Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 36


    పెద్దగా చదువుకోకపోయినా భర్త ఆదర్శాలను అర్థం చేసుకోగల సంస్కారం ఆమెకుంది.

 

    ఆమెకు తన భర్త పెద్ద రచయిత కావాలని కోరిక. భర్తను ఏనాడు చీరెలకూ, నగలకూ వేధించలేదు.

 

    ప్రభుత్వ ఉద్యోగంలో అతనికి ఊఫైరాడటం లేదు.

 

    అది అతని ఆలోచనలకు కళ్లెం వేసింది.

 

    అతని కలానికి సంకెళ్ళు వేసింది.

 

    "రాణీ! ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకొంటున్నాను" అన్నాడు ఒక రోజు భోజనం చేస్తూ, భార్యతో.
    


    "చెయ్యండి !"

 

    అతను చివ్వున తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు.

 

    "మనస్పూర్తిగా అంటున్నావా?"

 

    "ఎందుకు సందేహం వచ్చింది ? ఎన్నో పాత్రలను వాస్తవ వ్యక్తులా అన్నంత సహజంగా సృష్టించిన మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారన్నమాట !" ఆమె కంఠం ప్రశాంతంగా పలికింది.

 

    శివప్రసాద్ సిగ్గుపడిపోయాడు.

 

    "సారీ, రాణీ!" అన్నాడు.

 

    ఆమె హాయిగా నవ్వింది.

 

    "నేను అదృష్టవంతుడ్ని !"

 

    ఆమె పక పక నవ్వింది.

 

    ప్రసాద్ అయోమయంగా భార్య ముఖంలోకి చూశాడు.

 

    ఎందుకు నవ్వుతోంది ?

 

    ఆమె చెప్పినదాన్ని తను నమ్మినందుకా ?

 

    అంటే - రాజీనామా చెయ్యడం ఆమెకు ఇష్టం లేదా ?

 

    "ఏమిటాలోచిస్తున్నారు ?"

 

    "ఎందుకు అలా నవ్వావు ?"

 

    "ఇదెప్పటినుంచి మీకు పట్టుకుందా అని నవ్వాను."

 

    "ఏమిటి ?"

 

    "అదృష్ట దురదృష్టాల మీద నమ్మకం."

 

    "ఓ - అదా?" గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు రిలీఫ్ గా.

 

    "జన్మతో వచ్చిన సంస్కార దోషం ! వీటిని నమ్మని వాళ్ళు చాలా మంది ఈ మాటల్ని ఉపయోగిస్తారు."

 

    ఆమె హాయిగా నవ్వింది.

 

    అతని మనసు వెన్నెల్లో విరగ బూసిన మల్లెపందిరి అయింది.

 

    "ఉద్యోగం మానేస్తాను. నా రచనల మీద వచ్చే పారితోషికం మనం బ్రతకడానికి చాలు. కాని ముందు ముందు నా రచనలకు డిమాండు తగ్గి...ఆర్ధిక ఇబ్బందులు వస్తే...నువ్వు నిలబడగలవా ?"

 

    ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు.

 

    "నా గుండె అంత బలహీనమైనదా ?" ఆమె ఎదురు ప్రశ్న వేసింది.

 

    ఆమె ముఖంలోకి చూశాడు.

 

    అదే ప్రశాంతత ! అదే ఆత్మ నిబ్బరం !

 

    ఆ రాత్రి ప్రసాద్ ఆదమర్చి నిద్రపోయాడు.

 

    తెల్లవారి ఆఫీసుకెళ్ళి రాజీనామా పత్రం రాసి ఇచ్చాడు.

 

    కొందరు స్నేహితులు అతనికి ఆ పని చెయ్యొద్దని హితబోధ చేశారు.

 

    ప్రసాద్ ఎవరి సలహానూ పట్టించుకోలేదు.


                                     6


    శివప్రసాద్ రచనలోనే తన కాలాన్నీ మనసునూ నిమగ్నం చేశాడు.

 

    సామాజిక అవగాహనతో సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రచనలు చేశాడు.

 

    కమిట్ మెంటూ, నిజాయితీ లేని రచయితల్ని సంఘద్రోహులుగా గాఢంగా నమ్మాడు.

 

    ఉపన్యాసాలలో అదే చెప్పాడు.

 

    తనకు తెలిసిన జీవితం గురించే రాశాడు.

 

    మైకాగని కార్మికుల గురించి వ్రాయడానికి వారి దగ్గర ఆరు నెలలు వారితో పాటు జీవించాడు.

 

    ఆ నవల సాహిత్య లోకంలో ఎంతో సంచలనాన్ని కలిగించింది.

 

    గతతార్కిక భౌతిక వాదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఈ దోపిడీ వ్యవస్థ మారితేగాని, పీడితుల సమస్యలకు పరిష్కారం లేదనే ఆలోచనా తరంగాలను పాఠకుల బుర్రల్లో రేకెత్తించిన ఘనత శివప్రసాద్ కు లభించింది.

 

    శ్రమ శక్తి ఎంత దారుణంగా దోచుకోబడుతుందో పెట్టుబడిదారి విధానంలో శ్రమ జీవుల మనుగడ ఎంత బాధాకరమైనదో ఆ నవలలో ఆవిష్కరించాడు.

 

    సాహిత్యం సాంఘిక చైతన్యంలో ఒక శాఖ అని అతని నమ్మకం.

 

    సజీవంగా ఉండటానికి మానవుడు ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరమో, సజీవమైన సంఘానికి చైతన్యం అంత అవసరం అని అతనికి తెలుసు.

 

    ఆ చైతన్యాన్ని కలిగించే రచనలే సమాజానికి ప్రయోజనాన్ని అందిస్తాయి.   

 

    చాలాకాలం అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడుగా ఉన్నాడు.

 

    అది రెండుగా చీలింది.

 

    అందులోనుంచి చీలిన మరికొందరు తీవ్రవాదులుగా మారారు.

 

    అతను సంఘాలతో సంబంధాలను వదులుకొన్నాడు.

 

    రచయితలు, ఒక ప్రయోజనాన్ని ఆశించి అవగాహనతో రాసే రచయితలు, మీ అవగాహన తప్పంటే - మీ అవగాహన తప్పని ఒకర్నొకరు దుమ్మెత్తి పోసుకోవడం అతనికి నచ్చలేదు.

 

    అతను స్వతంత్రంగా ఉంటూ ఎన్నో రచనలు చేశాడు.

 

    పీడితుల విముక్తి కోసమే రచనలు చేశాడు.

 

    క్రమంగా అభ్యుదయ రచయితలు పాఠకుల్ని ఆకర్షించడంలో అపజయం పొందసాగారు.

 

    గత పదేళ్లుగా సాహిత్యపు ట్రెండు మారిపోయింది.

 Previous Page Next Page