"వీరభద్రయ్యా! ఆడపిల్లనీ, అందులో పెళ్ళికావాల్సిన పిల్లనీ, ఇలా నలుగురిలో నిలబెట్టి, ఎక్కడ పడుకున్నావ్. ఎవరితో వచ్చావ్.... ఎవరితో పోయావ్.... అని అడగడం పార్లమెంటరీ సాంప్రదాయం కాదయ్యా!" అన్నాడు నరహరి.
నరహరి అన్నతీరుచూసి వీరభద్రయ్యకు మరీ ఉషారెక్కింది.
"ప్రెసిడెంటుగారూ! మరి తప్పుడు రిపోర్టు లివ్వడం పార్లమెంటరీ సాంప్రదాయమాండీ?" అన్నాడు.
"ఇదిగో వీరభద్రయ్యా! మరీ అంత ఇదైపోకు! అమ్మాయిది చిన్నవయస్సు తప్పుచేసిందే అనుకో.... పెద్దవాడివి.... అనుభవజ్ఞుడివి, నువ్వు సర్దుకుపోవాలిగాని ఇంతమందిలో అల్లరి చెయ్యడం బాగుందా చెప్పు?" అన్నాడు నరహరి అర్ధయుక్తంగా.
"సర్దుకుపోవాల్సిన కర్మ నాకేమిటండీ? కావాలంటే మీరే నెత్తి కెక్కించుకోండి!" అన్నాడు వీరభద్రయ్య రెచ్చిపోతూ.
"ఏమిటయ్యా నీ మాటలు నువ్వూనూ. ఎక్కడాలూ ఎక్కించుకోవడాలూనూ?" కోపం నటిస్తున్నాడు నరహరి.
మళ్ళీ ఘొల్లున నవ్వులు.
అదను చూసుకొని చిలకలపాడు సర్పంచ్ లేచి నిల్చున్నాడు. ఆ గోలలో గొంతు పెద్దదిచేసి "ఆమెకిష్టమైనచోట పడుకుంటుంది. మధ్యలో నీ గొడవేంటయ్యా" అరిచాడు.
హాలు నవ్వులతో దద్దరిల్లిపోయింది.
"ఎవడింట్లో పడుకుంటే నాకేమిటయ్యా! మా ఊరు రాలేదు. మా ఊళ్ళో పడుకోలేదు."
ఆ పై మాటలు సునందకు విన్పించలేదు. సునందకు కాళ్ళకింద భూమి జరుగుతున్నట్లనిపించింది. హాలుగోడలు కదులుతున్నట్టున్నాయి. అసహాయంగా సభలోవాళ్ళను కలియచూసింది.
అవమానంతో, లజ్జతో కృంగిపోతున్న సునంద చెవుల్లో, అలనాడు నిండు కొలువులో ద్రౌపతి వలువలను దుశ్శాసనుడు లాగుతుండగా, దుర్యోధన దుశ్శాసనుల వికటాట్టహాసాల మధ్యనుండి ఎలుగెత్తి "హే కృష్ణా!" అని పిలుస్తున్న ఆర్తనాదం గింగురుమంటూ విన్పించింది.
కళ్ళముందున్న ఇందిరాగాంధీ ఫోటో గిర్రున తిరుగుతూ కృష్ణుని చక్రంలా మారింది. ఆ సభ కౌరవ సభగా కన్పించింది. నరహరి దుర్యోధనుడుగా, వీరభద్రయ్య దుశ్శాసనుడుగా కన్పించాడు సునంద కళ్ళకు. తను ద్రౌపదిగా కౌరవ సభలో నిల్చున్నట్టనిపించింది ఆమెకు. వయసు మళ్ళిన కొందరూ, మరికొందరు మంచివాళ్ళూ సునందకు విదుర, భీష్మ, ద్రోణ, కృపాదులుగా కన్పించారు. వాళ్ళకేసి అసహాయంగా చూసింది. అందరూ బాధపడుతున్నట్టు తలలు దించుకొని వున్నారు. ఇంతమంది పెద్దల్లో అధర్మాన్నీ, అన్యాయాన్నీ ఎత్తిచూపించే మనోధైర్యం కలవాళ్ళే లేరా? వుండాలి! ఒకే ఒకడు! వయసులో అందరికంటే చిన్నవాడు వికర్ణుడు వుండాలి! కాని ఏడీ? ఎక్కడ? "కురువృద్దు లెవరూ ఉలక్కుండా పలక్కుండా కూర్చుని వుంటే నేను చేస్తాను న్యాయ నిర్ణయం" అంటూ లేచిన ఆ వికర్ణుడు ఏడీ? ఎక్కడా?
అడుగో వికర్ణుడు! లేస్తున్నాడు!
సునంద కళ్ళు బైర్లు కమ్మినాయ్! కాళ్ళలోని సత్తువంతా ఎవరో సిరంజితో లాగేసినట్టు అయింది. కుర్చీలో కూలబడింది. ఇంకా కేకలూ, నవ్వులూ విన్పిస్తూనే వున్నాయి. ఆ నవ్వుల మధ్యలో ఒక్కసారిగా సింహగర్జన విన్పించింది.
"ఆగండి!" ఆ కంఠం కంచు గంటలా మ్రోగింది. ఒక్కసారిగా నవ్వులూ, కేకలూ ఆగిపోయాయ్.
సునంద కళ్ళు తెరిచింది. ఎదురుగావున్న ఇందిరాగాంధీ బొమ్మ మసక మసగ్గా కన్పించింది. అంతవరకూ దుర్యోధన దుశ్శాసనుల్లా కన్పించిన నరహరి, వీరభద్రయ్యలు బిగిసిపోయి కూర్చుని వున్నారు.
"ఇది కౌరవసభ కాదు." శేఖర్ గర్జించాడు.
"అని ఎవరన్నారు? ఇది ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధుల సభ!" వీరభద్రయ్య రెచ్చిపోతూ అన్నాడు.
"అందుకే ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడవలసిన సభ్యతా, బాధ్యతా మన మీద వున్నాయ్!"
"ఏమిటి విశేషం! మధ్యలో నువ్వెందుకు భుజాలు తడుముకుంటావ్!" విషపు నవ్వు నవ్వాడు వీరభద్రయ్య, నరహరి కళ్ళెర్రజేశాడు.
"అధర్మాన్ని ఎదుర్కోవడం అంటే భుజాలు తడుము కోవటంకాదు."
"కందకు లేని దురద కత్తిపీట కెందుకయ్యా?" వ్యంగ్యంగా అన్నాడు వీరభద్రయ్య.
శేఖర్ దెబ్బతిన్న పులిలా వీరభద్రయ్య మీదకు వచ్చాడు.
"వీరభద్రయ్యా! వళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు!" శేఖర్ గట్టిగా అరిచాడు.
సభలో వాళ్ళంతా బిగిసిపోయి కూర్చున్నారు. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నరహరి కల్పించుకోకుండా వుండలేకపోయాడు.
"శేఖర్! పెద్దవాళ్ళమీదకు ఏమిటా దూకుడు? అటువంటివాళ్ళను వెనకేసుకు రావడం మంచిదికాదు" మందలిస్తున్నట్టు అన్నాడు నరహరి.
"ఏమో పెద్ద తాళిగట్టిన మొగుడిలా వెనకేసుకొస్తున్నాడు!" వీరభద్రయ్య ఎత్తి పొడిచాడు.
శేఖర్ ఒక్కసారిగా వీరభద్రయ్యమీదకు లంఘించి షర్టు పట్టుకున్నాడు. కోపంతో ముఖం మధ్యాహ్నపు మార్తాండునిలా మండిపోతూ వుంది.
"ఏం? కొడ్తావా? కొట్టు చూస్తాను?" కొంచెం తగ్గి అన్నాడు వీరభద్రయ్య.
"ఇవ్వాళ నీ రక్తం కళ్ళచూస్తాను!" బెబ్బులిలా గర్జించాడు శేఖర్!
నరహరి దిగ్గున లేచివచ్చి శేఖర్ చేతినుంచి వీరభద్రయ్య షర్టు విడిపించాడు.
"శేఖర్ ఏమిటిది? చిన్నా పెద్దా విచక్షణలేకుండా మీదకు దూకడం, చెయ్యి చేసుకోవడం, నోరు పారేసుకోవడం. నీ యిష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని నేను అంగీకరించను. ఇది డేగలమర్రి పంచాయితీ సమితి మీటింగు హాలని గుర్తించుకో! ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకోవలసిన బాధ్యతను మర్చిపోతున్నావు" నరహరి కోపంగా అన్నాడు.
శేఖర్ నరహరి ముఖంలోకి తీక్షణంగా చూశాడు.
ఈ కుట్రకు కారకుడు నరహరేనని గ్రహించాడు.
"నరహరీ! నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావ్? ఆ అర్హత నీకు లేదు!" శేఖర్ కంఠం ఖంగ్ న మ్రోగింది.
"వళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మరీ నోరు తెరువు!" నరహరి బుసలు కొట్టాడు.
"తెలుసు! ప్రజలమనిషినంటూ ప్రజల్ని నమ్మించి వాళ్ళచేత ఎన్నుకోబడి, ఆ ప్రజల సొమ్మునే స్వంతం చేసుకుంటున్న జెలగతో .... నీతి నిజాయితీలు మంటగలిపి....సభ్యతా సంస్కారాలకు స్వస్తి చెప్పి.... ఉద్యోగంకొరకు వచ్చిన ఒక ఆడపిల్లను నిండు సభలో అవమానించే పశువుతో...."
నరహరి నిలువెల్లా కంపించిపోతున్నాడు రోషంతో, కోపంతో అవమానంతో....
"నోరుముయ్యి!" హాలు దద్దరిల్లేలా అరిచాడు.
"మరోసారి అంటే మూయించాల్సే వస్తుంది!"
శేఖర్ నిటారుగా నిల్చున్నాడు.
"ఏమిట్రా పేలుతున్నావ్? ఇంతవరకూ మీ మామ మొహంచూసీ, మీ కుటుంబ గౌరవాన్నిచూసీ ఊరుకున్నాను. సిగ్గులేకుండా దాన్ని కార్లో ఎక్కించుకుని నడిబజార్లో తిరిగే నువ్వా నాకు నీతులు నేర్పిస్తున్నావ్. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు?" నరహరి దాదాపు పిచ్చివాడిలా అరుస్తున్నాడు.
"అదీ ఇదీ అన్నావంటే చూడు...."
"ఏంచేస్తా వేం?"
"మళ్ళీ ఆమెనుగురించి నోరెత్తావంటే పళ్ళు రాల్తాయ్! జాగ్రత్త!"
అందరూ నిశ్చేష్టులై కూర్చున్నారు.
"ఎంతమాట పడితే అంత మాటంటావురా? అసలు నీకూ దానికి వున్న సంబంధం ఏమిటి? ముందీసంగతి తేలాలి?" నిలదీసి అడిగాడు నరహరి.
"ఒక స్త్రీని గౌరవించడానికి ఏ సంబంధమూ అక్కర్లేదు. నీ దృష్టిలో స్త్రీ అంటే, నీ తల్లీ, నీ చెల్లెలూ, నీ పెళ్ళాం. వాళ్ళే పతివ్రతలు శీలవాతులు, మిగతా స్త్రీలందరూ చెడిపోయినవాళ్ళు. గౌరవానికి అనర్హులు. అవునా!" శేఖర్ రెట్టించాడు.
"అవును! అంతే! నాకేకాదు....ఆమాటకొస్తే ఏ మగాడి దృష్టిలో ఐనా అంతే. అందుకే అడుగుతున్నాను చెప్పు! అది నీకు ఈ మూడింటిలో ఏమౌతుంది? తల్లి .... కాలేదు. చెల్లెలు .... కానేకాదు. ఇక పోతే పెళ్ళాం కావాలి!"
"నోరు ముయ్!" శేఖర్ ప్రళయకాల రుద్రుడిలా వణికిపోతున్నాడు.
"మూస్తాను! మూస్తాను! ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు! అంత వెనకేసుకొస్తున్నావ్ .... అది నీకు తాళికట్టిన పెళ్ళామా.... తాళి కట్టబోయే పెళ్ళామా!" నరహరి వెక్కిరింపుగా అన్నాడు.
"అవును! చెప్పు! మాకు సమాధానం కావాలి!" వీరభద్రయ్య ముందుకొచ్చి హుషారుగా అన్నాడు.
శేఖర్ నరహరిని ఒక్క తోపు తోశాడు. పడబోయి కుర్చీ పట్టుకొని నిలబడ్డాడు నరహరి.
శేఖర్ రెండడుగులు ముందుకేసి సభంతా కలయజూశాడు. అందరూ అనుకోని ఈ పరిణామానికి బిగిసిపోయి కూర్చుని వున్నారు. శేఖర్ సునంద కేసి చూశాడు.
సునంద రెండు చేతులతో ముఖం కప్పుకొని కుమిలి కుమిలి ఏడుస్తోంది.