎదురుచూస్తున్నా.
    
    ఏమని వ్రాసేది నీకు
    ఇక్కడి నా క్షేమసమాచారాలు
    ఏమూల చూచినా ఇంకా
    ఏడ్పులూ హాహాకారాలూ
    
    అక్కడి నీ క్షేమం
    అడగటానికి లేవటంలేదు నోరు
    రక్కసి కబంధుల కౌగిట్లో
    చిక్కుకున్నాడు నా"ముజిబూరు"
    
    విన్నావా బాబూ!
    ఇప్పుడు నీ రాష్ట్రం స్వతంత్రమైంది
    ఈస్టు పాకీస్థాన్ పాస్టైపోయింది
    ఆజాద్ బాంగ్లాదేశం ఆవిర్భవించింది
    
    ఆనాడు నిన్ను సంప్రదింపులకని ఆహ్వానించిన కిరాతకులు
    అర్ధరాత్రి అన్యాయంగా పట్టి బంధించారు విశ్వాసఘాతుకులు
    విమానంలో ఎక్కించి కరాచీకి తరలించారు
    అమానుష హత్యాకాండలకు నడుం కట్టారు
    అక్రమంగా పాక్ సేనలు ఆనాడు సాగించిన దురాక్రమణలు
    అన్నీ ఇన్నీ కావు - ఎన్నటికీ అవి మఱుపురావు
    
    ఆ నరహంతకుల పైశాచిక నృత్యాలకు
    విశృంఖల విధ్వంసక కృత్యాలకు -
    అఘాయిత్యాలకు హత్యలకు అత్యాచారాలకు
    దారుణ మారణ హోమాలకు -
    
    కాలి పొగచూరిన గ్రామాలు సాక్షి
    గగనాని కెగసిన ధూమాలు సాక్షి
    మంటలలో మాడిపోయిన పంటపొలాలు సాక్షి
    గుంటలలో పూడిపోయిన శవాలగుట్టలు సాక్షి
    
    అమ్మగుండెల్లో బాకు దించుతూండగా
    "అమ్మో" అని అఱచిన పాలబుగ్గల పసికందులు సాక్షి
    దిక్కులేని దిగంబర దేహాలపై ఎక్కి
    ముక్కులతో పొడుస్తున్న ముసలి రాబందుల సాక్షి
    
    శ్మశానాలుగా మారిన మన పొలాలు
    దశాబ్దాలదాకా పండనట్లున్నాయి
    బాంగ్లా వీథుల్లో పారిన నెత్తురు మడుగులు    
    పదేండ్ల దాకా ఎండనట్లున్నాయి    
    
    నీ వానాడు వెలిగించిన విప్లవజ్యోతి నీ సోదరులకు దారిచూపింది
    నీవు ఎగురవేసిన జాతీయపతాక నింగినిండా వెలుగులు నింపింది
    నీవు మ్రోగించిన రణభేరి నిఖిల దిక్కులా ప్రతిధ్వనించింది
    నీవు సాగించిన జైత్రయాత్ర నిరాటంకంగా పురోగమించింది
    
    దురాక్రమణను తొమ్మిది నెలలుగా నిరోధించింది ముక్తివాహిని
    హోరాహోరి పోరాటంలో పారింది వీరుల రక్తవాహిని
    పాకీస్థాన్ దుండగులు ప్రజలపైబడి దోచుకున్నారు
    నూరు లక్షలమంది నిరాశ్రయులు భారతమాతకడుపులో తలదాచుకున్నారు
    
    అంతలో భారతసైన్యం మనకు అండగా నిలిచింది
    పాక్ సేనల చర్మం ఒలిచింది
        ఫటాలున బద్దలైనాయి పాటన్ టాంకులు
        పటాపంచలైనాయి ఫైటర్ జట్ విమానాలు
    
    తోకముడిచారు దుండగులు
    పరాజితులైనారు నరహంతకులు
    అంతా అద్భుతంగా జరిగిపోయింది.
    పాకీస్థాన్ నడుము విరిగిపోయింది
    నిరంకుశత్వం నిష్క్రమించింది
    స్వతంత్ర బాంగ్లా సాక్షాత్కరించింది
    
    అయితే బేటా!
    ఇప్పుడు నీ మాతృభూమిని నీవు గుర్తుపట్టలేవు
    అప్పటి ఇండ్లూ వాకిళ్ళూ అలా లేవు - నీ దేశం
    బావురుపిల్లి నోటిలోనుంచి బయటపడిన పావురంలా ఉంది
    పందులు చిందులు త్రొక్కిన పంటపొలంలా ఉంది
    నరకాసురుడు తగులబెట్టిన నందనవనంలా ఉంది
    
    పగబట్టిన నల్లత్రాచులు
    మాయదారి మారీచులు
    
    కసిపోక మసిపూసికొనే నీచులు రేచులులా
    నీచుట్టూ మూగి ఉన్నారు
    నీతో అప్పుడే మంతనాలు సాగిస్తున్నారు
    చింతకాయలు రాలవులే మంత్రాలకు
    స్వేచ్చాప్రియులు లొంగరులే కుతంత్రాలకు
    
    నీవు వెంటనే మాతృదేశానికి బయలుదేరి రావాలి
    ఇక్కడ జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలి
    "అల్లా" చల్లంగా రక్షించి
    "ఆజాద్ బాంగ్లా" అధ్యక్షుడివి కావాలి
    
    నీ బేగం నీకోసం నిరీక్షిస్తున్నది
    బేటీ హసీనా బెంగపెట్టుకొని ఏడుస్తున్నది
    నీ మనుమరాలు నిద్దురలోకూడా
    "దాదా! దాదా" అని నిన్నే పిలుస్తూ కలవరిస్తున్నది
    
    నీవు వెంటనే బయలుదేరిరా బేటా!
    నిన్ను ఆహ్వానిస్తున్నది ఢాకా
    నిదురపోదు నీవు వచ్చేదాకా
    
    అయితే ఒక్కసంగతి మాత్రం మరచిపోకు బేటా?
    నీవు వచ్చే దోవలో
    భారతదేశంలో ఆగు
    ఢిల్లీ మనపాలిటి బంగారుతల్లి
    ఆ చల్లని తల్లికి, సలాములు చెల్లించు
    ఆపైన విమానాన్ని స్వదేశానికి మళ్ళించు.   

 Previous Page Next Page