Previous Page Next Page 
అనూహ్య పేజి 33

                                      13 వవారం  సీరియల్  

 

"భగవంతుడా నాకో  బోయ్ ఫ్రెండ్ ని వెదకిపెట్టు, అని కానీ  ప్రార్దించావా కొంపదీసి!" అంది డ్రైవ్ చేస్తూ విజయ
    నాకు మాత్రం చాలా థ్రిల్లింగ్ గా, అంత వింతగా,  ప్రపంచం సరి కొత్తగా మారినట్లు అనిపిస్తోంది. 'అమ్మమ్మ దగ్గరకు ఊరెళ్తున్నను అని చిన్నప్పుడు అనుకోగానే ఇలాగే అనిపించేది!'
    "పాపం నువ్వంటే ఇప్పటికీ ఇంట్రెస్టువున్నట్లుంది" అంది విజయ. నేను మౌనంగా వణికే చేతుల్ని చూసుకుంటూ కూర్చున్నాను.
    "ఏవిటలా అయిపోయావు?" అడిగింది విజయ.
    "ఇలా రాకుండా వుండివుంటే బావుండేదే!" అన్నాను.
    "జీవితాన్ని  ఆనందించాలి. దాన్ని చూసి భయపడి పారిపోకూడదు! ఇప్పుడేమైందనీ?
    అతని పరిచయం స్నేహంగా మారడం ఇష్టం లేకపోతే, చిన్న చిరునవ్వుతో 'సారీ...ఐ హేవ్ నో ఇంట్రెస్ట్ ' అనేసేయ్ అయినాసరే నువ్వే కావాలి అని  వెంటపడటానికి నువ్వేం బాలనాగమ్మన్నీ, అతను మయలపకిరూ కాదు!" అంది.
    అది కరుగ్గా  చెప్పినా నిజాలే చెప్తుంది.
    ఆ రాత్రి ఫోన్ మోగినప్పుడల్లా ఉలిక్కి ఉలిక్కి పడ్డాను. రెండుసార్లు వెళ్లి వివేక్ ని " నాకేనా?" అని అడిగేశాను కూడా!
    అతను వింతగా చూశాడు.
    ప్రొద్దుట లేచి నేను  కాఫీ కలుపుతుంటే, వివేక్ గుమ్మందగ్గరకి వచ్చి" నువ్వు ఎదురుచూస్తున్న  ఫోన్   వచ్చింది" అన్నాడు.
    నేను అదిరే గుండెల్ని చేత్తో పట్టుకొన్నట్లుగా ఓసారి గాలి పిల్చివదిలి, నెమ్మదిగా  హాల్లోకి వెళ్లాను. ఫోన్ తీస్తుంటే చెయ్యి వణికింది. బావిలోంచి మాట్లాడుతున్నట్లుగా "హలో!" అన్నాను.
    "హాయ్ ! నేను సమీర్ ని... గుర్తుపట్టారా? పరిచయం కాగానే నా రక్తం  కళ్ళజూశారుగా.... జ్ఞాపకం వుండే  వుంటాను. నిన్నంతా ఫోన్ చేస్తూనేవున్నాను...ఎక్కడికి వెళ్లారూ?" ఆపకుండా  మాట్లాడేస్తూన్నాడు.
    నేను తేలికపడ్డ హృదయంతో" ఓ సమీర్ ! మీరా? ఇప్పటికైనా మీ నెంబర్  చెప్తారా?" అన్నాను.
    "చూశారా...నేను ఉట్టి పూల్ ని, ఈడియట్ ని.... అసలు మొన్ననే మీకు నెంబర్  ఇచ్చివుండాల్సింది. సరే....వ్రాసుకోండి..." అని నెంబర్ చెప్పాడు.
    నేను వ్రాసుకున్నాను.
    అతను చాలాసేపూ కామా, పుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతూనేవున్నాడు. చిన్నపిల్లలు  సినిమా చూసొచ్చి ఆగకుండా కథ చెప్తుంటే వింటున్నట్లుగా వింటూ కూర్చున్నాను.
    "అనూహ్యా.... మీతో చాలా మాట్లాడాలి. ఎప్పుడు కలుసుకుందాం?" అడిగాడు.
    ఇంకా  అతని దగ్గర సంగతులు మిగిలివున్నందుకు నాకు ఆశ్చర్యం వేసింది.
    "సాయంత్రం మా ఇంటికి  రండి" అన్నాను.
    "రీయల్లీ! నిజంగా ఇన్వైట్ చేస్తున్నారా?" ఎక్సైట్  అయిపోతూ అడిగాడు.
    "ఔను...ఏం?"
    "ఓ....ఏమీ నా భాగ్యము? తప్పకుండా వస్తా... కాస్కోండి" అన్నాడు.
    నేను నవ్వి "బై" ఫోన్ పెట్టేశాను. లేచి లోపలికి రాబోతూ  ఫోన్ వైపు  చూశాను మనసు ఎందుకో ఓ నెంబర్ డయల్ చెయ్యమని  పోరుతోంది.లేచినదాన్నే  మళ్ళీ కూర్చున్నాను 'వద్దు' అనుకున్నాను. 'చెయ్యి ....ఏం కాదు' అంది  మనసు.
    నెమ్మదిగా  పుస్తకం  చూసి  శరత్ చంద్ర  నెంబర్ డయల్  చేస్తుండగా వివేక్ వచ్చాడు.
    "కాఫీ...." అని "ఓ సారీ ....క్యారీ ఆన్..." అని వెళ్ళిపోయాడు.
    అవతలివైపు ఫోన్ లిప్ట్ చేసి శరత్ చంద్ర "హలో....హలో....హలో" అంటున్నాడు.
    నేను మౌనంగా క్రెడిల్ చేసేశాను. అనుకున్నవి అన్నీ అందరూ చెయ్యలేరు!
    మధ్యాహ్నం సూపర్ మార్కెట్ కి వెళ్ళి సరుకులు కొనుక్కుని  బయటికి వచ్చి ఆటోకోసం చూస్తూ  నిలబడ్డాను.
    నా పక్కనే  ఆగిన కారుని నేను చూడలేదు.
    "హలో.... మే ఐ హెల్ప్ యూ!" అన్నాడు విండో లోంచి శరత్ చంద్ర.
     నేను విస్మయంగా  చూశాను.
    "నేను మీ ఇంటికి వెళ్ళాను. సూపర్ మార్కెట్ కి వెళ్ళినట్లు పక్కింటావిడ చెప్పింది. నా లక్  పరీక్షించుకుందామని ఇక్కడ వెదికాను. దొరికారు సో... ఐయామ్ వెరీ లక్కీ అన్నమాట!" అన్నాడు.
    నేను  బిగుసుకుపోయి అలాగే నిలబడ్డాను.
    "కార్లో ఎక్కడం ఇష్టంలేకపోతే వద్దులెండి" అన్నాడు శరత్ చంద్ర అదోలా.
    "అబ్బే... అలాంటిదేం లేదు" అన్నాను.
    అతను ఫ్రంట్ డోర్ తీసి  పట్టుకున్నాడు.
    నేను ఎక్కి కూర్చున్నాను.
    "అనూహ్యా...నేను మిమ్మల్ని బాధపెడ్తున్నానా?"
    "నో....అలాంటిదేం లేదు"
    అతను కారు ఓ ఖరీదైన రెస్టారెంట్ ముందు  ఆపాడు. నేను ఇబ్బందిగా చూస్తూ  "ఎందుకూ? ఇంటికి వెళ్ళిపోదాం" అన్నాను.
    "ఇంటినుంచేగా వస్తున్నాను. మరోసారి వస్తాను. ఇప్పుడు  హొటల్ లో కాఫి తాగించండి" అన్నాడు.
    నాకు అతని వెంట వెళ్ళక తప్పలేదు.
    అతనితో నడుస్తూవుంటే మొదటిసారిగా  అడుగులేస్తున్నంత భయంగా అనిపించింది.
    మేం ఇద్దరం చివరగా వున్న టేబుల్ దగ్గర కూర్చున్నాం. అందరూ మా వంకే చూస్తున్నారు!
    ఒకతను లేచి మా దగ్గరకి  వచ్చి "మీరు శరత్ చంద్ర గారు కదూ!" అన్నాడు.
    శరత్ చంద్ర హుందాగా తలఊపాడు.
    "మీ ఆటోగ్రాప్ కావాలి సార్! నేను మీ  అభిమానిని" అన్నాడతను.
    శరత్ చంద్ర  అతనికి ఆటోగ్రాప్ తో ఏవో రెండు వాక్యాలు కూడా రాసిచ్చాడు ఇందతా  చూస్తున్న నాకెంతో తమాషాగా  అనిపించింది.అతని తర్వాత ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా  వచ్చి అతని దగ్గర ఆటోగ్రాఫ్ లు అడిగి తీసుకున్నారు.
     శరత్ చంద్ర నాతో "సారీ అనూహ్యా.... నీకిదంతా న్యూసె న్స్ లా వుండివుంటుంది!" అన్నాడు.
    "నో...నో... క్వైట్ ఇంట్రెస్టింగ్! కారీ ఆన్" మనస్పూర్తిగానే అన్నాను. ఐడెంటిటీ అనేది  ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో నాకు బాగా తెలుసు! పావులారిటి ఒకవరం అని నా అభిప్రాయం.
    "సాయంత్రం కళాభవన్ లో ఒక ప్రోగ్రామ్ వుండి రాగలరా?" అడిగాడు  నేను  వెంటనే సమాధానం చెప్పలేనట్లు వుండిపోయాను.
    "బలవంతం ఏం లేదు" అన్నాడు.
    "ఎన్ని గంటలకి?" అడిగాను.
    "5.30కి. వస్తానంటే వచ్చి  పికప్ చేసుకుంటాను" అన్నాడు శరత్ చంద్ర.
    "అఖ్ఖర్లేదు నేనే వస్తా" అన్నాను.
    శరత్ చంద్ర కాఫీ సిప్ చేస్తుండగా "ఓహ్....ఇంకోడోస్తున్నడు..... మళ్లీ ఆటోగ్రాఫ్ అనుకుంట" విసుగ్గా అన్నాడు శరత్.
    "అభిమానులని విసుక్కుంటే ఎలా?" నవ్వుతూ అన్నాను. అప్పటికే నాకు అతనితో కాస్త చనువు వచ్చేసినట్లు  నాకు తెలిసింది.
    అతను వచ్చి శరత్ చంద్రతో మాట్లాడలేదు. నాతో మాట్లాడాడు.
    "హలో అనూహ్యా.... హౌ ఆర్ యూ?" అన్నాడు.
    అతను సారథి! నాతో  మాట్లాడ్తూ శరత్ చంద్రాని నిశితంగా పరీక్షిస్తున్నాడు.
    హల్లో "అన్నాను.
    "మిమ్మల్ని చూసి వివేక్ వచ్చాడేమో అనుకున్నా. సారీ ....వస్తా....బై" అని  వెళ్ళిపోయాడు.
    "వివేక్ మీ హజ్బెండా?" అడిగాడు శరత్ చంద్ర.
    నేను తలఊపాను ఎందుకో  వివేక్ గురించి ఏదైనా  చెప్పాలనిపించింది. "వివేక్ డాక్టర్. చాలా బిజీ ప్రాక్టీసు అతనిది" అన్నాను.
    "ఆర్ యూ హేపీ విత్ హిమ్ "సడెన్ గా అడిగాడు శరత్ చంద్ర.
    "ఆఁ...ఆఁ..వెరీ  హాపీ" అనేశాను.
    "గుడ్" అని, "దెన్....లెట్స్ మూవ్" అతను లేచి  నిలబడ్డాడు.
                                  *        *        *
    ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి పొద్దు పోయింది! రాత్రి నన్ను ఇంటిదగ్గరడ్రాప్  చేశాడు శరత్ చంద్ర.
    "లోపలికి రండి" అన్నాను.
    "మరోసారి  ప్రత్యేకమైన అకేషన్ లో  వస్తాను" అన్నాడు.
    "ప్రత్యేకమైన అకేషనా? ఏవుంటుందీ?" ఆలోచనగా అన్నాను.
    "లేకపోతే సృష్టించుకుందాం ఓ.కే. బై" నవ్వుతూ అని వెళ్లిపోయాడు.
    మేడమెట్లమీద చుట్ట  కాల్చుకుంటూబొంగరం మావయ్య  ఎదురుపడ్డాడు.
    "సినిమా నుంచా?" అడిగాడు.
    "కాదు" అని గబగబా అతని తప్పుకుని నడిచాను.
    బాల్కనీలోంచి మామీ, ఆవిడ భర్త కూడా నన్నే చూడటం గమనించాను. వివేక్ తన్మయితో కలసివస్తూంటే ఎప్పుడూ ఇలా చూడలేదే! అనుకున్నాను. డోర్ తీసేవుంది.
    ఏదో సీరియస్ గా చదువుకుంటున్న వివేక్ నన్ను  చూసి "ఇప్పటివరకూ ఆ కుర్రాడు ఎదురుచూసివెళ్లాడు" అన్నాడు.
    "ఏ కుర్రాడూ?" ఆశ్చర్యంగా అడిగాను.
    "సమీరో కొత్తిమీరోట! సాయంత్రం ఇన్వైట్  చేశావుట పాపం!" కాస్త వ్యంగ్యంగా అన్నాడు.
    "ఛ!" నుదుటిమీద కొట్టుకున్నాను. ఆ విషయం ఈ నిమిషందాకా నాకు గుర్తులేదు "మార్చేపోయాను పాపం!" బాధగా  అంటూ ఫో వైపు  నడిచాను.
    "కొత్తబొమ్మలు దొరికిప్పుడు పాతబొమ్మలని అశ్రద్ధచెయ్యడం చిన్నపిల్లల లక్షణం!" వివేక్ తన రూమ్ లోకి వెళ్ళిపోతూ అన్నాడు.
    నేను ఎమెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నానని చెప్పడం అతని ఉద్దేశమా?
    సమీర్  కి ఫోన్ చేశాను. రూమ్ లో  లేనట్టున్నాడు. ఎవరూ లిప్ట్ చెయ్యలేదు.
    టేబుల్ మీద క్యారియర్ కనిపించింది హొటల్ నుండి మీల్స్ తెప్పించినట్లున్నాడు వివేక్.
    వివేక్ వచ్చి "మీ ఊరినుండి ఎవర్నో పంపించింది మీ అమ్మమ్మ ఎక్కడికి వెళ్లిందీ? ఎప్పుడొస్తుందీ? అంటూ ఆ వచ్చినతను యక్షప్రశ్నలు ఎలా భరిస్తారో అనిపించింది. చీర కొనుక్కోమని మీ అమ్మమ్మ  డబ్బు పంపించింది. అదిగో.... టేబుల్ మీద పెట్టాను" అన్నాడు.
    నా మనసు చివుక్కుమంది అమ్మమ్మ అతన్ని నా గురించి రకరకాల ప్రశ్న లేస్తుంది. నేను ఇంట్లో  లేనని తేలిస్తే  బాధపడ్తుంది. ఎన్నాళ్ళయ్యిందో చూసి! ఓసారి వెళ్ళొస్తేనే అనిపించింది.   
    "అనూహ్య....ఉన్నావా?" అంటూ  సుమతి వచ్చింది. పట్టుచీర కట్టుకుని జారుముడితో పవిత్రతంతా క్రింద చిందుతున్నట్లుగా వుంది!

 Previous Page Next Page