Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 35


    చుట్ట కొనకొరికి తుపుక్కున ఊశాడు. "ఊఁ చూస్తాను. దీని అంతు తేల్చుకుంటాను. రేపే ప్రెసిడెంటుతో మాట్లాడుతాను" అంటూ ముందుకు కదిలాడు వీరభద్రయ్య.

 

    కామాక్షమ్మ గుండెలనిండా గాలి పీల్చుకుంది.

 

    "పదమ్మా! పోయి భోంచేద్దాం! ఆలస్యం అయిపోయింది" ఉత్సాహంగా అన్నది గ్రామసేవికతో.

 

    సునంద సెక్రటరీతో మాట్లాడి పంపించి, క్యారియర్ విప్పి భోజనం చేసింది. మీనాకుమారి కొరకు ఎదురుచూస్తూ కూర్చుంది.

 

    అప్పుడే వచ్చిన మీనాకుమారిని "ఇంత ఆలస్యం చేశావేం?" అడిగింది సునంద.

 

    "భోజనం చేసి రావద్దూ?" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది మీనాకుమారి.

 

    సునంద గ్రామసేవిక ముఖంలోకి చూసింది.

 

    ఈ గ్రామసేవికలకు వుండే ఇన్ ప్లుయన్స్ గెజిటెడ్ ఆఫీసర్లకు కూడా వుండదు. పంచాయితీ రాజ్యానికి పునాది గ్రామం. గామ సేవిక పునాదిలో తిష్టవేసి, బలవంతుల అండదండలు సంపాదిస్తుంది. ఆమెను ఎవరూ కదిలించలేరు. అందుకే అంత నిర్లక్ష్యం.

 

    "సరేపద! హరిజనవాడ వెళ్దాం!"

 

    "మీరెళ్ళండి. నేను రాలేను. ఇవ్వాళ నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నయ్!" అన్నది గ్రామసేవిక.

 

    సునంద గ్రామసేవికనుంచి అటువంటి సమాధానం వస్తుందని అనుకోలేదు. విస్మయంగా చూసింది.

 

    "ఊళ్ళో వున్న హరిజనవాడకు వెళ్ళడానికి కాళ్ళు నొప్పులేమిటి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావ్! ఆ సంగతి గుర్తుంచుకో! బయలుదేరు" ఖచ్చితంగా అన్నది సునంద.

 

    "నేను రాలేను. అర్ధరోజు శెలవు పెడ్తున్నాను" అంతకంటే ఖచ్చితంగా అన్నది మీనాకుమారి.

 

    సునంద ఓ క్షణం ఆలోచిస్తూ నిలబడింది.

 

    మరోమాట మాట్లాడి ప్రయోజనం లేదని తెలుసుకుంది. వడివడిగా ముందుకు సాగిపోయింది.

 

    అలా వెళుతున్న సునందను వెనకనుంచి చూస్తూ ముసి ముసిగా నవ్వుకుంది గ్రామసేవిక మీనాకుమారి.

 

    సునంద హరిజనవాడ చేరుకుంది. చిరిగిన మురికి బట్టల్లో దరిద్రం, అజ్ఞానం ఓడుతూ, పసివాళ్లు ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చారు.

 

    "దగాపడిన తమ్ముళ్ళూ, చెల్లాయిలు" అనుకుంటూ అందర్నీ దగ్గరకు తీసుకుంది సునంద. ఆమె కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.


                                        29


    సునంద సంచి చంకకు తగిలించుకొని, ఒక చేత్తో క్యారియర్ పట్టుకొని రోడ్డు ప్రక్కగా చకచకా నడచిపోతోంది.

 

    అప్పటికే బారెడు పొద్దెక్కింది. ఎండ చిటపట లాడిస్తోంది.

 

    వెనకనుంచి వచ్చిన సమితి జీప్ సునందను దాటుకెళ్ళి ఆగింది.

 

    సునంద జీప్ దగ్గరకు వచ్చింది. జీప్ లో ముందు సీట్లో సమితి ప్రెసిడెంటు నరహరి కూర్చుని వున్నాడు. అతని పక్కన చిలకలపాడు గ్రామసేవిక స్వరాజ్యం కూర్చునివుంది.

 

    "దిగు! వెనక్కెళ్ళి కూర్చో!" అన్నాడు నరహరి స్వరాజ్యంతో.

 

    స్వరాజ్యం ముఖం చిన్నది చేసుకొని జీపు దిగింది. సునంద నరహరికి నమస్కరించింది. నరహరి ముఖమంతా కళ్ళుచేసుకొని సునందను చూశాడు. సునందకు ఏదోలా అనిపించింది.

 

    "రా! ఎక్కు!" మృదువుగా ఆహ్వానించాడు నరహరి.

 

    సునంద అతని ఆహ్వానాన్ని ఎట్లా తిరస్కరించాలో తోచక మౌనంగా నిలబడిపోయింది.

 

    స్వరాజ్యం చిన్నబుచ్చుకొని వెనక్కువెళ్ళి చక్రం మీదుగా ఎక్కడానికి ప్రయత్నిస్తూంది. స్థూలకాయం అవడంవల్ల కొంచెం ఇబ్బందిగానే వుంది. రెండుసార్లు జారి మూడోసారి లోపలకు ఎక్కగలిగింది.

 

    "ఎక్కు! డిప్రమోషన్! పాపం" చిన్నగా అన్నాడు సమితి క్లర్కు.

 

    నరహరి పక్కన ఆమె కూర్చోవడం నచ్చలేదు అతనికి. అంతవరకూ ఆడవాళ్ళకు లభించే అవకాశాన్ని తల్చుకొంటూ వుడికిపోతున్న అతనికి స్వరాజ్యం దిగి వెనక్కు రావడం సంతోషాన్ని కలిగించింది.

 

    స్వరాజ్యం సీట్లో కూలబడి రొప్పుతూ వుంది.అది చూచి జీపులో వున్న వి.డి.ఓ. లు ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. స్వరాజ్యం రోషంతో ఉడికిపోయింది.

 

    "ఏమిటాలోచిస్తున్నావ్? ఎక్కు సునందా!" అతని కంఠంలోని ఆ తియ్యదనం ఎబ్బెట్టుగా విన్పించింది సునందకు.

 

    స్వరాజ్యం వెనక్కు తిరిగి ఈర్ష్యగా చూసింది.

 

    "ఎందుకులెండి సర్. దగ్గరకొచ్చేశానుగా. నడిచే వెళ్తాను." మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తల వంచుకొని ముందుకు సాగింది సునంద.

 

    నరహరి దెబ్బతిన్న బెబ్బులిలా అయాడు. వెనక కూర్చునివున్న తన సబార్డినేట్సు తననుచూసి నవ్వుతున్నట్టనిపించి గిర్రున వెనక్కు తిరిగి చూశాడు. కాని అతను అనుకున్నట్టు ఎవరూ నవ్వడంలేదు. అందరూ బిగుసుకుని కూర్చున్నారు.

 

    స్వరాజ్యం ముఖం మాత్రం వికసించివుంది.

 

    "రా! ముందుకొచ్చి కూర్చో!" కటువుగా పిల్చాడు నరహరి.

 

    ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న స్వరాజ్యం, అంతలావు శరీరాన్ని అతితేలిగ్గా చక్రం మీదుగా కిందకు జారవేసింది.

 

    "మళ్ళీ ప్రమోషన్" గొణుక్కున్నాడు క్లర్క్.

 

    స్వరాజ్యం నరహరి పక్కన కూర్చుంది బితుకు బితుకుమంటూ. నరహరి చాలా కోపంగా వున్నాడు.

 

    "పోనియ్!" కసురుకున్నాడు డ్రైవర్ను.

 

    డ్రైవర్ ఉలిక్కిపడి ఒక్కసారిగా స్టార్టుచేశాడు. జీపు ఒక్కసారి ముందుకు దూకింది. ఆ కుదుపుకు ఒళ్ళో ఫైల్సు పెట్టుకొని వెనక వేలాడుతున్న ప్యూన్ కిందపడ్డాడు.

 

    జీప్ ముందుకు సాగిపోతూంది. ప్యూన్ పడటం చూసినవాళ్ళు తమకేమీ పట్టనట్లు చూస్తూ వుండిపోయారు. కాని ప్యూన్ వెంటనే లేచి దుమ్ముదులుపుకోవడం కన్పించింది. అప్పుడుగాని క్లర్కు గొంతు పెగల్లేదు.

 

    "సర్! సింహాచలం పడిపోయాడు సర్!"

 

    "వెధవని పడనియ్!" కోపంగా వున్న నరహరి అన్నాడు. తను విన్నదేమిటో. తన సమాధానం ఏమిటో అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.

 

    "ఆపు వెధవ పడ్డాడట. వెనక్కు తిప్పు!" అన్నాడు నరహరి డ్రైవర్ తో.

 

    "అక్కర్లేదు సార్! వాడే వస్తున్నాడు పరిగెత్తుకుంటూ" అన్నాడు వి.డి.ఓ.

 

    జీపు ఆగింది. నరహరి సునంద గురించి ఆలోచిస్తున్నాడు. మనసు అవమానంతో దహించుకుపోతుంది.


                                                   *    *    *    *


    రోడ్డువారగా నడుస్తున్న సునంద పక్కగా ఓ చిన్నకారు ఆగింది. సునంద నిలబడి చూసింది.

 

    శేఖర్ దిగి "నమస్తే !" అన్నాడు.

 

    సునంద ప్రతినమస్కారం చేసింది. శేఖర్ కళ్ళు సంతోషంతో వెలగడం సునంద గమనించింది.

 

    సునంద ముందుసీట్లో కూర్చొనివున్న రాణీని చిరునవ్వుతో పలకరించింది.

 

    రాణీ మౌనంగా కూర్చుంది. అప్పుడు అక్కడ తను కన్పించడం రాణికి సంతోషాన్ని కలిగించలేదనే విషయం సునందకు స్పురించింది. సునంద మనసు చివుక్కుమన్నది. రాణీ ప్రవర్తనకు శేఖర్ కూడా నొచ్చుకున్నాడు.  

 

    "మొన్న మీ నాన్నగారు కన్పించారు" అన్నాడు శేఖర్.

 

    "ఎలా వున్నారు?" ఆత్రంగా అడిగింది సునంద.

 

    "బాగానే ఉత్సాహంగానే వున్నారు. అమ్మాయి కన్పిస్తూ వుంటుందా అని కూడా అడిగారు" అంటూ సునంద కళ్ళలో దేన్నో వెతకడానికి ప్రయత్నిస్తున్నట్టు లోతుగా చూశాడు.

 

    సునంద చూపులు మరల్చుకుంది.

 

    "రండి! ఎక్కండి! డ్రాప్ చేస్తాను" కారు వెనకడోర్ తెరిచి పట్టుకొని ఆహ్వానించాడు శేఖర్.

 

    "ఎందుకండీ! దగ్గిరకు వచ్చేశానుగా" తటపటాయిస్తూ నిల్చుంది. శేఖర్ ఆహ్వానాన్ని ఎందుచేతనో తను తేలిగ్గా తిరస్కరించలేక పోతోంది.

 

    "ఇంకా చాలా దూరం వుంది. ఎక్కండీ!" అన్నాడు శేఖర్.

 

    సునంద యాంత్రికంగా కారు ఎక్కి కూర్చుంది. శేఖర్ వచ్చి స్టీరింగు దగ్గిర కూర్చుని "నువ్వెళ్ళి వెనుక కూర్చో?" అన్నాడు రాణితో.

 

    రాణీ రుసరుసలాడుతూ దిగి డోర్ చాలా గట్టిగా కసిగా కొట్టింది.

 

    రాణీ ముఖం కందగడ్డలా చేసుకొని సునంద పక్కన కూర్చుంది.

 

    తను కారు ఎక్కాల్సిందికాదు. రాణీకి ఇష్టం వుండదని తెలిసీ తను ఎందుకు ఎక్కి కూర్చుంది? నరహరి ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు శేఖర్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించలేక పోతుంది? శేఖర్ ను చూడగానే, ఒక్కసారిగా తలుపులూ, కిటికీలూ తెరుచుకున్న గదిలా ఎందుకు వెలుగుతో నిండిపోతుంది తన మనసు? తన మనసుకు ఏమైంది? ఏమీ కాలేదు. అంతా భ్రమ! శేఖర్ ఎక్కడా? తనెక్కడా? అతని అంతస్థూ తన అంతస్థూ.... పైగా రాణి అతన్ని ప్రేమిస్తూంది.... అతను కూడా రాణిని....లేదు....అతను రాణిని ప్రేమిస్తున్నట్టు తనకు అనిపించడంలేదు. తనను చూడగానే అతని కళ్ళెందుకు అలా వెలిగిపోతాయి? తను భ్రమలోపడి పోతుంది. కేవలం భ్రమ మాత్రమే....అంతే....వాస్తవంలేదు....  

 Previous Page Next Page