కరుణశ్రీ సాహిత్యం - 3
బాలసాహితి - 1
డా|| జంధ్యాల పాపయ్య శాస్త్రి
1. తెలుగు బాల
తెనుగుదనమువంటి తీయందనము లేదు;
తెనుగు కవులవంటి ఘనులు లేరు;
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 1
కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు;
నష్టపెట్టబోకు నాన్నపనులు;
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 2
దేశసేవకంటె దేవతార్చన లేదు;
స్వార్థపరతకంటె చావు లేదు;
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 3
అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాల మానసముల మేలుకొల్పు;
సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 4
రక్తిలేని యాట రాత్రి నిద్దురచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు;
నీతిలేని చదువు జీతాలచేటురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 5
వినయ, మార్జవంబు, వీరత్వ, మనుకంప,
దీక్ష, సత్యసూక్తి, దేశభక్తి;
మండనమ్ము లివ్వి మంచి విద్యార్థికి
లలిత సుగుణజాల! తెలుగుబాల! 6
మదము, దొంగతనము, మంకుబుద్ధి, అసూయ,
విసుగు, పిరికితనము, విరుగబాటు,
సహజ గుణము లివ్వి చవట విద్యార్థికి
లలిత సుగుణజాల! తెలుగుబాల! 7
మొరకువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబు రోతరా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 8
ఎద్దు నెక్కె శివుడు; గ్రద్ద నెక్కెను విష్ణు;
హంస నెక్కె బ్రహ్మ అందముగను;
బద్ధకంపు మొద్దు బల్లపై నెక్కెరా!
లలిత సుగుణజాల! తెలుగుబాల! 9
బడికి నడువలేడు, పాఠాలు వినలేడు,
చిన్నపద్య మప్ప జెప్ప లేడు;
రాజరాజుబిడ్డరా నేటి విద్యార్థి!
లలిత సుగుణజాల! తెలుగుబాల! 10
పరమ సుందరములు ఫలములు, సంసార
విష మహీజమునకు వెలయు రెండు;
సాధుసంగమంబు, సత్కావ్యపఠనంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 11
అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
దేవతలకు నిడక తినెడివాని
చెప్పనగు ధరిత్రి "జీవన్మృతుం"డని
లలిత సుగుణజాల! తెలుగుబాల! 12
జనులకొరకు ధర్మశాలలు గట్టించి;
బీదసాద నెంతొ యాదరించి;
పేరుగన్న కర్మవీరుడే "మృతజీవి"
లలిత సుగుణజాల! తెలుగుబాల! 13
హంసలందు బకము హాస్యాస్పదంబగు;
మణుల గాజుపూస గణుతి గనదు;
చదువురాని మొద్దు సభల రాణింపడు;
లలిత సుగుణజాల! తెలుగుబాల! 14
జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
కలిమి గలిగి, విద్య గనని జనులు
గంధరహిత కింశుకప్రసూనంబులు;
లలిత సుగుణజాల! తెలుగుబాల! 15
బ్రతికినన్నినాళ్ళు ఫలము లిచ్చుటె గాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు;
త్యాగభావమునకు తరువులే గురువులు;
లలిత సుగుణజాల! తెలుగుబాల! 16
జూలు చుట్టుకొన్న వాల మల్లార్పిన
కొండకొమ్ముమీద కూరుచున్న
కరుల గుండె లదర గర్జించునా నక్క
లలిత సుగుణజాల! తెలుగుబాల! 17
తగిలినంతమేర దహియించుకొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె;
మంచివాని మైత్రి మలయమారుత వీచి;
లలిత సుగుణజాల! తెలుగుబాల! 18
అది పయోధి దోష మడుగున మణు లిడి
తృణగణమ్ము తల ధరించు టనిన;
మణుల విలువ పోదు; తృణముల కది రాదు;
లలిత సుగుణజాల! తెలుగుబాల! 19
ఫణిని మట్టుపెట్టి బాలు గాపాడిన
ముంగి జంపె నొక్క మూర్ఖురాలు;
మందమతుల కెపుడు ముందుచూ పుండదు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 20
సాధుసంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రహించుచుండు;
పుష్పసౌరభంబు పొందదా దారంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 21
అడవి గాల్చువేళ నగ్నికి సాయమై
నట్టి గాలి దీప మార్పి వేయు;
బీదపడిన వేళ లేదురా స్నేహంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 22
మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
సరసిజంబు క్రింద తిరుగు కప్ప;
కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 23