అనుభూతీ ఆర్ద్రతా ఏమాత్రం లేకుండా -
పరవశించి భావనలో కరిగిపోకుండా -
ఏమి లాభం స్వామీ రాముడిమీద పద్యాలు రచించి
చెవులలో మ్రోగటం లేదా కవితాక్రౌంచి కరుణవిపంచి !
కదలటం లేదా ఎదలో క్రౌంచపక్షి ఆక్రందనం !
"ఆ క్రందనమే"గా ఆదికవి హృదయస్పందనం
నిషాదునిమీద నీదృష్టి నిలుపుకున్నావు
విషాద విహ్వల విహంగిని విస్మరించావు !!
ఒక నిష్ఠుర నిషాదుని నిశితశరం దూసుకువచ్చింది
ఒక మహత్తర కావ్యాన్ని విశ్వానికి అందిచ్చింది
మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు గిడుతున్నాడు మామూలు నరుడు!
కావ్యం వ్రాసిన కవిమాత్రం కలకాలం అజరామరుడు !!
నీరసమైన కిరాతుని నారసం చూచి నీవు భీతిచెందకు
నిర్భాగ్యుడైన నిషాదుని నిరీక్షించి నీవు భయమందకు
విశ్వకల్యాణకరమైన సృష్టి కార్యానికి విముఖుడవు కాకు
నిరంతర రసస్రవంతికి పరాఙ్మఖుడవై పారిపోకు.
అపరాధియైన ఆ వ్యాధుడు మాత్రం ఎవడు?
ఆలోచిస్తే ఆదికవి వాల్మీకి మొదటి రూపమేగా అతడు -
క్రౌంచాన్ని కొట్టినందుకు కవికి వచ్చింది కోపం
ఎట్టయెదుట నిలబడింది విడిచిపెట్టిన మొట్టమొదటి రూపం !
దారుణమైన నీలోని ఆ పూర్వరూపాన్ని పారద్రోలు దూరంగా
క్రూరమైన దానికుటిల దంష్ట్రలు గ్రుచ్చుకుంటాయి నీకు ఘోరంగా
"పెద్దమనిషి" "బుద్ధిమంతుడు" అనే పేరుకోసం తహతహలాడి
కరుణామయి కవితను బలిచేస్తావా కనికరం విడనాడి.
కవీ! వినవయ్యా విను !! కవిత్వానికి ఆలంబనం "నారీమతల్లి"
ఆమె సహజ సౌభాగ్యంతో పుష్పించిన కల్పవల్లి
కవీ! వినవయ్యా విను !! కవిత్వానికి జనయిత్రి "ధరిత్రి"
విత్తనాలకోసం వేచియున్న విశ్వధాత్రి.
కవిత్వాన్ని కవిత్వంగా గౌరవించడం కవికి హుందాతనం
కవిత్వమనేది సత్యసనాతనం! నిత్యనూతనం!
క్రొత్తదైనా సరిక్రొత్తదైనా కవిత్వం కవిత్వమే!
ఉత్త ఉపదేశాలు మానివేయి! ఉదాత్తమైన కవిత్వం వ్రాయి!
అయిపోతున్నది లేఖ - మూడుముక్కల్లో ముగిస్తున్నాను -
ప్రియమైన కవీ! ఒక్క సంగతి హెచ్చరిస్తున్నాను -
జలబిందువై సముద్రంలో మునిగిపోవడమా -
చందమామవై పాలకడలిలో పైకితేలడమా -
మంచిదేదో ఆలోచించు! ఆ విధంగా ఆచరించు !
కొంచెంగా చెప్పినా గొప్పగా గ్రహించు !
కవిత్వం చైతన్యవంతమైన గంగాఝరి !
ఆ వేగానికి అనుభూతి మహోన్నత హిమగిరి.
అనుభూతిలేని శుష్కహృదయునివాణి
ముదుసలి మగడు తాళిగట్టిన అందాలరాణి
ఉపన్యాసాలు కట్టిపెట్టి ఉత్తమంగాసృష్టించు కవిత
ఉంటాను.
ఇట్లు ప్రియమైన నీ సవిత
గులామ్ ఖాదరు
(కాశ్మీరములోని 'ఖాగ్' గ్రామము గులామ్ ఖాదరు నివాసస్థానము.
దురాక్రమణ దారులైన పాక్ గూఢచారులను కనిపెట్టి తరిమికొట్టి
ఆ సంకుల సంగ్రామములో అసువులువాసిన అమరమూర్తి గులామ్
ఖాదరు. ఆ అమరవీరుని సమరగాథయే ఈ రచనకు ఆధారము.)
అక్రమమ్ముగ తన గ్రామ మాక్రమించు
దుండగుల గుండె చీల్చు వీరుం డతండు!
అణువణువు మాతృభూమి రక్షణము కొఱకు
వ్యయముచేసిన ధన్యజీవను డతండు.
లంచమిచ్చి తన్ను వంచింప నెంచిన
వంచకులను ధిక్కరించినాడు !
మతము పేరుచెప్పి మాయచేయదలంచు
చెన్నటులను డొక్కచించినాడు.
"మతము మతమటంచు మైకమ్ము తలకెక్కి
హతమొనర్పఁదగునె యవని జనుల ?
మాతృభూమికన్న మత మున్నదా?" యంచు
మోసగాండ్ర నోరు మూసినాఁడు.
పాకీస్థా నుసికొల్పిన
రాకాసుల పాఱఁద్రోల గ్రామీణ ప్రజా
నీకము నేకమొనర్చిన
నీ కేరీ సాటి! ముందు నిలిచిన మేటీ!
గ్రామము కూడగట్టుకొని, కట్టిడి దోపిడిమూక మీద సం
గ్రామము చాటి, ముందునకు కాలిడనీయని వీరకార్మిక
స్వామివి నీవు; నీ సమర సాహసలీలకు పుల్కరించె "ని
స్లాము" సెబాసు ఖాదరుగులాము! సలాము త్వదీయ దీక్షకున్.
"ఇప్పు డిటేల వచ్చితిరి? ఈక్షితిఖండము భారతమ్ములో
నెప్పుడొ చేరిపోయె పదునెన్మిది యేడులనాడె; చాలు మీ
తప్పుడు మాయదారి పరదా సరదా; సరదారులార! మీ
రిప్పురి వీడిపొండు; సహియింపము మీ పలుగాకి చేష్టలన్!
ఈ కాశ్మీరము పొత్తు భారతముతోనే కాని, పల్గాకి యౌ
పాకీస్థానము తోడ కా దనుచు నిస్పష్టమ్ముగా చాటమే
లోకమ్మెల్ల; వ్యథల్ క్రుథల్ వృథలు; చాలున్ దండముల్ మీకు; మీ
రాకల్ మాకు చిరాకు; లోబడము మీ రాకాసి కౌగిళ్ళకున్.
ఎల్లల్ దాటుట, యిండ్లుగాల్చుట, ప్రజన్ హింసించుటల్, పంటలన్
గొల్లంగొట్టుట, గొంతుకోయుట, తుపాకుల్ ప్రేల్చుటల్, జీవితా
లల్లాడించుట న్యాయసమ్మతములే? అల్లా మిమున్ మెచ్చునే?
చెల్లంబో విట మీదురంతములు కాశ్మీర ప్రదేశమ్ములో."
అంచు గర్జించి క్రుద్ధ సింహము విధాన
దూకితివి దొంగతోడేళ్ళ మూకపైన;
ఐదురోజులు భీకరాహవమునందు
వేడినెత్తురు కురిసె నీవాఁడి బరిసె.
వైరులఁద్రోలి నేలపయి వ్రాలిన ముస్లిము వీర! నీ యసృ
గ్దారల ధన్యమైనది గదా క్షితి;నీ స్మృతి కల్మి నొక్క కా
శ్మీరమె కాదులే, పరవశించిన తావక దేశభక్తికిన్
భారతజాతి యెల్ల ఋణపడ్డదిరా పదివేల యేండ్లకున్.
భారతావనిలో నున్న యారుకోట్ల
ముస్లిములు నీ పరాక్రమమ్మును స్మరించి
మురిసిపోయిరి; నీ వీరచరిత మాతృ
పూజ కొక నవ్యదివ్య నీరాజనంబు.
'అమరవీరుఁడ'వైన నీ సమరగాథ
"ఖాగపురి" రక్షకైన నీ త్యాగదీక్ష
ధీర గంభీరశక్తి నీ దేశభక్తి
మెఱయు నిక ముందు! వీరకాశ్మీరమందు !
ఆయూబ్ ఆత్మగతము
జిత్తులమారి జంబుకము "చెవ్వనులై" మెడబట్టి త్రోయ దం
డెత్తితి మాతృదేశము పయిన్, సమరాన విరోధి చేతిలో
చిత్తయి పోయితిన్; చపలచిత్తుఁడ; మత్తుఁడ; నాదుమత్తు గ
మ్మత్తుగ దించినారు ధృతిమంతులు భారత వీరసైనికుల్.
"భుట్టో ఱంకెలు, మాయటాంకులు, పెకింగ్ బొంకుల్, మదిన్నమ్మియీ
నట్టేటం బడియెన్ మదాంధుఁ"డని నానాదేశముల్ నన్నె చీ
కొట్టెన్ - మేరుగిరీంద్రమున్ దగరు ఢీకొట్టెన్ గదే! నేఁడిటుల్
"పట్టాల్ దప్పిన బండి"నైతి నిక నా ప్రారబ్ధ మెట్లున్నదో !
ఆకాశ్మీరము వంకబెట్టుకొని యన్యాయమ్ముగా నిండియా
పైకిం దూకితి, నోరులేని ప్రజపై వర్షించితిన్ బాంబులున్
రాకెట్లున్; రిపుసైన్యముల్ తరుమ పోరన్ దోకజాడించి చీ
కాకై పోతిని! చిన్నపోతిని! చిరాకైపోతి లోకానికిన్ !!
మొండి శిఖండి దుండగపు మూకల కాకల కోడి యిండియా
గుండెలు క్రుంగి లోమ్గు ననుకొంటి; నవక్ర పరాక్రముల్ రణో
ద్దండులు భారతీయులు; యథార్దమెఱుంగక మోసపోయితిన్;
దండుగమయ్యె నా శ్రమ; కృతఘ్నములయ్యె శతఘ్నులన్నియున్ !!
టాంకుల్ పోయె! ఫిరంగు లెత్తువడె! ఫైటర్ జెట్ విమానంబులున్
డింకాగొట్టె! పటాలముల్ బెదరె, తండ్రీ! గుండియల్ జారెరా!
కింకర్తవ్య విమూఢ చిత్తునకు దిక్కెవ్వారు మీకంటె; నా
వంకం జూడరె! నా మొఱల్ వినరె! మీవాడన్ కటాక్షింపరే !