"చేసుకున్నానండీ."
"నీ మొదటిభార్య ఇంకా మా కళ్ళల్లో మెదులుతూనే వుంటుంది."
రమణమూర్తి కళ్ళలో నీరు తిరిగింది.
"ఇదుగో నిన్నే" లోపలికి చూస్తూ కేక వేశాడు సావిత్రి తండ్రి రామనాధం.
"ఆఁ వస్తున్నా!" కొంగుకు చెయ్యి తుడుచుకుంటూ బయటికి వచ్చింది సావిత్రి తల్లి పార్వతమ్మ.
"ఎవరొచ్చారో చూడు"
కళ్ళపైగా చేతినుంచి కళ్ళు చికిలించి చూసింది. "చూపు ఆనడంలేదు. ఎవరండీ వచ్చింది?"
"రమణమూర్తి!"
"మన రమణమూర్తె! గుర్తురాలేదా?"
"ఊఁహు! పెద్దతనం వచ్చేసింది. ఏదీ గుర్తుండి చావడంలేదు."
"చంద్రవదన భర్త!"
"అయ్యో నాయనా నువ్వా! చంద్రవదన గురించి నేను తల్చుకోని రోజు వుండదు."
కుశల ప్రశ్నలు వేసింది.
అతడన్నింటికీ సమాధానాలు యిచ్చాడు.
ఆ భార్యాభర్తలు మునుపటిలా లేరు. నాలుగేళ్ళకే పదేళ్ళ పైబడిన వాళ్ళలా వున్నారు. ఆ వాతావరణంలో ఏదో అపశృతి వున్నట్టు అన్పించింది.
"సావిత్రి ఎక్కడ?" అడిగాడు రమణమూర్తి.
ఇద్దర్లో ఒక్కరూ సమాధానం చెప్పలేదు.
వాళ్ళ ముఖాలు విషాదపూరితం అయ్యాయి.
సావిత్రి తల్లి కళ్ళు తుడుచుకుంది.
రమణ అయోమయంలో పడ్డాడు. ఏమైంది సావిత్రికి? వృద్ధాప్యంలో ఇద్దర్నీ వదిలేసి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయిందేమో! దూరదేశం వెళ్ళిందేమో.
రామనాధం తలవంచుకొని కూర్చున్నాడు.
"ఏమైందండీ సావిత్రికి?"
"ఏమైందని చెప్పమంటావు బాబూ!" రామనాధం కంఠం దుఃఖంతో గరగరలాడింది.
"సావిత్రి చచ్చిపోయిందా?" మనసులో అనుకోబోయి పైకే అనేశాడు.
భార్యాభర్తలిరువురు కళ్ళు తుడుచుకున్నారు.
"ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ప్రయాణము చేసివచ్చావ్ స్నానం చేసి భోజనం చెయ్యి"
"రా బాబూ" అన్నది పార్వతమ్మ.
రమణమూర్తి పెట్టె తీసుకొని లోపలకెళ్ళాడు.
"పక్కవాటాలో ఎవరుంటున్నారండీ?" తన మొదటిభార్యనూ, ఆ రోజుల్నీ తల్చుకుంటూ అడిగాడు రమణ.
"షిప్ యార్డులో పనిచేస్తున్నాడు. కృష్ణాజిల్లా. మంచివాళ్ళే. ఇద్దరు పిల్లలు కూడా. వాళ్ళు మమ్మల్ని స్వంత తల్లిదండ్రుల్లా చూస్తారు. అందువల్లనే ఈమాత్రం అయినా బ్రతికున్నాం" అన్నది పార్వతమ్మ.
"సావిత్రి ఎలా చచ్చిపోయింది? ఎప్పుడు చచ్చిపోయింది?" తెలుసుకోవాలని ఆదుర్దాగా వున్నది రమణకి. కాని అడగలేకపోతున్నాడు.
సావిత్రి చచ్చిపోయింది.
సావిత్రిని తీసుకెళితేకాని తన భార్యకు ట్రీట్ మెంట్ ఇవ్వడు భయంకరం. అంటే తన భార్య ఎప్పటికి... ఆపైకి ఆలోచించలేకపోయాడు.
స్నానంచేసి భోజనం చేశాడు.
నిద్ర ముంచుకొచ్చింది. "నడుంవాల్చు నాయనా" అంటూ పార్వతమ్మ మంచం వేసింది.
పడుకోగానే నిద్రపట్టేసింది.
రామనాధం లేపేంతవరకూ మెలుకువ రాలేదు.
లేచి కాఫీ తాగి కూర్చున్నాడు.
చీకటి పడింది.
"పనిమీద వచ్చావా బాబూ?" రామనాధం అడిగేడు.
"అవునండీ"
"ఏంపని బాబూ?"
"సావిత్రిని తీసుకెళ్ళాలని"
పార్వతమ్మా, రామనాధం తృళ్ళిపడ్డారు.
"సావిత్రిని తీసుకెళ్ళడానికి వచ్చావా?" తనను తానే ప్రశ్నించుకుంటున్నట్టు అన్నాడు రామనాధం.
"ఎందుకు బాబూ?" పార్వతమ్మ దాదాపు ఏడుస్తూనే అడిగింది.
రమణమూర్తి సావిత్రి హైదరాబాదు రావడం, తన భార్య సైకిక్ గా తయారవడం నుంచి డాక్టర్ సావిత్రిని తీసుకురమ్మనడం వరకూ వివరంగా చెప్పాడు.
"అయ్యో ఎంతపని జరిగింది బాబూ?"
"సావిత్రి ఎలా చచ్చిపోయిందండి"
"సావిత్రి చచ్చిపోలేదు బాబూ" గద్గద కంఠంతో అన్నాడు రామనాధం.
రమణమూర్తి రామనాధం ముఖంలోకి విస్మయంగా చూశాడు.
"సావిత్రి చచ్చిపోలేదా? మరి ఏమైంది? మీరెందుకింత బాధపడుతున్నారు"
"చచ్చిపోయినా ఒక ఏడుపు ఏడిచేవాళ్ళం బాబూ. నా బిడ్డను దారుణమైన పరిస్థితిలో చూడమని భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్ళలేదు" కళ్ళ నీళ్ళు తుడుచుకుంది పార్వతమ్మ.
"అసలు ఏమైందండీ? సావిత్రి ఎక్కడ వుందండి"
"ఈ ఊళ్ళోనే వున్నది బాబూ"
"ఈ ఊళ్ళోనే వున్నదా?" అతని మనసులో ఆశాకిరణము తళుక్కుమన్నది.
"ఎక్కడున్నది?"
రామనాధం మాట్లాడలేదు.
పార్వతమ్మ బోరున ఏడవసాగింది.
రమణమూర్తికి చిరాకు వేసింది. సావిత్రి బతికేవుంది. ఈ ఊళ్ళోనే వుంది. అయినా ఆమె తల్లి చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడ్చినట్టు ఏడుస్తుందేం?
"సావిత్రి ఎక్కడ వుందో చెప్పండి బాబాయ్. ఆమెతో నా జీవితం పెనవేసుకుని వున్నది. ఒక భార్య పోయింది. రెండోభార్యకి మతి చలించింది. సావిత్రిని తీసుకెళితే నా భార్యకు నయం అవుతుంది ప్లీజ్ చెప్పండి."