Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 1
కరుణశ్రీ సాహిత్యం - 4
* బాలసాహితి - 2 *
డా. జంధ్యాల పాపయ్య శాస్త్రి
పద్య విభాగం:
బాలకృష్ణ ప్రభూ!
శ్రీరాధారమణీ మణీ కుచయుగ శ్రీగంధ సౌగంధ్యవి
స్తారోద్భాసి భుజాంతరాళ! వ్రజకాంతాలోల! విన్యస్తక
స్తూరీఫాల! సువర్ణచేల! హతరక్షోజాల! గోపాలబా
లా! రావేల? దయాలవాల! శుభశీలా! బాలకృష్ణప్రభూ!
మోక్షాధ్యక్ష! విపక్షశిక్ష! భవసమ్మోహాబ్ధి నిర్మగ్న సం
రక్షాదక్షకటాక్ష! మానసవికారత్యక్త భక్తావళీ
సాక్షాత్కల్పకవృక్ష! కౌస్తుభావిరాజద్వక్ష! దైత్యేభహ
ర్యక్షా! విస్ఫురితారుణాంబుజదళాక్షా! బాలకృష్ణప్రభూ!
కారుణ్యామృతసార! ధీర! నిజభక్తశ్రేణి మందారబృం
దారణ్యాంత విహార! యోద్ధనుతనీయాకార! ధాత్రీరజః
పూరస్నిగ్ధ శరీర! వక్షవిలసన్ముక్తావళీ హార!రా
రా! రాధా హృదయాబ్జచోర! సుకుమారా! బాలకృష్ణప్రభూ!
వ్యామోహాత్ముడ; బాలకుండ; కలుషవ్యాపారుడన్; క్రూరుడన్,
స్వామీ! మీ మహిమం బెరుంగుటకు నాశక్యంబె? యోజింపగా
నేమో తోచినయటు లర్ధశతకంబే కూర్చి యర్పించెదన్,
బ్రేమం గైకొనవే సుశీతల దయాభ్ధీ! బాలకృష్ణప్రభూ!
ఫాలంబందు కరుంగనాభియు, కటిన్ బంగారుచేలంబు, కెం
గేలన్ పిల్లనగ్రోవి సుందరతరగ్రీవంబునన్ మాలతీ
మాలల్, మౌళి మయూరపింఛమలరన్, మచ్చిత్తముప్పొంగ నీ
లీలాబాలకమూర్తి చూపగదె తండ్రీ! బాలకృష్ణప్రభూ!
అద్దాలన్ నిరసించు చెక్కిళులతో, నందంపు కందోయితో,
నిద్దంపుంజిగిగుల్కు ముంగురులతో, నీటైన కెమ్మోవితో
ముద్దుల్ మూటలు గట్టు నీదు నగుమోముం బ్రేమమై నాకునే
ప్రొద్దుం జూపగదయ్య నెయ్యమున బాబూ! బాలకృష్ణప్రభూ!
"గొల్లల్ పిల్లనిమాట నమ్మినను గైకోరం"చు రాజల్లులన్
గొల్లల్ గా గురిపింప వ్రేలికొనతో గోవర్ధనం బెత్తి యా
కల్లోలంబునడంచి వేల్పుదొరదౌ గర్వంబు సర్వంబు వే
డుల్లంజేసిన నీకు భక్తి చెయిమోడ్తున్ బాలకృష్ణప్రభూ!
గోవిందా! మునిబృందవందిత పదా! గోవర్ధనోద్ధారణా!
దేవస్తుత్య! ముకుంద! మందరధరా! దివ్యప్రభావా! దయా
భావా! భావజకోటి సుందర! నినుంబ్రార్థింప నన్గావగా
రావేలా! బుధపాల! శ్యామలశరీరా! బాలకృష్ణప్రభూ!
ఉరగంబుల్ దలలూప, గోపసతు లత్యుత్సాహ మందన్, శిలల్
గరగన్; దల్లుల చన్నులన్ విడిచి లేగల్ చూచుచుండన్; మనో
హర బృందావనమందు నొక్క తరుశాఖాగ్రంబుపై నెక్కి నీ
మురళీగాన మొకింత సల్పగదె బాబూ! బాలకృష్ణప్రభూ!
వెన్నల్ తక్కువె? మీగడల్ తరుగె? లేవే సుప్రసన్నంబులౌ
యన్నంబుల్? కరవే దధుల్? మధురభక్ష్యాహారముల్ లోటె? పా
లెన్నన్ సున్నయె? యిన్నియున్ గలుగగా నేహ్యంబు పోనాడి య
న్నన్నా! మన్నునుదింటి విట్లు తగునయ్యా? బాలకృష్ణప్రభూ!
నెత్తావుల్ విరజిమ్ము క్రొమ్ముడి విడన్ నిన్ బట్టి కొట్టంగ తా
బెత్తంబున్ గొని "పోకు పోకు నిలురా బిడ్డా!" యటంచాగ్రహా
యత్తస్వాంత యశోద అల్లదిగొ! వెన్నాడెన్ నినున్; రమ్ము; నా
చిత్తాబ్జాంతరమందు దాగికొనుమా శ్రీబాలకృష్ణప్రభూ!
"అమ్మా" "ఏమిర?" "గిన్నెయిమ్ము" "సరియేలా" "పాలుద్రావంగ" "కా
లమ్మేయిప్పు?" "డదెప్డు?" "రాత్రి" "అదియేలాగుండు?" "గాఢాంధకా
రమ్మౌ" నంచు యశోద పల్క కను లోరన్ మూసి "రే వచ్చె;తే
తెమ్మాపా" లని తల్లిపైబడు దయాబ్ధీ! బాలకృష్ణప్రభూ!
"ఏరాబాలక! మన్ను దింటివట?" "లేదే" "అన్నయన్నాడు" "నా
పైరోషంబున బల్కెనట్టుల" "నిజంబా?" "నిక్కువంబే" "సరే
నోరుంజూపుము" "చూడవే జనని!" యంచుం సర్వలోకంబులిం
పారన్ తల్లికి నోట జూపితివి యాహా! బాలకృష్ణప్రభూ!
"పెరుగున్ బువ్వను పెట్టుదాన తనయా! వేవేగర"మ్మంచు న
త్తరి మీయమ్మ యశోద నిన్ బిలువ పాదద్వంద్వమం దందియల్
చిరుగజ్జెల్ గలుగల్లు గల్లురన తల్లింజేర నల్లల్లనన్
పరుగుల్ వెట్టెడు నిన్ను గొల్చెదను దేవా! బాలకృష్ణప్రభూ!
Next Page