తనకు అనుమానం కలిగి భార్య ద్వారా విషయమంతా తెలుసుకున్న సాంబశివరావుగారు అసలే అనారోగ్యంతో వున్నారేమో మంచం పట్టారు. మనసులో బాధ దాచుకోలేక శ్రీహరిగారికి ఉత్తరం రాయించింది రాజేశ్వరమ్మ భర్తతో పోరిపోరి. ఆవిడ తృప్తికోసం ఉత్తరం రాశారు సాంబశివరావుగారు. నాలుగురోజుల్లో సమాధానం వచ్చింది. తాము కన్నబిడ్డే అయినా, దాని బాగోగులు చూసే బాధ్యత కలవారిపై లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో పెరిగి ఇలా పెడసరంగా తయారయిన బిడ్డను ఏ విధంగా మందలించగలమంటూ రాశారు. పైగా మీకున్న సన్నిహితం కూడా మాకు లేదు. అయినా చెప్పి చూస్తాం. దానికి కూడా ఉత్తరం రాస్తున్నాం" అంటూ జవాబు రాశారు. దాంతో అన్ని ఆశలూ అడుగంటిపోయి మరింత కృంగిపోయారు రాజేశ్వరమ్మ, సాంబశివరావుగారూ.
తల్లీ తండ్రీ రాసిన ఉత్తరం చూసి నవ్వుకుంది రాధిక. ఆ నవ్వు వెనకదాగి వున్న బాధ ఆమె నరనరాలలోనూ పిండేసింది." నువ్వింత అప్రతిష్టురాలివి అనుకోలేదు. వారి కొంపకి చిచ్చుపెడతావని అనుకోలేదు. నువ్వు గడిపిన బతుకెటువంటిదో మాకు తెలీదు. మా అదుపు ఆజ్ఞల్లో పెరిగిన బిడ్డవయితే ఇలా చేసే దానివి కావు. ఈ రకంగా నువ్వు తిరిగొచ్చావన్న సంతోషం కంటే, నువ్వు కనబడకుండా పోయావన్న దుఃఖంలోనే మాకు తృప్తి వుండేది" ఇది ఆ ఉత్తరంలోని సారాంశం. ఆవేశంతో, ఉక్రోషంతో, రక్తం ఉడికిపోతోంది. "అమ్మా నాన్నా" అన్న ఆ కమ్మనిమాట మీదే విరక్తి కలిగింది రాధికకి. ఎటువంటి తప్పునైనా, కన్నతల్లి కడుపులో పెట్టుకుని దాస్తుంది" అన్న వాక్యాలు అబద్ధాలనిపించాయి. కన్నబిడ్డ మాటమీద, ఆమె గడిపిన జీవనం మీద నమ్మకం లేని తల్లీదండ్రులు తల్లీదండ్రులే కాదు. ఈ ప్రపంచంలో అమ్మా, నాన్నా, అన్నా. చెల్లీ, భార్యా, భర్త అన్నీ కృత్రిమబంధాలే. ఎవరికి ఎవరూ ఏదీ కారు అనే ధోరణిలో, కుమిలి కుమిలి ఏడ్చింది మొదటిసారి తల్లిదండ్రులు తిరస్కరించినప్పుడు, మధన్ చేరదీసి ఊరడించాడు. ఈ రోజు ఆ మధన్ కి దూరమయింది తను. చేసింది తప్పేమో దేముడిలాంటి మధన్ ని క్షోభపెడుతోందేమో అని ఆలోచించి, వెళ్ళి మధన్ కాళ్ళమీదపడి క్షమాపణ వేడుకుందామని లేవబోయింది. అంతలోనే డబ్బు వ్యామోహానికి బంధితులయిన మనుష్యులు కళ్ళ చుట్టూ కనిపించారు. ఆత్మాభిమానం చంపుకుని అతని కాళ్ళమీద పడడం అనవసరమనిపించింది. "తనిచ్చిన డబ్బంతా మధన్ పుచ్చుకుంటూనే వున్నాడు. లెక్కపెడితే కొన్ని వేలయి వుంటాయి. డబ్బు దాహం లేనివాడయితే ఎందుకు పుచ్చుకుంటున్నాడు ఇచ్చినదంతా. బాంకులో వేసుకుని పెరుగుతూన్న సొమ్మును చూసి, మురిసిపోతూండొచ్చు. ఆ డబ్బు మనిషిని క్షమాపణ కోరుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు, అనుకుని, ఆ ప్రయత్నం మానుకుంది. అల్లకల్లోలమైన మనస్సుతో పిచ్చి పిచ్చి వూహలతో, సతమతమయిపోతూ, ఓపికున్న కొద్దీ ఏడ్చింది, మంచం మీద పడుకుని రాధిక.
"నాకొడుకఖ్కర్లేకపోయాక నా ఇల్లు మాత్రం ఎందుకు? నా ఇంట్లో వుండొద్దు పో..... అంది ఒకరోజున రాజేశ్వరమ్మ బయటికి వెళుతూన్న రాధికతో.
"చూడండి అత్తగారూ ఇంతవరకూ విడాకులని వీధిన పడలేదు. అంటే 'లా' ప్రకారం నేను వారి భార్యనే కనుక ఈ ఇంట్లో నుంచి పొమ్మనే అధికారం ఎవరికీ లేదు. మీ మాట కాదంటున్నందుకు మన్నించండి" అంటూ గబగబా వెళ్ళిపోయింది.
"అత్తగారూ బొత్తగారూ అని పిలుస్తూనే కొంపనంటించేస్తున్నావ్. 'లా' ప్రకారం పొమ్మనే అధికారం లేదట. అంటే మా చుట్టూ పక్కలో బల్లెంలా వుంటూ కక్ష్య తీర్చుకుంటుందన్న మాట. ఎంతో సహృదయంతో చేసిన సహాయానికి ప్రతిఫలం మాకు ఇది భగవంతుడా అంటూ శోకాలు ప్రారంభించింది ఆవిడ.
ఈ ఏడుపులూ, పెడబొబ్బులూ రోజురోజుకీ ఎక్కువయిపోవడంతో, ఇంట్లో వుండలేకపోతున్నాడు మధన్. ఆనోటా ఆనోటా వీరి గృహకలహాలు ఆఫీసు దాకా కూడా పాకాయి నలుగురూ నాలుగు రకాలుగా చెప్పుకునే కథలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. అక్కడా వుండలేకపోతున్నాడు. చివరికి ఒకరోజు మరీ భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంట్లో ఇరవై నాలుగు గంటలూ కూర్చోవడం, నరకం అనిపించింది. సత్యాన్ని తలుచుకుని పసిపిల్లాడిలా ఏడ్చాడు. సత్యం ఇచ్చిన తాళాలు గుర్తొచ్చి, ప్రశాంతతకోసం, తన గదిలో కూర్చొని కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు. చిత్తంలోని చింత చిత్తరువుల ద్వారా తెలుపుకుంటూన్నట్టు, అశోకవనంలో శోకమయిన సీత, సీత కోసం తపించిపోయి కుమిలిపోయే రాముడు. అభాగిని శాపగ్రస్త అహల్య. దుఃఖితురాల శకుంతల, ఈరకంగా పటాలు గీయడం మొదలెట్టాడు. అందులోనే ఒక రకమైన అద్వితీయమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
ఒక్కొక్కసారి రోజులు తరబడి కొడుకు ఇంటికి రాకపోవడం, ఉద్యోగం మానేశాడన్న వార్త సాంబశివరావుగారు దంపతులకి గోరు చుట్టుమీద రోకటిపోటులా అయింది. సాంబశివరావుగారు పూర్తిగా మంచం పట్టారు. అతని మందులూ, టానిక్కులూ, పళ్ళరసాలకే బోలెడంత డబ్బయిపోతోంది. ఒక్క వస్తువు లేదనకుండా తెచ్చి పెడుతున్నాడు మధన్.
ఉద్యోగం మానేసినా, ఈ ఖర్చులన్నీ భరిస్తున్నాడంటే, పౌరుషంతో ఆనాడు తన డబ్బు పారేసినా, ఈనాడు అదే అవసరానికొచ్చిందనుకుంది రాధిక. పరోక్షంగానైనా, తను ఆ కుటుంబానికి సహాయపడుతున్నాలే అని, పిచ్చిగా సంతోషించింది" ఎలా వుంది మామగారూ" అంటే సమాధానం చెప్పరు సాంబశివరావుగారు. "అత్తయ్యా ఏమైనా కావాలా బజారు నుంచి" అని అడిగితే, "మా ప్రాణాలు పోవడానికి ఇంత విషం కొనుక్కొచ్చియ్యి" అంటుంది. ఇన్ని విధాల ఇంతమందికి మానసికక్షోభ తనవల్లే కదా, మధన్ ని క్షమించమని అడుగుదామని వెళితే ఆమెను తప్పించుకు తిరుగుతున్నాడతను, ఏమైనాసరే, ఈ రోజు అతన్ని కలుసుకుని, క్షమాపణ కోరుకోవాలని, శోకపూరితమయిన ఆ యిల్లు మళ్ళీ నవ్వులతో నందనవనం కావాలని కోరుకుంటూ మధన్ కోసం ఎదురు చూస్తోంది. అంతలో "ఉత్తరాలొచ్చాయండి" అంటూ మిసెస్. జానకి రెండు కవర్లు చేతిలో పెట్టి వెళ్ళింది. కవర్లు చించి చదవడం మొదలెట్టింది.
ఒకటి చెల్లెలు రేణుక దగ్గరనుంచి, రెండోది తల్లి రాసింది. రేణుక ఉత్తరం మొదట చదివింది "ప్రియమైన అక్కా. ఈ మధ్య ఏ పేపర్లో చూసినా నీ ప్రదర్శన గురించిన ప్రశంసలే. నువ్వు సినిమాల్లో కూడా చేరబోతూన్నట్టు వార్త చదివాను. చాలా సంతోషం. మా చిన్నారి అనిత చక్కగా డాన్సు చేస్తుంది. వాళ్ళ నాన్న దీన్ని చూసినప్పుడల్లా నీ పోలీకలే అంటారు. నిన్ను తలుచుకోని క్షణం లేదనుకో. సినిమాలో మా పాపకి ఏవైనా చిన్న చిన్న వేషాలుంటే ఇప్పించు. పెద్దగా డబ్బివ్వకపోయినా ఫరవాలేదు. రానూ, పోనూ ఖర్చులిస్తేచాలు. ఎవరైనా నీ గురించి పొగుడుతూ వుంటే ఎంత గర్వంగా వుంటుందో తెలుసా నాకు? ఉంటామరి మా పాపకి నీ ఆశీస్సుల కోసం ఎదురుచూస్తూ
నీ చెల్లెలు, రేణు.