Previous Page Next Page 
అనూహ్య పేజి 35


      
                                                        14 వవారం  సీరియల్  

   వివేక్ టీపాయ్ మీద పెట్టిన హార్లిక్స్ కప్పు చేతిలోకి తీసుకున్నాను. ఆరిపోయి తోరక కట్టివుంది. హార్లిక్స్ నాకు సయించదు. తోరకకడ్తే అస్సలు సయించదు. అయినా గటగటా తాగేశాను!
    మధ్యాహ్నం ఆస్పత్రినుండి సిస్టర్ లిండా ఫోన్ చేసి "ఎలా వుందీ? డాక్టర్ గారు కనుక్కోమన్నారు" అంది.
    "బావుంది" అనేసి బాధపడ్డాను. ఓసారి తనే చేస్తే ఏమవుతుందీ? గర్వం కాకపోతేనూ. సాయంత్రం బాల్కనీలో  కూర్చుని బాలమురళీ గాత్రం వింటూవుండగా సమీర్ వచ్చాడు. నాకు లేవడానికి కూడా ఓపిక లేదు. అక్కడినుండే "రా..." అన్నాను.
    స్కూల్లో ఎవరితోటో పోట్లాడివచ్చేసిన కుర్రాడిలా మొహం  ఎర్రగా పెట్టుకుని వచ్చాడు.
    "కాఫీ ఇచ్చే ఓపిక కూడా లేదు" అని నవ్వాను.
    "కాఫి వద్దుగానీ, ముందు ఓ ప్రశ్నకి సమాధానం  కావాలి!" కాస్త గట్టిగా అన్నాడు.
    "ఏవిటో?"
    "మీకు శరత్ చంద్ర చాలా క్లోజ్ ట కదూ!" నా ఎదురుగా కూర్చుని అడిగాడు.
    నేను తీవ్రంగా  చూస్తూ "ఎవరన్నారూ?" అన్నాను.
    "నా ఫ్రెండ్ ఒకడు మిమ్మల్ని అతనితో చాలాసార్లు చూశాడుట! అవాకులూ, చవాకులూ పేలాడు నేను ఊరుకోలేదు. మెత్తగా కొట్టాను" అన్నాడు.
    నేను కోపంగా ఏదో  అనబోయి అప్పుడే చూశాను అతని గెడ్డం క్రిందనుండి స్రవిస్తున్న రక్తాన్ని!
    "సమీర్... ఎందుకా తోదంరపాటూ?" అన్నాను.
    సమీర్ హఠాత్తుగా వచ్చి నా ఒడిలో తల దాచుకున్నాడు. "అనూహ్యా నేను భరించలేను. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను! అలాగే  మీరు  ఆ శరత్ చంద్ర తో  అరగడంకూడా నేను భరించలేకపోతున్నాను!" అన్నాడు.
    అనుకొని ఈ సంఘటనకి బిత్తరపోయాను. ఒడిలో వున్న అతని ముఖాన్ని ఎలా తప్పించాలో అర్ధంకాక "సమీర్.... ఏవిటిది? లే..." అని అరిచాను.
    "ఇంకెప్పుడూ ఆ శరత్ చంద్రతో తిరగనని మాటిస్తే లేస్తా!" అన్నాడు.
    నేను బలంగా అతన్ని ఒళ్లోనించి లేపి దూరంగా  తోస్తూ "అసలు నువ్వేం మాట్లాడుతూన్నావో నీకు  తెలుస్తోందా?" అన్నాను.
    "ఆఁ...బాగా తెలుస్తోంది నీకే తెలియటంలేదు నలుగురూ నాలుగురకాలుగా మాట్లాడుతుంటే!" అరిచినట్లు అన్నాడు.
    "ఇప్పుడు కాదు అతను నాకు కాలేజ్ డేస్ నుండీ తెలుసు" కోపంగా అన్నాను.
    "అయినా సరే నాకు ఇష్టంలేదు" అతను ఇంకా  గట్టిగా  అన్నాడు.
    నేను స్దాణువై పోయాను! ఎప్పుడూ  వివేక్ నోటమ్మట ఇటువంటి మాటలు ఒక్క సారి కూడా  రాలేదు!" ఇతనికెవరిచ్చారీ అధికారం?
    "సమీర్....మిమ్మల్ని  నేనో  ఫ్రెండ్ గా చూశాను అంతే! మీరు ఇంకా ఎక్కువగా బావిస్తున్నట్లున్నారు" వణుకుతున్న పెదవుల్ని  అదుపులోకి తెచ్చుకుంటూ సాధ్యమైనంత శాంతంగా అన్నాను.
    సమీర్ నా భుజాలు పట్టుకుని కదుపుతూ "కేవలం స్నేహమేనా? నేనంటే ఇష్టంలేదా? మరి నువ్వంటే నాకు ఇష్టమని  నేను చెప్తుంటే ఎందుకు ఊరుకున్నావు? నన్ను పిచ్చివాడ్ని చేసి నీ చుట్టూ ఎందుకు తిప్పుకున్నావు?...చెప్పు" అని అరిచాడు.
    బలహీనంగా వున్న నేను అతని పట్టునుండి విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ-
    "ఏవిటిది? నీకేమైనా పిచ్చిపట్టిందా? వదులు.... వదులు...." అని  గింజుకున్నాను.
    "అనూహ్యా.... వివేక్ వచ్చాడా?" అంటూ  బొంగరం మావయ్య లోపలికి వచ్చాడు. వస్తూనే  ఈ దృశ్యాన్ని పరమానందంగా చూడసాగాడు.
    నాకు సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది!
    సమీర్ చటుక్కున నా భుజాలు వదిలి పెట్టేశాడు.
    "గెట్ అవుట్" సమీర్ తో కోపంగా అన్నాను.
     సమీర్ తలవంచుకుని వెళ్లిపోయాడు.
    అతను వెళ్ళిపోయేదాకా ఆగి "నేను  చూసిన విషయం వివేక్ కి చెప్పనులే! అయినా అతని సంగతి అతను  చూసుకుంటున్నప్పుడు నువ్వు  మాత్రమేం చేస్తావు... ఉప్పు పులుపూ తింటున్న శరీరమాయె!" అన్నాడు  బొంగరం మామయ్య.
    "ఆపండి..." అతనివంక అసహ్యంగా  చూస్తూ  అరిచాను.  "మీరనుకుంటున్నట్లుగా ఇక్కడ ఏం జరగలేదు. అతను.... నా దృష్టిలో చిన్నపిల్లవాడు!"
    "కానీ లోకందృష్టిలో కాదు!" అన్నాడు.
     నేను  విసురుగా "మీకు  జవాబు  చెప్పే  అవసరం  నాకు లేదు. బయటికి  వెళ్లండి" అన్నాను.
    "ఇదంతా చూసినట్లు మర్చిపోవడం మరి కష్టమేనే?"
    ముసలాడు నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యబోతున్నాడని అర్ధమైంది "మరిచిపోలేకపోతే ప్రతి ఇంటి తలుపూ తట్టి చాటింపు వేయండి. లేకపోతే పేపర్లోవేయించండి. ముందు ఇక్కడి నుండి వెళ్లిపోండి. లేకపోతే మర్యాద దక్కదు" అని అరిచాను.
    ఆయన  నావైపు చూస్తూ అదోలా నవ్వి "ముందు నీ కోపం తగ్గనీ మళ్ళీ కలుద్దాం!" అనేసి వెళ్ళిపోయాడు. నేను జరిగిన సంఘటనని జీర్ణం చేసుకోలేక ఆ రాత్రంతా ఏడుస్తూనేవున్నాను.
    తెల్లవారి లేచేసరికి వివేక్ రూమ్ లో తన్మయి కనిపించింది! ఆమె  చాలా నీరసంగా కనిపించింది.
    వివేక్ ఆమెకి కొత్తపెళ్ళానికి చేస్తున్నట్లుగా సపర్యలు చేస్తున్నాడు! నిన్నటి అతని ప్రవర్తన గుర్తోచ్చేసరికి నాకు ఒళ్ళంతా సెగలూ, పోగలూగా మారింది.
    కాసేపటికి ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు.
    వాచ్ మెన్ వచ్చి ఉత్తరాల కట్ట పడేసి వెళ్లిపోయాడు. అవి తీసి లోపల పెడుతుండగా ఒకదానిమీద ఉషా సుధాకర్ అన్నపేరు కనిపించింది. ఆ కవర్ పట్టుకుని వాళ్ళ వాటావైపు నడిచాను. తలుపు తీసేవుండటంతో నేట్టగానే తెరుచుకుంది.
    "ఉషా...." అని పిలుస్తూ లోపలికి అడుగు పెట్టబోయాను.
    "ఆగు.... అగక్కడే సిగ్గులేదూ.... ఎప్పుడూ అదేనా? ఇంకో రంధి లేదా?" ఉష కంఠం ఖంగుమంది.
    నేను బొమ్మలా  గుమ్మంలోనే నిలబడి పోయాను.
    "ప్లీజ్....ఇంకొక్కసారి....మళ్ళీ వారందాకా  రాసుగా" సుధాకర్   కంఠం బ్రతిమాలుతున్నట్లుగా వుంది.
    "వారానికే అంత ఇదా?" ఉష కవ్విస్తోంది.
    "నీకేంతెలుసు? పెళ్ళయ్యాక బ్రహ్మచర్యం ఒక్క రాత్రికూడా నరకమే!"
    "ఇప్పుడే చీర కట్టుకున్నాను.... అబ్బా..... ఆగు .... తలుపు తీసేవుంది. వేసిరానీ"
    నాకు వాళ్ళున్న పరిస్ధితి అర్ధమై ఉత్తరం లోపలపడేసి రివ్వున వెనుతిరిగాను.
    "ఇప్పుడెవరైనా లోపలికి వచ్చేస్తేనో!" ఉషగొంతు సన్నగా వినిపిస్తోంది.
    "రానీ....పెళ్ళయినవాళ్ళైతే వెంటనే మూడ్ వచ్చి ఇంటికి పరిగెడ్తారు. పెళ్ళికాని వాళ్ళయితే పాపం...." సుధాకర్ ఏదో గుసగుసలాడాడు.
    "ఛీ....నీకస్సలు సిగ్గులేదూ!"
    "సిగ్గు పెళ్ళినాడే పోయింది. పెద్ద నీకున్నట్లూ.... ఏదీ చూడనీ...." అంటున్నాడతను.
    నేను పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చి  పడ్డాను. ఎంత వద్దనుకున్న వాళ్ల మాటలు పదేపదే చెవుల్లో గింగురుమంటున్నాయి!
    'పెళ్ళయ్యాక బ్రహ్మచర్యం ఒక్కరాత్రి కూడా  నరకమే....' అన్నసుధాకర్ మాట నిజమే! మరి వివేక్  హాయిగా  ఎలా  నిద్రపొగలుగుతున్నాడూ? ఆ ప్రశ్నకి జవాబుతట్టి దుఃఖం గుండెకి ఎగదట్టింది.
    'పెళ్ళయినవాళ్ళయితే వెంటనే మూడొచ్చి....'
    'అబ్బా!' గట్టిగా  చెవులు  మూసుకున్నాను. అయినా ఇంకా  వినిపిస్తున్నట్లే వున్నాయి.
    డోర్ బెల్ ఆగకుండా మ్రోగుతోంది.
    విసుగ్గా వెళ్ళి తలుపు తీశాను.
    ఎదురుగా సమీర్!
    నేను కోపంగా ఏదో  అందామనుకున్నాను.
    "ప్లీజ్ అనూహ్యా.... తలుపు  వేసెయ్యద్దు. నేను నా ప్రవర్తనకి చాలా  బాధపడుతున్నాను. నన్ను క్షమించండి కావాలంటే చూడండి రాత్రంతా నిద్ర లేదు" అర్దిస్తున్నట్లుగా అన్నాడు.
    నేను ముఖం చిట్లించి "రాత్రి మీ  ప్రవర్తన అస్సలు బాలేదు నాదేం ఎడాలిసెన్స్ కాదు పెళ్ళయినదాన్ని . ఏదో చిన్నతనం  అని ఇన్నాళ్లూ మిమ్మల్ని సీరియస్ గా తీసుకోలేదు!" అన్నాను.
     అతను లెంపలు వేసుకుంటూ "తెప్పే! ఇంకెప్పుడూ అలా చెయ్యను. సరేనా?" అన్నాడు.
    నేను జరిగి లోపలికి రానిచ్చాను.
    "ఆకలేస్తోంది" చిన్నపిల్లాడిలా అన్నాడు.
    "నేనేం వండలేదు" అన్నాను.
    "అయితే బయటికెళ్దాం" అన్నాడు.
    నేను చివ్వున  తలెత్తి  చూశాను.
    "ప్లీజ్....ఈ ఒక్క సారికీ క్షమించెయ్యమన్నానుగా.... నిన్నటినుంచీ ఏమీ  తినలేదు. ఈ రోజు  మీరు నన్ను  క్షమించి నాతో  రాకపోతే ఈరోజు కూడా  తినను!" జాలిగోలిపేటట్లు ముఖం పెట్టి అన్నాడు.
    "నాకు మూడ్  లేదు సమీర్ "అన్నాను.
    "సరే...రాకండి. రేపు ఉదయానీకల్లా సమీర్  వుండడు. ఇంకెవరూ మిమ్మల్నిలా  సతాయించరులెండి" ఆవేశంగా అంటూ లేచాడు.
    అతని ఆవేశం  చూస్తే నాకు  ఎందుకో భయం  వేసింది. ఆ అఘాయిత్యమైన  చేసుకోడుకదా! అనిపించింది. "వస్తాను.... రెండు నిమిషాలు ఆగు!" అని లోపలికి వెళ్ళి చీర  మార్చుకుని వచ్చాను.
    మేడమెట్లు దిగుతుంటే బాగా తల తిరుగుతున్నట్లు అనిపించింది. నేనూ నిన్నటినుంచి ఏమీ తినేలేదన్న విషయం నాకప్పుడు గుర్తొచ్చింది!
    అతని వెనకాల  హోండామీద వెళ్ళడం నాకు కొత్త కాకపోయినా, ఈ  రోజెందుకో అతని  డ్రైవింగ్ చూస్తుంటే భయమేసింది. కేవలం మేఘాల మీద ఎగురుతున్నట్లుగా తీసుకెళ్తున్నాడు! అప్పటికి అతని భుజంమీద తట్టి వేగం తగ్గించమని చెప్తూనే వున్నాను. అతను వినిపించుకోలేదు.
    పగలు ఆఫీసు టైమ్ కావడం మూలాన  రోడ్లన్నీ  హెవీ ట్రాఫిక్  తో వున్నాయి.
    కళ్ళు మూసి తెరిచేలోగా ఆ వ్యక్తి హోండా క్రింద  పడిపోయాడు. అంతా రక్తం! అది  చూడగానే నా కళ్ళు చీకట్లు కమ్మాయి అందరూ నా చుట్టూ చేరి నానామాటలూ అంటున్నారు.
    "ఏం కళ్ళు కనపడడంలేదా? వెనకాల ఆడపిల్ల వుంటే చాలు....భూమి కనిపించదు!" ఓ కానిస్టేబుల్ జనంలోంచి వస్తూ అరిచాడు.
    "ముందు అతన్ని  హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ఏర్పాటు చెయ్యండి ఖర్చు ఎంతైనా భరిస్తాం" కంగారు కంగారుగా అన్నాను.
    "అలాగే....ముందు మీరిద్దరూ స్టేషన్ కి రావల్సివుంటుంది!" అన్నాడు కానిస్టేబుల్.
    సమీర్ వైపు చూశాను.
    ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి.
    టెన్షన్ తో గడ్డకట్టుకుపోయినట్లుగా వున్నాడు. నావైపు భయంగా  చూశాడు.
    "మేం స్టేషన్ కి వస్తున్నాం.... ముందు అతన్ని హాస్పిటల్ కీ తీసు కెళ్ళండి" దైర్యంగా చెప్పాను.
    జనం తలో మాటా అంటూనేవున్నారు.
    "ఏవైందీ?" ఎవరో కారు హరన్ కొడ్తూ విసుగ్గా అడుగుతున్నారు.

 Previous Page Next Page