Previous Page Next Page 
మానిని మనసు పేజి 32

                                                                                15
    ఆరోజు ఆదివారం.
    టిఫిన్ చేస్తూ "అనూ! నువ్వూ టిఫిన్ చేసి త్వరగా బయలుదేరు" అన్నాడు రమణ.
    అనసూయ చివ్వున తలెత్తి భయంగా భర్త ముఖంలోకి చూసింది.
    "ఏమిటి ప్రతిదానికీ అలా బెదిరిపోతావ్? ఇవాళ ఆదివారంగా, అలా బయటికి వెళ్దాం"
    అనసూయకు సావిత్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది.
    "అవును! ఆరోజు కూడా ఆదివారమే. చంద్రవదనను సింహాచలం తీసుకెళ్ళాడు. కొండమీది నుంచి తొయ్యాలనుకున్నాడు. వీలుపడలేదు. తెల్లవారేసరికి కిరోసిన్ ఆయిల్ మీద పోసి నిప్పు అంటించాడు."
    అనసూయ నుదురుమీద చెమట బిందువులు కన్పించాయి రమణకి.
    ఆమెను చూస్తూ జాలిగా నవ్వాడు.
    ఆ నవ్వుచూసి మరీ హడలిపోయింది అనసూయ.
    బయటికి తీసుకెళ్తాడట. ఎక్కడకు తీసుకెళతాడు. గండిపేటకు తీసుకెళతాడో ఏమో!
    "త్వరగా తెములు"
    "ఎక్కడికి గండిపేటకా?"
    రమణ భార్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
    ఎలా చూస్తున్నాడో. తను అర్ధం చేసుకున్నందుకు బిత్తరపోయాడు.
    "అలా ఎందుకనుకున్నావ్?"
    "మీ మొదటిభార్యను చనిపోయే ముందురోజు సింహాచలం తీసుకెళ్ళారటగా?"
    "అయితే?"
    "ఆమెను కొండమీదనుంచి తోసి చంపాలనుకున్నారు. ఇప్పుడు నన్ను ఉస్సేన్ సాగర్ లోకి తోసేసి చంపాలనుకుంటున్నారు."
    రమణమూర్తికి తల తిరిగిపోయింది.
    అంతలోనే కోపం వచ్చింది.
    కళ్ళు ఎర్రబడ్డాయి.
    "అనూ!"
    "ఔను! నీళ్ళల్లోకి నన్ను తోసి చంపేస్తారు. నేను రాను. నేను ఎక్కడికీ రాను. నేను మా అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతాను" పిచ్చిగా అరవసాగింది.
    "ఉప్ చిన్నగా! చుట్టుపక్కల వాళ్ళు వింటారు."
    "విననివ్వండి. మొదటిసారి జైలు తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకోలేరు."
    "అనూ!" అతని కంఠంలో మార్ధవం లేదు.
    "అవును! నన్ను చంపేస్తారు. నేను రాను" పిచ్చిగా అరుస్తూ పడిపోయింది.
    అతడు భార్యకు సపర్యలు చేశాడు.
    ఆమె కళ్ళు తెరిచింది.
    "నేను గండిపేట రాను..."
    "వద్దులే. డాక్టర్ దగ్గరకు వెళదాం."
    "నేను రాను. డాక్టర్ దగ్గరకని చెప్పి గండిపేట తీసుకెళతారు."
    "కమలకూడా వస్తుంది. ఆమెనుకూడా రమ్మన్నాను"
    "ఆమె వస్తుందా? అయితే డాక్టర్ తో ముందే మాట్లాడి వుంటారు, స్లో పాయిజన్ ఇంజక్షన్ ఇప్పిస్తారు."
    "నిన్ను నేను చంపుకోను అనూ! నువ్వు నా ప్రాణానివి..."
    "ఇంకా అనసూయ తయారైనట్టులేదే?" లోపలకు వస్తూ అంది కమల.
    "ఏమిటోయ్ ఇంత చిక్కిపోయావ్? మీ ఆయన బాధపడుతు చెబితే ఇంత చిక్కిపోయావని ఊహించలేకపోయాను. త్వరగా లే వెళదాం, ఆదివారం పన్నెండు తర్వాత డాక్టర్ వుండదు." అంది కమల.
    అనసూయ లేచి లోపలకు వెళ్ళింది.
    బట్టలు మార్చుకొని వచ్చింది.
    ముగ్గురూ ఆటోలో బయలుదేరారు.
    డాక్టర్ భయంకరం అనసూయను గదిలోకి తీసుకెళ్ళాడు.
    అర్ధగంట తరువాత బయటికి వచ్చాడు.
    "మీ మిసెస్ మెంటల్ అప్ సెట్ తో బాధపడుతోంది. మీకు వివాహం అయినప్పటినుంచీ ఇలాగే వుందా?"
    "లేదండీ. దాదాపు రెండు నెలలనుంచి"
    "నేను అడిగినదానికి మీరు నిజాయితీతో సమాధానాలు చెప్పాలి." అన్నాడు భయంకరం.
    "అలాగేనండీ."
    "ఆవిడలో ఏదో భయం చోటుచేసుకుంది. ఆ భయం అనేక అనుమానాలకు నిలయంగా మారింది. ఆవిడకు మీరంటే భయమా?"
    "రెండు నెలలనుంచి మాత్రమే. తనను నేను చంపేస్తానని భయపడుతోంది."
    "ఎందుకలా?" భయంకరం రమణ కళ్ళలోకి లోతుగా చూస్తూ ప్రశ్నించాడు.
    ........
    "మరి ఇప్పుడు ఇలాంటి భయం ఎందుకు ఏర్పడిందని మీరు భావిస్తున్నారు?"
    రమణ సావిత్రి వచ్చినప్పటినుంచీ జరిగిన ప్రతి సంఘటనా చెప్పాడు.
    భయంకరం ఆలోచనలో పడ్డాడు.
    "సావిత్రికి మీమీద అలాంటి అభిప్రాయం ఎందుకు కలిగింది?"
    "నాకు తెలియదు."
    "ఆ రోజుల్లో ఆవిడ మీతో మాట్లాడేదా?"
    రమణ సావిత్రి ఆరోజుల్లో ఎలా ప్రవర్తించేదో చెప్పాడు.
    "ఆ అమ్మాయి వచ్చి మీ తలుపు కొట్టిన సమయంలో నిజంగా మీ భార్య నిద్రపోతున్నదా?"
    "అవునండీ. మంచి నిద్రలో వుంది. నేనూ నిద్రలోనే ఉన్నాను. తలుపు చప్పుడుకు మెలుకువ వచ్చింది."

 Previous Page Next Page