ఇప్పుడు ఆమెను అలా పిల్చే ధైర్యం తనకు లేదు.
అలా పిలవడంవల్ల తను ఆమెను ఎగతాళి చేస్తున్నట్లుగా ఉంటుందేమోనని భయం.
తనకు ఆమె ముఖంలోకి తిన్నగా చూసే ధైర్యం కూడా ఈనాడు లేదు.
నలభై నిండిన ఆమె అరవై నిండుతున్నట్టుగా కన్పిస్తోంది.
దానికి కారణం ఎవరు ?
తనే ! తన అసమర్థతే !
కమిట్ మెంటు అంటూ మడికట్టుకొని కూర్చుని తను నిజంగా ఏమైనా సాధించాడా ?
తనూ కాలంతో పాటు, రచనల ధోరణి మారుస్తూ, చెత్త కథల పోటీలలో సైతం పాల్గొంటే తనకీరోజు ఈ బాధ ఉండేదా?
ఏంలేకపోయినా రచయితగా సంపాదించుకొన్న ఈగో మాత్రం తనకు మిగిలింది.
ఇంట్లో బియ్యం లేకపోయినా పట్టించుకోడు.
ఆడపిల్ల ఓణీలు చిరిగిపోయినయ్ అని భార్య చెప్పినా వినిపించుకోడు. అందుకే ఆమె అసలు తనకు ఇలాంటివి చెప్పదు.
విని తనేం చెయ్యగలడు ?
ఎవరి ముందుకెళ్ళి చెయ్యి చాచగలడు ?
ప్రాణ స్నేహితుల్ని కూడా అప్పు అడగలేడు.
ఒకప్పుడు తను బాగాఉన్న రోజుల్లో చాలా మందిని ఆదుకున్నాడు. అందులో చాలామండి ఇప్పుడు బాగానే ఉన్నారు.
తన పరిస్థితి తెలిసీ వాళ్ళు తనకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వరు.
తనకు మొహమాటం అని తెలుసు.
అందరూ తనకు మొహమాటం లేదనీ, ముక్కుకు సూటిగా వెళ్ళే వ్యక్తి అనీ అంటారు. అది నిజమే!
కాని డబ్బు దగ్గరే, నూట తొంభయ్ మందికి ఉండని విషయంలోనే, తనకు మొహమాటం!
మరి దీన్నేమంటారు?
హిపోక్రసీ కాదా ?
ఏమో ! తనకే తెలియదు.
అతని ఆలోచనలు మందగిస్తున్నాయి.
బుర్రలోని ధ్వనులు అలసిపోయాయి.
కాంపోజ్ పనిచేస్తోంది.
నిద్రలోకి జారిపోయాడు.
5
శివప్రసాద్ రచయిత అని వేరుగా చెప్పక్కర్లేదు.
దాదాపు పాతికేళ్ళకుపైగానే వ్రాస్తున్నాడు.
అతడు తన మేధను కరిగించి, ప్రతి రక్తంబొట్టునూ కార్చి వ్రాసిన రచనలతో ఎందరో డబ్బు చేసుకొన్నారు.
అతనికి నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోయింది.
మంచి కీర్తి కూడా వచ్చింది.
బాగా చదువుకున్నవాళ్ళ మన్ననలను ఈనాటికీ పొందుతూనే ఉన్నాడు.
ప్రసాద్ సాహిత్యాన్ని ఒక సామాజిక శక్తిగా గుర్తించి రచనలు చేశాడు.
శివప్రసాద్ ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే చిన్న చిన్న కథలు వ్రాయడం ప్రారంభించాడు.
కమ్యూనిస్టు పార్టీ కాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణాలో సాగిన పోరాటం, సాహిత్య సాంస్కృతిక సంచలనం ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. చాలా మండి రచయితలు ఆ పోరాటం ద్వారా ప్రభావితులై రచనలు చేశారు. దాదాపు అన్ని కళా రూపాలనూ విప్లవోద్యమ ప్రయోజనానికి విరివిగా వినియోగించుకోవడం జరిగింది.
ఆ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివాడు.
"మా భూమి, ముందడుగు" లాంటి నాటకాలను కాలేజీల్లో ప్రదర్శించి శివప్రసాదు నటించాడు.
ఫలితంగా బి.ఏ. మొదటి సంవత్సరంలోనే కాలేజీ నుంచి డిబార్ అయాడు.
అతను ఆళ్వారుస్వామి "ప్రజల మనిషి"ని ఎన్నోసార్లు చదివాడు.
ఉన్నవవారి "మాలపల్లి" అతడ్ని ప్రభావితం చేసింది. ఒక భక్తుడు భగవద్గీతను చదివినట్టు 'మాలపల్లి'ని ఎన్నోసార్లు చదివాడు.
గురజాడ, శ్రీశ్రీ ఆయనకు ఆరాధ్యులు.
భూస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక సాహిత్యాన్ని సామ్యవాదోన్ముఖంగా తీసుకెళ్ళి, తెలుగువాళ్ళ సాంస్కృతిక పురోగమనానికి దోహదం చేసిన ఉత్తమ సాహిత్య స్రష్ట కొడవటిగంటి కుటుంబరావు గారికి ఏకలవ్య శిష్యుడుగా మారాడు.
చలంలోని తిరుగుబాటు ధోరణిని ఆకళింపు చేసుకొన్నాడు.
గోపీచందు రచనలలోని పాత్రలను తన చుట్టూ చూశాడు.
సాహిత్య ప్రయోజనం "ఆనందం" అనీ, అదే సార్వకాలిక, సార్వజనీన, విశ్వజనీన ప్రయోజనం అని చెప్పేవాళ్ళను ఛాందసులుగా చూశాడు వాళ్ళను మానవ జాతికే శత్రువులుగా భావించాడు.
ప్రాచీన భారతీయ విమర్శకులందరూ దాదాపు 'నియతికృత' 'నియమరహిత' మైన 'ఆనంద నిష్యందత'ను సాహిత్య ప్రయోజనంగా భావించేవారు. అది కేవలం వారి భ్రమ మాత్రమేనని వాదించేవాడు.
రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు.
ఉద్యోగంలో ఉన్నప్పుడే అతను వివాహం చేసుకొన్నాడు.
పెద్దలకు ఇష్టంలేని వివాహం చేసుకొన్నాడు.
కులాంతర వివాహం, కట్నం లేకుండా చేసుకొన్నాడు.
ఫలితంగా తనవాళ్ళకు దూరం అయ్యాడు.
పెద్ద ఆర్భాటం లేకుండా స్నేహితుడి చెల్లెల్ని నలుగురు స్నేహితుల మధ్య ఐదు రూపాయల ఖర్చుతో పెళ్ళి చేసుకొన్నాడు.
కృష్ణవేణి అపురూప సౌందర్యవతి.
రూపానికి తగిన గుణం.