Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 37

 
                                   వైతరణి

                                           (1986 వరకు నాల్గు ముద్రణలు)


    ఉషాదేవి మేలి ముసుగును సవరించుకుంటూ పల్లె ప్రజలను పలకరించింది.

 

    ఆమె చిరునవ్వు వెలుగు క్రమంగా ఆకాశాన్ని అలుముకుంది.

 

    ఆమె రక్తకపోలాల అరుణిమతో తూర్పున ఆకాశం రాగరంజితమైంది.

 

    "ఏమేవ్! ఇంకెంతసేపు? భద్రయ్యగారి సవారిబండి వెళ్ళిపోయింది కూడా! నువ్వుమాత్రం తెమిలి బయటపడవు." సవారిబండికి కట్టివున్న పులెద్దు వీపు చరుస్తూ పొలికేక పెట్టాడు మాధవయ్య.

 

    "ఐదో వస్తున్నా." లోపలినుంచి పున్నమ్మ గొంతు వినిపించింది.

 

    "ముందు మీరు ఎక్కి కూచోండర్రా!" అన్నాడు మాధవయ్య పిల్లలతో.

 

    మాధవయ్య పెద్దకొడుకు సుబ్బారాయుడు పదిహేనేళ్ళవాడు. గబగబా సవారీబండి ఎక్కి కూచున్నాడు.

 

    రెండోవాడు రామదాసుకి పదమూడు సంవత్సరాలు. వాడు బండి ఎక్కటానికి అవస్థపడుతుంటే పాలేరు ఎక్కించాడు.

 

    మూడోవాడికి పదకొండేళ్ళు. వాడి పేరు నాగభూషణం. వాణ్ణికూడా పాలేరు ఎక్కించాడు.

 

    నాలుగోవాడు సత్యనారాయణ. ఏడేళ్ళవాడు. తండ్రి ఎత్తుకుని వాణ్ణి సవారిబండి తొట్లో, ముందు కూచోపెట్టాడు.

 

    బండిలో కూర్చున్న ముగ్గురూ నేను వెనక కూచుంటానంటే నేను వెనక కూర్చుంటానని కీచులాడుకుంటున్నారు. కాళ్ళు కిందకు వేసుకొని వెనక కూచోటం వాళ్ళకు సరదా.

 

    "ఒరేయ్ సుబ్బారాయుడూ! నువ్వు మాత్రం వెనక్కూచో. మీరిద్దరూ బండి లోపల కూచోండిరా! చిన్నపిల్లలు బండి కుదుపుకు కింద పడగలరు" అన్నాడు మాధవయ్య. మాధవయ్య మాటంటే పిల్లలకు భయం. కిక్కురుమనకుండా తండ్రి చెప్పినట్టే కూచున్నారు.

 

    ముఖాన పెద్ద కానీ అంత కుంకంబొట్టు పెట్టుకుని, పెద్ద అంచునచీర కట్టుకొని చేతిలో పాలచెంబుతో వచ్చింది పున్నమ్మ.

 

    "ఆఁ ఎక్కు తొందరగా!" విసుక్కున్నాడు మాధవయ్య.

 

    "అయ్యో తొందరా!" అంటూ సవారిబండి అతికష్టంమీద ఎక్కింది.

 

    "అయ్యగారూ! తమరుకూడా ఎక్కండి" అన్నాడు పాలేరు.

 

    "నువ్వింటిదగ్గరే వుండు. ఇల్లు జాత్రత్త! బండి నేను తోలతాలే" అంటూ మాధవయ్య ఉషారుగా బండెక్కి కూచున్నాడు.

 

    చిన్నసైజు నందుల్లా వున్న కోడెలు యజమాని ఎక్కగానే పరుగు అందుకున్నాయి.

 

    "కొంచెం మెల్లగా తోలండి. పాలన్నీ ఒలికిపోతున్నాయి" అంది పున్నమ్మ.

 

    మాధవయ్య పల్లెపాలెంలో ఉన్న మోతుబరి రైతుల్లో ఒకడు.

 

    మాధవయ్యకూ, పున్నమ్మకూ ఒకటే కొరత. అది ఆడసంతానం కలగలేదని. "పడ్లలా నలుగురు మొగపిల్లలు. నీకేమమ్మా అదృష్టవంతురాలవు!" అని ఎవరైనా అంటే పున్నమ్మ నిట్టూర్చి వూరుకునేది.

 

    మాధవయ్య దంపతులు ఆడసంతానం కోసం మొక్కని దేవుడూ, పట్టని నోములూ లేవు.

 

    ఆ రోజు నాగులచవితి. ఊరవతల కోసం మొక్కని దేవుడూ, పట్టని నోములూ లేవు.

 

    ఆ రోజు నాగులచవితి. ఊరవతల వున్న నాగన్న పుట్టలో పాలు పొయ్యటానికి మాధవయ్య కుటుంబం బయలుదేరింది.

 

    "ఈసారన్నా నాగన్న కనికరించి యింత ఆడనలుసును ప్రసాదిస్తే వచ్చే సంవత్సరం నాగన్నకు బంగారు పడగ చేయిస్తాను" అంది పున్నమ్మ.

 

    మాధవయ్య నిట్టూర్చాడు. ఎడ్లను గట్టిగా అదిలించాడు. గణగణ గంటలు మోగుతుంటే గతుకుల రోడ్డుమీద బండి ఉయ్యాల జంపాలలాడుతూ పరుగెడుతూంది.

 

    ఆఖరువాడికి ఏడేళ్ళు. ఇంతకాలానికి పున్నమ్మ మళ్ళీ నీళ్ళు పోసుకుంది. మాధవయ్యకు మాత్రం తనకు ఆడ సంతానం కలుగుతుందనే నమ్మకం లేదు. పున్నమ్మకు మాత్రం ఆశ చావలేదు.

 

    "ఆ నాగన్న దయవల్ల ఆడపిల్ల పుడితే నాగమ్మ అని పేరు పెట్టుకుందామండీ!" అంది పున్నమ్మ పాలచెంబును భద్రంగా పట్టుకుకూచుని.

 

    మాధవయ్య జవాబివ్వలేదు. ఎడ్లను మళ్ళీ అదిలించాడు.

 

    "అమ్మోయ్! చెల్లాయికి నాగమ్మకాదే, బాలనాగమ్మ అని పేరు పెట్టుకుందాం" అన్నాడు పెద్దకొడుకు సుబ్బారాయుడు.

 

    "మా నాయనే! చెల్లాయంటే, నీకెంత యిదిరా!" మురిపెంగా అంది పున్నమ్మ కొడుకు తల నిమురుతూ.

 

    "నాగమ్మేంటే నాగమ్మ! చెల్లాయికి మంచి పేరు పెట్టుకుందాం" అన్నాడు సిసింద్రీలాంటి మూడో కొడుకు నాగభూషణం.

 

    వాడికి తల్లి అన్నయ్యను మెచ్చుకోవడం నచ్చలేదు. అందరికంటే తనకే చెల్లాయంటే ఎక్కువ ప్రేమ అని తెలియజెయ్యాలని ఆ పసివాడి ఆరాటం.

 

    "ఛ వధవాయ్, నోరు మూసుకో." కసిరింది పున్నమ్మ. చేసిన తప్పు అర్ధంకాని నాగభూషణం తెల్లముఖం వేశాడు.

 

    "నాగన్న తండ్రీ, పసివాడు ఏదో తెలియక అన్నాడు. నా పిల్లకు నాగమ్మ అనే పేరు పెట్టుకుంటాను తండ్రీ!" పున్నమ్మ చెంపలు వేసుకుంది.

 

    "ఊరుకుందురూ వెధవ సొద, పిల్ల యింకా పుట్టలేదు, పేరుమీద రాద్దాంతం" కసురుకున్నాడు మాధవయ్య.

 

    "అదేంటండీ అపశకునం మాటలూ మీరూనూ?" పున్నమ్మ గొంతు బొంగురుపోయింది.

 

    బండి ఊరి బయట తాటితోపు దగ్గరగా వెళ్ళి నిలిచింది. చిన్నవీ పెద్దవీ మొత్తం పదివరకూ పుట్టలు వున్నాయి.

 

    ఆడవాళ్ళు పుట్టలకు పసుపు రాసి కుంకంబొట్లు పెట్టి పాలు పోస్తున్నారు. ప్రదక్షిణలు చేస్తున్నారు. పిల్లలంతా దూరంగా చెట్లదగ్గర ఆడుకుంటున్నారు. మగవారు బళ్ళు విడిచిన చోటనే కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

 

    పున్నమ్మ బండి దిగి ఓ పుట్టవైపుకు నడిచింది. పిల్లలు ఆడుకోటానికెళ్ళిపోయారు. మాధవయ్య ఎడ్లను విడిచి బండికి కట్టి, చుట్ట ముట్టించుకున్నాడు.


                                        2


    ఉత్తర దిశన రయ్యిన పరుగెత్తుకొస్తున్న కారుమబ్బులు, ముత్తయిదువు నొసటి కుంకుమను చెరిపే కబంధుని కఠోర హస్తంలా ఆకాశంలోని అరుణిమను కప్పివేస్తున్నాయి.

 

    ఆకాశం ఏదో బాధపడుతున్నట్టుంది ఏదో తెలియని వెలితి గోచరిస్తోంది.

 

    ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుని, రాహువు తన చీకటి నీడల్ని పరచి యింకొంచెంసేపట్లో కబళించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు.

 

    జనం హడావిడిగా తిరుగుతున్నారు. కొందరు గాజు పెంకులకు మసిపూసి సూర్యగ్రహణాన్ని చూట్టానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకున్నారు.

 

    ఊళ్ళో అన్నిటికంటే ఎత్తుగావున్న భవనంపైనున్న గూటిలోంచి ఓ కపోతాల జంట లేచి టపటప రెక్కలు ఆడించుకొంటూ రివ్వున ఆకాశంలోకి లేచిపోయింది.

 

    ఆ భవనం వెనకవున్న గొడ్లచావిట్లో ఆవుదూడ తల్లి పాలకోసం అరుస్తూంది.

 

    ఆ భవనం మొదట అంతస్థులో దక్షిణపు గదిముందు మాధవయ్య ఆందోళనగా అటూ యిటూ తిరుగుతున్నాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ. అతని ముఖంలో ఏదో ఊహించలేని భయచిహ్నాలూ, హృదయంలో ఆనందపుటలాలూ, గజిబిజిగా అలుముకుంటున్నాయి.

 

    మాధవయ్య నలుగురు కొడుకులూ బిక్కమొహాలు వేసుకుని కూచుని వున్నారు. గదిలోనుంచి వినిపిస్తున్న తల్లి మూలుగును చెవులు రిక్కించి వింటూ "నాన్నా! అమ్మ ఎందుకు ఏడుస్తూంది?" అన్నాడు చిన్నవాడు సత్యనారాయణ ఏడుపు గొంతుతో.

 

    "మనకు చెల్లాయి పుడుతుందిరా తమ్ముడూ!" అన్నాడు పెద్దవాడు పెద్దవాళ్ళలా ముఖంపెట్టి.

 

    "ఒరేయ్ సుబ్బులూ! మీరు వెళ్ళి ఆడుకోండి. సత్యాన్ని కూడా తీసుకెళ్ళండి!" అన్నాడు తండ్రి.

 

    తండ్రి ఆజ్ఞ ప్రకారం పిల్లలందరూ బయటకు బయలుదేరారు. కాని ఆఖరువాడు "నాకు అమ్మ కావాలి. నేను అమ్మ దగ్గరకు వెళతాను" అంటూ పేచీ పెట్టాడు.   

 Previous Page Next Page