అంతటితో నా బావమర్ది భార్యను వదిలేశాడట. సావిత్రికి సపర్యలు చేశారు.
డాక్టర్ వచ్చి ఏమీలేదు, భయపడిందని నిద్రమాత్ర ఇచ్చాడట.
తెల్లవారి నిద్రలేస్తూనే...
"మా అత్తయ్యను మామయ్య చంపేశాడు" అంటూ ఏడవసాగిందట.
"నేనేనమ్మా నీ అత్తయ్యను" అంటూ దగ్గరకు తీసుకున్న నా చెల్లెల్ని దూరంగా "నువ్వు మా అత్తయ్యవు కాదు మా అత్తయ్య చచ్చిపోయిందిగా" అన్నదట.
డాక్టర్ వచ్చి చూసి భయపడింది, ఫర్వాలేదు. తగ్గిపోతుందని ఏదో మందు ఇచ్చాడట.
రెండురోజులైనా సావిత్రి మనలోకంలోకి రాలేదు. రాత్రిళ్ళు ఎవరో ఏడుస్తున్నారు. గొంతు పిసుకుతున్నారు అంటూ లేచి కూచునేదట.
అది విని నేను నిలువునా కుప్పకూలిపోయాను. దిక్కుతోచనివాడిలా గోడకు చేరబడి కూచున్నాను.
"ఏయ్ ముసలాడా! నన్ను నీతో తీసుకెళతావా? వీళ్ళిద్దరూ మంచివాళ్ళు కారు. నన్ను ఏడిపిస్తున్నారు" అన్నది నా భుజంమీద చెయ్యివేస్తూ.
"అమ్మా! తల్లీ" అంటూ భోరున ఏడ్చాను.
"ఛ! నువ్వు కూడా ఏడుస్తున్నావా? ఛ... పిల్లలు ఏడుస్తారు. పెద్దవాళ్ళు ఏడవటం ఏమిటీ?" అంటూ నవ్వసాగింది.
నా భార్యను పట్టుకోవడం కష్టమయిపోయింది. డాక్టరు మార్ఫియా ఇంజక్షన్ ఇచ్చాడు.
ఆ డాక్టర్ సలహామీదనే సైకియాట్రిస్టు దగ్గరకు సావిత్రిని తీసుకెళ్ళాను. నర్సింగ్ హోమ్ లో చేర్చించాను. షాక్ ట్రీట్ మెంటు ఇచ్చాడు. వారంరోజుల్లోనే పిల్ల మమ్ముల్ని గుర్తించింది. మరో వారానికి మామూలు మనిషి అయింది.
"ఇక మీ అమ్మాయికి భయంలేదు. నార్మల్ గా ఉన్నది కాని ఎప్పుడైనా రివైవ్ కావచ్చును. మళ్ళీ కొంచెం అనుమానము వస్తే వెంటనే సైకియాట్రిస్టుకు చూపండి" అన్నాడు.
పిల్లను తీసుకుని ఇంటికి వచ్చాం.
అంతవరకూ చెప్పి రామనాధం నిట్టూర్చాడు.
"ఆఁ ఆ తర్వాత?" ఆతృతతో అడిగాడు రమణ.
అది పెరుగుతూ వచ్చింది. చదువులో చురుగ్గా ఉండేది. కొంతకాలం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం. పిల్ల చాలా నార్మల్ గా ఉండేది. ఒకప్పుడు దానికి మతి చలించిందనే విషయముకూడా మర్చిపోయాం.
బి.ఏ. పరీక్షలు రాసింది. అప్పుడే సావిత్రికి అనసూయతో పరిచయం. అనసూయ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. తర్వాత తెలిసింది. హైస్కూల్లోకూడా కలిసి చదువుకున్నారని.
అనసూయ చదువు మానేసి వెళ్ళిపోయిందనీ, వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయారనీ సావిత్రే చెప్పింది.
సావిత్రి ఎం.ఏ. లో చేరింది.
హాస్టల్లో అయితే చదువు బాగా సాగుతుందనీ హాస్టల్లో చేరతాననీ పట్టు పట్టింది. మాకు ఇష్టంలేదు. అయినా దానిమాట కాదనలేక హాస్టల్లో చేర్పించాం. ఆ మర్చిపోయాను మొదటిసంవత్సరం ఎం.ఏ. ఇంటిదగ్గర ఉండే చదువుకుంది. ఫైనల్ ఇయర్ క్లాసు రావాలని హాస్టల్ కు వెళ్ళింది."
ఓ క్షణం ఆగి కళ్ళు తుడుచుకున్నాడు రామనాధం.
రమణ వూపిరి బిగపట్టినట్టు కూర్చున్నాడు.
ప్రతి చిన్నదానికి ఉద్రేకపడేది. కాని మేము పెద్దగా పట్టించుకోలేదు.
"ఆ తర్వాత వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళిందా?"
"వెళతాను అనేది. మేమే పంపించలేదు. అప్పుడప్పుడు నా చెల్లెలే వచ్చి వెళ్ళేది."
"అప్పుడు సావిత్రి ఎలా ప్రవర్తించేది?"
"మామూలుగానే ఉండేది. చిన్నప్పటి విషయం పూర్తిగా మర్చిపోయింది."
"హాస్టల్ లో చేరిన రెండు నెలలకే ఒకరోజు పెట్టె తీసుకొని వచ్చేసింది. ఎందుకొచ్చేశావని అడిగాను."
ముఖం కందగడ్డలా ఉన్నది. "ఏం నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టంలేదా?" అన్నది ఉద్రేకంగా.
రెండోరోజు నేను హాస్టల్ కి వెళ్ళి వార్డెన్ ను కలిశాను. సావిత్రి వచ్చేయడానికి గల కారణం విని బాధపడ్డాను. ముందుకు మాట్లాడలేనట్టు ఆగిపోయాడు రామనాధం.
"వార్డెన్ ఏం చెప్పిందండీ?"
ఏం చెప్పను బాబూ! మీ అమ్మాయికి ఎప్పుడైనా మతి భ్రమణం కలిగిందా? అని అడిగింది.
నేను తెల్లముఖం వేశాను.
"లేదండీ" అబద్ధం చెప్పాను.
"వార్డన్ చెప్పింది ఉన్నట్టుండి అర్ధరాత్రి పిచ్చిగా అరుస్తూ నిద్రలేచేదట. కాసేపటికి తేరుకుని మళ్ళీ పడుకొనేదట. సావిత్రి అలా లేవడంతో ఆమె రూంమేట్సు భయపడి వార్డెన్ కు చెప్పేరట. అయినా ఆమె దాన్ని చాలా చిన్న విషయంగా కొట్టేసిందట."
"ఇంటిదగ్గర ఎప్పుడూ అలా చెయ్యలేదా?"
"ఎం.ఏ లో చేరాకనే ఒకటి రెండుసార్లు అరుస్తూ లేచింది. ఏదో పీడకల వచ్చి వుంటుందనుకున్నాం.
ఒకరోజు అర్ధరాత్రి లేచి బయటికి వచ్చి పక్కగది తలుపులు బాదసాగిందట. ఆ గదిలో వాళ్ళు భయపడి తలుపులు తీయలేదట. పక్కగదుల వాళ్ళు తలుపులు తీసుకొని బయటకు వచ్చారట.
వాళ్ళతో "లోపల ఎవరో ఏడుస్తున్నారనీ, ఎవరో ఎవర్నో గొంతు పిసుకుతున్నారని చెప్పిందట. తర్వాత ఆ గదిలోని వాళ్ళు బయటకు వచ్చి అంతా అబద్ధం అన్నారట.
తెల్లవారి వార్డెన్ సావిత్రిని మందలించిందట.
సావిత్రి తనకు ఏమీ గుర్తు లేదన్నదట.
రెండురోజుల తర్వాత మళ్ళీ అర్ధరాత్రి ప్రక్కగది తలుపులు కొట్టి అల్లరి చేసిందట.
దాంతో అందరికీ సావిత్రి అంటే భయం పట్టుకుంది.
వార్డెన్ సావిత్రిని ఇంటికి పంపించివేసింది.
"ఇంటికి వచ్చాక డాక్టర్ కు చూపించలేదూ?"
"లేదు బాబూ! చాలారోజులు మామూలుగానే ఉన్నది. అప్పుడప్పుడు మాత్రం రాత్రిళ్ళు లేచి ఎవరో ఏడుస్తున్నారని అనేది.
తర్వాత నువ్వు పక్కపోర్షన్ లోకి అద్దెకు వచ్చావు.