"హీరాయిన్ కు అలవాటుపడ్డవాళ్ళను జంకీస్ అంటారు!" అన్నాడు జాన్.
"వాళ్ళు ప్యాడ్ లో వుండరా?"
"ముందు వాళ్ళూ ప్యాడ్ లోనే వుంటారు. హీరాయిన్ కు అలవాటు పడ్డాక మిగతి హిప్పీస్ వాళ్ళకు దూరంగా వుంటారు."
"ఎందుకనీ?" శబరి ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"హీరాయిన్ కు అలవాటు పడ్డవాళ్ళు మానసికంగా దెబ్బ తింటారు. అందువల్ల హిప్పీస్ వాళ్ళకు దూరంగా వుండటానికి ప్రయత్నిస్తారు."
"యల్.యస్.డి. కంటే కూడా హీరాయిన్ పవర్ ఫుల్ డ్రగ్గా?" శబరి బాంబే బ్లాక్ ను అడిగింది.
"అవును! సాధారణంగా మార్జువానానుంచి చరస్ నుంచి నల్లమందుకూ, ఆ తర్వాత పెథడ్రిన్, డెక్సిడ్రిన్ లకు క్రమంగా అలవాటు పడ్తారు. ఆ తర్వాత యల్.యస్.డి. తీసుకుంటారు. యల్.యస్.డి ప్రభావం నరాలమీద ఉంటుంది. స్లోగా పనిచేస్తుంది. కాని హీరాయిన్ అలా కాదు. ఒకసారి ఇంజక్షన్ తీసుకుంటే, దాని ప్రభావం ఎంతోసేపు ఉండదు. దాని పవర్ తగ్గుతూ ఉండగానే, మరొకటి తీసుకుంటారు. అలా తీసుకోకపోతే శరీరంలో వచ్చే మార్పుకు తట్టుకోలేక బాధకు గురి అవుతారు. అందుకే రోజుకు కొన్నిసార్లు తీసుకుంటారు. హీరాయిన్ ను "హెచ్" లేక "హార్స్ పవర్" అంటారు. దీనికి అలవాటు పడ్డవాళ్ళకు ఆకలి వుండదు. వేరే ప్రపంచంతో సంబంధం వుండదు!"
"హీరాయిన్ ఇంజక్షన్ నరాలకు తీసుకుంటారా?"
"ముందు కండలోకే తీసుకుంటారు. దీన్ని "జే పాపింగ్" అంటారు. "జే పాపింగ్" తీసుకున్నాక హిప్పీస్ నుంచి విడిపోతారు. వాళ్ళనే జంకీస్ అంటారు. తర్వాత క్రమంగా సూదిని నరాల్లోకి ఎక్కించి తిన్నగా రక్తంలోకే మందును ఎక్కిస్తారు. త్వరలోనే జమ్కీ వళ్ళంతా ఉబ్బిపోయి గుర్తుతెలియకుండా మారిపోతాడు!" అంటూ బాంబే బ్లాక్ శబరి ముఖంలోకి చూశాడు.
ఆమె కళ్ళల్లో భయం పారుకాడుతూంది.
"అవును! జంకీస్ చావును ప్రేమిస్తారు. ఎక్కువ కాలం బతకరు. ఎక్కువమంది ఆత్మహత్య చేసుకుంటారు."
శబరి గొంతులోకి ఎగబాకిన భయం అక్కడే ఆగిపోయింది. ఉక్కిరిబిక్కిరి అయింది.
"బేబీ భయపడుతున్నట్టుంది!" అన్నాడు బాంబే బ్లాక్ నవ్వుతూ.
"భయమా? హిప్పీస్ కు భయం ఏమిటి? బేబీ కొత్తగా వచ్చింది.అందుకే భయపడుతోంది!" అన్నాడు జాన్.
"బాగా డబ్బు పట్టుకొచ్చిందా?" అదోలా చూస్తూ అడిగాడు బాంబే బ్లాక్.
"మీ హోటల్లో గది ఖాళీ వుందా?" జాన్ మాట మారుస్తూ అడిగాడు.
"ఉంది. కావాలా?"
"వద్దు! మనం ఇక్కడ ఉండొద్దు. వీడు దొంగ వెదవలా కన్పిస్తున్నాడు. మనం ప్యాడ్ కు వెళ్దాం!" శబరి జాన్ చెయ్యి పట్టుకుని లాగుతూ తెలుగులో అన్నది.
"బేబీ ఏమిటి అంటున్నది?" తెలుగు తెలియని బాంబే బ్లాక్ ఇంగ్లీషులో అడిగాడు.
"మళ్ళీ వస్తాం! ముందు ప్యాడ్ చూద్దాం అంటూంది" అంటూ జాన్ ముందుకు కదిలాడు.
శబరి జాన్ పక్కగా నడుస్తూంది. కాళ్ళు తేలిపోతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటూ వుంది. తాను తప్పు చేసిందేమో? ఈ వాతావరణం తనకు అదోలా అన్పిస్తూ ఉంది. తిరిగి వెళ్ళిపోతే? ఆలోచిస్తూ జాన్ వెనకే నడుస్తున్న శబరి ఒక్కసారిగా ఆగిపోయింది. రోడ్డు కిందగా చీనా రేకుల షెడ్డు వుంది. షెడ్డుముందు అర్ధ నగ్నంగా ఉన్న తెల్లటి పిల్ల కూర్చుని వుంది. "పిల్లి పిల్లలా వుంది" ఆ అమ్మాయిని చూస్తూ అనుకుంది శబరి.
"జన్ కీ!" జాన్ ఆ పిల్లకేసి చూస్తూ అన్నాడు.
"దగ్గరకెళ్ళి చూద్దాం!" అంటూ శబరి ముందుకు వెళ్ళింది.
జాన్, శబరీ ఎదురుగా వెళ్ళి నిల్చున్నా ఆ అమ్మాయి వీళ్ళను చూడలేదు. తన లోకంలో తాను వుంది. ఎడంచేతి వ్రేళ్లను శ్రద్ధగా వంగి చూస్తూ, కుడిచేత్తో కనిపించని వాటిని వేటినో లాగి లాగి దూరంగా విసిరేస్తూ వుంది. అంతలోనే ముందుకు వంగి రెండుచేతుల్నీ నేలకు ఆనించి తనమీదకు వస్తున్న వాటిని వేటినో నెట్టివేస్తున్నట్టు చేతులు విసురుతూ వుంది. శబరి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ నిల్చుంది.
"హల్లో బేబీ!" జాన్ దగ్గరగా వెళ్ళి పిల్చాడు.
"వద్దు! వద్దు! నా మీదకు రావద్దు!" అరుస్తూ శరీరం మీదకు ఏదో పాకుతున్నట్టూ, దాని తీసి దూరంగా విసిరేసినట్టూ చేతులు విసిరింది.
"ప్లీజ్! ఓ పీటర్! ఆ చీపురు ఇలాతే! వీటిని ఊడ్చెయ్! ఛ! ఛ!" వెనక్కు అశాంతిగా జరుగుతూ ముందుకు చేతులు అడ్డం పెట్టుకున్నది.
ఇంతలో ఒకతను బయటకు వచ్చాడు. ముఖం అంతా వుబ్బిపోయి వుంది. శరీరం నీరుపట్టి వుంది. శబరి అతనికేసి జాలిగా చూసింది. జాన్ అతన్ని పలకరించాడు. కాని అతను సమాధానం ఇవ్వలేదు. అతనికి వినిపించినట్టులేదు.
"జాన్! ఏమిటి ఆ అమ్మాయి అలా చేస్తోందేం?"
"హీరాయిన్ తీసుకున్నప్పుడు ట్రిప్ మొదలు కాగానే ఎదురుగా ఉన్న ప్రతివస్తువు పాములా, నల్లటి పొడవు పురుగులా కన్పిస్తుంది. మనుషులు కూడా అలాగే కన్పిస్తారు. చేతుల వేళ్లనుంచి సన్నటి నల్లటి పురుగులు తొలుచుకొని వస్తున్నట్టు అనిపిస్తుంది. లాగి పారేసిన ఆ పాములు మళ్ళీ మీదకు పాకి వస్తున్నట్టూ శరీరంలోకి కన్నాలు చేసుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నట్లూ అన్పిస్తుంది!"
"ఓ మైగాడ్! ఇదంతా నీకెలా తెలుసు?"
"ఒకసారి నేను స్వయంగా అనుభవించాను. హారిబుల్!"
"నువ్వు హీరాయిన్ అంటే జాయ్ పాపింగ్ తీసుకున్నావా!" ఆశ్చర్యంగా అడిగింది.
"అవును!"
"ఎప్పుడూ?"
"నేను కొత్తగా హిప్పీగా అయిన రోజుల్లో తీసుకున్నాను. మా ప్యాడ్ లో ఒక జంకి ఉండేవాడు. అతను ఒకరోజు నాకు ఆ ఇంజక్షన్ ఇచ్చాడు. బ్రహ్మాండంలో ఏదో బద్దలైంది. నా తలలో ఏదో పేలింది. దాదాపు పిచ్చే ఎక్కింది. నా చుట్టూ వున్న తోడి హిప్పీస్ పాములుగా మారారు. నల్లటి పొడవాటి పురుగులుగా మారారు. నా శరీరంలోనుంచి కన్నాలు చేసుకొని పాములు వస్తున్నాయి. వేళ్ళగోళ్ల నుంచి నల్లటి పురుగులు వస్తున్నాయి. తీసి పారేస్తున్నాను. అవి మళ్ళీ నా మీదకే వస్తున్నాయి. ఇలా ఎంతసేపు జరిగిందో తెలియదు. ఆ తర్వాత హారిబుల్ స్టేట్! నరాలు పురిపెట్టినట్లు తిరిగిపోతున్నాయి. రక్తనాళాలు చిట్లటానికి సిద్ధంగా ఉన్నాయి. కేకపు పెట్టాను. ఏడ్చాను. మళ్ళీ హీరాయిన్ ఇవ్వమని బతిమాలాను. కాని ఎవరి దగ్గిరా లేదు. ఆ జంకీగాడు పత్తాలేకుండా వెళ్ళిపోయాడు. వాడి భయం వాడిది. వాడి ఇంజక్షన్స్ నేను తీసుకుంటానని వాడి భయం. దాదాపు నెలరోజులు దాని ఎఫెక్టు నా మీద వుంది. ఆసుపత్రిలో చేరాను. మరో ఇంజక్షన్ తీసుకొని ఉంటే నేనూ జన్ కీస్ లో కలిసిపోయి ఈపాటికి చచ్చిపోయి వుండేవాణ్ణే!" అన్నాడు జాన్.
"ప్లీజ్ స్టాపిట్!" అరిచింది శబరి.
"అరే ఆ పిల్ల ఏది?" జాన్ అన్నాడు.
"అదుగో! అదేమిటి అలా రోడ్డుమీద పరుగులు తీస్తూ వుంది."
శబరి నోట్లో మాట పూర్తి అయీ కాకముందే స్పీడ్ గా వస్తున్న లారీ ఒకటి 'కీచ్' మంటూ కొద్ది దూరం పోయి ఆగింది.
"అరే! పాపం! లారీకింద పడిపోయింది!" జాన్ నిర్లిప్తంగా అన్నాడు. శబరి పిచ్చిచూపులు చూస్తూ నిల్చుంది.
"బాధ పడ్తున్నావా శబరీ! ఇలాంటి వాటికి బాధపడకూడదు. ఆమె నిర్వాణం పొందింది. జంకీలు చావును ప్రేమిస్తారు. వారికోసం మనం బాధపడకూడదు."
శబరికి కళ్ళు తిరుగుతున్నట్టు అన్పించింది. నేలమీద కూలబడింది. ఏమిటిది? ఇంత హారిబుల్ జీవితాన్నా తను వరించి వచ్చింది!
"జాన్! నేను వెళ్ళిపోతున్నాను!"
జాన్ శబరి ముఖంలోకి అర్థం కానట్టు చూశాడు.
"ప్లీజ్! నన్ను పంపించెయ్! ఈ జీవితం ఇంత భయంకరంగా వుంటుందను కోలేదు!"
జాన్ చూస్తూ వుండిపోయాడు.