Previous Page Next Page 
మరీచిక పేజి 34


    జ్యోతికి సత్యం ధోరణి అర్థం కాలేదు. అర్థం అయినంత వరకు కూడా నచ్చలేదు. ఎన్నోసార్లు నది దాటానంటాడు. పడవ నడిపే వాళ్ళుంటే తను కూడా ఎన్నిసార్లయినా నది దాటగలదు!"

 

    "ఊ! తెడ్డెయ్ బాబూ! నాతోపాటే సమానంగా వెయ్యాలి. కొండయ్య సత్యానికి హుషారిచ్చాడు. సత్యం పళ్ళు బిగించి అతి జాగ్రత్తగా, ఓ పక్క నుంచి కొండయ్య చేతుల్ని చూస్తూ నది నీటిలోకి తెడ్డు వేశాడు.

 

    "అద్గదీ అట్టానే లాగుబాబూ!"

 

    పడవ కొంత వేగాన్ని పుంజుకుంది.

 

    "ఏయ్? లాగూ! ఏయ్! లాగూ!" అంటూ కొండయ్య సత్యం వేసి నప్పుడే తనూ తెడ్డు వేస్తున్నాడు.

 

    "తపక్! తపక్!" సత్యం చేతిలోని తెడ్డునీళ్ళమీద కొట్టుకుని గాల్లోకి లేచింది. పడవ తిరిగిపోయింది. 'ఇంకా నయం తిరగబడలేదు' అనుకున్నాడు కొండయ్య.

 

    పడవ ప్రవాహ వేగానికి, వాలుకుపడి కొట్టుకుపోతూ వున్నది. పడవను తిప్పడానికి కొండయ్య ప్రయత్నించాడు. కాని సాధ్యం కాలేదు. వుధృతంగా వస్తున్న వరదకు అడ్డంగా పడవ తిప్పగల శక్తి కరిగిపోయిన కొండయ్య కండల్లో లేదు. తృళ్ళుతూ, పొర్లుతూ వస్తూన్న వరదలో, ఎగిరెగిరి ఉయ్యాలా జంపాలా ఆడుకుంటూ పడవ పరుగులు తీస్తూనే ఉన్నది.

 

    ప్రమాదాన్ని పసిగట్టిన సుందరం సత్యాన్ని హెచ్చరించాడు. అవసరం అయితే నీళ్ళలోకి దూకడానికి సిద్ధంగా వున్నారు.

 

    "కామ్రేడ్ ప్రతిభా! మీకు ఈతవచ్చా?" సుందరం అడిగాడు.

 

    జ్యోతి తల అడ్డంగా తిప్పి "రాదు" అన్నది.

 

    నిస్పృహతో చూసింది. సుందరం ఆ మాట అడిగాక జ్యోతి గుండెలు జారిపోయాయి. అంతవరకూ ధైర్యంగా ఉన్న జ్యోతి గుండెలు పట్టు తప్పాయి. ముఖం పాలిపోయింది.

 

    "అదేంటి సుందరం బాబూ!నది మధ్యకు వచ్చాక అమ్మాయి గారిని ఈతొచ్చా అనడుగుతారేంటి బాబూ! ఆ ముక్క పడవెక్కే ముందే అడగాలి" అన్నాడు కొండయ్య.

 

    సుందరానికి చాచి చెంపమీద కొట్టినట్టయింది. సత్యానికిమాట పెగల్లేదు. అమాయకుడైన కొండయ్య అడిగిన ప్రశ్నలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి జ్యోతికి. ఎన్నో ఎత్తుగడలతో వ్యూహాలతో విప్లవాన్ని విజయవంతంగా నడిపిన నాయకులు ప్రజలనుండి ఎంతో నేర్చుకున్నారని తను చదివండి. అది యధార్థం. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పడవను అడ్డం తిరక్కుండా తెడ్డువేసి ఆపుకుంటున్నాడు కొండయ్య. వీలయినంతలో పడవ మార్గాన్ని ఒడ్డుకేసి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

    "కొండయ్యా!"

 

    "బాబూ?"

 

    "ఏదైనా ప్రమాదం వస్తే ప్రతిభను ఒడ్డును చేర్చే బాధ్యత నీదే! అందుకే అడిగాను."

 

    "ఆ మాట వేరే చెప్పాలా బాబూ! నీటిమీద బతికే వోళ్ళం. నీటిమీద చేపలెంతో మేమూ అంతే! అమ్మాయిగారి పానానికి నా పేణం అడ్డుఏస్తా బాబూ!"

 

    కొండయ్య మాటలు వింటుంటే జ్యోతికి ఎక్కడో చదివింది గుర్తొచ్చింది.

 

    "విప్లవకారుడు నీటిలో చేపలా ప్రజల్లో వుంటాడు."

 

    "ఆ నమ్మకం నీమీద మాకెప్పుడూ వుంది కొండయ్యా!"

 

    ఉండబట్టలేకో, ఊరికే కూర్చోలేకో అన్నట్టు అన్నాడు కొండయ్య "పెతీబామ్మగోరూ! పెమాదం ముంచుకొచ్చినప్పుడు మామూలుకంటే దెయిర్యంగా వుండాలి. బెంబేలు పడిపోయేమో, పులినోట్లో తలకాయ మనకై మనమే పెట్టినట్టే అవుతుంది!" "కొండయ్యా నేనే భయపడటంలేదు." జ్యోతి కంఠంలో జీర పలకలేదు.

 

    "గంగా బవానమ్మలా పడవలో కూకున్నావ్! నీకేటి బయమమ్మా! సేమంగా ఒడ్డుకు చేర్తాంలే తల్లీ!"

 

    కొండయ్య మనసులో కోటి దేవతల్ని ప్రార్థించాడు.


                                       21


    పడవ ఒడ్డుకు చేరింది. ప్రతిభ పడవ దిగి ఒడ్డెక్కింది. ఆమె వెనక సత్యం, సుందరం దిగారు. కొండయ్య పడవను ఒడ్డుకు లాగాడు. పడవలోని సూట్ కేసు తీసుకున్నాడు. సంచి కన్పించలేదు. కృష్ణ కట్ట మీద చెట్టుకింద నిలబడ్డ ప్రతిభ దగ్గిరకొచ్చి సూట్ కేసు అందించాడు.

 

    "అమ్మాయిగోరూ! మీ సంచి జారి నీటిలో బడ్డట్టుంది!" అన్నాడు విచారంగా.

 

    "అవును! సంచి నీళ్ళలో పడటం నేను చూశాను. పడవ ఒరిగినప్పుడు పెట్టె మీదున్న సంచిజారి నీళ్ళలో పడిపోయింది!"

 

    "మీరు చూశారా? మరి చెప్పలేదేం తల్లీ!"

 

    "చెప్పినా చేయగలిగిందేమీ లేదని నాకు తెలుసు. పోతే పోయింది సంచి! మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చావ్!" ప్రతిభ కృతజ్ఞతను తెలియజేస్తూ అన్నది.

 

    "ఎంత గుండె నిబ్బరమమ్మా నీకు!" కొండయ్య అన్నాడు.

 

    "కొండయ్యా! ఇక మేం వెళతాం! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. పైగా ఎంతో దిగువకొచ్చాం! నడవాల్సింది చాలా ఉన్నది!" సుందరం కొండయ్య భుజం మీద చెయ్యివేసి అన్నాడు.

 

    'అలాగే బాబూ! క్షేమంగా వెళ్ళండి కృష్ణ పక్క గ్రామాల్లో మనుషులు మేలుకొనే వుంటారు. కట్టమీద కాపలాలు కాస్తూ ఉంటారు వరద తగ్గేదాకా! తొరగా ఎళ్ళిరండి!" అన్నాడు.

 

    సుందరం సత్యం కదిలారు. సూట్ కేసు అందుకొని "కొండయ్యా వెళ్ళొస్తా!" అన్నది జ్యోతి.

 

    "సత్యం బాబూ! అమ్మగారిపెట్టె" అన్నాడు కొండయ్య.

 

    "అవసరం లేదు కొండయ్యా!తేలిగ్గానే వుంది. నేను మోయగలను."

 

    సత్యం ఆగి పెట్టె అందుకోబోయాడు.

 

    "పర్వాలేదు. ఇవ్వండి!"

 

    "నా బరువు నేను మొయ్యగలను. నా విప్లవ జీవితం మరొకరికీ బరువు కాకూడదు!"

 

    కొండయ్య జ్యోతి ముందుకొచ్చాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

 

    "సీతమ్మ వారిలా వనవాసానికి వెళుతున్నావ్ తల్లీ! నీకు జయమవాలని గంగమ్మ తల్లికి మొక్కుకుంటానమ్మా!"

 

    "సీతమ్మవారిలా వనవాసానికి వెళుతున్నావ్!" తాతయ్య చెప్పిన రామాయణ గాథలూ, సినిమాల్లో చూసిన పుక్కిటి పురాణ కథలూ ప్రతిభ కళ్ళముందు కదలసాగాయి. పడవలో రాముడూ, సీతా, లక్ష్మణుడూ నది దాటించిన  గుహుడూ గుర్తుకొచ్చాడేమో కొండయ్యకు. సీతారామ లక్ష్మణులకు సేవలందించిన గుహుడితో తనను పోల్చుకున్నాడేమో? తనను సీత స్థానంలో చూస్తున్నాడా? సత్యం, సుందరం, రామలక్ష్మణుల్లా కనిపించారా కొండయ్యకు? గతితార్కిక భౌతికవాదానికి కట్టుబడిన విప్లవ జీవితాలకు సీతమ్మవారి పోలికేమిటి? రామలక్ష్మణుల ఉపమానాలేమిటి?

 

    కాని కొండయ్య అలా అంటున్నప్పుడు తను కరిగి ద్రవించి పోయింది. కొండయ్య చూపించిన ఆప్యాయతా, అనురాగం ఎంతో మానవత్వంతో కూడి ఉన్నది. కొండయ్య తనలోని స్పందనను తెలియజెయ్యడానికి సీత కష్టాల్ని గుర్తుకు చేసుకున్నాడు. తనను గుహుదుగా భావించుకొని ఉంటాడు. అవును కొండయ్య అంతకంటే వేరే పద్ధతిలో ఆలోచించలేడు. చెప్పలేడు. తరతరాలుగా కొండయ్యలాంటి వారికి ఈ సమాజం అందిస్తున్న విజ్ఞానమే అది. అంతకంటే మరోలా ఎలా చెప్పగలడు? మన కామ్రేడ్స్ ఈ మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేరు?

 

    కొండయ్యలాంటి వాళ్ళకు శాస్త్రీయ జ్ఞానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? సోషలిస్టు వ్యవస్థలోనే అది సాధ్యపడుతుంది. అంతవరకూ కోటానుకోట్లు కొండయ్యలాంటి వాళ్ళలో జీర్ణించుకుపోయిన కథలూ - గాథలూ - సాంప్రదాయాలూ - అలవాట్లూ- దేవుడూ - దెయ్యం- కులం, మతం ఈ ఫ్యూడల్ ధనస్వామ్య వ్యవస్థలోని అవకతవకలన్నింటినీ ఎలా తొలగించడం? ఇవి వాళ్ళ రక్తంలో నుంచి పోకుండా విప్లవ చైతన్యం మొలకెత్తదా? ఈ అవలక్షణాలు తొలగకుండా ప్రజలు జాగృతులు కాలేరా?

 

    ప్రతిభ బుర్ర వేడెక్కిపోతూ ఉంది. కామ్రేడ్ సుందరాన్ని అడిగితే? తొందరేముంది? సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలకు, పరిష్కారం తోచని ఎన్నో సమస్యలకు ముందున్న తన విప్లవ జీవితమే సమాధానాలనిస్తుంది. పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ముగ్గురూ కృష్ణానది కట్టదిగి చేలల్లో నడిచారు. మరో అరగంటలో ఓ డొంకలోకి వచ్చారు.

 Previous Page Next Page