Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 35


    హాస్పిటల్ ఐదో వార్డులో, పదకొండో నెంబరు తొట్టిలోవున్న పసికందును ఐదేళ్ళక్రితం తెచ్చుకుంది. "సమత" అని పేరు పెట్టుకుంది. ఆ పసిగుడ్డు చుట్టూ తన జీవిత ఆదర్శాలన్నింటినీ అల్లుకొని పెంచుతూవుంది. తను పతిత. తన కూతురు పతిత. తను అలా అవటానికి చాలావరకు తనే బాధ్యురాలు. తన కూతురు అలా అవటానికి ఎవరు కారణం? అధికారం, వ్యామోహం, కృత్రిమ జీవితానుభవాలకోసం తమ జీవితాలు, స్వార్ధపూరిత సమాజ ఇనుప చక్రాల క్రిందపడి నలిగి పిప్పి అయినయ్. తన వంశాంకురమైన "సమత"ను నిర్మలమైన సమాజంలో, స్వార్ధరహితమైన వాతావరణంలో పెంచాలి. "సమత"ను సంపూర్ణ మానవతిగా చెయ్యడమే తన శేషజీవితానికి పరమార్ధం. "సమత" తన ఆదర్శాలకూ, ఆశయాలకూ ప్రతిరూపమై నిలుస్తుంది, తప్పక తన ఆశలు పండుతాయి.......

 

    "అమ్మా!" ఎవరో పిలుస్తున్నారు. "ఎందుకూ?"

 

    "అమ్మా! అమ్మా! బెజవాడ వచ్చేశాం"- చలమయ్య కంఠం ఆదుర్దాగా వినిపిస్తుంది.

 

    అరుంధతి కళ్ళు తెరిచింది. మధుర స్వప్నం చెదిరిపోయింది. ఆమె కళ్ళలో కోటి జ్యోతుల వెలుగు ఒక్కసారి ఆరిపోయినట్లయింది. పగటికలలు నిజం అవుతాయా? తనలో తనే ముసి ముసిగా నవ్వుకుంది. ఏం? ఎందుకు కాకూడదు?

 

    "చలమయ్యా! ఎక్కడకొచ్చాం?" గడియారంకేసి చూసుకుంది.

 

    "ఎస్కిమో హోటల్. అమ్మా! పది దాటిపోయింది. ఇక్కడ భోజనం చేయండి. మళ్ళీ దారిలో ఎక్కడా మంచి హోటళ్ళు లేవు!" అన్నాడు చలమయ్య.

 

    "భోజనం తరవాత చెయ్యొచ్చులే. ముందు గుంటూరు వెళ్ళాలి. కారు పోనియ్!" అంది మెడా, ముఖం పమిటచెంగుతో తుడుచుకుంటూ.

 

    "గుంటూరా?" ప్రశ్నార్ధకంగా అన్నాడు డ్రైవర్.

 

    "అవును. గుంటూరు జనరల్ ఆసుపత్రికి వెళ్ళాలి."

 

    "ఆసుపత్రికా అమ్మా, ఒంట్లో బాగలేదా?" గాబరాపడుతూ అడిగాడు చలమయ్య.

 

    "నా వంట్లో బాగానేవుంది. కాని పనివుంది, త్వరగా కారు పోనియ్" అంది అరుంధతి.

 

    "గుంటూరు ధర్మాసుపత్రికా అమ్మా! ఇది విన్నారా?" అంటూ మడిచి పెట్టిన దినపత్రిక వెనుక సీట్లో వున్న అరుంధతికి అందించి కారు స్టార్టు చేశాడు.

 

    అరుంధతి పత్రిక మొదటి పేజీలోనే పెద్ద పెద్ద అక్షరాల్తో వార్త చదివింది.

 

    "పసిపాపను కుక్క ఎత్తుకుపోయిన వైనం- ఇక్కడ ధర్మాసుపత్రిలో వార్డులోవున్న మూడు రోజుల పసికందును కుక్క ఒకటి ఎత్తుకుపోయింది. ఆ పసిబిడ్డ అనాథ బాలిక అని తెలియవస్తూంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అయిన డాక్టర్ కుక్కటేశ్వరర్రావుగారు ఈ దారుణ సంఘటన జరగటానికి గల కారణాలు స్వయంగా పరిశీలించి త్వరలోనే ఒక నివేదికను అందచేస్తారని మా విలేకరి తెలియచేస్తున్నారు. పోతే అలా పసిబిడ్డ నోట కరచుకొని పోతున్న కుక్కను...."

 

    ఆ తరువాత అరుంధతికి అక్షరాలు కనిపించలేదు.. హే! భగవాన్? ఏమిటీ శిక్ష? నేరం చేసిందెవరు? శిక్ష ఎవరికి? ఆ అనాథ బాలిక తన కూతురు బిడ్డేనా? అవును. అనాథ బాలిక! తన మనుమరాలే?

 

    "చూశారా అమ్మా! ఈ ధర్మాసుపత్రులు ఎట్లా వున్నాయో? అసలు ఆ గుంటూరు ఆసుపత్రిలో చాలా రోజుల్నించి ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూనే వున్నాయమ్మగారూ!" అంటూ డ్రైవర్ కారు నడిపాడు.

 

    కృష్ణాబారాజ్ దగ్గరకు వచ్చేటప్పటికి కారులూ, లారీలూ, రిక్షాలు అడ్డదిడ్డంగా జరుగుతూవుంటే, కారు వేగం మందగించింది. అయిదారు నిముషాలపాటు అసలు ముందుకు కదిలే అవకాశమే దొరకలేదు. అరుంధతి ఆదుర్దాతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆలస్యమయిన ప్రతి నిముషమూ ఆమె గుండెల వేగాన్ని పెంచసాగాయి. తను ఎలాంటి ఘోరాన్ని చూడబోతుందో, తన సర్వస్వమూ నాశనమయి, మిగిలిన ఒకే ఒక జీవకణమూ ఆశాకిరణమూ అయిన ఆ పసికందు ఏమైందో? పొత్తిళ్ళలో వుండాల్సిన బిడ్డ కాలభైరవుని కోరలకు ఆహారమైందా? తల్లీ, తండ్రీ, తాతా, అమ్మమ్మా, జేజమ్మా, నౌకర్ల, చాకర్ల కనురెప్పలచాటున సంరక్షించబడాల్సిన పసికందు నూరేళ్ళ జీవితమూ ఏ వీధికుక్క కోరలకు బలైపోయిందో? సర్వ ఐశ్వర్యాలతో తులతూగుతూ, పుత్తడిబొమ్మలా అల్లారు ముద్దుగా పెరగాల్సిన నా తల్లి ఎంత నికృష్టమైన చావుకు గురైంది? దీనికి బాధ్యులెవరు? తనా? తన భర్తా? రాజారావా? తన కూతురు మాధవా? దానిని వంచించినవాడా? లేక వాడు....వాడు....ఆ డాక్టర్ కుక్కటేశ్వరరావా? వాడికి ప్రమోషన్ ఇచ్చి ఆసుపత్రికి సూపరింటెండెంటుగా చేసిన ప్రభుత్వానిదా? లేక ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలదా? ఆ దరుద్రుడికి తనేగా ప్రమోషన్ ఇప్పించింది? తనే! తనే! తను చేసిన పాపం తనను తిప్పితిప్పి కొడుతుంది. తను చేసిన పాపానికి ఇంకా కళ్ళు తెరవని, ప్రపంచాన్ని చూడని పసికందు ఎందుకు బలైపోవాలి?

 

    కారు - లారీలను, బస్సులనూ తప్పుకొని కృష్ణాబారాజ్ బ్రిడ్జి ఎక్కింది. కింద వరదపొంగులో వున్న కృష్ణానది ఉరవళ్ళు పరవళ్ళు తీస్తున్నది. అంత వేగంగాను అరుంధతిలో అంతర్వాహినులు ప్రవహింపసాగాయి.

 

    "చలమయ్యా! త్వరగా పోనియ్!" ఆమె కంఠంలోని ఆవేదననూ, ఆతురతనూ గ్రహించి డ్రైవర్ యాక్సిలేటర్ను నొక్కాడు. డెబ్బయి ఎనభయ్ కిలోమీటర్ల వేగంలో కారు పోతూంది.   

 

    శవాల గదిలో తన చిట్టితల్లిని వుంచుతారా? అసలు బిడ్డ శవమైనా దొరికిందా? దొరికినా ఇంకా వుంచారా లేక ఏ మురికి కాలవలోనైనా పారేశారా? తలలో సమ్మెట పోటులు ప్రారంభమయాయి.

 

    దూదిపింజలాంటి శరీరంలో కర్కశమైన కోరలా! ఆ పసికందు శరీరాన్ని తను తీసుకెళ్ళి ఏం చేసుకుంటుంది? ఇంకా ఎవరికి చూపిస్తుంది? ఎవరు విలపిస్తారు? ఇహ తనెందుకు వెళ్ళాలి? వెళ్ళి ఏం సాధించగలదు? బతికినన్నాళ్ళూ ఆ బీభత్సదృశ్యం కళ్ళలోనే వుంచుకోవాలా?

 

    కారు సడన్ బ్రేకు పడి ఆగింది. అరుంధతి ముందుకు తూలింది. సీటుకు తల తగిలి పగిలేంత ప్రమాదమైంది. తెప్పరిల్లుకొని రోడ్డుమీదకు చూసింది. లేగదూడ ఒకటి కారుకు అడ్డుగా వచ్చి, బెదిరి గెంతుతూ పరిగెత్తసాగింది. దానివెనకే ఆవు అరుస్తూ పరుగులు తీస్తూంది.

 

    డ్రైవర్ తువ్వాలుతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని కారు తోలసాగాడు. మళ్ళీ కారు వేగంగా పోతూంది. రోడ్డుపక్కన గొడ్లను తోలుకుపోతున్న బుడ్డాళ్ళు, పేడ తట్టలు నెత్తిన ఎత్తుకొని ఆడపిల్లలు బుడ్డాళ్ళతో పారాచకాలాడుతూ పాటలు పాడుతున్నారు. ఆగి నిలబడి కారుని చూస్తున్నారు. క్షణకాలంపాటు కన్పించి పోతున్న ఆ పిల్లల్ని చూస్తుంటే అరుంధతికి కడుపులో రంపపుకోత మొదలైంది. ఆ పసిగుడ్డు ఏ కష్టజీవి కడుపునో పుట్టివుంటే! ఎంత హాయిగా స్వేచ్చగా పెరిగి పెద్దదయేదో? అనాథ అయి దిక్కులేని చావు చావాల్సి వుండేది కాదుగదా! అందరికీ ఇదేగతి పట్టిందా? ఆసుపత్రుల్లో మాత్రం ఎంతమంది కని వదిలేసి పోవడంలేదు! అరుంధతి మనస్సులో ఓ ఆలోచన ఆశా కిరణంలా తళుక్కుమంది. అవును! ఆ పసికందు తన మనుమరాలే ఎందుకయి వుండాలి? ఆ సంఘటన మరో అనాథ బాలిక విషయంలో ఎందుకు కాకూడదూ? అసలు ఆ పేపర్లో వార్త ఎందుకు అబద్ధం కాకూడదు? తన పాప బాగానే వుండి వుంటుంది. అమ్మమ్మకోసం తన బోసి నవ్వుల్ని దాచుకుంటూ ఎదురు చూస్తూ వుంటుంది! అమ్మ భడవా? ఎంత హడలగొట్టావే అమ్మమ్మను? నాకు తగిన శిక్షే వేశావ్! ఈ లోకంలో నన్ను ఇంతగా ఎవరూ శిక్షించలేరనుకున్నాను.   

 

    నా బంగారు తల్లీ, వస్తున్నానమ్మా! నీ పుట్టుకతో నాకు పునర్జన్మను ప్రసాదించేవు. నీవే నా ఆశాజ్యోతివి. నా గతం చరిత్రలో కలిసిపోయింది. నీవే నా భవిష్యత్తు! నీ కోసం కొత్త సమాజాన్ని సృష్టించబోతున్నా నమ్మా! ఆ చిన్న ప్రపంచంలో నువ్వు పెరిగి పెద్దదానివి కావాలి. నీ అమ్మా, అమ్మమ్మలు చవిచూసిన నరకం పొలిమేరల్లోకికూడా నువ్వు తొంగిచూడాల్సిన అవసరం లేదు.

 

    "అల్లారు ముద్దువికదే, అపరంజివికదే"- దూరం నించి పాట విన్పిస్తూంది. కారు మంగళగిరి రోడ్డుమీద వున్న హోటలుని దాటుకొని పోయింది.

 

    "చలమయ్యా! త్వరగా పోనియ్!" అరుంధతి కంఠం ఉద్విగ్నమయింది. డ్రైవరుకు మతి పోతున్నట్లయింది. ఆమె మరో ప్రపంచంలో వున్నదానిలా మాట్లాడుతుంది.

 

    "మన పాపకేం జరగలేదు! సుఖంగా వుంది! అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడువస్తుందా, అని ఎదురుచూస్తుంది. త్వరగా పోనియ్ చలమయ్యా! ఆలస్యమయితే నా అమ్మడికి కోపం వస్తుంది."   

 

    అంత వేగంలోనూ చలమయ్యకు వెనక్కు తిరిగి చూడాలనిపించింది. ముందున్న అద్దాన్ని సర్ది అందులో అరుంధతి ముఖం చూశాడు. ఆమె ముఖంలోని విషాదచ్చాయలపై ఏదో కొత్తకాంతి ప్రసరిస్తూవుంది. చలమయ్య ఆలోచనలో పడ్డాడు. ఆమె గుంటూరు ఎందుకు వెళుతూంది? లీలగా అర్ధం అయింది చలమయ్యకు. అక్కడ వున్న పాప ఎవరో? ఈమెకూ ఆ పాపకూ ఉన్న అనుబంధం ఏమిటి? తనలో ఆలోచనలు అల్లిబిల్లిగా తిరుగుతూండగా స్పీడామీటర్ ముల్లు సర్రున పైకి తిరుగుతోంది. కారు శరవేగంగా నంబూరు ట్రాన్స్ మిషన్ స్టేషన్ దాటింది.

 

    మరో పదినిముషాల్లో గుంటూరు బస్ స్టాండు దాటి హాస్పిటల్ రోడ్డుమీద వెళ్తోంది కారు. అకస్మాత్తుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒకడు అడ్డం తగిలి కారు ఆపాడు.

 

    "ఈ రోడ్డున వెళ్ళొద్దు. వెనక్కు తిరిగి వేరే రోడ్డున వెళ్ళు" అన్నాడు చలమయ్యను చూసి కానిస్టేబుల్.

 

    "ఏం, ఆసుపత్రికి వెళ్ళాలి!" అన్నాడు చలమయ్య.

 

    "అందుకే చెప్పేది. అక్కడ పెద్ద గలాటా జరుగుతోంది. అటు వెళ్ళొద్దు."
    


    "ఫర్వాలేదు. నువ్వు పోనియ్!" ముందుకు వంగి డ్రైవర్ను హెచ్చరిస్తూ అంది అరుంధతి.

 

    "రాళ్ళేసి కొడుతున్నారు. కొత్తకారు పప్పు అవుతుంది. తిరిగి వెళ్ళండి!" అంటూన్న కానిస్టేబుల్ మాటలు పూర్తిగా వినిపించుకోకుండానే చలమయ్య కారును పోనిచ్చాడు. హాస్పిటల్ కి వచ్చేసరికి జనం గుంపులు గుంపులుగా పేవ్ మెంట్లమీద నిలబడి వున్నారు. రెండు పోలీసువానులు ఆగి వున్నాయి. ఇరవై మందిదాకా రిజర్వు పోలీసులు వానులపక్క బారులు తీసి నిలబడి వున్నారు.

 

    చలమయ్య కారు పక్కకు తీసి ఆపి "అమ్మగారూ! ఇహ ఇటు వెళ్ళటానికి వీల్లేదు. చూస్తున్నారుగా? కారు వెనక్కు తిప్పమంటారా?" అంటూ ఆగిపోయాడు. అప్పటికి అరుంధతి కారు దిగి డోర్ వేసింది. గబగబా ముందుకు నడవసాగింది. జనాన్ని తోసుకొని హాస్పిటల్ కేసి నడవసాగింది.

 

    "అధికారుల దౌర్జన్యం....నశించాలి!"

 

    "ఆసుపత్రి పనివాళ్ళ సంఘం వర్ధిల్లాలి!"

 

    మొదలైన నినాదాలతో వాతావరణం ఉద్రేకపూరితంగా వుంది.

 

    గత నలభై గంటలుగా ఆసుపత్రిలోని తోటి పనివాళ్ళు సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచాలనీ డ్రెస్సులు, అలవెన్సులు, వసతి సౌకర్యాలూ కలుగజేయాలనీ సమ్మె ప్రారంభం అయింది. రెండోరోజుకల్లా, ఆసుఅప్త్రి సూపరింటెండెంటు అక్రమ చర్యలకు వ్యతిరేకంగా మిగిలిన పనివాళ్ళూ సమ్మెలో చేరారు. క్రితంరాత్రి కొందరు కార్మిక నాయకుల్ని పోలీసులు లారీల్లో ఎక్కించుకెళ్ళారు. లాకప్ లో ఉన్న నాయకులపై జరిగిన లాఠీ ఝళిపింలతో, ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెలో చేరాయి. ఉదయం నుంచీ వాతావరణం ఉద్రిక్తంగా వుంది. తెల తెలవారుతుండగనే వందలాది కార్మికులు ఆసుపత్రి గేటుముందు బైటాయించి సమ్మె ప్రారంభించారు. ముందు బ్యాచీలో సత్యాగ్రహం చేసినవాళ్ళను అరెస్టుచేసి పోలీసులు లాకప్ లో పెట్టి నాలుగు ఉతికారని వార్తలు వ్యాపించాయి.

 

    అందులో వంటి ఊపిరి వాడొకడు చావు బ్రతుకుల్లో వున్నాడనీ, తెల్లవారుఝామున రహస్యంగా ఆస్పత్రిలో చేర్పించారనీ, అసలు చచ్చిపోయాడనీ,వాడి శవం మార్చురీలో ఉందనీ, వాడు గుండె ఆగి చచ్చిపోయినట్లు సూపర్నెంటు సర్టిఫై చేశాడనీ వార్తలు పట్టణమంతా వ్యాపించాయి. దాంతో ఆసుపత్రి పనివాళ్ళు రెచ్చిపోయి హాస్పిటల్ గేటును విరగ్గొట్టి హాస్పిటల్ మీదకు దాడి చేస్తారని సూపర్నెంటు పోలీసు బలంతో మంచి బందోబస్తు చేశాడు. పట్నంలోని ఇతర కార్మిక సంఘాలు సానుభూతి సమ్మె చేయడానికి నిర్ణయించి పట్టణం నాలుగు చెరగులనుంచి ఊరేగింపులు బయలుదేరదీసి హాస్పిటల్ వైపుకు రాసాగారు. మధ్యతరగతి ఉద్యోగులూ, మేధావులూ- కుక్కపిల్లను నోట కరచుకొని పోవటానికి కారణం, ఆసుపత్రిలో పనివాళ్ళ అశ్రద్దా? లేక అధికారుల అశ్రద్ధవలనా అన్న మీమాంసలో పడి చర్చించుకుంటూ రోడ్లమీదకు వచ్చారు. మునిసిపాలిటీ వారు రోడ్లమీద కుక్కల్ని హడావిడిచేసి పడుతూవుంటే చూస్తూ నిల్చున్న అమాయకులు కొందరు, పిల్ల నెత్తుకొనిపోయిన కుక్కదే అసలు తప్పని, అందువల్లనే ఈ గలాటాలన్నీ జరుగుతున్నాయనే అభిప్రాయంలో పడిపోయారు.

 

    సరదా చూసే జనాన్ని తప్పుకొని అరుంధతి ముందుకు సాగింది. బూడిదరంగు బట్టలవాళ్ళు, కావిరంగు బట్టలవాళ్ళూ, ముతకనేత, పచ్చంచు, ఎర్రంచూ తెల్ల చీరల వాళ్ళూ, ఆడా....మగా అంతా కలగాపులగంగా దడికట్టినట్టు గేటుముందు నిలబడి ఉద్రేకంగా నినాదాలు చేస్తున్నారు. అరుంధతి ఆ జనంలో కలిసి ఒక్కొక్కళ్ళనే మెల్లగా తప్పుకొని ఒక్కొక్క అడుగే ముందుకేస్తూ గేటు దగ్గరకు జరుగుతూ వుంది. గేటు ముందు పోలీసులు వలయాకారంగా నిలబడి, కార్మికులను ముందుకు రానీయకుండా కాపలా కాస్తున్నారు. గేటు లోపల బాష్పవాయువుతో తుపాకులతో మరికొంత పోలీసు బలగం నిల్చొని వుంది.

 

    సమ్మె చేస్తున్న కార్మికుల గుంపులో జొరబడి ప్రయాసతో అరుంధతి ఆసుపత్రి గేటుదగ్గరకు వచ్చింది. గేటుదాటి లోపలకు పోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకు పోలీసు ఇనస్పెక్టర్ ఒకడు అడ్డుతగిలాడు.

 

    "ఆగు. లోపలకు వెళ్ళటానికి వీల్లేదు, తిరిగి వెళ్ళు!" మొరటుగా అతని గొంతు గాండ్రించింది.

 

    తననేనా వీడు ఆగమనటం? పోలీసు సూపర్నెంట్లు తన ఇంటి ముందు కాపలా కాశారు.

 

    అరుంధతి అతడికేసి ఈసడింపుగా చూసి, ఏదో అనాలని అంతలోనే తమాయించుకొని, అతన్ని తప్పించుకొని ముందుకు నడిచింది. చిర్రెత్తిపోయిన ఇన్ స్పెక్టర్, అరుంధతిని రెక్కపట్టుకొని వెనక్కు గుంజాడు. ఆ ఊపుకు అరుంధతి వెనక్కు పడిపోయింది. చీర తొలగి పమిట జారిపోయింది. అభిమానవతి అరుంధతి దెబ్బతిన్న ఆడపులిలా లేచింది. నిండు యూనిఫారమ్ లో వున్న ఇన్ స్పెక్టర్ చెంపమీద లాగికొట్టింది. అతడి నెత్తినవున్న టోపీ అంత దూరంలో ఎగిరిపడింది. ఇన్ స్పెక్టర్ ఉగ్రుడైపోయాడు. పక్కనేవున్న కానిస్టేబుల్ ని పిలిచి అరచాడు:

 

    "దీన్ని జుట్టు పట్టుకొని లాక్కురండి."

 

    మరుక్షణంలోనే ఇద్దరు పోలీసులు అరుంధతి జబ్బ పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ హాస్పిటల్ గేటులోపలికి పోసాగారు.

 

    అంతలోనే డ్రైవర్ చలమయ్య ముందుకు దూకి అరుంధతిని ఈడ్చుకుపోతున్న పోలీసులతో కలబడ్డాడు. దబదబా పది లాఠీలు చలమయ్య మొరటు శరీరం మీద నాట్యం చేశాయి. రక్తం చిమ్ముతూ చలమయ్య ఆసుపత్రి గేటుముందు పడిపోయాడు. అది చూసి ఉద్రుక్తులైన కార్మికులు ఉప్పెనలా వచ్చి పోలీసులను చుట్టుముట్టారు. గేటులోపల ఉన్న పోలీసులు బాష్పవాయువు బాంబులు విసిరారు. జనంలోనుంచి రాళ్ళూ, సోడాబుడ్లూ పోలీసులమీదకు జడివానలా కురిశాయి.

 Previous Page Next Page