Previous Page Next Page 
అనూహ్య పేజి 34

     "శుక్రవారంకదా....తాంబూలం తీసుకుని అక్షింతలు వేసి దీవించు" అని వంగి కాళ్ళకి నమస్కరించింది.
    ఏదో గిల్టీ పిలింగ్! 'ఏమని దీవించనూ? నన్ను పోలి బ్రతకమనా?' అనుకున్నాను.
    "ఎవరో ఇంటిదగ్గర డ్రాప్  చేసినట్లున్నారు. మీ కజినా?" ఉత్సుకతగాఅడిగింది సుమతి.
    ఎన్నో ప్రమాదాల నుండి, ఎంత మందినో తప్పించే చుట్టరికం 'కజిన్'! అబద్దం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. "మా ఫ్రెండ్ నా కాలేజ్ మెట్" అన్నాను.
     సుమతిఅదోలా చూడి "అదిగో....పూజ అయిపోయినట్లుంది. మా వారు  గంటకొడ్తున్నారు" అని హడావుడిగా వెళ్ళిపోయింది.
    వివేక్ తన్మయితో తిరిగితే ఈ లోకం పట్టించుకోలేదు. కానీ ఒక్క రోజుశరత్ చంద్రతో బయటికి  వెళ్ళోస్తే పనిగట్టుకుని  వచ్చి మరీ ప్రశ్నిస్తోంది!
    సారథి, సుమతి, బొంగరంమావయ్య, మామీ....వీళ్ళంతా రేపు  వివేక్ పక్షం నిలబడి 'ఔను ఆమెని వదిలేయ్యల్సిందే! మేం కళ్ళారా  చూశాం పరపురుషులతో తిరగడం ! అలాంటి ఆడదాన్ని ఏ భర్త మాత్రం భాస్తాడూ?' అనరూ!
    పక్క పోర్షన్ లో చాలా హడావుడిగా వుంది. ఉషా సుధాకర్ ల నవ్వూ, మ్యూజిక్ కలగలిపి వినిపిస్తున్నాయి. కేవలం ఆనందించటానికే పుట్టినట్లుగా  వుంటారు ఆ జంట!
    అందరూ  తమతమ పరిధుల్లో , పరిస్ధితుల్లో సర్దుకుని చాలా హాయిగా వున్నారు! మరి నేనో!!!
    ఫోన్  రింగ్ అయింది.
    ఇంత రాత్రి  ఎవరూ? బహుశా సమీర్ అయ్యుంటాడు అనుకుంటూ "హలో" అన్నాను.
    "అనూహ్యా" శరత్ చంద్ర  గొంతు.
    "సారీ .... ఇంత రాత్రి ఫోన్ చేయడం విజ్ఞత కాదు. కానీ... ఈ మనసుంది చూశావూ....ఒట్టి మూర్ఖపుది! మాట వినదు. ఈ రాత్రి  నీకు థాంక్స్ చెప్పకపోతే నా మాట విననంది" అన్నాడు.
    "థాంక్సా? ఎందుకూ?" అన్నాను.
    "ఈ రోజు నా జీవితంలో థ్రిల్లింగ్ గా గడిపిన రోజు! ఐ ఎన్ జాయ్ డ్ ఇట్ నీతో  కలిసివున్న క్షణాలు నెమరువేసుకున్నకొద్ది తియ్యదనం పెరిగిపోతోంది!"
    అదో లాంటి మత్తు  అతని గొంతులో.
    "మీలా మాట్లాడటానికి నేను కవిని కాను. కానీ  నాకూ బావుంది!" అన్నాను.
    "అనూహ్యా... హైద్రాబాద్ వస్తున్నప్పుడు నేనంత ఆనందంగా లేను. కానీ  ఇక్కడ  సెటిల్ అయినందుకు సంతోషపడ్తున్నాను" అన్నాడు.
    "మీరంత పొజిషన్ లో వుండి నాతో ఇలా మాట్లాడటం నాకూ గర్వంగా వుంది" అన్నాను.
    "నా పొజిషన్ ఏవిటో  నాకే ఇంకా  తెలీలేదు "
    "అంటే?" అర్ధంకాక అడిగాను.
    "అదే ఈసారి కలిసినప్పుడు తెలుసుకుందాం. బై.... గుడ్ నైట్!" అతను ఫోన్ పెట్టేశాడు.
    ఆలోచిస్తూ పడుకున్నాను.
    అతని మాటల్లో అంతరార్ధం ఏవిటీ? ఈ పరిచయం పర్యవసానం ఎలా వుంటుందీ?
    జీవితంలో చాలా పెద్ద మార్పులు రావడానికి ఓ గంటకాలం  చాలు! కానీ  వాటికి సర్దుకుని బ్రతకడానికి చాలా కాలం పడుతుంది.
    నా ప్రయత్నం పెద్దగా  లేకుండానే నా జీవితం కొత్త మలుపు తిరిగింది! శరత్ చంద్ర తో ప్రోగ్రామ్స్, సమీర్ తో  బాతాఖానీలూ, చిన్నచిన్న పార్టీలూ, మిడ్ నైట్ డిన్నర్లూ ఇప్పుడు కొత్తగా అనిపించడంలేదు.
    సమీర్ వారానికి...  రెండు మూడు సార్లు అయినా వచ్చి ఊదరగొట్టేస్తాడు. అంతా  జడివానలా హోరుగా వుంటుంది. ప్రతీదీ ఫాస్ట్ గా  వుండాలంటాడు. ఏమైనా అంటే నిమిషంలో చిన్నబుచ్చుకుంటాడు. చాలా సెన్సిటివ్! అతని బుంగమూతి చూస్తే నాకు జాలేస్తుంది. బ్రతిమాలి మళ్ళీ  మంచి మూడ్ లో పడేస్తాను.
    శరత్ చంద్ర  చాలా  బిజీగా  వుంటున్నాడు. అయినా  అప్పుడప్పుడూ ఫోన్చేసి పొయిటిక్ గా మాట్లాడుతుంటాడు. ఆపోజిట్ సెక్స్ వ్యక్తుల మధ్య పెరిగే స్నేహం ఇచ్చే థ్రిల్, సేమ్ సెక్స్ ల వారి మధ్య వుండదు!
    నేను ఈ ప్రవాహంలో ఎంతగా మునిగిపోయనంటే.....వివేక్, తన్మయితో కలిసి బోంబే వెళ్ళాడని తెలిసినా పెద్దగా బాధపడలేదు!
    విజయ  ఓ రోజున అడిగింది "నీ  బోయ్ఫ్రెండ్స్ ఏవంటున్నారూ?"
    "ఏవీ అనడంలేదు" అన్నాను.
    "ఎవరితోనైనా ఇన్ వాల్వ్ అయ్యావా?"
    నేను అదిరిపడి చూశాను.
    "సెక్సువల్ గా...." వివరిస్తూ అంది.
    "ఛ!" వేగటుగా ముఖంపెట్టి అన్నాను.
    విజయ ముఖంలో వెక్కిరింత కనిపించింది.
    "పవిత్రమైన స్నేహలా?" అంది.
    "విజయా?" కోపంగా చూశాను.
    "చూడూ! నీ జీవితం నీ ఇష్టం! కానీ ఏం చేస్తున్నావో కనీసం నీకైనా తెలియాలి! తెలిసి చేస్తే  సామాన్యంగా  ఏ ప్రమాదమూ వుండదు!"
    నేను కోపంగా "నేనేం తప్పు చేస్తున్నానని నాకు మీ అందరూ నీతులు చెప్తున్నారు? ఇలా వివేక్ కి  ఎన్నడైనా  చెప్పావా? నీ బోయ్  ఫ్రెండ్స్ విషయంలో నేనెప్పుడైనా కలగాజేసుకున్నానా?" అన్నాను.
    అది నవ్వి "నాకూ వివేక్ కి మేమేం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మాకు తెలుసు" అంది.
    ఆ మాటతో నాకు తిక్క రేగిపోయింది. "అక్కడికి మివి బలమైన వ్యక్తిత్వాలూ....నాది బలహీనమైన మనస్తత్వం అని నీ ఉద్దేశమా?" అన్నాను.
    "నీకు లోకంతెలియదు అనూ!" అంటూ విజయ జాలిగా చూసింది.
    ఆ చూపు నేను భరించలేకపోయాను. "మీరెవ్వరూ నా గురించి ఏనాడూ బెంగపడక్కరలేదు. ఏమొచ్చినా నేనే భరించుకుంటాను" పంతంగా అన్నాను.
    "వివేక్ తన్మయితో బోంబే వెళ్ళాడు తెలుసా?" అంది అడిగింది.
    "తెలుసు!
    "అయినా నీకు బాధగా లేదా?"
    "లేదు!"
    "ఉంది. కానీ నీ  చుట్టూ వున్న సరికొత్త ప్రపంచపు మోజులో పడి నువ్వా బాధని పట్టించు కోవడంలేదు అంతే!" అది లేస్తూ అంది.
    "రోజురోజుకీ విడిపోయే రోజు దగ్గరకోస్తోంది. అతనిగురించి నాకెందుకూ బాధ?" రోషంగా అన్నాను.
    "అతను గడుపులో గా  అతని పార్ట్నర్ ని చూసుకున్నట్లే వున్నాడు. మరి నువ్వో? అతని ప్లేస్ లో సూటబుల్ కేండిడేట్ ని సెలెక్ట్ చేశావా?" అడిగింది విజయ.
    నేనేం మాట్లాడలేకపోయాను.
    అది నా భుజంమీద చెయ్యివేసి "వస్తా " అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ నామదిలో పెద్ద అలజడి రేపి వెళ్ళిపోయింది.
    వివేక్ తాలూకు ఆలోచనలు  అప్పటిదాకా బిరడా  బిగించి పెట్టినట్లూ , ఒక్కసారిగా  మూత తీసినట్లూ బుస్సున బయటికి పొంగుకొచ్చాయి!
    ఈ గడువు తీరిపోగానే తన్మయిని పెళ్ళి చేసుకుంటాడు! వాళ్ళిద్దరూ ఆనందంగా  వుంటారు. మరి నేనో....మనసంతా కలచివేసినట్లు అయింది. ఆ టైమ్ లో సమీర్ ఫోన్ చేస్తే చాలా చిరాగ్గా అనిపించి, "తర్వాత మాట్లాడ్తాను" అని ఫోన్ పెట్టేశాను .
    పున్నమి విరగబడి నవ్వుతోంది అప్రయత్నంగా  అతని గదిలోకి అడుగు పెట్టాను అతను వాడే టవల్, షూస్, టైలు, బెడ్  అన్నీ తడిమాను.
    అలవాటైన ఆ పరిమళం ముక్కుకి తగలగానే, శరీరం చిగురాకులా కంపించింది.
    దిండులో మొహం దాచుకుంటే అతని మీసం ముఖం మీద గిలిగింతలు పెడుతున్నట్లే అనిపించింది. ఎన్నాళ్ళయిందీ అతని స్పర్శ దూరమై! ఏడుపొచ్చింది. ఇక శాశ్వంతంగా  ఈ స్ధానం తన్మయిది. అప్పుడిక నేను కళ్ళతో కూడా అతన్ని  చూసుకోలేను.
    రాత్రంతా ఒకటే పీడకలలు!
    తెల్లవారింది. ఎవరో లేపుతున్నారు. కళ్ళు తెరుస్తుంటే సూదులతో  గుచ్చుతున్నట్లు ఒకటే బాధ! ఒళ్ళంతా  నొప్పులు లోపలకీ ఎవరు రాగలరు? డోర్ లాక్  చేసుకునే పడుకున్నానే!
    "అనూహ్యా!" అని పిలుస్తున్న ఆ రూపం వివేక్ గా గుర్తించాను. ఎందుకో ఆ నిమిషంలో చాలా ఆనందం వేసింది. మరునిమిషం నేను తన బెడ్ మీద వున్నందుకు చాలా సిగ్గేసింది!
    "మై గాడ్! చాలా  టెంపరేచర్  వున్నట్లుంది!
    నేను నీరసంగా  కళ్ళుమూసుకున్నాను.
    అతను నా జబ్బమీద  చెయ్యివేశాడు.
    మరు నిమిషంలో సన్నని పోటుకి కళ్ళు తెరిచాను.
    అతను సిరెంజ్ బయటికి తీస్తూ "ఎప్పటినుండీ?" అడిగాడు.
   నాకు మాట్లాడాలనిపించలేదు. 'బోంబెలో బాగా ఎంజాయ్ చేశాచ్చావుగా! నేనెలా ఛస్తే నీకేం?' అని  అరవాలనిపించింది కానీ  ఓపిక లేదు నిస్సత్మనగా పడుకుని చూస్తూండి పోయాను.
    అతను హార్లిక్స్ కలిపి తీసుకొచ్చాడు.
    "వద్దు" అన్నాను.
    "ఆడవాళ్లకి అలకా, బ్రతిమాలించుకోవడం అనేవి ఎంత నేచురల్ థింగ్స్ అంటే, సమయా సమయాలు కూడా తెలుసుకోరు!" కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు.
    'ఏం? ఒక్కసారి నాకోసం  తాగు అంటే  ఇతడి సొమ్మేం  పోతుందీ? అదేతన్మయి అయితే ఇలాగే ప్రవర్తిస్తాడ?'
    నాకు ఏడుపోచ్చేసింది.
    "నేను హాస్పిటల్ కి  వెళ్తున్నాను ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి " టై నాట్ వేసుకుంటూ వచ్చి చెప్పాడు.
    ఈ ఒక్కరోజు హాస్పిటల్ కి  వెళ్ళడం మానేస్తే ఏం? అనిపించింది. కానీ అలా అనే హక్కు నాకెక్కడిదీ?
    "ఆఁ! అన్నట్లు.... ఓపిక రాగానే నీ రూమ్ లోకి మారితే మంచిది" అనేసి  వెళ్ళిపోయాడు.
    నేను సిగ్గుపడినంతా అయింది.
    ఛీ! నాకు  బుద్దిలేదు. అతను రాగానే అయినా లేచి వెళ్ళిపోవలసింది గుండె మళ్ళీ  బరువెక్కింది ఈ మనిషికి సున్నితంగా మాట్లాడడమే రాదా అసలూ?'
                                         

 Previous Page Next Page