Previous Page Next Page 
పిపాసి పేజి 34


    ఈరోజు రాత్రి కూడా క్రితం రోజులాగేనే అవతలిగదిలో పడుకుంది. మధన్ రమ్మని బ్రతిమాలలేదు. మర్నాడు ఉదయం ఎవరి పనులలో వారు మునిగిపోయారు. మధన్ ఆఫీసుకి వెళ్ళిపోయాడు. సత్యం లేని కొరత ఆఫీసులో కొట్టొచ్చినట్టు కనిపించింది మధన్ కి. పని చెయ్యాలనిపించడంలేదు. ఎలాగో సాయంత్రం దాకా కూర్చుని గడియారం అయిదు కొట్టేసరికి బయటపడ్డాడు. ఇంటికి రాగానే రాధిక ప్రోగ్రాంకి బయలుదేరుతోంది. ఆమెకోసం కారు సిద్ధంగా వుంది. గబగబా ముస్తాబై రాధిక కారులో కూర్చుని వెళ్ళిపోయింది.    


    రాధిక ప్రవర్తనకి బాధతో నిట్టూర్చాడు మధన్. రాధిక ఒంటరిగా వెళ్ళిందన్న భయంతోనూ, అక్కడేమైనా ఆమెని గురించిన విమర్శలొస్తే అది విని ఆమె బాధపడుతుందేమోనన్న భయంతోనూ ఆమె రమ్మని పిలవకపోయినా ప్రోగ్రాముకి వెళ్ళాడు మధన్.  


    మధన్ ని చూడగానే కార్యకర్తలు ఎదురొచ్చి తీసుకెళ్ళి ముందుసీట్లో కూర్చోపెట్టారు. మరో పదినిమిషాలకల్లా ప్రదర్శన మొదలయింది. జానపద నాట్యంతో జనాన్ని ముగ్ధుల్ని చేసింది రాధిక. ప్రోగ్రాం అయిపోగానే యధాప్రకారం పత్రికలవాళ్ళూ, ఇతర సంఘాల ప్రతినిధులు ఎందరో ఆమెని చుట్టేశారు. వారిని దాటుకుని ముందుకువెళ్ళి "రాధీ..... పోదామా" అన్నాడు మధన్.       


    "మీకు పనుందన్నారు మీరు వెళ్ళండి. నేను వీళ్ళ కారులో వచ్చేస్తాను" అంది తడుముకోకుండా రాధిక.


    "ఫరవాలేదులే. అయిదునిమిషాల్లో ఇద్దరం కలిసే వెళదాం?"     


    "అయిదు నిమిషాలు కాదు కొంచెం ఆలస్యమవుతుంది. పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతున్నారు. మీ పనెందుకు పాడుచేసుకోవడం మీరు వెళ్ళండి నేనొచ్చేస్తాను" అంది.


    "అవును సార్ మీ పని పాడుచేసుకోకండి. మీరేం బెంగ పట్టుకోవద్దు. రాధికాదేవిగార్ని మేము జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాం" కార్యదర్శిగారు హామీ యిచ్చారు.  


    చేసేదేమీలేక వెళ్ళొస్తానని సెలవు తీసుకొని బయలుదేరాడు మధన్.


    రాధిక ఎందుకంత పంతానికి పోతోంది అంతుపట్టలేదు. ఎలాగయినా ఆమెకు నచ్చజెప్పి ఆమెకోపాన్ని చల్లార్చాలనుకుని ఎంత ప్రయత్నం చేసినా, విఫలుడవడంతో జరగబోయే పరిణామాలను ఊహించుకుని భయపడిపోతున్నాడు. కాసేపు చల్లగాలి పీల్చుకుందామని ఉపశమనం కోసం బీచ్ వైపు వెళ్లాడు. లోపల వేడితో ఉడికిపోతూన్న మనస్సుకి బయట వీస్తూన్న చల్లగాలి ఏ మాత్రం సంతోషం కలిగించలేదు. పైగా సముద్రాన్ని చూస్తూ వుంటే తన మనస్సులో చిందరవందరగా ఉన్న భావాలలాగే కెరటాలన్నీ అల్లిబిల్లిగా అనిపించాయి. చికాకుతో లేచి యింటి ముఖం పట్టాడు.


    లోపలికొస్తూన్న మధన్ కి హాల్లో కూర్చున్న రాధిక లేచి ఎదురొచ్చింది. ఆమె వెనకాలే ఒకావిడ వుంది, మధ్యవయస్కురాలు. చేతిలో హ్యాండ్ బాగ్, కళ్ళ జోడూ చూడగానే ఉద్యోగస్తురాలిలా అనిపిస్తుంది.


    "ఈమ మిసెస్ జానకీ రాఘవన్. చాలా బాగా పాడతారు. ఈ రోజు నా ప్రోగ్రాంకి ఈమె పాడారు. ఇకముందు నా ప్రోగ్రామ్స్ అన్నింటికీ ఈమె పాడతానంటున్నారు. అందుకే ఈమెని నాకు సెక్రటరీగా కూడా వుండమన్నాను, ఒప్పుకున్నారు. ప్రోగ్రాం వొప్పుకోవడం, ఆర్కెస్ట్రా చూసుకోవడం అవన్నీ ఈమె చూసుకుంటారు. నేను ప్రోగ్రాంకి ఇంత అని కొంత పర్సెంటేజ్ యిస్తానన్నాను. సరేనన్నారు. ఈమె భర్తకి పెరాలిసిస్ వొచ్చి ఒక కాలూ, చెయ్యీ పడిపోయాయి. ఒకబ్బాయీ, అమ్మాయీ చదువుకుంటున్నారు. ఈమె సంపాదన వలనే కుటుంబం నడుస్తోంది" గుక్క తిప్పుకోకుండా పరిచయం చేసింది రాధిక.


    ఏదో మత్తు కమ్మినట్టు రాధిక చెప్పేదేదో అర్థంకానట్టు యాత్రికంగా నమస్కారం పెట్టాడు మధన్ ప్రతి నమస్కారం చేసింది ఆమె. తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు మధన్.


    కాస్సేపటికి, ఆమె వెళ్ళిపోయాక మధన్ కూర్చున్న చోటి కొచ్చింది రాధిక. ఆమె చేతిలో పదిరూపాయల నోట్లు రెపరెపలాడుతున్నాయి. "ఇదిగో మిగతా డబ్బు" మధన్ చేతికిచ్చింది.


    సూటిగా కళ్ళలోకి చూశాడు మధన్. ఆ చూపులకి తట్టుకోలేక తలదించుకుని నేలచూపులు చూసింది రాధిక.


    "కూర్చో నీతో మాట్లాడాలి" అన్నాడు.


    "ఏమిటో చెప్పండి" కూర్చోకుండానే అంది.


    "ఏం కూర్చోవా?" కటువుగా అన్నాడు.


    "ఆజ్ఞాపిస్తున్నారా?"


    "అవును. ఆ అధికారం నాకుంది."


    "అధికారాలతో, ఆజ్ఞలతో ఆలుమగలజీవితాలు ఆనందం కావు."


    "అనురాగానికి, అభిమానానికి లొంగనప్పుడు, అధికారం ఆజ్ఞ వాటంతటఅవే చోటు చేసుకుంటాయి."


    అనురాగం, అభిమానం ఉన్నచోట, ఆదరణ, గౌరవం కూడా ఉంటాయని మరిచిపోకండి.


    "అది అర్థం చేసుకోవడంలో వుంది. అపార్థాలతో జీవితాన్ని నరకం చేసుకోవడం తెలివితక్కువతనం."


    "ఆత్మాభిమానాన్ని చంపుకుని, పశువులా బతకడం వ్యర్థం."         

 Previous Page Next Page