Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 34


    "అన్నీ కాదనుకో! మరి వచ్చే పోయే ఆఫీసర్లకు ఏం పెడ్తున్నామనుకుంటున్నావ్?" అన్నది కామాక్షమ్మ.

 

    సునంద విస్మయంగా కామాక్షమ్మ ముఖంలోకి చూసింది.

 

    "మరీ మా ప్రెసిడెంటుగారికి వచ్చే పోయే వాళ్ళ తాకిడి ఎక్కువయి పోయింది. వారానికి రెండుసార్లన్నా డిన్నర్లు ఇస్తూనేవుంటారు. మాటలా? ఎంత ఖర్చవుతుంది?" అన్నది ఒక యువతి కామాక్షమ్మను సమర్ధిస్తూ.

 

    "అదేమిటండీ? కోళ్ళను మహిళామండలికి సప్లై చేసింది. వచ్చేపోయే ఆఫీసర్లకు వండి వడ్డించమనా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది సునంద.

 

    "అమ్మాయ్! నువ్వింకా చిన్నదానివి. ఉద్యోగం కూడా కొత్త. అనుభవంలేదు. అందుకే నీకింకా ఏమీ తెలియదు" మరేమీ అడగొద్దు అన్నట్టుంది కామాక్షమ్మ ధోరణి.

 

    "మరి పోయిన నెల పంపించిన రిపోర్టులో అరవై గుడ్లుదాకా బాలింతలకూ, చూలింతలకూ, బాల్వాడీ పిల్లలకూ వండి పెట్టినట్టుంది?" ఆశ్చర్యంలో తల మునకలేస్తూ అన్నది సునంద.

 

    "మరి రిపోర్టు పంపించాలిగా? లక్ష్మికి అన్ని విషయాలు తెల్సు!"

 

    సునందకు అంతా అయోమయంగా వుంది. అంటే పోయిన నెల ముఖ్యసేవిక ఆదిలక్ష్మి పంపించిన రిపోర్టు ఫార్స్ అన్నమాట! అంటే అందరూ కలిసి తోడుదొంగల్లా.... ....ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో? ఎక్కడి కక్కడే దోపిడీ!

 

    "కనీసం కూరగాయలన్నా సరిగా పంచుతున్నారా?"

 

    గ్రామసేవిక డ్రాయర్ లోనుంచి, నలిగి మురిగ్గావున్న తెల్లకాగితాల పుస్తకం బయటికితీసి సునంద ముందు విసురుగా పెట్టింది. సునంద గ్రామసేవిక ముఖంలోకి చూసింది తీక్షణంగా.

 

    "సమితివారూ శాంక్షన్ చేసిన ఐదు వందల రూపాయల్తో, వంకాయలూ, బెండకాయలూ, ఆలుగడ్డలూ, సొరకాయలూ, పొట్లకాయలూ, టమాటాలు పండిస్తున్నాం! ప్రైమరీస్కూలు పిల్లల, బాల్వాడీ పిల్లల మధ్యాహ్నం భోజనానికి ఉపయోగిస్తున్నాం! పిల్లలు ఆరోగ్యంగా కళకళలాడుతూ వున్నారు" గ్రామసేవిక పాఠం అప్పజెప్పినట్టు గడ గడ మాట్లాడింది.

 

    కామాక్షమ్మ తల ఆనందంగా ఎగరేస్తూ, గ్రామసేవిక తెలివితేటల్ని మనసులోనే మెచ్చుకుంది.

 

    సెక్రటరీ, కొంతమంది ఆడవాళ్ళూ ముఖముఖాలు చూసుకున్నారు.

 

    "అయితే స్కూలుకు వెళ్దాం పద. గార్డెన్ చూస్తాను" అన్నది గ్రామసేవికతో సునంద.

 

    మీనాకుమారి తటపటాయిస్తూ నిలబడి పోయింది.

 

    "ఊఁ బయలుదేరు," సునంద ముందుకు కదిలింది.

 

    "గార్డెన్ స్కూల్లోలేదు. మన ప్రెసిడెంటుగారి పెరట్లో వుంది" అన్నది కొంచెం జంకుతూ మీనాకుమారి.

 

    "అదేమిటి? గార్డెన్ ప్రెసిడెంటుగారింట్లో వెయ్యడం ఏమిటి?" గద్దించింది గ్రామసేవికను సునంద.

 

    "అది అంతే!" సెక్రటరీ అర్ధయుక్తంగా, వ్యంగ్యంగా అంది.

 

    "నాకేం తెలుసూ? నన్ను కసురుకుంటారేం? నేను ఈ సమితికి వచ్చేటప్పటికే గార్డెన్ వారింట్లో వుంది" సాగదీసింది మీనాకుమారి.

 

    సునంద వ్యవహారం కామాక్షమ్మకు బొత్తిగా నచ్చలేదు. వళ్ళు మండిపోతూంది. అయినా తమాయించుకుంటూ అన్నది.

 

    "స్కూల్లో వున్నదంతా చవిటినేల, అందుకే మా పెరట్లో వేశారు. అగ్రికల్చెర్ వి.డి.ఓ., ముఖ్యసేవిక ఆదిలక్ష్మి, ఇద్దరూ ప్రాధేయపడితేనే ఒప్పుకున్నాను. దానికి కాపలా కాయలేక చస్తున్నాను. మాయదారి ఊరంతా దొంగలే!"

 

    "కుట్టుమిషన్లు కన్పించవేం?" అడిగింది సునంద.

 

    "రిపేర్ కిచ్చాం!" అన్నది గ్రామసేవిక తడుముకోకుండా.

 

    "మిషన్లా? ఒకటేగా ఇచ్చారు? అదీ ఎప్పుడూ పనిచెయ్య"దని అన్నది ఒకామె.

 

    "ఒకటేమిటి? మూడు మిషన్లుండాలి" అన్నది సునంద.

 

    "ఏమోనమ్మా ఎవరికిచ్చారో ఏమో! మేమయితే ఎరగం!" ఒక స్త్రీ సాగదీసింది.

 

    "ఒకటి కామాక్షమ్మగారింట్లో, మరొకటి గ్రామసేవిక గారింట్లో.... ఒకటి పనికిరానిది మాత్రం ఇక్కడ...." అన్నది సెక్రటరీ.

 

    కామాక్షమ్మ దిగ్గునలేచి నిలబడింది.

 

    "అబ్బబ్బ! ఒకటే కాకిగోల! అమ్మాయికి భోజనానికి టైం అయిపోయిందనే ఆలోచనన్నా లేదు. అది లేదూ__ ఇది లేదూ....అంటూ వచ్చినప్పట్నుంచి ప్రాణాలు తోడేస్తున్నారు....చేతులూ మూతులూ తిప్పుతూ...." కసురుకుంది కామాక్షమ్మ.

 

    "పదమ్మా! ఎప్పుడనగా బయలుదేరారో ఏమో! ఆలస్యం అయింది. భోజనం చేశాక అన్ని విషయాలూ వివరంగా మాట్లాడుకోవచ్చు!" ఆప్యాయత తెచ్చి పెట్టుకుంటూ సునందను ఆహ్వానించింది.

 

    "మీకెందుకండీ అంత శ్రమ! నా భోజనం నేను తెచ్చుకున్నాను" మర్యాదగానే కామాక్షమ్మ ఆహ్వానాన్ని తిరస్కరించింది.

 

    "ప్రెసిడెంటుగారు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఆఫీసరుగారు కూడా వస్తున్నారనుకున్నాం. ఆఫీసరుగారికి కోడిమాంసం అంటే చాలా ఇష్టం! అందుకే రెండు కోళ్ళను కోయించారు. మీరు భోజనానికి రాకపోతే అంతా వేస్టయిపోతుంది. ప్రెసిడెంటుగారు బాధపడ్తారు. ఈ ఊరు ఏ ఆఫీసరు వచ్చినా ప్రెసిడెంటుగారింట్లో భోజనం చెయ్యకుండా వెళ్ళడమంటూ జరగదు" అన్నది గ్రామసేవిక.

 

    సునందకు వళ్ళు మండిపోయింది. "ఈ రెండు కోళ్ళూ సమితి ద్వారా సఫ్లై చేసినవేనా?" అని అడగాలనిపించింది.

 

    "నిన్నటికి రెండు మిగిలివున్నాయ్! ఇవ్వాళ అవీ స్వాహా అయినాయ్ అన్నమాట!" సెక్రటరీ గొణిగింది.

 

    కామాక్షమ్మ సెక్రెటరీ కేసి చుర చుర చూసింది.

 

    "క్షమించండి కామాక్షమ్మగారూ! నాకు ఎవరింట్లోనూ భోజనాలు చేసే అలవాటు లేదు. నా భోజనం నేను తెచ్చుకున్నాను. నేను చుట్టంగా రాలేదు. ఉద్యోగరీత్యా వచ్చాను. నాపని చూసుకొని వెళ్ళిపోతాను" అన్నది సునంద.

 

    "ఇవ్వాల్టికి రండి. లేకపోతే చేసిందంతా....

 

    "నువ్వెళ్ళి తినిరా!" గ్రామసేవిక మాటల్ని మధ్యలోనే అందుకుని కసురుకుంది సునంద.

 

    గ్రామ సేవిక ముఖం ముడుచుకుంది.

 

    అంతమందిలో కామాక్షమ్మకు తల కొట్టేసినట్టే అయింది. ఏనాడూ, ఏ ఆఫీసరు, తన ఆహ్వానాన్ని ధిక్కరించలేదు. ఈ ముఖ్య సేవికకు ఇంత పొగరా! తనను అవమానిస్తుందా!

 

    రుసరుస లాడుతూ కామాక్షమ్మ బయటికి నడిచింది. కామాక్షమ్మ గ్రూపుకు సంబంధించిన ఆడవాళ్లు ఆమెను అనుసరించారు.

 

    "భోజనం చేసి త్వరగా రా! హరిజన కాలనీకి వెళ్ళాలి" అన్నది సునంద. వెళ్తున్న గ్రామసేవికతో.

 

    మీనాకుమారి తల ఊపి, కామాక్షమ్మను అనుసరించింది.

 

    వాళ్ళు వెళ్ళిపోగానే సెక్రెటరీ, ఆమె గ్రూపువాళ్లూ సునంద చుట్టూ చేరారు. అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పసాగారు. సునంద ఓపిగ్గా వింటూ కూర్చుంది.

 

    రొద చెయ్యని రోడ్డు రోలర్ లా రోడ్డు పక్కగా వెళ్తున్నా కామాక్షమ్మ, చుట్ట చుట్టుకుంటూ చూడకుండా దాటిపోతున్న భర్త వీరభద్రయ్యను చూసింది.

 

    "ఇదిగో? నిన్నే! నిన్నేనంటుంటే ఈ మనిషికి ఏ ధోరణి పడితే అదే! వినిపించుకోడు!" సునంద మీది కోపం భర్త మీద చూపించింది కామాక్షమ్మ.

 

    "సర్!" గట్టిగా కేకపెట్టింది మీనాకుమారి.

 

    వీరభద్రయ్య ఆగి వెనక్కు చూశాడు. భార్యనుచూచి వెనక్కు వచ్చాడు.  

 

    కామాక్షమ్మ ఆ ఊరి మహిళా మండలి ప్రెసిడెంటు అయాకనే వీరభద్రయ్య సర్పంచ్ అయ్యాడు. కామాక్షమ్మకు భర్త అంతటివాడు కావడానికి కారణం తనేనని గట్టినమ్మకం ఏర్పడింది. ఈ వూళ్ళో వీరభద్రయ్యకు సర్పంచ్ గా కంటే కామాక్షమ్మ మొగుడిగానే ఎక్కువ పరపతి వుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే వీరభద్రయ్యకు కూడా ఆ విషయం బాగాతెలుసు.

 

    "ఏంటట్టా బుర్రొంచుకుపోతావ్? ఇక్కడ కొంపలంటుకు పోతుంటేనూ?" రాగం తీసింది కామాక్షమ్మ.

 

    "ఏం జరిగిందేమిటి? మీరిద్దరే వస్తున్నారేం? ఆఫీసరూ, ఆ కొత్త ముఖ్య సేవికా ఎక్కడ? మనింట్లో భోజనానికి రావడం లేదా!"

 

    "ఆఫీసరు రాలేదు. ఆ కొత్త ముఖ్యసేవిక భోజనం చెయ్యదట మనింట్లో."

 

    వీరభద్రయ్య అర్ధంకానట్టు చూశాడు.

 

    "నీతులు మాట్లాడుతుంది. వచ్చినప్పటినుండి ఒకటే ఆరాలు. కూరగాయల్నుంచి కోళ్ళగూటిదాకా గుచ్చి గుచ్చి అడుగుతోంది" అన్నది కామాక్షమ్మ."ఊ! అంత మొనగత్తా?" గుర్రుమన్నాడు వీరభద్రయ్య.

 

    "సర్! నామీద రిపోర్టు రాస్తుందేమో_ నా ఉద్యోగం_?" భయపడుతున్నట్లు నటించింది మీనాకుమారి.

 

    "నీ ఉద్యోగం ఎవరు తీసేస్తారే నేనుండగా?"

 

    "నేను తల్చుకుంటే మీ ఆఫీసురమ్మనే ఏడు చెరువులు నీళ్ళు తాగించి ఆదిలాబాద్ అడవులు పట్టిస్తాను. ఇలాంటి ముఖ్యసేవిక నొకలెక్కా?" కోరమీసం దువ్వుతూ కౄరంగా నవ్వాడు.

 

    కామాక్షమ్మ మొగుడి ప్రతాపానికి ఉప్పొంగిపోతూ "దీన్ని వెంటనే ట్రాన్సఫర్ చేయించండి. మహా ఆరాలు తీస్తోంది" అన్నది.

 

    "అవును సర్, మళ్ళీ మన ఆదిలక్ష్మినే పోస్టుచేయించండి సర్!" అన్నది మీనాకుమారి.

 Previous Page Next Page