Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 39


                                   స్వర్ణలత
    
    అల్లదుగొ పూలతీవ
    అందానికి అసలు త్రోవ
    ఆడుతూ పాడుతూ మెల్లిమెల్లిగా
    అల్లుకుంది అల్లిబిల్లిగా
    అల్లదుగో మొల్లతీగ
    అల్లరి పసిపిల్ల లాగ.

    వడిగా వచ్చిన వర్షం
    వల్లికి హెచ్చిన హర్షం
    అరవిచ్చిన పువ్వులు
    చిలిపిపిల్ల చిరునవ్వులు.
    
    పందిరిగుంజను కౌగిలించుకొని
    పసందుగా పైకి నిక్కింది
    ముందున్న పశువుల పాకమీదికి
    మోచెయ్యి మోపి ఎక్కింది
    చిందించింది స్మితరేఖలు మందమందంగా
    అందించింది సరిక్రొత్త సొగసులు ఆనందంగా
    అరవిచ్చిన పసిడిమొల్ల
    చిరునవ్వుల చిలిపిపిల్ల
    బక్కపలచని తనూవల్లి
    పరవశమై వూగి వూగి
    చక్కదనాల ప్రేమసూత్రంలా
    సహజశోభతో సాగి సాగి
    పూలగుత్తులవలె గుండ్రంగా
    పొటమరించిన హృదయం పొంగు
    ఆలోకించినకొలంది అందం చిందే మేలిరంగు
    ఎప్పుడో మరి దీని విలాసం కొంత
    అప్పుపుచ్చుకొన్నది తప్పనిసరిగా ఉరగకాంత    
    ఒయ్యారంగా పరీమళ డోలలో
    ఉయ్యాలలూగుతూ
    తియ్యని మౌనంలో మైమరచి
    తేపతేపకూ తూగుతూ
    ఈ నాఅనురాగవల్లి ప్రాణంలో ప్రాణంగా
    మానసం ముంగిట అల్లుకుంది
    మమతకు తార్కాణంగా.
    
    నవ్వింది తొలిమాటుగా
    నా పూలకన్నె తెరచాటుగా
    
    అల్లదుగో మొల్ల తీవ
    ఆనందపు అమృతనావ.
    
    ఒంటికాలితో నిలబడింది
    ఒయ్యారంగా మునివ్రేళ్ళపైన
    కంటి కింపుగా జంపుగా
    కనబడుతూ లేబ్ర్డాయమైన.
    
    మోకాలు అదో చిత్రంగా కొంచెం
    ముందుకు వంచింది
    డాకాలు కుడి పిక్కపై
    నాజూకుగా ఆనించింది
    మిలమిలలాడే చిగుళ్ళు
    మేనంతా ధరించింది
    వెలుగునీడల మేలిముసుగు
    తలపై సవరించింది
    
    తళతళమెరిసే వెండిరెక్కలు గాలిలో తెరిచి
    అరణ్యంమధ్య పచ్చికబయళ్ళలో నిలిచి
    ఆకాశంలోకి సూటిగా అమాంతం ఎగరబోతున్న
    అచ్చర మచ్చెకంటిని అచ్చంగా అనుకరిస్తూవున్న
    పసిబుగ్గల తీవమొల్ల.
    చిరుసిగ్గుల చిలిపిపిల్ల.
    
    ఆడుతూ పాడుతూ మెల్లి మెల్లిగా
    అల్లుకున్నది అల్లి బిల్లిగా
    రంగారు జరీ జాలరీ లంగా కట్టుకొని
    బంగారు మొగ్గల సొమ్ములు సింగారించుకొని
    
    అలంకారంగా చెట్ల చెట్ల
    కలంకారీ పైట వేసుకొని
    
    పొంగిపొరలిన లావణ్యం అల వలె
    నింగిమీద నక్షత్రాల నీలినీడల వల వలె
    
    భరించలేక సౌకుమార్యం బరువు తలపై
    సరిగా అడుగుబడక తడబడుతున్నది ఇలపై
    
    అనువైన అలల భంగిమలతో అటూ ఇటూ వంగి
    వనస్పతి జగత్తునుంచి వచ్చిన నిర్ఘరిణి భంగి
    పచ్చనిరంగు ప్రవహించే పసినరాల  లతాంగి
    చకచక ముందుకు దుమికే చంచల చారుకురంగి
    
    అల్లదుగో పూలతీవ
    అందానికి అసలు త్రోవ
    
    అంతరంగంలో గూడుకట్టుకున్న
    ఆంక్షలేని ఆకాంక్ష రీతి
    అంతటా పులుముకొని
    అనురాగాల ఆత్మానుభూతి
    
    ఇలాసుందరి నవయౌవన విలాస క్రీడ వలె
    కులాసా స్వప్నాల క్రీనీడ వలె
    అవలంబించి అదుగో ఆ స్తంభం వెన్నెముకపట్టు
    ఆరోపిస్తున్నట్టు జగచ్చైతన్యం మెట్టుపైమెట్టు
    
    విశ్వజీవితానికి వికాసమార్గం చూపిస్తూ
    వియత్తలం నిండా విశేష సుగంధం వ్యాపిస్తూ
    
    మూలభూతమైన స్థూలధరిత్రి కడుపులోనుంచి
    ముడి తమస్సును వడివడిగా వెలువరించి
    అంతరాంతరాల్లో దాగివున్న ప్రాణధనాలు
    కాంతిమయ మంజల మణిప్రసూనాలు
    శాంతిపతాకలా చాచిన
    చంచల కరాంచలంలో ధరించి
    
    సుందర సుకుమార భుజవృంతాలు
    సున్నితంగా పైకి సారించి
    అందిస్తున్నది అందరికీ వికాసాన్ని
    అధరాలమీద మధుర మందహాసాన్ని
    
    ప్రాణాలకు ప్రాణమైన నవనవోల్లాసాన్ని -
    ఉల్లంలో వెల్లివిరిసే ఉజ్జ్వల విలాసాన్ని -
    
    అల్లదుగో పూలతీవ
    అందానికి అసలు త్రోవ.
    
    సత్యం! మానవుడు సల్పుతున్నాడు ప్రతీక్ష
    నిత్యం ఈ తీగను చూచి నేర్చుకోవాలి నవ్యదీక్ష
    
    అచ్చమైన పూలతీవ అమాయిక రాగాలలో
    వెచ్చవెచ్చని ప్రాణాల పచ్చని అగ్నిజ్వాలలో
    వెలిగించలి ఒక దీపం
    కలిగించాలి చైతన్యానికి నవ్యస్వరూపం
    కనపడాలి మానవ పథం
    కదలాలి జీవన రథం
    
    జగత్తుకు 'ప్రేమే' ఆద్యంతాలు కావాలి
    యుగాన్ని నడిపే సారథిగా
    'త్యాగం' ముందుకు రావాలి.
    
    చావు బ్ర్తతుకుల సంఘర్షణలో
    సతమత మవుతున్న మానవులకు
    సమరాల బురదలో దిగబడి
    సగం చచ్చిన మానవులకు -
    
    ఆదర్శం పూలతీవ
    అందానికి అదే త్రోవ.

 Previous Page Next Page