"నీ భార్య నిద్రలో అరుస్తూ లేచేదా?"
"అబ్బే అలాంటిది ఎప్పుడూ జరగలేదు."
"ఆ అమ్మాయి మీ భార్యతో ఎలా వుండేది?"
"నా భార్యకు ఆ అమ్మాయి అంటే ఇష్టం వుండేది కాదు. సావిత్రిని చూస్తే భయం వేస్తుందనేది. సావిత్రి తల్లితో మాత్రం చనువుగా ఉండేది. నాభార్య పెద్దగా చదువుకోలేదు. ఆ అమ్మాయి ఎం.ఏ. చదువుతున్నది. ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సువల్ల నాభార్య సావిత్రితో చనువుగా వుండటానికి భయపడు తుందనుకున్నాను. ఒకరోజు నా భార్యను మా దాంపత్య జీవితాన్ని గురించి ఏవేవో ప్రశ్నలు వేసిందట. ఆ విషయానికి నేను అంత ప్రాధాన్యత ఇవ్వలేదు."
"అర్ధరాత్రి ఆ అమ్మాయి మీ తలుపులు ఎందుకు కొట్టిందనుకున్నారు?"
"ఒంటరిగా వుండటానికి భయపడుతూందనుకున్నాను."
"ఆ విషయం తెల్లవారి మీ భార్యతో చెప్పారా?"
"చెప్పలేదు. ఆమె మరోలా అర్ధం చేసుకుంటే ప్రమాదం అని చెప్పలేదు"
భయంకరం తలవూపుతూ ఏదో ఆలోచించాడు ఓ నిముషం.
"ఒకటి చెయ్యాలి నువ్వు"
"చెప్పండి"
"ఆ సావిత్రిని నా దగ్గరకు తీసుకురావాలి."
రమణమూర్తి తృళ్ళిపడ్డాడు.
"ఆవిడవల్లే అనసూయ ఈ స్థితికి వచ్చింది. మరోసారి ఆవిడ పూర్తిగా పిచ్చిదే అవుతుంది."
భయంకరం చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వు రమణకి బాగా అనిపించలేదు. ఆయన నవ్వకుండా వుంటే బావుండు అనిపించింది.
"అలాంటి భయంలేదు. ఆవిడవల్ల వచ్చిన భయం ఆవిడ ద్వారానే పోగొట్టే ప్రయత్నం చేస్తాను."
"అది సాధ్యమా డాక్టర్?"
"సాధ్యమే"
రమణమూర్తి కళ్ళల్లో ఆశాకిరణం తలుక్కుమన్నది.
అంతలోనే సావిత్రిని ఎలా తీసుకురావడం అనే ప్రశ్న తల ఎత్తింది.
"ఆమె రావాల్సిందేనా డాక్టర్?"
"మీ ఆవిడ త్వరగా మామూలు స్థితికి రావాలంటే ఆమె రావాలి."
"ఆమె ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నది."
..............
కొంచెం ఆగి మళ్లీ అన్నాడు. "అసలు నామీద ఎందుకు అబద్ధాలు చెబుతుందో ఎంత ఆలోచించినా అర్ధంకావడం లేదు. నన్ను చూసి భయపడిపోతున్నట్టు నటిస్తుంది."
భయంకరం అదోలా నవ్వాడు.
వీడు నవ్వకుండా వుండకూడదూ అనుకున్నాడు రమణమూర్తి.
"ఆమె అబద్ధాలు చెప్పడం, ఆమె నటించడం లేదు."
రమణమూర్తి డాక్టర్ ముఖంలోకి అయోమయంగా చూశాడు.
"అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా?"
"ఆ విషయం తర్వాత తేలుతుంది. ముందు మీరామెని ఎలాగయినా తీసుకురండి. ఆమె తల్లిదండ్రులు కూడా తీసుకురండి. మీతో ఒంటరిగా రావడానికి ఆమె ఇష్టపడకపోవచ్చును"
"అలాగే ప్రయత్నిస్తాను."
"ప్రయత్నించడం కాదు. తీసుకురావాలి. ఇవ్వాళే విశాఖపట్నం వెళ్ళండి. మీ భార్యను మా నర్సింగ్ హోంలో ఉంచి వెళ్ళండి"
"అలాగే డాక్టర్ అనసూయతో చెప్పి..."
"వద్దు. ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. నిద్రపోతున్నది."
"వస్తాను డాక్టరుగారూ!"
"గుడ్! త్వరగా వచ్చేయండి."
రమణమూర్తి బయటికి వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిపోతున్న రమణమూర్తిని రెప్పవాల్చకుండా చూశాడు సైకియాట్రిస్టు భయంకరం.
16
భర్త సామాను సర్దుకుంటున్నాడు.
అనసూయ చూస్తూ నిలబడిపోయింది.
ఈమధ్య భర్తను ఏదడగాలన్నా భయంగానే ఉంటున్నదామెకు.
"అనూ నేను ఆఫీసు పనిమీద వైజాగ్ వెళుతున్నాను"
"నేను ఒక్కదాన్నీ వుండలేను భయంగా ఉన్నది."
"రఘు చెల్లెలు నీకు తోడుగా వుంటుంది. నేను వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటుంది. అరగంటలో వచ్చేస్తుంది" అన్నాడు రమణ.
"మళ్ళీ ఎప్పుడొస్తారు?"
"రెండురోజుల్లో వచ్చేస్తాను. పోనీయ్ నువ్వు కూడా రాకూడదూ?"
"రాను! రాను!" గబగబా అనేసింది.
రమణమూర్తి నిట్టూర్చాడు.
సావిత్రి తనతో వస్తుందా? తనను చూడగానే మళ్ళీ కథ ప్రారంభిస్తే? భయంకరం సావిత్రిని చూడాలంటాడేం? తన గురించి తెలుసుకోవడానికా.
రమణమూర్తి తనలో తనే అదేమాదిరిగా నవ్వుకున్నాడు.
ఆ నవ్వుచూసి అనసూయ భయపడింది.
బయటికి వచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంది.
రమణమూర్తి వచ్చేసరికి రామనాధం వసారాలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు.
రమణమూర్తి సాదరంగా ఆహ్వానించాడు.
"ఇప్పుడు ఎక్కడుంటున్నావ్?"
"హైదరాబాద్ లో"
"మళ్ళీ పెళ్ళి చేసుకున్నావా?"