"బాబూ ఏం చెప్పను?"
"చెప్పండి. ఎక్కడుంది సావిత్రి?" కొంచెం విసుగ్గా అడిగాడు రమణ.
"ఆమె రాలేదు బాబూ! మీ డాక్టర్ తో సావిత్రి చచ్చిపోయిందని చెప్పండి. నీ భార్యకు త్వరగా నయం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను"
"ఆమె ఎక్కడుందో అడ్రసు చెప్పండి. నేను వెళ్ళి ఆమెను ప్రాధేయపడి హైదరాబాదు తీసుకెళతాను."
"బాబూ!"
"చెప్పండి ప్లీజ్..."
"సావిత్రి అడ్రసు" ఆగిపోయాడు రామనాధం.
"త్వరగా చెప్పండి" ఆత్రంగా అడిగేడు.
"సావిత్రి అడ్రసు... విశాఖపట్నం పిచ్చాసుపత్రి" గబుక్కున అనేసి రెండుచేతులతో ముఖం కప్పుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రామనాధం.
రమణ తృళ్ళిపడ్డాడు.
రామనాధంకేసి అయోమయంగా చూశాడు.
పార్వతమ్మ కాఫీ తెచ్చి "తీసుకో బాబూ" అన్నది.
"సావిత్రి పిచ్చాసుపత్రిలో వుందా?" నమ్మలేనట్టు అడిగాడు.
"అవును బాబూ"
"రెండు నెలలు కదండీ హైదరాబాదు నుండి వచ్చి, అప్పుడు బాగానే వుందిగా?"
"ఏం బాగు నాయనా? బాగుంటే అది నీతో అలా ఎందుకు ప్రవర్తిస్తుంది?"
"అవునండి నాకూ కొంచెం అనుమానం వచ్చింది. అసలు మేం ఇక్కడ వుండగా ఆమె ప్రవర్తించిన తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. మతిచలించే ముందు కొందరికి ఏవేవో శబ్దాలు వినిపిస్తాయని విన్నాను. ఎవరో మాట్లాడుతున్నట్టు కూడా విన్పిస్తాయట. అప్పుడే మీతో చెప్పాలనుకొని భయపడ్డాను."
"మాకు తెలుసు బాబూ! అప్పుడే సైకియాట్రిస్టుకు చూపించాల్సింది. కాని పెళ్ళికావల్సిన పిల్ల, నలుగురికీ తెలుస్తుందనే భయంతో ఇంతవరకూ తెచ్చుకున్నాం."
"అన్ని విషయాల్లో మామూలుగానే వుండేది కదండి"
"బయటివాళ్ళకు తెలిసేది కాదు. ఆ రోజుల్లో తను స్నానం చేస్తుంటే ఎవరో ఒకటీ, రెండూ అంటూ లెక్కపెడతారని చెప్పేది" కొద్ది క్షణాలు ఆగాడు.
"ఆ పని నువ్వే చేస్తున్నావనేది బాబూ! నీ కంఠమే అది అని చెప్పేది."
"మరి మీరు డాక్టర్ కు ఎందుకు చూపించలేదు?"
"చెప్పానుగా! మా తెలివితక్కువ వల్లే దాని జీవితం నాశనమైంది."
"ఆమెకు మతి స్థిమితం లేదని ఎప్పటినుంచీ తెలుసు?"
"చిన్నప్పుడే దానికి మనసు చలించింది అప్పుడు దానికి పన్నెండేళ్ళు"
"అంత చిన్న వయసులోనా? కారణం?"
"చెబుతాను విను బాబూ!"
17
రామనాధం ఓ క్షణం మౌనంగా ఉన్నాడు.
కళ్ళు తుడుచుకున్నాడు.
గొంతు సవరించుకున్నాడు.
"మాకు సావిత్రి ఒక్కటే బిడ్డ. చిన్నప్పుడు తెల్లగా... బొద్దుగా వుండేది. ప్రతివాళ్ళూ చిదిపి దీపం పెట్టొచ్చు అనేవారు దాన్ని చూసి.
అంత అందముగా వుండేది.
దాన్ని అపురూపంగా పెంచుకున్నాం. అప్పుడు దానికి పన్నెండేళ్ళు.
మా బంధువుల్లో చాలామంది దాన్ని కోడలుగా చేసుకోవాలని పోటీలు పడేవారు.
ఆ సంవత్సరం ఎనిమిది పరీక్షలు రాసింది. నాకు ఒక చెల్లెలు వుంది. దానికి పిల్లలు లేరు. సావిత్రి అంటే దానికి ప్రాణం. దాని భర్త చాలా మంచివాడు. కాని చెడు సహవాసాలతో తాగుడు నేర్చుకున్నాడు. జూదం ఆడేవాడు. రాత్రిళ్ళు క్లబ్బులోనే ఎక్కువగా ఉండేవాడు. ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది.
క్రమంగా నా చెల్లెలి వంటిమీద నగలు కూడా అమ్మేశాడు.
ఆ సంవత్సరం పరీక్షలు రాసి సావిత్రి అత్తయ్య దగ్గరకు వెళతానన్నది. నేనే వెళ్ళి పంపించి వచ్చా.
ఒకరోజు టెలిగ్రాం వచ్చింది. సావిత్రికి ఒంట్లో బాగాలేదనీ, వెంటనే బయలుదేరి రమ్మనీ.
ఇద్దరం ఏడుస్తూ కాకినాడ వెళ్ళాం.
సావిత్రి మెల్లా యింట్లో ఉయ్యాలలో కూచుని ఊగుతున్నది. ఏదో పాట పాడుతున్నది. మాకు ఆశ్చర్యం వేసింది. పిల్ల బాగానే వుంది మరి ఆ టెలిగ్రాం ఎవరిచ్చారో అర్ధముకాలేదు.
"అమ్మా సావీ!" అంది వాళ్ళమ్మ దగ్గరికి వెళుతూ.
సావిత్రి మాకేసి చూడలేదు. తన లోకంలో తను ఉన్నది. మామీద కోపంగా ఉన్నదనుకున్నాం.
అంతలో మా చెల్లెలు బయటికొచ్చి "అన్నయ్యా..." అంటూ భోరున ఏడ్చింది.
"ఏమిటమ్మా ఏం జరిగింది?" అన్నాను.
"సావి... సావి... అన్యాయం జరిగింది."
నేను అయోమయంగా చూశాను.
నా భార్య స్ణాణువులా నిలబడిపోయింది.
"ఏమిటమ్మా నువ్వనేది? అది బాగానే వుందిగా?"
"లేదన్నయ్యా! సావిత్రి మనల్నెవరినీ గుర్తించడం లేదు. మనసు చెడింది"
"అయ్యో నా బిడ్డ..." అంటూ నా భార్య విరుచుకుపడిపోయింది.
అంతలో మా బావమరిది వచ్చాడు.
"నేను పాపిని నన్ను చంపండి బావగారు" అంటూ భోరుమన్నాడు.
మా చెల్లెలు నా భార్యకు సపర్యలు చేసింది.
ఆమె చివ్వునలేచి కూతురి దగ్గరకెళ్ళి "తల్లీ..." అంటూ పట్టుకుంది.
"ఏయ్ ఎవరు నువ్వు? ఏం ముసలోడా ఎందుకొచ్చారు?" అన్నది.
నాభార్య గొల్లున ఏడవసాగింది.
నాకు మతిపోయింది.
సావిత్రి చప్పట్లుకొడుతూ నవ్వసాగింది.
"ఏమిటి? అసలు ఏమైంది?" అని అడిగాను.
నాకు వాళ్ళు చెప్పిన విషయం --- రెండురోజుల క్రితం నా బావమర్ది బాగా తాగి అర్ధరాత్రిపూట ఇంటికి వచ్చాడట. జూదం ఆడటానికి మంగళసూత్రం తాడు ఇవ్వమన్నాడట. ఉన్న బంగారు నగ అది ఒక్కటే. మా చెల్లెలు ప్రాణం పోయినా సరే అది మాత్రము ఇవ్వనన్నదట. దాంతో వెర్రి ఆవేశముతో భార్య గొంతు పట్టుకున్నాడట. నా చెల్లెలు కేకలు పెట్టిందట.
అక్కడే నిద్రపోతున్న సావిత్రి తృళ్ళిపడి లేచిందట. తన అత్త గొంతు పట్టుకొని "చంపేస్తాను" అంటూ అరుస్తున్నాడట.
సావిత్రి నిద్రలో లేచింది.
ఆ దృశ్యం చూసి భయంతో కెవ్వున కేకపెట్టి పడిపోయిందట.