"ఏం ఉద్యోగం బాబూ! ఊళ్ళుపట్టుకు తిరిగే ఉద్యోగం?" అన్నది రాణి సునందను కించపరచాలనే ఉద్దేశంతోనే.
సునంద సమాధానంగా సన్నగా నవ్వింది.
"ఇటువంటి వెధవ ఉద్యోగం నెలకు వెయ్యిరూపాయలిస్తామన్నా నేను చెయ్యనుబాబూ?" మూతి తిప్పుతూ అన్నది రాణి."
"నీకేం ఖర్మ ఇలాంటి ఉద్యోగం చెయ్యాలని?" సునంద అన్నది.
"అసలు నీకు ఈ ఉద్యోగం ఎవడిస్తాడు?" విసురుగా అన్నాడు శేఖర్.
"ఓహో! ఇదంత గొప్ప ఉద్యోగమా!" వ్యంగ్యంగా అన్నది రాణి.
"అవును ఈ ఉద్యోగం చెయ్యాలంటే చాలా యోగ్యతలు కావాలి!"
"ఏమిటో అవి."
"చెప్పినా నీకు అర్ధం కానివి....సంస్కారం....సేవాభావం....మానవత్వం...." శేఖర్ కారు స్పీడు పెంచాడు.
రాణి ముఖం కోపంతో జేవురించింది.
తన గురించి వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతూవుంటే సునందకు బాధగా వుంది. కార్లో ఇబ్బందిగా కూర్చుంది. కారు రోడ్డుపక్కగా ఆగివున్న సమితి జీపును దాటుకొని వెళ్ళింది.
కార్లో కూర్చొనివున్న సునందను నరహరి చూశాడు.
తన జీపులో ఎక్కడానికి పరువు నష్టమా? ఆ శేఖర్ గాడి కార్లో సిగ్గులేకుండా కులుకుతూ కూర్చుంటుందా? తనెవరో దానికి తెలిసినట్లు లేదు. ఎవరి అండర్ లో పనిచేస్తుంది. బాస్ అయినా భయంలేకుండా తనను అవమానించింది. అంతకంత వడ్డీతోసహా వసూలు చేస్తాడు! తన తడాఖా చూపిస్తాడు. నరహరి అంటే ఏమనుకుంటుందో! మళ్ళీ ఈ సమితిలో తల ఎత్తుకొని తిరక్కుండా చెయ్యగలడు!
నరహరికి బ్లెడ్ ప్రెషర్ వచ్చినంత పనయింది. కుతకుతలాడి పోతున్నాడు.
30
డేగలమర్రి సమితి మీటింగు హాలు. గోడలమీద గాంధీ మొదలు ఇందిరాగాంధీ వరకు దేశనాయకుల ఫోటోలు వ్రేలాడుతున్నాయి.
జనరల్ బాడీ మీటింగుకు విచ్చేసిన సర్పంచ్ లందరూ కొలువుదీరి వున్నారు. సమితి సిబ్బంది, సమితి ప్రెసిడెంటుకు దగ్గరగా ఓ పక్కగా కూర్చొని వున్నారు. బి.డి.ఓ. రామమూర్తి, ప్రెసిడెంటు పక్కకుర్చీలో వున్నాడు.
బి.డి.ఓ. వ్యవసాయశాఖ విస్తరణాధికారిని డైరీ చదవమని పురమాయించాడు.
వ్యవసాయశాఖ విస్తరణాధికారి (E. O. Ariculture) లేచి నిలబడి డైరీ చదవసాగాడు. ఏఏ ఊళ్ళలో కూరగాయల గార్డెన్స్ వేయించిందీ, ఎక్కడెక్కడ సమిష్టి వ్యవసాయ కార్యక్రమం ప్రారంభించిందీ, ఏఏ రైతులకు రుణాలు ఇప్పించడంలో సహాయపడిందీ వివరిస్తూ వుంటే నరహరి ముఖం చిట్లించుకున్నాడు. సభలో వున్నవాళ్ళెవరూ కూడా సరిగా వినడంలేదు. గోలగా వుంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
"ఇక చాల్లే! ఆ ముఖ్య సేవికను డైరీ చదవమనండి" మధ్యలో అందుకొని అన్నాడు నరహరి.
వ్యవసాయ శాఖ విస్తరణాధికారి చదవడం ఆపి, ఓ క్షణం మౌనంగా నిల్చుని. ప్రెసిడెంటు ముఖంలోకి చూశాడు. నరహరి ముఖం చూడగానే ఠక్కున కూర్చున్నాడు.
సునంద మొదటిసారిగా జనరల్ బాడీ మీటింగుకు హాజరైంది. అంతా కొత్తగా వుంది. చేతిలో డైరీ పట్టుకొని లేచి నిలబడింది. కాళ్ళు వణుకుతున్నాయి. అరచేతులు చల్లబడ్డాయి. చేతిలోని కాగితాలు కదులుతూ ఆమెలోని భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సునంద లేవగానే అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి. నరహరి గుర్రుగా చూస్తూ కూర్చున్నాడు. వీరభద్రయ్య కసిగా చూశాడు. చిలకలపాడు సర్పంచ్ అక్కసుగా చూశాడు.
సునంద డైరీ చదవసాగింది.
"గత నెల ఎనిమిదవ తేదీన చిలకలపాడు మహిళామండలిని దర్శించితిని. ఈ సంవత్సరం చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించితిని. సర్పంచ్ గారిని కలుసుకొని గ్రాంటు రిలీజు గురించి చర్చించితిని. మండలి మీటింగులో ఆహారపు విలువల గురించి వివరించితిని. వంట ప్రదర్శన చేయించితిని."
"నన్నెక్కడ కలుసుకున్నావ్! పాపం ఎవర్ని కలుసుకొని ఎవరనుకున్నావో?" సునంద డైరీ చదువుతుంటే చిన్నగా తన పక్కన వున్నవాళ్ళకు మాత్రం వినిపించేలా అన్నాడు చిలకలపాడు సర్పంచ్. అతని దగ్గర్లో కూర్చున్నవాళ్ళు అతను విసిరిన జోక్ కు పగలబడి నవ్వారు.
సునంద అదేమీ గమనించకుండానే డైరీ చదువుతూంది.
"పన్నెండవ తేదీన రాబందులపాడు మహిళామండలిని దర్శించితిని. మొదటి పర్యాయము ఆ మహిళామండలికి వెళ్ళితిని."
"మరి గోగులపల్లి ఎప్పుడెళ్ళావ్?" చిలకలపాడు ప్రెసిడెంటు మళ్ళీ ఓ చెణుకు విసిరాడు. ఈసారి కంఠం కొంచెం పెంచాడు. గోగులపల్లి ప్రెసిడెంటు వినాలనే ఉద్దేశ్యంతో. కాని అతని ప్రయత్నం వృధాప్రయాసే అయింది. సునంద చదువుతున్న డైరీని శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు.
"రాబందులపాడు మహిళామండలివారు భజన కార్యక్రమాలు తప్పించి మరే ఉపయోగకరమైన కార్యక్రమాలను సాగించడంలేదు. పైగా అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నవని చెప్పడానికి విచారిస్తున్నాను."
వీరభద్రయ్య వీరభద్రుడే అయాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి. నరహరి "తొందరపడకు" అన్నట్టు వీరభద్రయ్య కళ్ళలోకి చూశాడు.
సునంద డైరీ చదువుతోంది. "సమితివారు ఆ మహిళామండలికి నూటపాతిక కోళ్ళు సప్లయి చేశారు. కాని ఇప్పుడు ఆ కోళ్ళగూటిలో కోళ్ళు లేవు. సర్పంచ్ గారి గొర్రెలూ, మేకలూ వున్నాయ్."
వీరభద్రయ్య చివ్వునలేచి నిల్చున్నాడు. నరహరి కళ్ళుతోనే "కూర్చో" అని ఆజ్ఞాపించాడు. వీరభద్రయ్య విసురుగా కూర్చున్నాడు. బుసలుకొడ్తున్నాడు. అందరూ కుతూహలంగా వింటున్నారు.
సునంద చదువుతూనేవుంది __ "సమితివారు ఆ మండలికి మూడు కుట్టు మిషన్లు ఇచ్చారు. అందులో ఒకటి మండలి ప్రెసిడెంటుగారింట్లో...."
"అబద్ధం! పచ్చి అబద్ధం!" ఓపికపట్టలేక అరిచాడు వీరభద్రయ్య.
అంతవరకూ డైరీ చదవడంలోనే పూర్తిగా లీనమైవున్న సునంద ఉలిక్కిపడి తలెత్తిచూసింది....
"నువ్వసలు మా ఊరే రాలేదు?" మళ్ళీ అరిచాడు.
సునంద విస్మయంగా వీరభద్రయ్యకేసి చూసింది.
"అంతా తప్పుడు రిపోర్టు. తప్పుడు రాతలు. నువ్వసలు మా ఊరే రాలేదు. ఆరోజు ఎక్కడకెళ్ళావో ఏమో?" వీరభద్రయ్య నిప్పులు కక్కుతూ అన్నాడు.
సునంద ఓక్షణం అయోమయంగా చూసింది. మరోక్షణంలో ధైర్యాన్ని కూడదీసుకొని "పోయిన నెల పన్నెండు శుక్రవారం రోజు మీ ఊరు వచ్చాను."
"అబద్ధం! ఆరోజు నేను ఊళ్ళోనే వున్నాను. నువ్వసలు రానే లేదు. దొంగడైరీ రాసుకున్నావ్....మరి టి.ఏ. రావాలిగా!"
సునంద ముఖం కందిపోయింది. గోగులపల్లి సర్పంచ్ సునంద ముఖంలోకి జాలిగా చూశాడు. శేఖర్ వీరభద్రయ్యకేసి చురచుర చూశాడు.
నరహరి తన సంతోషాన్ని కనబడనీయకుండా ముఖంలోకి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు.
"ఆ రోజు మీ ఊరు వచ్చాను, కామాక్షమ్మగార్ని కూడా కలుసుకున్నాను గదండీ!" మెల్లిగా భయపడుతూ అన్నది సునంద.
"అబద్ధం! నిజంగా వస్తే నైట్ హాల్ట్ కు ఆ రాత్రి ఎక్కడ పడుకున్నావో చెప్పు?" నిలదీసినట్టు అడిగాడు వీరభద్రయ్య.
సభలో వున్నవాళ్ళలో చాలామంది ఘొల్లున నవ్వారు. నరహరి వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించాడు.
సునంద బిత్తరపోయి నిల్చుంది.
"చింతలపాలెం వెళ్ళిందేమో ఆ రాత్రి!" చిలకలపాడు సర్పంచ్ తగ్గుస్థాయిలో అన్నాడు. మళ్ళీ నవ్వులు.
చింతలపాలెం సర్పంచ్ ఏదో అన్నాడు. కాని ఆ గోలలో ఎవరికీ విన్పించలేదు. తను కల్పించుకుంటే సునందను మరీ అవమానం పాలు చెయ్యాల్సి వస్తుందేమోనని అతను తలవంచుకొని కూర్చున్నాడు.
సునందకు ముచ్చెమటలు పోస్తున్నాయి. వణుకుతున్న చేతిలో కాగితాలు రెపరెపలాడుతున్నాయి.
"ఆ రోజు మీ ఊళ్ళోనే వున్నాను!"
"రాత్రి సంగతి అడుగుతున్నాను. అక్కడే పడుకున్నావా?"
సునంద తల ఊపింది. నాలుక పిడుచకట్టుకు పోతోంది.
"అయితే ఎవరింట్లో పడుకున్నావ్?" ఒక్కొక్క శబ్దాన్నే నొక్కుతూ వికృతంగా అన్నాడు వీరభద్రయ్య.
కమిటీ హాలంతా కేకలతో, నవ్వులతో నిండిపోయింది.
సునంద చేతిలో డైరీ కింద పడిపోయింది. అవమానంతో అణువణువూ దహించుకుపోతుంది.
"సైలెన్స్ ప్లీజ్" నరహరి బల్లమీద చరుస్తూ అరిచాడు.
సునంద అసహాయమ్గా, గాయపడిన లేడిలా నిల్చుంది.
తోకపల్లి సర్పంచ్ వయసులో పెద్దవాడు. పెద్దమనిషి తరహాగా వుంటాడు. సునందను ఆప్యాయంగా పలకరించేవాడు. సునంద అతనికేసి ఆదుకోమని అర్ధిస్తున్నట్లు చూసింది. అతను తలవంచుకొని కూర్చుని వున్నాడు.