"పంతానికీ పట్టింపులకీ పోయి, సంసారాన్ని నాశనం చేసుకోవడం, ఆత్మాభిమానమా? కాదు, అవకాశం."
"భర్తగా అధికారాన్ని వినియోగించుకుని, ఆమె అభిమతం తెలుసుకోకుండా ప్రవర్తించడం అవివేకం."
"వివేకవంతురాలివయితే, భిన్నాభిప్రాయాలేర్పడ్డప్పుడు పొరపాటు సరిదిద్దుకుని, ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయావా? అసలు, మనిషివైతేనా మనస్సును అర్థం చేసుకునేదానివి. ఛీ..... ఛీ......" కోపంతో బాధతో మరి మాట్లాడలేకపోయాడు.
రాధిక మనస్సు ఉక్రోషంతో కుతకుతలాడిపోయింది.
కన్నీళ్ళు పొంగు కొస్తున్నాయి. "మనిషిని కాకపోతే రాక్షసినా? దెయ్యాన్నా? ఏమిటి మీ ఉద్దేశం?" దుఃఖాన్నాపుకొంటూ వుంటే, గొంతు జీరబోయింది.
"అంతకంటే అన్యాయం బహుశా వాటికీ, విశ్వాసం కృతజ్ఞత ఉండొచ్చు."
"అయితే విశ్వాసంగా కుక్కలా పడుండాలన్నమాట."
అది మనకి చాతకాలేదులే.
"ఎంతనీచంగా మాట్లాడుతున్నారు భర్త భార్య దగ్గర నుంచి కోరుకునేది, విశ్వాసమూ, కృతజ్ఞతే అయితే, అది పవిత్రమయిన వివాహబంధం కాదు. బానిసత్వం అవుతుంది. ఆడది స్వతంత్రంగా బతకగలిగే ఈ రోజుల్లో కూడా ఒక చదువుకున్న మగవాడే ఇంత సంస్కారరహితంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇంకా ఈ దేశంలో చదువులేని వారి మధ్య, అనాగరికుల మధ్య ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. ఈ బానిస బతుకు కన్నా చావు మేలు. తీసుకోండి మీ డబ్బు" పదిరూపాయలకట్ట చేతి కివ్వబోయింది.
"అది నా డబ్బు కాదు."
"మాంగల్యంకట్టి, నామీద అధికారాన్ని పొందినప్పుడు నా డబ్బు మీద అధికారం వుంది తీసుకోండి."
"మాంగల్యం, మనువు, మనసు వీటికి అర్థం తెలీకుండా మాట్లాడే మనిషి మీద అధికారం వున్నా ఉపయోగించుకోవడం, తెలివితక్కువ. వీటిని అర్థం చేసుకోవడానికి హృదయం కావాలి."
"అది హృదయం వున్న వాళ్ళకే తెలుస్తుంది."
"తెలిసింది కనుకనే అంటున్నాను. నీకు హృదయమే కాదు బుద్ధికూడాలేదని. నాకు కావలసింది డబ్బు కాదు, నువ్వు. నిన్ను నాట్యం చెయ్యమని ప్రోత్సహించింది ఆర్జన కోసం కాదు. కళాభివృద్ధి కోసం. కళాపిపసిని కాబట్టి నీ టాలెంట్ వృధాపోకూడదనుకున్నాను. కానీ, నీ కళని అమ్ముకోవాలని కాదు. ఇప్పటికయినా నమ్ముతావా?"
"నమ్ముతాను. కానీ మీరు చెప్పిన మాటలవల్లకాదు. ఆ నమ్మకం నాకు కలిగినప్పుడు."
"అంటే?"
"ఆ సమయం వచ్చినప్పుడు."
"ఇప్పుడు కాదన్నమాట. ఎప్పుడొస్తుంది ఆ సమయం."
"ఏమో కాలమే చెబుతుంది. అంతదాకా లోకం దృష్టిలోనే మనం భార్యాభర్తలం."
"రాధీ, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?"
"ఆ..... మైకంలో లేను."
"సరే..... నీ యిష్టం. నీ అభిప్రాయం మారే దాకా, నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. ఐ...... ప్రామిస్.
నోట్ల కట్ట మంచం మీద పడేసి, అవతలి గదిలోకి వెళ్ళిపోయింది రాధిక.
నాలుగు రోజులకొకసారయినా, ఏదో ఒకచోట రాధిక నాట్య ప్రదర్శన జరుగుతూనే వుంది. ఈ మధ్యన చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ప్రదర్శనలివ్వడానికి వెళుతోంది. మిసెస్ జానకి, ఈమె వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. డబ్బు మాత్రం యధావిధిగా తీసుకొచ్చి, మధన్ దగ్గర పడేస్తోంది రాధిక.
ఆమెతో వాదించి లాభం లేదని, ఆ డబ్బు తీసి పెట్టుకుంటాడు మధన్. కొత్తల్లో మధన్ యిష్ట ప్రకారమే రాధిక నాట్యం చేస్తోందేమోననుకుంది రాజేశ్వరమ్మ. అందుకే తనకిష్టం లేకపోయినా, మాట్లాడకుండా వూరుకుంది. కానీ, వీరిద్దరి ప్రవర్తనా చూసి ఒకరోజు నిలదీసి అడిగేసింది. "మీరిద్దరూ దెబ్బలాడుకున్నారా" అని. "ఆయన్నే అడగండి" అంది ముక్తసరిగా రాధిక" ఏరా ఏం జరిగింది? ఏవైనా చిన్న చిన్న గొడవలొస్తే భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కానీ, ఇలా బిగుసుకుపోతారా?" చిన్న గొడవలు కావమ్మా. మా మధ్యనున్నవి పెద్ద పెద్ద అడ్డుగోడలు. ఈ జీవనసమరంలో అవే కూలిపోతాయో, మేమే రాలిపోతామో, తెలీదు" సమాధానం చెప్పకుండా రాధిక అక్కడినుంచి వెళ్ళిపోయింది." ఏమిటిరా ఇంత పెద్ద పెద్ద మాటలంటున్నావు. ఏవైనా అపోహలొస్తే సరిదిద్దుకోండి. కానీ కాపురాన్ని వీధిన పెట్టి నవ్వులపాలు కాకండి. పండి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న మా జీవితాలలో చిచ్చు పెట్టకండి" కొడుకుని కౌగిలించుకుని బావురుమని ఏడ్చింది. "ఏడిస్తే జీవితాలు చక్కబడతాయా అమ్మా......
ఎవరి ఖర్మ వాళ్ళది. నువ్వేమీ బెంగపెట్టుకోకు" ఊరడించటానికి ప్రయత్నించాడు కానీ, రాజేశ్వరమ్మ కడుపు చెరువైపోయింది. "ఒక్కగానొక్క బిడ్డవి. కళ్ళ నీళ్ళు పెడితే ఎక్కడ కందిపోతావోనన్నట్టు పెంచాను. అంతస్తులూ, అసమానతలు ఏవీ ఎంచకుండా, నువ్వు కోరుకున్న పిల్లని పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకున్నాం. నీ సుఖం కోసమే పాటుపడ్డాం, ప్రాణాలతో వున్నాం. నూరేళ్ళు పండవలసిన వైవాహిక జీవితం, నూరుగంటల్లో చెల్లాచెదురైపోవడం నే చూళ్ళేను బాబూ" అంటూ శోకాలు పెట్టింది ఆమె. తల్లి దుఃఖాన్ని చూడలేని మధన్ కి కూడా దుఃఖం ఆగలేదు. కళ్ళంట నీరు ధారాపాతంగా కారిపోతూ వుంటే "ఛ...... ఏమిటి అసమర్దుడిలాగా?" అని తన్ను తాను తమాయించుకుని, "ఊరుకో అమ్మా ఈ గొడవలు ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయా" అంటూ ఓదార్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పిడుగు పడ్డట్టు రాజేశ్వరమ్మ కుప్పలా కూలిపోయింది.