ఆ గందరగోళంలో ఆయాలిద్దరు అరుంధతిని పట్టుకొని ఆమెకు ఆసరాగా నిలబడ్డారు. కొద్ది క్షణాల్లోనే పరిస్థితి విషమించిపోయింది. ఆసుపత్రి ఇనుపగేట్లు విరిగి కుప్పగా పడ్డాయి. జనం ముందుకు....ముందుకు తోసుకొని రాసాగారు. తుఫాను నాటి సముద్రపు అలల మీది పడవలా అరుంధతి, జనశక్తివడిలో ఊపుతో తోటీల మధ్యన, ఆయాల మధ్యన, ముందుకు ముందుకు గేటు దాటి హాస్పిటల్ ఆవరణలోకి వచ్చింది.
గాలిలోకి తుపాకులు పేలాయి.
హాస్పిటల్ భవనం ప్రతిధ్వనించింది.
"ఎర్రజెండా జిందాబాద్!" అంటూ కార్మికులు ముందుకు ఉరికారు. జనం గుండెలమీద తుపాకులు పేలాయి. సబ్ - ఇన్ స్పెక్టర్ చేతిలోని రివాల్వరుని కార్మికుడు ఒకడు లాక్కున్నాడు.
"విప్లవం...." ఒక కంఠం పలికింది.
"వర్ధిల్లాలి!" సహస్ర కంఠాలు ఖంగ్ మన్నాయి.
తుపాకి గుండ్లు తొలకరి నాటి వడగండ్ల వానలా కురిశాయి. అరుంధతి ప్రక్కనే వున్న ఆయాల్లో ఒకామె గుండు తగిలి నేలకు ఒరిగింది. ఆయాను పడకుండా పట్టుకోబోయిన అరుంధతి మరుక్షణంలోనే ముందుకు తూలింది.
హాస్పిటల్ కాంపౌండూ, ముందు రోడ్డూ, పేవ్ మెంట్లూ రక్తపు మడుగులతోనూ క్షతగాత్రులతోనూ నిండిపోయింది. జనం పరుగెత్తినవాళ్ళు పరుగెత్తిపోగా, మిగిలినవాళ్ళు నిలబడిపోయారు. కార్మికులూ రెడ్ క్రాస్ వాళ్ళూ, తుపాకి దెబ్బలు తగిలి పడిపోయిన వాళ్ళను వెతికి ఆసుపత్రిలోకి చేరవేయసాగారు.
అరుంధతీ, ఆమె ప్రక్కనేవున్న ఆయా ఆదెమ్మా, ఆరుగురు బిడ్డల తల్లి-నేల కొరిగారు. ఆదెమ్మ కణతల నుండి తూటా దూసుకుపోయి, అక్కడికక్కడే నెత్తురు కక్కి మరణించింది. కుడివైపున ఛాతీలో నుండి గుండు దూసుకుపోయి అరుంధతి చీరంతా రక్తసిక్తమయింది.
ఆమెకు కళ్లు బైర్లు తిరిగాయి. ఆకాశం గిరగిరా తిరిగిపోతూంది. ఆసుపత్రి భవనమూ, పోలీసు బలగమూ, ఆమె కళ్ళ ముందు కలగాపులగంగా గిర్రున తిరిగిపోతున్నారు. తన క్రింద భూమి తనకు దూరంగా జరిగిపోతున్నట్లుంది. ఎన్నడూ వినని వింత ధ్వనులేవో తలలో ప్రేలుతున్నాయి.
తనను ఎవరు ఎత్తుతున్నారో? ఆసుపత్రి పనివాళ్ళు తనను చేతుల్లోకి తీసుకుంటున్నారు. తనకు స్పృహ తప్పిపోతూంది.
36
అరుంధతికి కళ్ళు తెరవాలని వుంది. చెయ్యి కదిలించాలని వుంది. కళ్ళు తెరిపిడి పడటంలేదు. చెయ్యి కదలటంలేదు. శరీరం అంతా ఆమె స్వాధీనంలో లేనట్లుంది.
తన కళ్ళ ముందు ఏమి కనిపిస్తున్నాయి? అనేక రంగులు, వెలుగులు. తను పడుకున్న మంచం తనను ఎక్కడికో తీసుకెళుతూంది అంతు తెలియని లోతుల్లోకి. తను ఎక్కడికో గాలిలోకి తేలిపోతూంది. ఏవేవో తెలియని లోకాలకు తను వెళ్ళింది. అక్కడ వింత వింత మనుషుల్లాంటివాళ్ళు ఎవరో కనిపిస్తున్నారు. తను ఎక్కడ వుంది? తనకు ఏమయింది? ఏమయిపోతూంది?
అరుంధతి బలవంతంగా కళ్ళు తెరవబోయింది, తెరిచాననుకుంది. కాని తెరవలేదు. అరుంధతి పెద్దగా అరచి ఎవర్నో పిలవాలనుకుంది. తనను ఆ స్థితి నుంచి బయటకు తీయమని అరవాలనుకుంది. అరిచాననుకుంది. కాని పెదవి కదల్లేదు.
మంచం చుట్టూ- బూడిదరంగు బట్టలవాళ్ళూ, తెల్ల ముతక చీరలవాళ్ళూ, కార్మికులు నిలబడి ఆదుర్దాగా అరుంధతి ముఖంలోకి చూస్తున్నారు.
అరుంధతి కుడిచేతికి సెలైను ఎక్కిస్తున్నారు. ఎడంచేతికి రక్తం ఎక్కిస్తున్నారు.
"ఎవరో గొప్పింటి ఆమెలాగే వుంది" అంది ఆయా మాణిక్యం కనకంతో కళ్ళు తుడుచుకుంటూ.
కనకం ముక్కూ, కళ్ళూ పమిటతో తుడుచుకుంది.
"వంటినిండా నగలుకూడా వున్నాయి. పెద్దింటి ఆడపడుచులాగే వుంది."
"ఎంత అందంగా వుందో?" కొత్తగా ఆయాగా చేరిన ఓ పడుచు పిల్ల అంది అరుంధతికేసి కన్నార్పకుండా చూస్తూ.
కొందరు పిల్లల్ని ఎత్తుకొని నిల్చుని వున్నారు.
"పోలీసు ఇన్ స్పెక్టర్ని బలేదెబ్బ కొట్టిందిలే!" అన్నాడు ఒక తోటీ తన పక్కనే నిల్చున్న పొగాకు మిల్లు కార్మికులతో.
"మంచంచుట్టూ దడికట్టారేం? గాలి రావాలి. దూరంగా వుండండి" అంది సిస్టర్/ అరుంధతి మంచం పక్కకొచ్చి నిలబడి సెలైన్ బాటిల్ కేసి, రక్తం బాటిల్ కేసి, అరుంధతి ముఖం కేసి మార్చి మార్చి చూస్తూ నిలబడింది.
ఇద్దరు కార్మిక నాయకులు రావటంతో చుట్టూవున్న జనం వాళ్ళకు త్రోవ యిచ్చారు. మంచం చుట్టూ కాకుండా కొంచెం ఓరగా నిలబడ్డారు.
కార్మిక నాయకులతోపాటు డాక్టరు కూడా వచ్చాడు.
"ఏమయినా లాభం వుంటుందంటారా?"
డాక్టరు నిరాశగా పెదవి విరిచాడు. "ఆపరేషన్ సక్సెస్ రి ఫుల్ అయింది. కాని ఆమె బతికిందాకా నమ్మకం లేదు. రక్తం అంతా పోయింది" అన్నాడు డాక్టర్, సిస్టర్ పక్కగా వచ్చి అరుంధతి మంచం దగ్గర నిలబడి....
తన చేతుల్ని ఎవరు కట్టేశారు? తన కళ్ళను ఎవరు బలవంతంగా తెరవకుండా చెయ్యి అడ్డం పెట్టారు? ఏవేవో గొంతులు, మాటలుకూడా వినిపిస్తున్నాయి.
అరుంధతి తల కొంచెం కదిలింది. కొన్ని వందల కళ్ళు ఆత్రంగా ఆమె ముఖంలోకి చూస్తున్నాయి.
"కదులుతూంది."
"అదిగో కళ్ళుకూడా తెరుస్తోంది."
"కళ్ళు తెరిచింది!" సంతోషంగా ఒకేసారి కొన్ని కంఠాలు పలికాయి.
తను కళ్ళు తెరిచిందా? మరి ఏమీ కనిపించటం లేదేం? తనకు ఏదో తమాషా అనుభూతి కలుగుతూంది. కాసేపు గాలిలోకి తేలికగా లేచినట్లూ, కాసేపు బరువుగా అగాధంలోకి పడిపోతున్నట్లూ వుంది. అట్లతద్దినాడు తమ ఇంటి దగ్గర వేపచెట్టుకు పెద్ద ఉయ్యాల వేశారు. తను ఎక్కింది. తన భర్త పెద్ద పెద్ద వూపుల్ని వూపుతుంటే తనకు భయం వేసింది. సరిగ్గా తనకు ఇప్పుడు అలాగే అనిపిస్తున్నది.
కళ్ళను గట్టిగా మూసి మళ్ళీ బలాన్నంతా కళ్ళల్లోకి కూడదీసుకుంటూ తెరిచింది. ఏదో కనిపిస్తుంది మసకమసగ్గా. అరే మాధవి తన దగ్గరకు ఎప్పుడొచ్చింది? మాధవి లావుగా, పొట్టిగా వుండదే! అయినా మాధవిని తను ఎక్కడ చూసింది? తను చూడనేలేదా? తనకు ఎదురుగా కనిపిస్తున్నది మాధవి కాదా? మాధవి చనిపోయిందిగా! తను మాధవి మృత దేహాన్ని చూసిందిగా! ఈమె మాధవి కాదా? ఆకుపచ్చ అంచు తెల్లని ముతకచీర! ఈ చీరల వాళ్ళను తను చాలామందిని చూసింది. ఆమె ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ వుండివుండాలి.
ఆమె పక్కనెవరూ? ఆ వయస్సు మళ్ళిన ఆమె తన అత్తగారా! అవును తన అత్తగారే. కళ్ళు తుడుచుకుంటుందేం? తనకు ప్రమాదంగా వున్నట్లుంది. అందుకే ఏడుస్తూంది. ఆమె చంకలో ఆ పిల్ల ఎవరూ - మాధవియేనా? అవును మాధవే కాని మాధవి పెద్దదయిందిగా? చచ్చిపోయిందిగా? శాంతమ్మ కూడా చచ్చిపోయిందని తన భర్త తనకు చెప్పినట్టు జ్ఞాపకం వస్తూంది. అవును. ఎప్పుడు చెప్పాడు? చాలా కాలం అయినట్లే వుంది. కాదు....కాదు.... ఆమె శాంతమ్మ కాదు! ఆమెకూడా ఆసుపత్రిలో పనిచేసే మనిషిలాగే వుంది.
తన భర్త ఎక్కడా కనిపించడే? ఇంకా కోపం తగ్గలేదా? కళ్ళు తిప్పి చూసింది. రాజారావు వచ్చివుంటాడు. తను ఈ పరిస్థితిలో వుంటే రాకుండా వుండగలడా? ఆత్రంగా కళ్ళు మంచం చుట్టూ నిల్చున్న వాళ్ళందరివైపు తిప్పింది, రాలేదు. రాజారావు రాలేదు. తన భర్త రాలేదు. తండ్రి రాలేదు. సవతి తల్లి, ఆమె బిడ్డలూ అరుగో వచ్చినట్లున్నారు. కళ్ళు గట్టిగా మూసుకొని మళ్ళీ తెరిచింది. కాదు వీళ్ళు ఎవరో పనిపాటులు చేసుకొనేవాళ్ళులా వున్నారు. తనకు ఎవరూ లేరు, ఎవరూ రాలేదు. కనీసం తెలిసిన ముఖాలు తన చేత పనులు చేయించుకున్న ముఖాలైనా కనిపిస్తాయేమో! లేదు. అన్నీ కొత్త ముఖాలే. కనీసం కుక్కటేశ్వరరావు కూడా కనిపించటంలేదు.
అవును- అన్నట్టు తను ఆసుపత్రిలో వుందికదూ? ఆసుపత్రి గేటును తోచుకొని సమ్మె చేస్తున్నవాళ్ళతోపాటు గేటులోపలకు వచ్చింది కదూ? తన పక్కనే ఎవరో తుపాకిగుండుకు బలియై పడిపోతుంటే తను పట్టుకోవటానికి ప్రయత్నించింది కదూ! ఆ తరువాత ఏం జరిగింది. గుర్తుకు రావటంలేదు. బహుశా తనూ తుపాకిగుండు తగిలి పడిపోయి వుంటుంది.
"అమ్మా! ఎలావుంది?" కార్మిక నాయకుడు ఒకతడు ముందుకు వచ్చి ప్రశ్నించాడు. ఎవరితడు? తనను ఎంత జాలిగా, ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఏదో అనబోయింది. పెదవులు కదల్లేదు.
"మీ వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరికి కబురు పంపించమన్నారు? మనుషుల్ని పంపిస్తాను" అన్నాడు అతనే మళ్ళీ అతి సౌమ్యంగా.
ఒక్కసారి ఆమె దృష్టిని తన మంచం చుట్టూ వున్న వ్యక్తులమీద సారించింది. ఇప్పుడు తనకు అందరూ స్పష్టంగానే కనిపిస్తున్నారు. ఆయాలూ, తోటీలు, బూడిదరంగు దుస్తులవాళ్ళు అందరూ ఆస్పత్రి గేటులో కనిపించినవాళ్ళే. ఎంత ఆదుర్దాగా తనవైపు చూస్తున్నారో? కొందరు ఏడుస్తున్నారు. కొందరు విషాదంగా చూస్తున్నారు. అందరికళ్ళూ చెమ్మగిల్లాయి.
మీ వాళ్ళకు........"
తనవాళ్ళు! తనకు ఎవరున్నారు? ఎవరూ పేరు. కాదు. వున్నారు. చాలామంది వున్నారు. తనచుట్టూ అంత ఆదుర్దాతో బాధపడుతూ కంట తడిపెట్టుకుంటున్న వీళ్ళంతా తనవాళ్ళు కాదూ? అరుంధతి పెదవులు చిన్నగా కదిలాయి. విషాదంతో నిండిన చిరునవ్వు విరిసింది ఆ పెదవులమీద.
"మీ...మీరు....మీరంతా నా వాళ్ళుకాదూ!" బలాన్నంతా కూడదీసుకుంటూ అంది అరుంధతి.
ప్రక్కనే ఓ ఆయా చేతిలో వున్న పసిబిడ్డ కేర్ మంది. అరుంధతికి ఏదో లీలగా గుర్తుంది.
పక్కకు చూసింది. సిస్టర్ నిల్చొని ఉంది. ఆమె ముఖంలోకి చూస్తూ-డాక్టర్ నిల్చొని వున్నాడు.
"సిస్టర్!"
సిస్టర్ ముందుకొచ్చింది.
"ఒక సాయం చెయ్యాలి." మాటలు అతికష్టంమీద గొంతులోనుంచి పెకలించుకొని బయటపడుతున్నాయి.
"చెప్పమ్మా! మేమంతా ఉన్నాం. ఏం చెయ్యమంటావో చెప్పు" అన్నాడు కార్మిక నాయకుడు.
"పిల్లలవార్డులో పదకొండవ నెంబరు తొట్టిలో ఒక పసిబిడ్డ, మూడు రోజుల బిడ్డ ఉంది. తీసుకొచ్చి ఒకసారి నాకు చూపించండి."
సిస్టర్ ఆశ్చర్యంగా అరుంధతి ముఖంలోకి చూసి, మళ్ళీ డాక్టర్ ముఖంలోకి చూసింది.
"వెళ్ళు సిస్టర్, తీసుకురా!" అన్నాడు డాక్టర్.
సిస్టర్ వెళుతుంటే "మీరుకూడా వెళ్ళండి, త్వరగా ఆ బిడ్డను తీసుకురండి," అన్నాడు కార్మిక నాయకుడు ఆయాలను ఉద్దేశించి. గబగబా మాణిక్యంతో పాటు మరో ఇద్దరు ఆయాలు సిస్టర్ వెనకే వెళ్ళారు.
అరుంధతి కళ్ళు మూతలు పడుతున్నాయి. బలవంతంగా తెరిచివుంచటానికి ప్రయత్నిస్తూంది. శరీరం అంతా - ఎక్కడ అణువు అక్కడే విచ్చిపోతున్నట్లుంది. తన శరీరం అంతా కొయ్యబారిపోతూంది. తను చివరి ఘడియల్లో వుందా? తన జీవితంలో ఏకైక ఆశాకిరణంగా మిగిలిన, ఆ ఒక్క తన వస్తువునూ ప్రాణం పోయే ముందు చూడగలదా?
తనకు ఎవరూ లేరనుకుంది. తనకోసం పదకొండవ నెంబరు తొట్టిలో ఎదురు చూస్తున్న ఆ చిన్న ప్రాణం వెంటనే తనకు గుర్తు రాలేదు.
తను లోతుకు, ఇంకా లోతుకు, ఎక్కడకో పడిపోతూ వుంది. ఏదీ బిడ్డ? కళ్ళు బలవంతంగా తెరుస్తూ "డాక్టర్! సిస్టర్ రాలేదూ?" అంది అతిప్రయాసమీద, ఆయాసపడుతూ.
"ఇంకా రాలేదేం?" కొన్ని గంటలు ఆత్రంగా ప్రశ్నించాయి.
"పిల్లల వార్డు చాలా దూరం. వెళ్ళి పిల్లను తీసుకొని రావాలిగా! ఐదు నిముషాల్లో రావచ్చు" డాక్టర్ అంటున్నాడు.
ఐదు నిముషాలా? తను ఐదు నిముషాలు ఈ ప్రాణాన్ని ఉగ్గబట్టుకొని వుండగలదా?
"డాక్టర్! ఒక సాయం. ఒక తెల్లకాగితం, కాలమూ ఇవ్వండి!"
అందరూ ఆశ్చర్యంగా చూశారు. "మీరుకూడా దగ్గరకు రండి" అంది కార్మిక నాయకుల వైపు చూస్తూ. వాళ్ళిద్దరూ కూడా డాక్టరు పక్కనే వచ్చి నిల్చున్నారు. డాక్టరు తన లెటర్ పాడ్ లో నుంచి ఓ కాగితం తీసి ఇచ్చాడు. కాని అరుంధతి అందుకోలేకపోయింది. అంతకుముందే ఆమె కుడి చేతికివున్న సెలైన్ బాటిల్ ట్యూబ్ తీసేశారు. డాక్టర్ పట్టుకుని ఆమె చేతిలో కలం పెట్టాడు. ఎలాగో కాగితం చివర. కుడివైపున "అరుంధతి" అని పెద్ద పెద్ద అక్షరాల్లో సంతకం పెట్టింది. ఆ పేరు చూసి డాక్టర్ విస్మయం చెందాడు. అది తను విన్న పేరే!
"డాక్టర్! నాకు హైద్రాబాదులో పెద్ద భవనం వుంది. చాలా స్థలాలూ, పొలాలూ వున్నాయి. బ్యాంక్ బ్యాలన్స్ కూడా పదివేలదాకా వుంది. అదంతా నేను వీళ్ళందరికీ ఇస్తున్నాను. మీరు సాక్ష్యం వుండి నా మరణవాగ్మూలం మీద సంతకం చేయండి. ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను" అంది అరుంధతి గబగబా.
"బాగా మాట్లాడుతూంది!"
"తుడి ఘడియల్లో అలాగే వుంటారమ్మా౧ ఇంకెంతోసేపు బతకదు."
"ఏ తల్లి కన్నదో? ఇక్కడ నా అనేవాళ్ళు లేకుండా పోతూంది."
అరుంధతి కళ్ళు మూసుకుంది. మాటలు దూరంగా వినిపించినట్లు వినిపిస్తున్నాయి.
"డాక్టర్! నా పాప-పాప ఎక్కడ?" బలవంతంగా రెప్పల్ని ఎత్తుతూ అంది.
"వస్తుంది, ఇప్పుడే వస్తుంది." జాలిగా అన్నాడు డాక్టర్.
అరుంధతి కార్మిక నాయకుల వైపు చూసింది.
"చెప్పండమ్మా!" అన్నాడు ఒక అతను ఆమె చూపులోని భావాన్ని గ్రహించి.
"ఆ పాపను, ఆఁ...అవును నేను చూడలేదు. నా సమతను చూడకుండానే పోతున్నాను. ఆ అమ్మాయిని మీరు, మీ పిల్లలందరితోపాటు పెంచండి, ఆ పాపపేరు 'సమత' అని పెట్టుకున్నాను. కాని ఏమీ చెయ్యలేకపోయాను. నా కలలు కలలుగానే వుండిపోయాయి." కళ్ళు మూతలుపడ్డాయి. మైకం కమ్మింది.
కొద్దిక్షణాల్లో మళ్ళీ కళ్ళు తెరిచింది. "నేను చూడలేని సమతను మీరైనా చూడండి. నేను పెంచలేని సమతను మీరు పెంచి పెద్ద చెయ్యండి. అదే నా కడసారి కోరిక!" కళ్ళు బరువుగా వాలిపోయాయి. తల పక్కకు ఒరిగిపోయింది. చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఘొల్లుమన్నారు. డాక్టర్ కళ్ళు తుడుచుకున్నాడు. కార్మిక నాయకులు తలలు వంచుకొని నిలబడ్డారు గౌరవ సూచకంగా. సిస్టర్ వచ్చి అరుంధతి మీద తెల్లని దుప్పటి కప్పింది.
- సమాప్తం -
(తరువాయి భాగం నుండి వైతరణి అనే కథ వస్తుంది.)