Previous Page Next Page 
పిపాసి పేజి 33


    "జాగ్రత్తగా వుండు బాబూ..... ఉత్తరాలు రాస్తూ వుండు" మొదలగు హెచ్చరికల్తో సాగనంపారు సత్యాన్ని.


    "వెళ్ళొస్తా చెల్లెమ్మా" అని రాధిక దగ్గర కూడా సెలవు తీసుకుని బయలుదేరాడు సత్యం.


    "ఒరేయ్..... అన్నట్టు ఈ తాళాలు నీ దగ్గరుంచుకోరా....." అంటూ తన రూమ్ తాళాలు మధన్ కిచ్చాడు సత్యం.    


    "నాకెందుకురా...... అయినా ఇంకా ఆ రూమెందుకూ? ఆ మిగిలిన సామానేదో మా ఇంట్లో పడెయ్యి. అద్దెదండగ" అంటూన్న సత్యం వినిపించుకోకుండా, "ఒరేయ్..... నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఆ రూమ్ లోనే వుంటున్నా..... ఇప్పుడెందుకురా దాన్ని ఖాళీ చెయ్యడం. ఎప్పుడన్నా వెళ్ళి నువ్వు చూస్తూ వుండు" అంటూ తాళాలు మధన్ చేతిలో పెట్టాడు.  


    "నువ్వో పెద్ద సెంటిమెంటలిస్టువి. అమెరికా వెళుతున్నా ఇంకా ఈ ధోరణి మార్చుకోవన్నమాట." కారు స్టార్టు చేస్తూ అన్నాడు మధన్.


    "అమెరికా వెళితే సెంటిమెంట్స్ మారాలేమిటి? వాళ్ళ డిటాచ్ డ్ లైఫ్ చూస్తూ వుంటే ఇంకా మన అటాచ్ మెంట్స్, సెంట్ మెంట్స్ కూడా ఎక్కువవుతాయి."


    "సరే లేవోయ్. ఇంకా వెళ్ళకుండానే ఉపన్యాసాలు దంచుతున్నావ్. వెళ్ళొచ్చాక ఈ ఉపన్యాసాలకంటే, ఓ పుస్తకమే రాసి పారెయ్. తీరిగ్గా చదువుకోవచ్చు" ఇద్దరూ నవ్వుకున్నారు.    


    సత్యానికి సెలవు గ్రాంటు చేస్తూ, అతన్ని అనేక విధాల మెచ్చుకున్నారు. రామచంద్రరావుగారు "ఏవోయ్ మధన్ నీ స్నేహితుడు నిన్ను ఒంటరివాణ్ణిచేసి వెళ్ళిపోతున్నాడు" అన్నాడు జోక్ గా.      


    "అందుకే కదండీ ఓ ఇంటివాణ్ణి చేసే వెళుతున్నాను." అన్నాడు సత్యం తడుముకోకుండా.


    ముగ్గురూ నవ్వేశారు, వారి దగ్గరా సెలవు తీసుకుని, తిన్నగా ఏర్ పోర్టుకి బయలుదేరారు. ఎలాగో అలాగా టిక్కెట్టు సంపాదించి, ప్లేన్ ఎక్కించాడు మధన్.


    "వెళ్ళగానే కేబిల్ పంపు" అన్నాడు గుడ్ల నీరు తుడుచుకుంటూ మధన్.


    "అలాగే" అన్నాడు సత్యం రుమాలుతో కళ్ళూ ముక్కూ తుడుచుకుంటూ.


    ఇన్నేళ్ళ వీరి స్నేహంలో ఈ ఎడబాటు భరించరానిదిగా అయింది. అంతలో "పాసింజర్స్ ఆర్ రిక్వె స్టెడ్...... టు..... గోఫర్ చెక్...... ఆఫ్....." అంటూ అనౌన్స్ మెంటు రాగానే, వెళ్ళలేక వెళ్ళలేక సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సత్యం.


    ప్లేన్ వెళ్లేదాకా వుండి, ఇంటివైపు బయలుదేరాడు మధన్, చెదరిన మనసును కూడదీసుకుంటూ.    


    ఇంటిముందాగిన కారు చూసి "ఎవరబ్బా" అనుకుంటూనే లోపల అడుగుపెట్టాడు మధన్ అప్పటికే ఆ పెద్ద మనిషి "వెళ్ళొస్తానండి నమస్కారం" అంటూ వెళ్ళబోతున్నాడు. మధన్ ని పరిచయం చెయ్యకుండా రాధిక చూసి చూడనట్లు ఊరుకోవడంతో సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు  మధన్. మరికాస్సేపటికి, పది రూపాయల నోట్ల కట్ట ఒకటి తెచ్చి, మధన్ పడుకున్న మంచం మీదికి విసిరి కొట్టింది రాధిక.


    "ఏమిటిది?"


    "రేపు సాయంత్రం గాంధీహాలులో నేను చెయ్యబోయే నాట్యానికి అడ్వాన్సు అయిదువందలు. బాలెన్సు రేపిస్తాను." అంటూ రుసరుసా వెళ్ళబోయింది. వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ఆ డబ్బు ఆమె మొహాన కొట్టాడు మధన్. దారం తెగి నోట్లన్నీ గదినిండా చెల్లాచెదురుగాపడ్డాయి. "ప్రతి విషయాన్నీ డబ్బుతో విలువకట్టే డబ్బు మనిషివనుకోలేదు" కోపంతో మొహం జేవురించింది మధన్ కి. కంఠం వణికిపోతోంది.


    "లెఖ్కలు వేసుకున్నది మీరు" కసిగా అంది రాధిక.


    "ఛీ..... నోర్ముయ్" కోపాన్ని పట్టలేక చెంపమీద ఒక్కటిచ్చాడు.


    "వడ్డించాను భోజనానికి రండర్రా" అంటూ అరిచిన తల్లికేక విని, గాలికి ఇల్లంతా ఎగురుతూన్న నోట్లన్నీ దగ్గరగా తీసేడు మధన్.


    "ఇప్పుడు తెలిసిందా ఎవరు డబ్బు మనిషో? అంతమాత్రానికి పౌరుషం ఎందుకు?" అని అవహేళనగా చూసి అతని సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది రాధిక.


    కొడుకు, కోడలూ యిద్దరూ మౌనంగా భోంచెయ్యడం, వారి మొహంలోని గాంభీర్యం చూసి, ఏదో ఘర్షణ జరిగి వుండొచ్చుననుకుంది రాజేశ్వరమ్మ. "ఏదో ప్రణయకలహంలే. అలకతీరాక కలయికుందే బ్రహ్మాండం" అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. తిన్నామంటే తిన్నామని లేచి చేతులు కడుక్కున్నారు మధన్, రాధిక.  


    సత్యం వెళ్ళిపోయాడన్న బాధ కొంత, రాధిక ప్రవర్తన కొంతా మనసుని కలిచేస్తూంటే, ఆఫీసుకి సెలవు పెట్టాడు మధన్. భోజనాలయ్యాక ఏదో పుస్తకం పట్టుకుని హాల్లో కూర్చుంది రాధి. అలా కూర్చున్న రాధిక దగ్గరికెళ్ళి సంగతేమిటో తెలుసుకుందామని  మాటల్లోకి దింపింది రాజేశ్వరమ్మ. "పొద్దున్నొచ్చినాయన ఎవరమ్మా?"    


    "ఒక పెద్ద కళా సంస్థ అధిపతి. రేపు నా డాన్సు ప్రోగ్రాము పెట్టించాలని అడగటానికొచ్చాడు. వెయ్యనూటపదహార్లిస్తారట. అయిదొందలు అడ్వాన్సు కూడా ఇచ్చి వెళ్ళారు "గుక్క తిప్పుకోకుండా చెప్పింది రాధిక.


    "ఒక్క ప్రదర్శనకి వెయ్యి రూపాయలే" ఆశ్చర్యంగా ముక్కు మీద వేలు వేసుకుంది రాజేశ్వరమ్మ." అవును నెలకొక ప్రోగ్రాము చేసినా సంవత్సరానికి పన్నెండు వేలు. దాంతో ఆర్కెస్ట్రా  వాళ్ళకి పాడిన వాళ్ళకీ ఖర్చులు పోను కనీసం తొమ్మిది పదివేలు మిగులుతుంది" అంది రాధిక ఆమె ముఖకవళికలను పరీక్షిస్తూ. సంతోషంగా వున్న ఆమెను చూసి, "అంత డబ్బు అనగానే ఎలా పొంగిపోతోందో...... ఈమెకీ డబ్బు పిచ్చే ఎందుకమ్మా డాన్సులూ గీన్సులూ డబ్బేం చేసుకుంటాంలే' అనలేదు. ఛీ ఛీ ప్రతి మనిషికీ నా డబ్బు కావాలి. నేనేమైనా వాళ్ళ కఖ్కరలేదు." అనుకుంటూ మరి మాట్లాడకుండా పుస్తకం చదువుతూన్నట్టు కూర్చుంది.


    ఒక్కొక్కసారి మనసు ఒకరకంగా ఆలోచించడం మొదలెడితే, ప్రతిదీ అదే ధోరణిలో కనబడుతుంది. అనుమానమయినా అంతే. ఆదిలో తుంచెయ్యకపోతే పెరిగి పెరిగి పెనుభూతమై పీడిస్తుంది. రాధిక విషయంలో సరిగ్గా అదే జరిగింది. మొగుడి దగ్గర నుంచి అత్తగారివరకూ, రాధికకి వారు తన డబ్బుమీద ఆధారపడి వుంటున్నారని అందుకే భర్త నాట్యం చెయ్యమని ప్రోత్సహిస్తున్నారనీ, దానికి అత్తగారు అభ్యంతరం చెప్పడం లేదనీ అనుకుంది. వారికి తనమీద ప్రేమలేదేమోనన్న ఒక పిచ్చి అనుమానం కూడా ఆమెని పీడిస్తోంది.

 Previous Page Next Page