"మరో గంటలో తెల్లారిపోతుంది. తెల్లవారేసరికి మనం కొండ మలుపుకు వెళ్ళాలి. త్వరగా నడవడం మంచిది!" సుందరం వేగంగా నడవసాగాడు. ప్రతిభ వాళ్ళ రెండంగలకు తను మూడు అంగలు వేస్తూ వాళ్ళతో సమానంగా నడుస్తోంది. చేతిలో సూట్ కేసు ముందు తేలిగ్గా ఉన్నట్టనిపించినా రాను రాను దాని బరువు పెరుగుతున్నట్టుగా వుంది. చేతులు మార్చుకుంటూ వేగంగా నడవసాగింది. కాళ్ళకింద మట్టిగడ్డలూ, కంప పుల్లలూ గుచ్చుకుంటున్నాయి.
చెప్పులు లేకుండా నడవడం ఇంత కష్టమని ఇంతవరకూ తన అనుభవంలోకి రాలేదు. సంచీతోపాటు సంచిలో పెట్టిన చెప్పులూ, నీళ్ళలో పడిపోయాయి. అప్పటి పరిస్థితిలో ప్రాణాలు ముఖ్యం. అందుకే ఏదిపోయినా పట్టించుకునే స్థితిలో లేదు అప్పుడు. కాళ్ళకింద గులకరాళ్ళూ, మట్టిగడ్డలూ గుచ్చుకుంటుంటే కాళ్ళకు చెప్పులు లేని బాధేమిటో తెలుస్తూంది. దానికి తోడు ఈ సూట్ కేసు బరువొకటి. మళ్ళీ సూట్ కేసును ఎడంచేతిలో నుంచి కుడిచేతిలోకి మార్చుకుంది.
అపరిచితుల వెనక, పరిచయంలేని ప్రాంతంలో, అందులోనూ చెప్పులు కూడా లేకుండా, సూట్ కేసు మోసుకొని నడుస్తున్న ప్రతిభకు అంతా ఏదో కలలా వుంది. అమ్మా, నాన్నా చుట్టాలు, పక్కాల్లూ అంతా మాసిపోయిన స్మృతులుగానే మిగిలిపోతారు. తన అసలు పేరు కూడా ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. చేతులు గుంజుతున్నాయి. కాళ్ళు మండుతున్నాయి. సత్యం అడిగినప్పుడు అతనికి సూట్ కేసు ఇచ్చివుంటే బాగుండేది. తను ఎంతో పొరపాటు చేసింది.
ఆడవాళ్ళు బరువులు మొయ్యడం మగాళ్ళకు ఇష్టం ఉండదు. రైల్వేస్టేషన్లలో, బస్ స్టాపుల్లో ఎన్నోసార్లు చూసింది. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళు అబలలు. బరువులు మొయ్యలేరు. ఈ జాడ్యం మధ్య తరగతి పై తరగతి వాళ్ళలోనే వుంది. వ్యవసాయ కూలీలనూ, బీదా బిక్కీ వాళ్ళను ఎందర్నో చూసింది. ఆడవాళ్ళు పెద్ద మూతలు మోస్తారు. బరువులెత్తుతారు. మగవాళ్ళతోపాటు కాయకష్టం చేస్తారు. పాటకజనం స్త్రీకి ఇచ్చిన స్థానాన్ని కూడా మధ్యతరగతి పై తరగతి వాళ్ళివ్వరు. చేతిలోనుంచి జారిపోతున్న సూట్ కేసును ఎత్తినెత్తిన పెట్టుకుంది. కొంత హాయిగా, తేలికగా వుంది. పదిహేను నిముషాలు నడిచేసరికి మాడు మంట పుట్టసాగింది. ఇక ఎంతోసేపు పెట్టె నెత్తిమీద ఉండేటట్టు లేదు.
సుందరం, సత్యం వేగంగా నడుస్తున్నారు. సురక్షిత సైనికుల్లా నడుస్తున్నారు. అడుగులు ఖచ్చితంగా పడుతున్నాయి. ప్రతిభకు కాళ్ళు తేలిపోతున్నాయి. నెత్తిమీద సూట్ కేసు జారి భుజాలమీద పడింది. రెండు చేతుల్లో ఎత్తి మళ్ళీ నెత్తిమీద పెట్టుకుంది. కామ్రేడ్స్ ను ఆగమని అడిగితే? ఛ! ఛ! తన చచ్చినా అలా అడగదు! ఇప్పుడర్థమౌతోంది కామ్రేడ్స్ "సూట్ కేసు తీసుకొచ్చావా?" అని ఆశ్చర్యంగా ఎందుకడిగారో? నిజానికి వాళ్ళ ప్రశ్న అప్పుడు తనకు ఎబ్బెట్టుగా తోచింది.
ఎవరి సామాన్లు వాళ్ళే మొయ్యడం దళ జీవితంలో ఒక నియమం అయి వుంటుంది. అందుకే అలా అడిగి వుంటారు. లేకపోతే ఆ ప్రశ్న వేసి వుండరు. మెడలు గుంజుతున్నాయి! కళ్ళముందు త్రోవ కన్పించడంలేదు. తలవంచి కిందకు చూస్తే పెట్టెజారిపోతున్నది. తలపైకెత్తినడిస్తే వెనక్కు జారిపోతున్నది.
కామ్రేడ్స్ ఇరవై గజాల ముందున్నారు. తను బాగా వెనకపడిపోయింది. ఇలా...ఇలాగే నడిస్తే కామ్రేడ్స్ కనుమరుగైపోతారు. సర్వశక్తులూ కూడదీసుకుని ఒక్క పరుగు తీసింది. సూట్ కేసు డొంకలో పడింది. ప్రతిభ బండి గాడిలోకి ఒరిగింది. కామ్రేడ్ సుందరం ఆగాడు. సత్యం వెనక్కు తిరిగాడు. సూట్ కేసు తీసి భుజాన వేసుకున్నాడు. ప్రతిభ లేచి నిలబడింది. ఏమీ జరగనట్టే సత్యం ముందుకు సాగాడు. తనకేసి చూడలేదు. ప్రతిభ కామ్రేడ్స్ తో అడుక్కు అడుగు కలుపుతూ నడవసాగింది. తూర్పుదిక్కు అరుణిమను పులుముకుంది. కొంద సానువులు దగ్గరౌతున్నాయి. డొంకవదిలి కాలిబాటన కొంతదూరం నడిచారు. తెల్లవారి పోయింది. కొండ మలుపు తిరిగింది.
"కామ్రేడ్ ప్రతిభా! మీరు సత్యంతో వెళ్ళండి! నేను మళ్ళీ కలుస్తాను." సుందరం ప్రతిభ ముందు నిలబడి అన్నాడు. ప్రతిభ తలెత్తి అతడికేసి చూసింది. సుందరం రెడ్ శాల్యూట్ చేశాడు. ప్రతిభ పిడికిలి బిగించి శాల్యూట్ చేసింది.
22
బాంబే, హిప్పీలకు అతి ప్రియమైన పట్టణం. దానికి అనేక కారణాలు వున్నాయి. విదేశాలనుంచి వచ్చేపోయేవారికి ఇది కేంద్రస్థానం. చివరకు ఖాట్ మండూ వెళ్ళినా, గోవా చేరినా ముందు కొన్ని రోజులు బొంబాయిలో తిరిగిన తరవాతనే! బాంబే (దక్షిణ బాంబే)లోని కొలాబాలో హిప్పీప్యాడ్సు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్మిన్ టన్ రోడ్డుమీద ఎక్కడ చూసినా హిప్పీలే కన్పిస్తారు. అందుకే ఈ స్ట్రీటును "లవ్ స్ట్రీట్" అని కూడా అంటారు. బొంబాయి పోలీసులు వీళ్ళను గురించి అంతగా పట్టించుకోరు. చూసిచూడనట్టు వెళ్ళిపోతారు. ఇతర పట్టణాలకంటే హిప్పీలు బొంబాయిలో ఎక్కువ స్వేచ్చగా తిరుగుతూ వుంటారు. బొంబాయిలోని చిన్న చిన్న హోటల్స్ లో హిప్పీలకు కావాల్సిన పానీయాలూ, మత్తుమందులూ దొరుకుతాయి.
ఇరవయ్యవ శతాబ్దపు నాగరికత పరాకాష్ఠను బొంబాయిలో చూడవచ్చును. అన్ని ఆకర్షణలతో పైకి అందంగా కన్పించే బొంబాయి పట్నం మేడిపండు అయితే, అక్కడక్కడ కన్పించే చిన్న చిన్న హోటళ్ళు ఆ మేడిపండు పొట్టలోని పురుగులు అవినీతికీ, చీకటి బతుకులకూ ఆలవాలాలు. ఇక్కడి మనిషి మాంసం (ఆడదాని శరీరం) చౌకగా, కారు చౌకగా, అంగడిలో అమ్మే ఉప్పూ, చింతపండూ కంటే చౌకగా అమ్మబడుతుంది. మత్తు పదార్థాలకు డబ్బు దొరకనప్పుడు హిప్పీ గరల్స్ ఈ హోటళ్ళలో శరీరాన్ని అమ్ముకుంటారు. మురికి ఓడుతూ, అరాచకంగా వుండే ఈ హోటళ్ళు, బొంబాయి నగరంలో, అందమైన శరీరం మీద చీమూ రక్తం ఓడుతూ ఉండే పుళ్లలా కన్పిస్తాయి. కొలాబాలోని ఈ హోటళ్ళలో 'బాంబే బ్లాక్' అనే కొత్తరకమైన మత్తుపదార్ధం దొరుకుతుంది. దీనిని ఒక ఇండియన్ హిప్పీ నల్లమందూ, చరస్ మొదలైనవాటి మిశ్రమంతో కనిపెట్టాడు. కడుపునిండా తిండీ, వంటినిండా బత్తా, వుండటానికి ఇల్లూ లేక కటికదారిద్ర్యంతో బాధపడేవాళ్ళు బొంబాయిలో లక్షల సంఖ్యలో వుంటారు. పేవ్ మెంటుమీద పుట్టి, అక్కడే పెరిగి, పెళ్ళి చేసుకొని, పిల్లల్ని కని, చివరికి ఆ పేవ్ మెంట్ మీదే చనిపోతూ వుంటారు.
పేవ్ మెంటుమీద పుట్టి పెరిగిన ఒకడు పేవ్ మెంటుమీదే 'బాంబే బ్లాక్' ను కనిపెట్టాడు. కొలాబాలో ఒక చిన్న హోటలు పెట్టాడు. వేషం హిప్పీలది కాని డబ్బు సంపాదన అతని లక్ష్యం. హిప్పీలలో కూడా రెండు రకాలవాళ్ళు వుంటారు. కొందరు కేవలం ఆ జీవితంలో లభించే సెక్సు కోసం, మత్తుపదార్థాల కోసం వస్తారు. ఇలాంటివాళ్ళు ఎక్కువరోజులుండరు. అందినంతవరకు అనుభవించి వెళ్లిపోయి మళ్ళీ మామూలు జీవితాలను గడిపేస్తారు. అటువంటివాడే బాంబే బ్లాక్ ను కనిపెట్టిన వాడు. అతను తన పేరు బాంబే బ్లాక్ అని పెట్టుకున్నాడు. పగలంతా నగరంలో తిరిగి సాయంకాలానికి జాన్, శబరితో 'కొలాబా'కు చేరుకున్నాడు. నగలూ డబ్బూ సంచీలోనే వున్నాయి. పూర్తిగా పగటి వెలుగు ఆరిపోలేదు. వీధి దీపాలు వెలవెలా పోతున్నాయి. హోటల్ ముందు, కౌంటరు పక్కగా కూర్చునివున్న ఒక ఇండియన్ హిప్పీ శబరిని చూసి అదోలా నవ్వాడు. అతని నవ్వులో మామూలు హిప్పీల నవ్వులో వుండే పలకరింపు లేదు. ఎరకు చిక్కిన పెద్దచేపను చూసి పల్లెవాడు నవ్విన నవ్వులా వుంది. శబరికి అతని నవ్వు నచ్చలేదు. ముఖం తిప్పుకుంది. అయినా అతను నవ్వుతున్నట్టే అనిపించింది.
"హల్లో! నా పేరు బాంబే బ్లాక్!" అన్నాడు.
జాన్ ముఖం వికసించింది.
"నువ్వేగా కొత్త డ్రగ్ కనిపెట్టింది? నీ పేరు విన్నాను."
"అవును!" గర్వంగా మెళ్ళోవున్న రంగురంగుల లావాటి పూసల దండను సరిచేసుకుంటూ అన్నాడు బాంబే బ్లాక్.
"నువ్వు హిప్పీవా?" శబరి అడిగింది అతన్ని పరిశీలనగా చూస్తూ.
అతను అదోలా నవ్వాడు.
"ఇక్కడ ప్యాడ్ వుందా?"
"రెండు మూడు వున్నాయి ఫర్లాంగు దూరంలో పెద్ద ప్యాడ్ వుంది, అక్కడ పాతిక మంది దాకా వున్నారు."
"ఆ ఎదురుగా కనిపించే ప్యాడ్..."
"అదా! అక్కడ జన్ కీస్ వుంటారు."
"ఎంతమంది వున్నారు?"
"ఐదుగురు వున్నారు. ఒకడు నిన్ననే బ్లేడుతో పీక కోసుకొని చనిపోయాడు."
శబరి జాన్ చెయ్యి గట్టిగా పట్టుకుంది.
"భయపడకు!" జాన్ చిన్నగా అన్నాడు.
"జంకీస్ అంటే" భయపడుతూ అడిగింది.
బాంబే బ్లాక్ శబరి కేసి తాజా యాపిల్ పండుకేసి పసివాడు చూసినట్టు చూశాడు.