మరోసారి మాధవి ముఖంలోకి చూశాడు.
"అమ్మా! మాధవీ! నన్ను క్షమించు తల్లీ! మీ అమ్మనుకూడా!" అంటూ మాధవి శవంమీద తలను అశాంతిగా కుమిలి కుమిలి ఏడ్చాడు.
35
వేగుచుక్క వెల వెలబోతుంది. నీటిమబ్బులు విచ్చుకొని పరవళ్ళు తీస్తున్నాయి. కలువగట్టున జారిపోతున్న కాళ్ళను అదుపులోకి లాక్కుంటూ అరుంధతి యాంత్రికంగా నడుస్తూ రోడ్డు ఎక్కింది. కారు తలుపు బార్లాగా తెరుచుకొని ముందుసీట్లో పడుకొని నిద్రపోతున్నాడు డ్రైవరు. అరుంధతి కొద్ది క్షణాలు అలాగే నిలబడి, చిన్నగా డోర్ తట్టింది. డ్రైవరు మత్తుగా కళ్ళు తెరచి, ఆమెను చూడగానే ఒకసారి తల విదిలించుకొని కారు దిగాడు.
"అమ్మగారూ! ఒక్క నిముషం" అంటూ అరుంధతి ముఖంలోకి చూసి నివ్వెరపోయాడు. ఆ ముఖం తను ఎరిగిన ముఖం కాదు. పాలిపోయివుంది. ఆ ముఖంలో అహంకారం, గాంభీర్యం ఏమయిపోయాయి? ఆ కళ్ళలో ఆ చురుకుదనం, కరుకుదనం ఏవీ? చూసేవాళ్ళను హడలగొట్టే ఆమెలోని ఆ వ్యక్తిత్వం ఏమయిపోయింది? ఆమె చూపులు తేలిపోతున్నాయి. చెదిరిన ముంగురులు గాలిలో ఎగురుతున్నాయి. ఆమె అలాగే పొలాలమధ్య తుమ్మల్లో కరిగిపోతున్న చీకటికేసి చూస్తూ నిలుచుంది.
డ్రైవరు గబగబా రోడ్డుదిగి కాలువ వొడ్డున వచ్చాడు. కాలువ నీటిలో ముఖం, చేతులూ కడుక్కుని కండువాతో తుడుచుకున్నాడు. కారు స్టార్ట్ చేసి బయలుదేరాడు.
తెలతెలవారుతోంది. రైతులు టప టపలాడిస్తున్నాయి. గూటిలోని పిల్లలను ముక్కులతో గోముగా గీరుతూ నిద్రలేపుతున్నాయి. చల్లనినీటిగాలి అరుంధతి చెంపల్ని సున్నితంగా తాకుతూ ఆమె శరీరాన్ని జోకొడుతోంది. ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. కళ్ళలో ఇసుక పడినట్లు మెరమెరలాడుతున్నాయి. సముద్రాంతరాల లోతుల్లోంచి అప్పుడే విసిరివేయబడినట్టు, ఆమె మనసు అనుభూతిని పొందసాగింది. పీడకలనుంచి బయటపడినదానిలా నిట్టూర్చింది తొలకరి ఉడుకులు ధరించిన ప్రకృతి నాట్యం చేస్తూ సర్వజీవరాసుల్లోనూ కొత్తఆశలనూ, అనుభూతులనూ రేకెత్తిస్తూంది. అరుంధతి మగతగా, నీరసంగా కార్లోనే చేరగిలపడింది.
"అమ్మగారూ! అమ్మగారూ!" అరుంధతి భారంగా కళ్ళు తెరిచింది. "ఎందుకాపావ్?" అన్నట్టు డ్రైవరుకేసి చూసింది.
డ్రైవర్ ఓ లోటాతో నీళ్ళు పట్టుకొని మరోచేతిలో కాగితం ముక్కలో బొగ్గుపొడి పట్టుకొని నిలబడి వున్నాడు.
"అమ్మా! మొహం కడుక్కోండి. కాఫీ తీసుకొస్తాను." డ్రైవర్ మెల్లగా అన్నాడు. సౌమ్యంగా వున్న అతని కంఠంలో అంతకుముందు చూపించే అతి వినయం, అణకువా లేవు. అందుకు అలవాటుపడిన అరుంధతి డ్రైవర్ని ఎగాదిగా చూసింది. కారు రోడ్డుప్రక్కన చెట్టుక్రింద ఆగివుంది. ఎదురుగా రోడ్డు ప్రక్కన కాఫీకొట్టు కనిపిస్తోంది. లారీల వాళ్ళూ, బళ్ళవాళ్ళూ కూర్చొని కాఫీ తాగుతున్నారు.
"ఇప్పుడిదంతా ఏమీ అవసరంలేదు. బెజవాడ పోనియ్!" అంది బొగ్గుపొడికేసి, మురిగ్గా ఉన్న లోటాకేసి చూస్తూ.
"బెజవాడ చేరడానికి ఎంతకాదన్నా గంటన్నర పడుతుంది. చాలా నీరసంగా ఉన్నారు. నిన్నంతా ఏమీ తిన్నట్టుకూడా లేదు. నీళ్ళు పుక్కిలించండి! కాఫీ శుభ్రంగా తయారుచేయించి స్పెషల్ గా తెస్తాను." అనునయంగా అన్నాడు డ్రైవర్.
అరుంధతి పేలవంగా వున్న పెదవులమీద తొంగిచూసిన హాస్యరేఖల్ని అదుపులో పెట్టుకుంది. రోడ్డుపక్కన హోటలుముందు ఆగివున్న లారీల, రిక్షాల క్లీనర్లూ, డ్రైవర్లూ బొగ్గుపొడితో పళ్ళు తోముకుంటున్నారు. సీసాలోవున్న నీళ్ళతో ముఖాలు కడుక్కుంటుంటే అరుంధతికి అదో సరదాగా అనిపించింది. డ్రైవరు చేతిలోనుంచి బొగ్గుపొడి లోటా అందుకొని సీటు చివరకు జారగిలబడి పళ్ళు తోముకుంటూంది.
ఆమె ముఖం కడుక్కుని పమిటచెంగుతో తుడుచుకుంది. చల్లనిగాలి ముఖాన్ని తాకుతూవుంటే హాయిగా వుంది. హోటలు బెంచీలమీద కూచునివున్న పాటకజనాన్ని చూస్తూ "అదృష్టవంతులు! ఏ చీకూచింత లేనివాళ్ళు" అనుకుంది తన మనసులోని బరువు కొంత దించుకొనే ప్రయత్నంలో.
అంతలో ప్లేటులో ఇడ్లీలు పెట్టుకొని, అరిటాకు కప్పుకొని వచ్చాడు డ్రైవరు.
"ఇప్పుడే వాయి తీశారమ్మా! వేడివేడిగా వున్నాయి, తీసుకోండి."
అరుంధతి ముఖం పక్కకు తిప్పుకొని "అవన్నీ అవసరం లేదు. కాఫీ పట్రా!" అంది.
"ఆకులో పెట్టించు కొచ్చానమ్మా! చాలా నీరసంగా వున్నారు, కొంచెం ఎంగిలిపడండమ్మా!" ఆప్యాయంగా అన్నాడు డ్రైవర్.
అరుంధతి హృదయం ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎక్కడీ ఆప్యాయత? నిష్కామమైన ఈ ఆర్ద్రత ఎక్కడిది?
తల తిప్పకుండానే ఇడ్లీ ప్లేటు అందుకుంది. కళ్ళవెంట నీరు ఉబికింది. డ్రైవర్ చూడకుండా కళ్ళు తుడుచుకుంది. మనస్సు తేలికపడింది. ఆకుకింద కనబడుతున్న మురికి సత్తుప్లేటు చూడగానే కడుపులో తిప్పింది. ప్లేటుతీసి పక్కన పెట్టి ఆకు చేతిలోకి తీసుకుంది. అల్లంపచ్చడి అద్దుకొని వేడి వేడి ఇడ్లీముక్క నోట్లో పెట్టింది. జిహ్వకు రుచి తెలిసే స్థితిలో లేదు.
మరో అయిదు నిముషాల్లో కాఫీగ్లాసుమీద కప్పుగిన్నెను బోర్లాపెట్టుకొని డ్రైవర్ వచ్చాడు.
"స్పెషల్ గా చేయించానమ్మా! తాగండి, బావుంటుంది" అన్నాడు.
తనకేది బావుంటుందో ఇంతవరకూ చెప్పినవాళ్ళు లేరు. అతని అమాయకత్వానికి ఆమె నవ్వుకుంది. కళ్ళు పెద్దవిచేసి చూసింది. ఇడ్లీప్లేటూ, ఎంగిలిఆకులూ తీస్తూ "బాగుందామ్మా?" అన్నాడు.
అవునేమో అన్నట్లు ఆమె తల ఆడించింది. ఆమె కాఫీ తాగినంతసేపూ కారు వెనగ్గా నిలబడ్డాడు డ్రైవరు. ఆమె ఆలోచిస్తూ కాఫీ తాగుతూంది.
ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు! ఐదు సంవత్సరాలుగా ఐదు మాటలుకూడా తన ఎదుట నిలబడి మాట్లాడ సాహసించనివాడు- ఎన్ని మాట్లాడుతున్నాడు? కానీ అతని మాటల్లో, ప్రవర్తనలో ఎక్కడా తనంటే చిన్నచూపుగానీ, నటనగానీ లేవు.
ఖాళీగ్లాసూ, ప్లేటో తీసుకొని వెళ్తున్న డ్రైవర్ను చూసి అరుంధతి "చూడు!" అంది. అతని పేరేంటి? చప్పున గుర్తురాలేదు, "నువ్వు కాపీ తీసుకున్నావా?" అంది.
వెనక్కు తిరగకుండానే "ఇంకా లేదమ్మా!" అంటూ హోటలుకేసి వెళ్ళాడు.
కాఫీ తాగాక అరుంధతికి నరాల్లోకి సత్తువ వచ్చినట్టనిపించింది. మనసు బరువు దించినట్లనిపించింది. గతరాత్రి తాలూకు స్మృతుల్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూంది. డ్రైవర్ - అవును? అతని పేరు ఏమిటి? డ్రైవర్ అనే తను పిలుస్తుండేది. వాళ్ళకీ పేర్లుంటాయని ఏనాడూ తను ఆలోచించలేదు. అధాటుగా చూస్తే రౌడీలా కనిపించేవాడు. వాణ్ణి చూస్తేనే చిరాకువేసేది. ఎప్పుడైనా ఎదురుగా నిలబడితే అరికాలు మంట నెత్తికెక్కేది. అతని అతి వినయం చాటున క్రౌర్యం దాగివుండేది. అతనికేసి కన్నెత్తి తను ఏనాడూ చూడలేదు. ఆ అవసరమూ కలగలేదు. అతని మొరటు మొద్దు స్వరూపంలో ఇంత సహృదయత ఉన్నదా?
తను పుట్టి బుద్దెరిగిన తర్వాత తనకోసం నిష్కామంగా, నిండుమనసుతో బాధపడిన వాళ్ళు ఎవరూ లేరు. తండ్రికి తను రొమ్ములమీద కుంపటే! భర్త తనను ఓ పువ్వులా చూశాడు. ఆ పువ్వు నలగకుండా అందులోని మధువు తన స్వంతం చేసుకోవటానికే తనను అంత గౌరవించేవాడు. తననెప్పుడూ సౌమ్యంగా చూడలేదు. తండ్రీ-భర్త- ప్రియుడూ- ఈ ముగ్గురూ ఇవ్వలేనిదేదో ఈనాడు డ్రైవర్, అతని పేరు చలమయ్య....జ్ఞాపకం వచ్చింది; అతను ఇవ్వగలిగాడు. ప్రకృతిలో సహజంగా పురుషుడు స్త్రీకి ఇచ్చేదానికి భిన్నమయినదాన్ని దేన్నో ఇచ్చాడు. ఒక వ్యక్తి మరోవ్యక్తికి, ఒక మానవుడు మరో మానవుడికి ఇవ్వగలిగిందే అది. అదే గుణం మానవుణ్ణి మానవుడిగా నిలబెడుతుంది. అది ప్రతి మానవుడూ తోడిమానవుడికి ఇవ్వగలిగింది. అయినా అందరూ ఇవ్వనిది. అలాంటి సహృదయమే తనలాటిస్థితిలోవున్న స్త్రీలకు అవసరం. అలాంటి సహృదయతనే చలమయ్య తనకు ఇవ్వగలిగాడు. ఆర్ద్రత, కరుణ ,సానుభూతీ, మానవతా ఇంకా మనుషుల్లో పూర్తిగా లోపించలేదు. అవి ఈనాడు వరదలా వచ్చి తన్ను ముంచేస్తున్నాయి, ఆ వెల్లువలో తన మనస్సు తేలిపోతోంది.
డ్రైవరు చలమయ్య వచ్చి కారు స్టార్టు చేశాడు. ట్రంకురోడ్డుమీద కారు వేగంగా పోతూంది. పైరగాలి రయ్యిన వీస్తోంది. అరుంధతి కళ్ళు అరమూతలు వేసి సుషుప్త్యవస్థలోకి జారిపోయింది....
అరుంధతి నిర్మించిన ఆదర్శనగరంలో ఆ రోజు అంతా పండగ చేసుకొంటున్నారు.
వరంగల్, ఖమ్మం రోడ్డుకు దగ్గరలోవున్న తన ఏభయ్ ఎకరాల పొలంలో పాతిక కుటీరాలు నిర్మించబడినాయి- అన్నీ ఒకే సైజులో ఒకటిగానే కనిపిస్తున్నాయి. ప్రతి కుటీరంపైకి సొరతీగలూ, పొట్లతీగలూ పాకి వున్నాయి. హైదరాబాదులో ఉన్న తన ఇల్లు అమ్మి నాలుగు బావులు తవ్వించింది. వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కొన్నది. ఆవులు, గేదెలు, ఎద్దులు కొన్నది. పొలాన్ని మరమ్మత్తు చేయించింది. ఒక్కొక్క ఇల్లూ వెయ్యిరూపాయలతో కట్టించింది. నిరాశ్రయులూ, అనాధలూ, దిక్కూ మొక్కు లేనివాళ్ళూ దాదాపు రెండువందలమంది దాకా ఆదర్శనగరంలో ఆశ్రయం దొరికింది. ఇళ్ళస్థలమూ స్కూలూ వగైరాలకు పోగా మిగిలిన ముప్పయ్ ఎకరాల్లోను వ్యవసాయం చేస్తున్నారు. కూరగాయలూ, పళ్ళూ, ధాన్యం పండుతున్నాయి. శారీరక కష్టం చెయ్యగలిగినవాళ్ళు వ్యవసాయ పనులూ, మిగతావాళ్ళు పిల్లలను చూసుకోవటం ,వంట చెయ్యడం, పిల్లలకు చదువులు చెప్పటం మొదలైన పనులు చేస్తూవున్నారు. ఎవరు చెయ్యగలిగింది వారు చేస్తూ ఎవరిక్కావల్సింది వారు అనుభవించే హక్కు అందరికీ కల్పించబడింది .అరుంధతి అన్ని పనులను పరిశీలిస్తూ అందరి కష్టసుఖాలనూ కనుక్కుంటూ, అందర్నీ సమావేశపరచి ఉమ్మడి సమస్యల్ని పరిష్కరిస్తూ ఆదర్శనగర్ ను నిజమైన ఆదర్శాలతో నడుపుతూంది.
ఆ రోజు ఆదర్శనగర ఐదవ వార్షికోత్సవం. పిల్లలందరికీ తలంటు పోయించి కొత్తబట్టలు కట్టింది. ఆ నగరవాసులంతా ఉత్సాహంగా వార్షికోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. వార్షికోత్సవానికి బయటనుంచి ఎవర్నీ పిలవలేదు. అలా పిలిచే ఆచారమూ లేదు. అమ్మగారే ఆనాటి సభకు అధ్యక్షత వహిస్తారు. అక్కడ వాళ్ళంతా ఆమెను "అమ్మ" అంటూ వుంటారు. తర తమ భేదాలు మరచి, పిన్నలూ, పెద్దలూ- అంతస్తులు మరచి సమానస్థాయిలో, అన్ని హక్కులతో బతకాలని ఆమె చేసిన కృషి కొంతవరకు ఫలించిందనే చెప్పాలి. రెండు దశాబ్దాల క్రితం, రాజారావు తొలిసారిగా తన జీవితంలో ప్రవేశించిన రోజుల్లో అతని ఆశయాలూ, ఆదర్శాలు తన మనస్సును ఆకట్టుకున్నాయి.
రాజారావు వ్యక్తిగా ఆదర్శమూర్తిగా రూపొంది, పతనమైపోయాడు. అయినా ఒకప్పుడు అతను నమ్మిన ఆదర్శాలు మాత్రం స్థిరస్థాయిగా వుండేవేననే నమ్మకం ఆమెకు అణువణువునా బలపడిపోయింది. వాటికి రూపకల్పన తను ఉడతాభక్తిని చేయగలిగింది. తన ఆశ్రమంలో నైచ్యానికీ, క్రౌర్యానికీ తావు లేదు. ఉన్న ఆస్తి అందరిదీను. అనుభవించే హక్కు అవసరాన్నిబట్టి అందరికీ వుంది. స్వంత ఆస్తి, నాది, నేను అనే మమకారం పోయినకొద్దీ ఆదర్శ నగరవాసుల్లో మానసిక స్థాయీ, మానవత పెరిగాయి. రాజారావు ఇలాంటి సమాజ నిర్మాణం గురించి ఉద్రేకంగా మాట్లాడుతూ వుంటే, తను జీవితంలో అలాంటి సమాజాన్ని చూడగలుగుతుందా అని ఆలోచించేది ఆ రోజుల్లో. చూడాలని కలలు కనేది. తను కలలుగన్న నవ సమాజ నిర్మాణాన్ని తనే సృష్టించగలిగింది. తన జన్మకు రాహిత్యం కలిగినట్లే.
సభాప్రాంగణం అంతా అలంకరించబడివుంది. పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటూ వుంటే చూడముచ్చటగా వుంది. అరుంధతి పిల్లల మధ్యన తిరుగుతూ వారి ఆనందంలో పాలు పంచుకుంటూ తన్మయత్వం చెందుతూంది.
అల్లంత దూరంలో ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు. తన మనుమరాలు "సమత" చలమయ్య కూతురుతో బెలూన్ కోసం తగాదా పడుతూండటం చూసింది అరుంధతి. తన కూతురు చేతిలో వున్న బెలూన్ లాక్కుని సమతకు ఇచ్చి కూతుర్ని మందలించాడు చలమయ్య.
"ఆ అమ్మాయిగా రెవరనుకున్నావ్! అమ్మగారి మనుమరాలు! మనందరికీ బతుకుతెరువు చూపించిన అమ్మగారి కూతురిబిడ్డ. ఇక్కడ వుండేవన్నీ అమ్మగారివే. ఆమె సొమ్మే మనం తింటున్నాం. అమ్మగారిని ఎప్పుడు తిట్టకూడదు. సమతతో పోట్లాడకూడదు" ఇంకా ఏదో అనబోయి ఎదురుగా నిల్చునివున్న అరుంధతిని చూసి మానేశాడు. అంతవరకూ మౌనంగా నిల్చొని విన్న ఆమెకు గుండెల్లో బాకులు గుచ్చి ఎత్తినట్లయింది. తను ఆశించిన దేమిటి? సాధించిన దేమిటి?
"చలమయ్యా! నువ్వేమీ మారలేదు. నీకీ బానిసబుద్ధి పోలేదు. నిన్ను మార్చటం నా తరం కాదు. కనీసం ఇక్కడవున్న పిల్లల్నన్నా సమానంగా బతకనియ్! నీ ఆస్తుల అంతస్తుల బీజాలను ఈ పసికందుల గుండెల్లో నాటకు. ఇక్కడవుండే ప్రతి జీవి ఒక అంతస్తులోనే పెరగాలనీ, సమతా ధర్మాన్ని పాటించాలనీ నా ఆశయం. కృత్రిమమైన తారతమ్యాలనూ, హెచ్చు తగ్గులనూ కల్పించి పసి హృదయాలను కలుషితం చెయ్యకు. నాకు సమత ఎంతో నీ కూతురు సుజాత కూడా అంతే. నా బిడ్డను సమతా ధర్మాలు పాటించే నవ సమాజంలో పెంచాలనే నా ఉద్దేశ్యం. సర్వ మానవ కల్యాణమే నా బిడ్డ ధ్యేయంగా వుండాలి. ఈ పిల్లల జీవిత గమనాన్ని నువ్వు వక్రంగా తిప్పకు."
"అమ్మా! క్షమించండి. తరతరాలుగా నా రక్తంలో జీర్ణించుకుపోయిన భావాలను పెకలించివేయలేకపోతున్నాను. ఇకనుంచి తమ ఆదేశానుసారం నడుచుకోవటానికి ప్రయత్నిస్తాను" అన్నాడు చలమయ్య తలవంచుకొని.
"చలమయ్యా! ఇందులో నా ఆదేశం ఏమీలేదు. ఇది మనందరి ఆదర్శంగా వుండాలి. సరే, టైం అయింది నీ పని చూసుకో" అని అరుంధతి సమతనూ, సుజాతనూ చెరొక చేత్తో పట్టుకొని పూలమొక్కల దగ్గరకు తీసుకెళ్ళింది. రెండు పూలు తుంచి వాళ్ళ జడల్లో పెట్టింది.
"అమ్మా, మరి నువ్వో!" అంటూ ఓ పువ్వును ఆమె ముడిలో పెట్టటానికి ప్రయత్నిస్తున్న సమతను "ఇంకా నాకు పువ్వు లెందుకమ్మా!" అంటూ గుండెలకు గాఢంగా హత్తుకొంది.