"మాట్లాడవేం?" కోపంగా అన్నది.
"అలాగే! రేపు వెళ్ళిపోదువుగాని!"
"లేదు. ఇప్పుడే వెళ్ళిపోతాను. మరొక్క క్షణం కూడా వుండను!"
"బేబీ! నామీద నమ్మకంలేదా? నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇక్కడ వుంచుతానని ఎందుకనుకుంటున్నావ్?"
"ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం! ఏదైనా మంచి హోటల్ లో వుండి రేపు వెళ్ళిపోదాం? నువ్వూ తోడురావాలి."
"అలాగే! కాని ఒక్కసారి ప్యాడ్ చూసి వెళదాం! జంకీస్ ను చూసి భయపడుతున్నావ్! ప్యాడ్ చూసి నీకు ఇష్టం అయితే..."
"లేదు - లేదు...నేను ప్యాడ్ లో కూడా ఉండను."
"అలాగే ఒకసారి ప్యాడ్ కు వెళదాం."
శబరి ఆలోచించింది.
ఎలా వుంటుందో ప్యాడ్! ఒకసారి చూస్తేనేం? తను అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు తిరిగివెళ్తే అందరూ ఏమనుకుంటారు? తను చచ్చిపోయిందనే అందరూ అనుకుంటూ వుంటారు. మళ్ళీ తను వెళ్తే... అమ్మా నాన్నా తనను ఇంట్లోకి రానిస్తారా?
"ఏమిటి బేబీ ఆలోచిస్తున్నావ్? నీకంత ఇష్టం లేకపోతే అక్కర్లేదులే. పద! ఏదైనా హోటల్ కు వెళదాం! రేపు నిన్ను హైదరాబాదు బండి ఎక్కిస్తాను!"
"ప్యాడ్ కు వెళదాం!"
జాన్ ఓ క్షణం శబరి ముఖంలోకి చూశాడు.
"పాపం! ఆ పిల్ల చచ్చిపోయింది. ఆ షెడ్ లో ఉన్నవాళ్ళు బయటికి రారేం?"
"వాళ్ళు ఈ లోకంలో ఉంటేగా!" అన్నాడు జాన్ ముందుకు నడుస్తూ. శబరి ఆలోచిస్తూ జాన్ వెనకే నడుస్తూ వుంది.
23
అల్లంత దూరం నుంచి గిటార్ విన్పిస్తున్నది. కొన్ని కంఠాలు విన్పిస్తున్నాయి. ఇంగ్లీషు పాట వినిపిస్తూ వుంది. శబరి శ్రద్ధగా వింటూ నడవసాగింది.
If wine interfers with your job
Quit your job
A night of good Drinikg
is worth a year's Thinking."
"వండర్ ఫుల్!" అన్నది శబరి.
జాన్ చివ్వున తలతిప్పి చూశాడు.
"పాట బాగుందికదూ?" హుషారుగా అన్నది.
జాన్ కళ్ళు వెలిగాయి.
"ఇంకా మంచి పాటలున్నాయ్!" అన్నాడు.
ముక్కు ఎగపీలుస్తూ "తమాషా వాసన వస్తోంది కదూ?" అన్నది.
"అవును! అన్ని రకాల మత్తు పదార్థాల వాసనలు కలిసిన వింత వాసన! హాయిగా. గాలిలో తేలిపోతున్నట్టుంది కదూ?"
శబరి సమాధానం ఇవ్వలేదు.
"నీకు భయంగా ఉందా? తిరిగి వెళ్ళిపోదామా?"
"వద్దు!" అన్నట్టు తల ఊపింది మ్యూజిక్ వింటూ.
"దమ్ మారో దమ్! బోలో హరేరామ హరేకృష్ణ!" శబరి ఎగిరి గంతేసినంత పనిచేసింది. "అరే ఈ పాటకూడా పాడ్తారా?" వుత్సాహంగా అడిగింది.
"ఎందుకు పాడరూ? అన్నీ పాడ్తారు. మన వాళ్ళకంటే విదేశీయులకే ఈ పాట ఎక్కువ ఇష్టం తెలుసా?"
అదొక పెద్దహాలు. వరండాలో వంద కాండిల్స్ బల్బ్ లు రెండు వెలుగుతున్నాయి. లోపల మాత్రం వెలుగు మందంగా నీలంగా ఉంది. ఇద్దరూ గడపలో నిల్చున్నారు. కొందరు అడ్డదిడ్డంగా పడివున్నారు. ఒకడు గిటార్ వాయిస్తున్నాడు. కొందరు ఆడమగా ఊగుతూ పాడుతున్నారు. శబరికి లోపల అడుగు పెట్టాలంటే జంకుగా వుంది. ధైర్యం కూడదీసుకోవడానికి ప్రయత్నిస్తూ వాకిలి ఇరుపక్కల గోడల్ని చూసింది. తెల్లటి గోడల మీద అనేక రంగుల్లో అక్షరాలు కన్పించాయి. కొటేషన్స్ కనిపించాయి. అన్నీ ఇంగ్లీషులోనే వున్నాయి.
"ఆగిపోయావేం? లోపలకు వెళ్దాంరా!" అన్నాడు జాన్.
"ఈ స్లొగన్స్ తమాషాగా వున్నాయ్! చదివాక వస్తాను!" అంటూ చదవసాగింది. "పక్కవాళ్ళను చూడటానికి ముందు నిన్ను నువ్వు చూసుకో!"
"ధైర్యం లేదు కదూ? హావ్ డ్రగ్! ట్యూన్ ఇన్! నీకు నువ్వే కన్పిస్తావ్!"
"నీ పొరుగువాడి పెళ్ళాంకేసి చూసెముందు నీ పెళ్ళాన్ని చూడు!"
"పరాయి ఆడపిల్లలమీద బూతు జోక్ వేసి వెకిలిగా నవ్వేముందు నీ చెల్లెల్నీ, నీ పెళ్ళాన్నీ, కూతుర్నీ తల్చుకో!"
"శాంతి గురించి మాట్లాడే ముందు మెషీన్ గన్ కేసి హైడ్రోజన్ బాంబుకేసి, వియత్నాంకేసీ చూడు!"
"నీ నాగరికత గురించి గొప్పలు కొట్టేముందు- లాభాల కోసం తయారుచేస్తున్న కల్తీ వస్తువులకేసి చూడు!"
"సమత గురించి మాట్లాడేముందు బొర్రలు పెంచిన కోటీశ్వరుల్ని చూడు!"
"అవినీతి నిర్మూలన గురించి ఉపన్యసించేముందు... సంతకాలకు వెల నిర్ణయించే ఆఫీసర్లను చూడు... పొట్టకోసం వళ్ళు అమ్ముకునే అతివలను చూడు... ముక్కు పోగుకోసం ముక్కుపచ్చలారని పసిదాని గొంతు నులిమే మానవుణ్ణి చూడు..."
"నీ సంస్కృతి గురించి మాట్లాడేముందు మీ తాతల మూతుల వాసన గురించి ఆలోచించకు. నీ మూతి వాసన ఏమిటో తెలుసుకొని మాట్లాడు!"
"నిన్ను నువ్వు అర్థం చేసుకుని-నీ సంస్కృతినీ... నీ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు!"
శబరి రెండో వైపు గోడకేసి నడిచింది.
"ప్లవర్ చిల్ డ్రన్ (వైట్ సాధూస్) కం ఇన్!"
"బేబీ నీకేం కావాలి? ఫ్రెంచ్ వైనా? స్వీజ్ ఛీజా? లేక జర్మన్ బీరా? ఏం కావాలి? కమాన్ హావ్ ఇట్!"
"డ్రగ్ తీసుకో!"
"మొద్దుబారిపో!"
"చైతన్యాన్ని నిద్రపుచ్చు!"
"చుట్టూ సౌందర్యం వుంది. కళ్ళు మూసుకొని ఆ సౌందర్యాన్ని ఆస్వాదించు!"
"బేబీ! ప్రేమను కోరుకో! పిల్లల్ని కోరుకోవద్దు!"
"నగ్నత్వాన్ని సమర్ధించు! పుడుతూ కత్తెరతో పుట్టలేదని గుర్తుంచుకో!"
"నేను అందుబాటులో వున్నాను. సందేహించకు! అడక్కుండానే అనుభవించు!"
"నీదీ నాదీ అంటూ భేదం మర్చిపో!"
"పవిత్రత, శీలం అర్థంలేని మాటలు, ఒకరు తాగిన గ్లాసులో మరొకరు తాగితే రుచి భేదం వుంటుందా?"
"ఎవరని అడక్కు!"
"అందరూ నీ వాళ్ళే!"
శబరి చదువుతూ నిల్చుంది.
"ఈ కృత్రిమ సంస్కృతి అక్కరలేదు. కొత్త సంస్కృతిని సృష్టిద్దాం."
"కొత్త సంస్కృతిని ఏర్పరుద్దాం! ఈ హిపోక్రసీని తిరస్కరిద్దాం. పాత విలువల్ని కాల్చేద్దాం! కొత్త విలువల్ని భావితరాలకు అందిద్దాం!"
"లోపలకు వెళదాం రా!" జాన్ శబరి చెయ్యి పట్టుకొని లోపలకు నడిచాడు.
గోచీ పెట్టుకొని వున్న ఒక యువతి చిరునవ్వుతో శబరికి చెయ్యి అందించింది. శబరికి ఆవిడ కేసి చూడాలనిపించలేదు. ఏదోలా అన్పించింది. నిక్కర్ మాత్రం వేసుకొని పాట్ తాగుతున్న ఒక నీగ్రో యువకుడు శబరికి చరస్ పాట్ అందించబోయాడు. శబరి అందుకోలేదు. నీగ్రో లేచాడు. శబరిని రెండు చేతులతో గట్టిగా బంధించి ముద్దుల వర్షం కురిపించసాగాడు. శబరి వుక్కిరి బిక్కిరి అవుతూ వుంది. పెనుగులాడుతూ వుంది. గోళ్లతో పిల్లిలా అతని ముఖాన్ని చీరింది. అతని ముఖం నుంచి కారుతున్న రక్తం వుప్పగా ఆమె పెదవులకు తగిలింది. అతని కళ్ళు ఎర్రగా వున్నాయి. ముఖంమీద ఎర్రటి రక్తం చిమ్ముతూ వుంది. అతన్ని బలంగా తోసేసింది. అతని కిందపడ్డాడు. లేవడానికి ప్రయత్నించడం లేదు. డ్రం దెబ్బలు ఆగిపోయాయి. గిటార్ ఆగింది. పాట ఆగిపోయింది.