Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 37


                                    కన్నతల్లి కన్నీటి లేఖ
    
    గుండె పగిలిపోతున్నది - గొంతు సురిగి పోతున్నది -
    చార్ మీనార్ చేతులెత్తి - "శాంతి శాంతి" అనుచున్నది.
    
    సెగలు పొగలు చెలరేగెను - పగలు పాములై మూగెను
    "అమరజీవి" హృదయంపై అగ్నిపర్వతం మ్రోగెను.
    
    ఇది నా కన్నీటిలేఖ - ఇది నా దురదృష్టలేఖ
    మతి తప్పిన నందనులకు మాతృశ్రీ వ్రాయు లేఖ.
    
    ఈలలు గోలలు గుంపులు - ఎన్నెన్నో గర్జింపులు
    తెలుగుజాతి నాయకులకు నలుగురిలో తలవంపులు.
    
    దహనాలిక చాలింపుడు - సహనా లవలంబింపుడు
    పెట్రోలును కాదోయీ! ప్రేమసుధలు చిలికింపుడు.
    
    బహిష్కారములు వీడుడు పరిష్కారములు చూడుడు
    కయ్యాలకు స్వస్తి చెప్పి నెయ్యాలకు కేల్ సాపుడు.
    
    అన్నదమ్ము లన్యోన్యం ఆయుధాలు దూయకండి
    కన్నతల్లి కడుపుమీద కత్తిపెట్టి కోయకండి.
    
    అన్నపూర్ణ రొమ్ములపై - హలాహలం పూయకండి
    ఎన్నో యేండ్ల మహాకృషి - ఏటిపాలు చేయకండి
    
    అటు ఎవ్వరు - ఇటు ఎవ్వరు - అంతా నా సంతానం !
    నా తెలుగు ! నా వెలుగులు ! నా హృదయం ! నా ప్రాణం !
    
    వేడుకతో నా ఒడిలో - ఆడుకొనే గోవిందులు
    పరవశించి నా గుడిలో - పాడుకొనే పసికందులు.

    అచట బహిష్కరణాలా ! ఇచట దురాక్రమణాలా !
    అట సజీవ దహనాలా ! ఇట క్రోధ స్ఫురణాలా !
    
    ఒక్కతల్లి బిడ్డలలో - ఎక్కడి దయ్యా ఈ కసి ?
    చక్కని సౌధం నడిమికి ముక్కలు చేసే రక్కసి.
    
    ఆంధ్ర తెలంగాణా రాయలసీమల కొకే నీతి !
    ఒకే రీతి -ఒకే జ్యోతి - ఒకే ఒకే ఒకే "జాతి"
    
    నిండుగుండె పొలములలో -పండింపుడు సానుభూతి
    ఐదుకోట్ల తెలుగుబిడ్డ - లాలపించు డైక్యగీతి.
    
    ఒంటికంటి గుంటనక్క - కుంటి నడకలను గనకుడు
    పంటచేలు పాడుచేయు - పందికొక్కులను జెనకుడు.
    
    త్రాడుతెగిన గాలిపటం - తప్పుడు బాటల జనకుడు
    చుప్పనాతి శూర్పణఖల - చెప్పుడు మాటలు వినకుడు.
    
    కబంధ హస్తాలు చాచి -కబళించుట స్వార్దమురా !
    "ఎగబడితే"ఎదుటివారు "తెగబడుట" యథార్ధమురా !
    
    అంతులేని ఆశలతో ఆక్రమణలు చేయకురా !
    నింగిలోని స్వర్గాలకు - నిచ్చెనలను వేయకురా !
    
    అమాయికుల మనసులలో - అనుమానం తొలగింపుడు,
    వెనుకబడిన సోదరులకు విశ్వాసం కలిగింపుడు.
    
    మేలుగూర్చు బాటలలో - మీ ఊహలు సాగింపుడు
    ప్రియజనని గృహాన "సమన్వయ దీపం" వెలిగింపుడు
    
    మ్రోగుచున్న హృదయవీణ - తీగలు మరి త్రెంపవద్దు
    సాగుతున్న సౌహార్దం - జాజితలలు త్రుంపవద్దు.
    
    తెలుగు యశోగీతులు "శ్రుతిగలిపి" తీయగా పాడుడు
    "భాగ్యనగర" సౌభాగ్యం భద్రంగా కాపాడుడు.
    
    పచ్చని పందిళ్ళ క్రింద - చిచ్చుబుడ్లు కాల్పకండి
    ప్రక్క యిండ్ల మీద "పిచ్చికుక్కల" నుసి కొల్పకండి.
    
    ముసుగు దయ్యములను "ప్రజలముందు" దుమ్ముదులిపింపుడు
    మసిపట్టిన దానవులను - మానవులను గావింపుడు
    
    కష్టసుఖాల్ కలబోసుక - కలసి మెలసి పంచుకొనుడు
    నష్టమైన లాభమైన - నలుగురిదని ఎంచుకొనుడు.
    
    ఎరుగని పెడదారులబడి - యిక్కట్లకు లోనైతిరి.
    ఇరుగమ్మకు పొరుగమ్మకు - ఎంత చులకనైపోతిరి.
    
    చిక్కుపడిన సూత్రాలకు - స్నేహంతో విడదీయుడు
    గడ్డు సమస్యలు "శాంతంగా" కనుగొని సరిచేయుదు.
    
    పలికిన వాగ్దానాలకు భంగంరానీయకండి
    అన్నదమ్ము లొకరి నొకరు -అన్యాయం చేయకండి.
    
    జరిగిన పొరబాట్లు తిరిగి - జరుగకుండ చూచుకోండి
    చేసిన తప్పులు మళ్ళీ - చేయకుండ కాచుకోండి.
    
    దింపుడు ఉష్ణోగ్రత సా-ధింపుడు సర్వ సమగ్రత
    "భస్మాసురు" లున్నారోయ్ -తస్మాజ్జాగ్రత ! జాగ్రత !!
    
                                     భుట్టో షష్ఠాష్టకము ౧
    
    పాకెట్లో రాకెట్లిడి
    బ్రాకెట్లాడకుము ప్రజల భవితవ్యముతో;
    జోకర్లను స్వార్ధానికి
    బ్రోకర్ల నొనర్పకోయి ! భుట్టో భాయీ!
    
    రాకాసి కాకులను గొని
    రాకోయీ శాంతిపావురమ్ముల పైకిన్ !
    "పాకీస్థానము" నొక్క "తు
    పాకీస్థానము'గ మారుపంబోకోయీ !!
    
    పేచీల నిడకు ! మిచ్చిన
    పూచీలను విడకు ! మల్పబుద్దులతో లా
    లూచీలు పడకు! మన్యుల
    గోచీలం బట్టి దూకకుము నడికడలిన్ !!
    
    రాజీ రాజీవమువలె
    రాజిల్లిన శాంతిసిరి విరాజిల్లునుగా !
    రాజేయకు రణకుంపటి !
    మాజీ నాజీవి గాకుమా భుట్టోజీ !
    
    కొట్టో! మార్కెట్టో! బా
    స్కెట్టో! సిగరెట్టో! గండుచీమల పుట్టో!    
    చట్టో! పాముల బుట్టో!
    భుట్టో! నీ బుఱ్ఱ వట్టి! బూరుగుచెట్టో !!
    
    చిట్టెలుక కొక్కిరించిన
    పట్టపుటేనుగు ప్రతిష్ఠ భగ్నంబగునా !
    గట్టుకు తల ఢీకొట్టిన
    పొట్టేలుకె నష్ట మోయి! భుట్టో భాయీ !
    
                                    భుట్టో షష్ఠాష్టకము ౨
    
    మొదలే తానొక పిచ్చికోతి! మఱి నిప్పుల్ త్రొక్కె! కల్ ద్రావె! నా
    పిదపం దోకకుఁ దేలుకుట్టె! పయి నావేశించె నే భూతమో!
    అదిరా చెప్పెడిదేమి యాకలకలం! బాపోక! లాకేక! లా
    గదమాయింపులు! దొంగతంతులును! ఆగల్లంతు! లాగంతులున్ !!
    
    ఇస్లామ్ ధర్మము మంటగల్పి, ప్రజలన్ హింసించి ధూర్తుండవై
    ముస్లిమ్ పెద్దలఁ గష్టపెట్టితివి మోమోటంబు లేకుండగా!
    అశ్లీ లోక్తుల బుట్ట! మాయల మరట్టా! భద్రతామండలిన్
    "మిస్లీడ్" చేయుదు వెంతకాలమిటు పండెన్ నీదు దౌర్భాగ్యముల్!
    
    "కుక్కలు పోవుచున్న వవిగో!" నని ప్రేలెడు నీదు గొంతుకన్
    నొక్కు మనీషి యొక్కరుడునున్ సభలోపల లేకపోయెనే!
    నిక్కము భారతీయు లవనిన్ నిను బోలిన గుంటనక్కలన్
    టక్కరి పందికొక్కుల హుటాహుటిఁ బట్టఁగ వేటకుక్కలే !!
    
    భారతభూమిలో పెరిగి, భారతమాత పయస్సు గ్రోలి, యీ
    భారతధూళిలో పొరలి, భారతరక్తము మేనఁ దాల్చి, దు
    ర్వార మనీష నేఁ డొక పరాయి తురాయి ధరించి ప్రేలెదే
    "భారతకుర్కురంబు" లని భాయి! వచింపుము నీవెవండవో?
    
    "పొగరుఁబోతు"వనో "త్రాగుఁబోతు"వనియొ
    "వదరుఁబోతు"వనో నిన్ను మదిఁ దలంచి
    మిన్నకున్నారులే మన్నుదిన్నయట్లు
    భద్రతామండలీ పట్టభద్రు లెల్ల.
    
    శిశుపాలుం డలనాఁడు నిండుసభలో శ్రీకృష్ణదేవున్ నిరం
    కుశుఁడై కర్ణకఠోర కర్కశ కటూక్తుల్ పల్కి తానెట్టి దు
    ర్ద శపా లయ్యెనొ! అట్టి దుర్దశయె ప్రాప్తం బౌను నీకెప్పుడో !
    పశువాదమ్ముల కేమి! మానవపథభ్రష్టుండవై పోకుమా !!
    
    అక్కసు పట్టఁజాలక దయామయుఁ డిచ్చిన నోటి నక్కటా
    కక్కసుదొడ్డి చేసికొని కాఱులుకూసిన లాభమేమి ! నీ
    రక్కెసనాల్క బైటపడె! ఱంకెలువేసిన వాసిగందువే !
    ఫక్కున నవ్వుకొన్నది ప్రపంచము నీ కటువాక్ప్రపంచమున్.
    
    భుట్టోభాయీ ! నీ వొక
    పొట్టేలైపోతివోయి! భూధరమును డీ
    కొట్టితివి ! కొండ కొండయె
    కట్టా! నీ తలయె ఖండఖండములయ్యెన్.

 Previous Page Next Page