Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 33


    "అందుకే రమ్మన్నాను."

 

    "నిజమేనా? నిజంగా చూపిస్తారా? అందుకే రమ్మన్నారా?" ఉద్రేకంలో పిచ్చిదానిలా మాట్లాడుతూంది.

 

    "చూపిస్తాను. నా ప్రశ్నకు సరైన జవాబు దొరికినాకనే చూపిస్తాను."

 

    చల్లగాలి వీచింది. గాలితోపాటు అగరువత్తుల వాసన గుప్పున వచ్చింది. అగరువత్తులు వెలుగుతున్నాయి. ఇంట్లో ఎవరో వున్నారు. మాధవి తను వచ్చిన విషయం తెలిసీ ఎలా మౌనంగా వుండగలిగింది? నిద్రపోతూందేమో? లేక తండ్రి అంటే భయమేమో! అరుంధతి హృదయం కొంత తేలిక పడింది. అతని ముఖంలోకి జాలిగా ప్రాధేయపూర్వకంగా చూసింది.

 

    "ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు!" కటువుగా వచ్చాయి మాటలు.

 

    "మీ బిడ్డే! మాధవి మీ బిడ్డే! నేను నిజం చెబుతున్నాను. నన్ను నమ్మండి." ఆమె స్వరంలో, కళ్ళలో, ముఖంలో అతనికి నిజాయితీ కొట్టుకొచ్చినట్లు కనిపించింది. తెల్లముఖంవేసి చూస్తూ కూచుండిపోయాడు. మనిషికి చెమట్లు పడుతున్నాయి. వెలుగుతున్న కొవ్వొత్తిలా అతని ముఖంలో కాఠిన్యం కరిగిపోసాగింది. శరీరం శిథిలం అవుతున్నట్లుంది.

 

    "సత్యం చెబుతున్నాను నా మాట నమ్మండి, నా బిడ్డమీద ఒట్టు, నా మాధవిమీద ఒట్టు," అంటూ ఆమె లేచినిల్చుంది. ఆవేశంగా లోపలకు వెళ్ళబోయింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

 

    "నువ్వు చేసిన అపరాధం ఎటువంటిదో తెలుసా?"

 

    "తెలుసు. ఏ స్త్రీ చెయ్యకూడని అపరాధం చేశాను." నిర్లిప్తంగా అంది.

 

    "కాదు. ఏ తల్లీ చెయ్యకూడని అపరాధం చేశావు."

 

    ఆమెకు అర్ధంకాలేదు, కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.

 

    "ఎందుకలా చెప్పావు? ఆ బిడ్డ నా బిడ్డ కాదని ఎందుకన్నావు?" నిద్రలో మాట్లాడినట్లు చిన్నగా అన్నాడు సీతాపతి.

 

    "అలాగయినా మాధవి నాకు దక్కుతుందని అన్నాను" అంది అపరాధిలా తల వంచుకొని అరుంధతి.

 

    "నువ్వు చేసిన పాపానికి ఫలితం త్వరలోనే అనుభవించబోతున్నావు. నీ అపరాధం ఎలాంటిదో కళ్ళారా చూడబోతున్నావ్."

 

    అరుంధతి మాట్లాడలేదు.

 

    "మాధవిని చూస్తావా?"

 

    ఆమె కళ్ళలో ఒక్కసారిగా దివ్య దీపావళి వెలిగింది. ఆనందంతో ఉక్కిరిబిక్కరయిపోతూంది. ఆత్రంగా లేచి నిల్చుంది.

 

    "ఒక షర్తు."

 

    ఆమె అసహాయంగా చూసింది. మళ్ళీ పెట్టబోయే షర్తు ఏమిటో ఆలోచించే స్థితిలో లేదు.

 

    "మాధవిని నువ్వు తాకకూడదు!"

 

    పిచ్చిదానిలా వెర్రిచూపులు చూసింది.   

 

    "అందుకిష్టమయితేనే చూపిస్తాను."

 

    ఆమె గుండెలు చిక్కబడుతున్నాయి. కాళ్ళు పట్టుతప్పుతున్నాయి. ఒకసారి తనబిడ్డను చూడాలనీ, తనివితీరా గుండెలకు హత్తుకోవాలనీ ఆరాటపడిపోయింది. ఎంతో కాలంగా మాతృహృదయంలో కరుడు కట్టిన ఆవేదన కన్నీటి రూపంలో ప్రవహిస్తే తేలికపడిన హృదయానికి గాఢంగా బిడ్డను హత్తుకోవాలనుకుంది. తనివితీరా ఏడవాలనుకుంది! ఇంతకంటే కఠోరమైన శిక్ష ప్రపంచంలో మరోటి వుండదు.

 

    "నన్ను చంపండి, కాని ఇలాంటి శిక్షను విధించకండి. నేను భరించలేను. పదిహేను సంవత్సరాల తరువాత కన్నబిడ్డను చూచి చేతుల్లోకి తీసుకోకుండా ఏ మాతృహృదయం వుండగలదు? నన్ను చిత్రహింస చెయ్యకండి!" ఒక్కసారిగా అతని కాళ్ళమీద పడిపోయింది.

 

    అతను బలంగా తన కాళ్ళను వదిలించుకున్నాడు.

 

    "చిత్రహింస! హుఁ! అందుకేగా నిన్ను పిలిచింది. నాకు మిగిలింది ఒకే కోరిక. అది నువ్వు చిత్రహింసకు గురి అవుతుంటే కనులారా చూడాలనే కోరిక. ఆ కోరిక తీరితేగాని నేను ఇంతకాలంగా అనుభవిస్తున్న చిత్రహింస నుండి నాకు విముక్తి దొరకదు." గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు మతిపోయినవాడు నవ్వే నవ్వు. ఆ నవ్వు నవ్వులో ఎన్నో విషసర్పాలు బుసలు కొడుతున్నట్లనిపించి అరుంధతి నిలువెల్లా వణికిపోయింది.

 

    "చెప్పూ!"

 

    "నీ ఇష్టం!" అన్నట్లు తల తిప్పింది అరుంధతి.

 

    "రా లోపలకు. ఐదు నిముషాల్లో నువ్వు ఈ ఇంటిని వదిలేయాలి."

 

    మెల్లా ఇంట్లోనుంచి దేవుడి గదిలోకి నడిచాడు అతను. అతని వెనకే ఆమె అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ నడిచింది. ఆమె హృదయంలో ఆనందం, దుఃఖం నేను ముందంటే నేను ముందంటూ పోటీపడుతున్నాయి.

 

    దేవుడి గది గడపలో కాలుపెట్టిన అరుంధతి శిలాప్రతిమలా అయిపోయింది. ఆమెలోని చైతన్య స్రవంతి ఒక్కసారిగా ఘనీభవించింది. అతను లోపలకు నడిచాడు. చాపమీద పడివున్న శరీరం నిండుగా తెల్లటిదుప్పటి కప్పివుంది. దుప్పటిపైనా చాపమీదా నాలుగు వైపులా మల్లెపూలు పోసి వున్నాయి. తలదగ్గర ప్రమిదలో వత్తి వెలుగుతూంది. రెండువైపులా మల్లెపూలు పోసి వున్నాయి. తలదగ్గర ప్రమిదలో వత్తి వెలుగుతూంది. రెండువైపులా గ్లాసులో అగరు బత్తీలు వెలుగుతున్నాయి.

 

    "చూడు. నీ బిడ్డను చూడు. కళ్ళారా చూడు. మళ్ళీ కావాలన్నా చూడలేవు. నీ పాపానికి ప్రతిఫలం ఏమిటో మనసారా చూడు!" అంటూ అతను శవం ముఖంమీద కప్పివున్న బట్టను తొలగించాడు.

 

    కెవ్వున కేకవేసి విరుచుకొని పడిపోయింది అరుంధతి.

 

    తెలివివచ్చిన అరుంధతి ఒక్కసారిగా మాధవి శవంకేసి పరుగెత్తబోయింది. సీతాపతి రెక్క పట్టుకొని గుమ్మం దగ్గరకు ఈడ్చుకొని వచ్చాడు.

 

    "ఒక్కసారి....ఒక్కసారి....నా మాధవి శరీరాన్ని తనివితీరా తడిమి చూచుకోనివ్వండి. ఒక్కసారి ఆ గుండెలమీద వాలి పోనివ్వండి." గుండెలు పగిలిపోయేలా విలపిస్తూ ప్రార్ధించింది.

 

    "వీల్లేదు, నీ చేతులతో నా బిడ్డను తాకనివ్వను. నా బిడ్డ బతికి వుండగా నీ నీడ పడలేదు. చచ్చిపోయాక ఆ శరీరాన్ని అపవిత్రం కానివ్వను. నీకు ఆ అర్హత లేదు. నువ్వు పాపివి."

 

    అరుంధతి గడపలో కూలబడింది. ఆమె శరీరంలోని ప్రతి అణువూ విచ్చిపోతున్నట్లు అనిపిస్తూంది.

 

    "అవును నేను పాపినే! కాని పాపాన్ని చూసి పుణ్యం పారిపోవటమా? వెలుగును చూసి చీకటి పారిపోవటమా? పవిత్రత అపవిత్రతకు భయపడటమా? నన్ను ఇక్కడకు పిలిచింది ఈ ఘోరం చూపించటానికేనా?"

 

    "అవును-నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తూంటే చూడాలనే రమ్మన్నాను."

 

    "నేను పాపం చేశానా? నాచేత మీరే పాపాలు చేయించారు. మీరు మాత్రం ఎంత సుఖంగా వున్నారు? ఈ పదిహేను సంవత్సరాల కాలం మీరు ఎంత బరువు జీవితాన్ని మోసారో మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతూంది. ఇంతమందిని ఈ విధంగా నాశనం చేసింది మీరే. మీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోండి, ఎంత భయంకరంగా వుందో!"

 

    "నేనా....నేనా?"

 

    "అవును మీరే! నేను ఈ ఇంటిని వదలివెళ్ళేంతవరకూ ఏ పాపమూ చెయ్యలేదు."

 

    "అబద్ధం!"

 

    "ఇంకా అబద్ధాలు ఆడి జీవితంలో ఏం సాధించాలి? నీకు అబద్ధాలు ఆడటం ఇష్టంలేదు. ఇలాంటి సమయంలో- ఏ స్త్రీ, ఏ తల్లీ అబద్ధం ఆడదు. మీరు స్త్రీత్వాన్నే అవమానిస్తున్నారు."

 

    "నోరుముయ్!"

 

    "మీలో ఇంకా రంకెలువేసే ఓపిక వుండటం ఆశ్చర్యంగానే ఉంది. రాజారావు మీకు ఎలాంటి ద్రోహమూ చెయ్యలేదు. మీకు ద్రోహం చెయ్యనని నాచేత కూడా ప్రమాణం చేయించాడు."

 

    "ఆ నీచుడి పేరు నా ముందు ఎత్తటానికి సిగ్గులేదూ? వాడు తన ఆదర్శాలకు, తన ఆత్మకే ద్రోహం చేసుకున్నాడు. మానవ కల్యాణంకోసం జీవితాలనే త్యాగం చేసిన వ్యక్తుల రహస్యాలను బయటపెట్టి పోలీసులకు అప్పగించాడు నీచుడు! అలాంటివాడు నాకు ద్రోహం చెయ్యటానికి వెనకాడతాడా? నన్ను నమ్మించటానికి ప్రయత్నించకు."

 

    "అతను అలా దిగజారిపోవటానికి కారణం మీరే. ఆనాడు మీరు అతన్ని పోలీసులకు అప్పగించకుండా వుంటే-"

 

    "నేను వాణ్ణి పోలీసులకు అప్పగించానా?"

 

    "అవును. అప్పగించారు. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర తలదాచుకోవటానికి వచ్చిన ఒక ఆదర్శమూర్తిని పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచే మీరంటే నాకు అసహ్యం ప్రారంభమయింది. రాజారావంటే గౌరవం పెరిగింది. ఆ కసి తీర్చుకోవటానికి ఆనాడూ మీరు వద్దంటున్నా మీటింగుకు వెళ్ళాను."

 

    "నేను పోలీసులకు అప్పగించానా? నువ్వు సందేహించావు. నువ్వు ఆడదానివికాదు. నీభర్తను నువ్వు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించని అల్పురాలివి. చేసుకున్న పెళ్ళాం భర్త నిజాయితీనీ అనుమానించినప్పుడు అతను పడే యాతన నీకు అర్ధం కాదు. నీలో బలహీనతల్ని నేను అర్ధం చేసుకోకపోలేదు. అయినా ఔదార్యంతో సహించాను. నువ్వు నాకు ద్రోహం తలపెట్టినా, రాజా నాకు ద్రోహం చేస్తాడని నేను ఆనాడు అనుకోలేదు."

 

    "ఆనాడు మీరు ఏలూరు ఎందుకు వెళ్ళారు, ఎవరికీ చెప్పకుండా?"

 

    "నేను ఏలూరు వెళ్ళలేదు."

 

    అరుంధతి సీతాపతి ముఖంలోకి చూసింది. ఇంకా అబద్ధం ఆడుతున్నందుకు అసహ్యించుకుంది.

 

    "మరి ఎక్కడకు వెళ్ళారు?"

 

    "రాజా భార్యాబిడ్డల్ని తీసుకురావటానికి వెళ్ళాను. రాజాను వ్యామోహంలో చిక్కుకొని దిగజారిపోకుండా నిలబెట్టటానికే వెళ్ళాను."

 

    నమ్మనట్టు చూసింది.

 

    "నువ్వు నమ్మవు- నువ్వు ఆడదానివి కావు. నీకు రాజామీద వ్యామోహం కలిగింది. దాంతో ఏ స్త్రీ చెయ్యకూడని ద్రోహం చేశావు."

 

    "అయితే, రాజా భార్యను ఎందుకు తీసుకొనిరాలేదు?"

 

    "ఆమె మూర్ఖపు పట్టుదల ఎక్కువ. నేను ఎంత చెప్పినా రానన్నది. ఆ పార్టీకి రాజీనామా ఇస్తేనేగాని అతనితో మాట్లాడనన్నది."

 

    "మరి నాకు ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు?"

 

    "నా నిజాయితీని శంకించిన నీమీద అసహ్యం వేసింది. నీకు సంజాయిషీ యిచ్చుకోవాలనిపించలేదు. ఆ తరవాత నువ్వు ఎప్పుడూ రాజాలోకంలోనే వుండేదానివి. ఏ మగవాడూ భరించరానిదాన్ని భరిస్తూ, బాధపడుతూ వుండిపోయాను."

 

    అరుంధతి తలవంచుకొని కూచుంది. ఆనాడు తన భర్తను ఎంత అపార్ధం చేసుకుంది!   

 

    దూరంనుంచి గడియారం గంటలు వినిపించాయి. ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. సీతాపతి గంటల్ని లెక్కించాడు.

 

    "ఐదయింది. ఇక నువ్వు వెళ్ళిపో, ఎవరూ లేవకముందే వెళ్ళిపో!"

 

    అరుంధతి త్రుళ్ళిపడి లేచింది. మాధవి శవంవైపుకు నడిచింది.

 

    ఈసారి సీతాపతి అడ్డగించలేదు. అరుంధతి మాధవి పక్కగా నిల్చొని ఆమె ముఖంలోకి చూస్తూ వుండిపోయింది. "నువ్వు పవిత్రంగానే వుండమ్మా! నాకు నిన్ను స్పృశించే అధికారం లేదు. నేను పాపిని. నన్ను క్షమించు తల్లీ!" అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది.

 

    "ఇక వెళ్ళు!" ఆజ్ఞాపిస్తున్నాడు.   

 

    అవును-అతను కరగడు. అతనికి దయాదాక్షిణ్యాలు లేవు. అతను మంచు మనిషి. అతను రాతి మనిషి. అతను అహంకారి. అతను జాలి అనేదాన్ని ఏనాడో మర్చిపోయాడు.

 

    అరుంధతి కళ్లు తుడుచుకుంది. గుండె రాయి చేసుకుంది. అపరాధిని చూసినట్లు భర్తముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది.

 

    "మాధవి ఎలా చచ్చిపోయింది?" ఆ ప్రశ్నలో "మాధవిని నువ్వు చంపేశావా?" అనే ప్రశ్న ప్రతిధ్వనించింది"

 

    "మాధవిని నేనే చంపాను. కాదు నువ్వుకూడా చంపావు. అందరూ కలిసి మాధవిని చంపాం. నీ కూతురు పెళ్ళికాకుండానే బిడ్డతల్లి అయింది."

 

    అరుంధతికి ఎవరో చెళ్ళున కొరడాతో కొట్టినట్లయింది.

 

    "అబద్ధం! నా బిడ్డ అలాంటిది కాదు." పిచ్చిగా అరచింది.

 

    రాతి విగ్రహం నవ్వినట్లే నవ్వాడు సీతాపతి.

 

    "అవును. నీ బిడ్డ అలాంటిదే!"

 

    అరుంధతి కుప్పగా కూలిపోయింది. మాధవి ముఖంలోకి చూస్తూ కూచుంది. ఎంత అమాయకంగా వుంది ఆ ముఖం! తనబిడ్డ అంతపనిచేసిందా?!.

 

    "దానికి కారణం నువ్వే! నువ్వు లేచిపోయావు గనక నీ కూతురి మీద అందరికీ చూపే. లేచిపోయిన మనిషికూతురికి పెళ్ళికాదు. వయసులో వున్న పిల్లకు ఇది తప్పు అని చెప్పే తల్లి లేదు. తండ్రివున్నా అతను ఆ పిల్లను ప్రతి నిముషం అసహ్యించుకున్నాడు."

 

    అరుంధతి రెండు చెవుల్నీ గట్టిగా మూసుకుంది. అంతలోనే కుమిలి కుమిలి ఏడ్చింది.

 

    "నువ్వు చేసిన పాపాన్ని నీ కూతురు అనుభవించింది. నీ కూతురు కన్నబిడ్డ అనాధగా గుంటూరు ఆసుపత్రిలో వుంది. ఆ పాప ఫలాన్ని కావాలంటే నువ్వు తీసుకెళ్ళి పంచుకో-వెళ్ళు! ఒక్క క్షణం ఇక్కడ వుండటానికి వీల్లేదు."

 

    అరుంధతి కళ్ళప్పగించి తనివితీరా మాధవి ముఖాన్ని చూస్తూ నిల్చుంది. ఆ ముఖాన్ని తన హృదయంలో పదిలంగా దాచుకోవటానికి ఆరాటపడుతూంది.

 

    "ఊఁ కదులు!"

 

    అరుందతికి మతిపోయినట్లనిపించింది. అవును. తనకు పిచ్చేత్తేలాగేవుంది. తనకు మతిపోక మునుపే ఆ వూరి పొలిమేరల్ని దాటిపోవాలి. పరుగెత్తింది బయటకు పిచ్చిదానిలాగే. సీతాపతి చూస్తూ నిల్చున్నాడు. నిట్టూర్పు విడిచాడు. చిన్నగావెళ్ళి వీధి గుమ్మంలో నిల్చున్నాడు. మైదానంకేసి చూచాడు. అరుంధతి ఆ మసక చీకటిలో దూరంగా కనిపించి మాయమయింది.

 

    సీతాపతి లోపలకు వెళ్ళి శవం పక్క కూచున్నాడు. అతని శరీరంలోకి వేడి పారుకాడింది. ఇంతకాలంగా అతని చుట్టూ పేరుకొని వున్న మంచుకొండలు కరిగిపోసాగాయి. మాధవి తన కూతురు. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ! తన బిడ్డకూడా తప్పు చేసింది. తన రక్తం మీద తనకు ఎంతో అభిమానం. తన వంశంమీద తనకు ఎంతో గర్వం వుండేది. మాధవి ఇలా కావటానికి కారణం తన వంశమా? తనలోని రక్తమా? కాదు....పరిస్థితులు! మాధవి చేసిన తప్పుకు బాధ్యురాలు మాధవి ఒకర్తేనా? కాదు....రమేష్....తను....తన భార్యా....ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యులే. రమేష్ మొగవాడు. అతని శీలాన్ని గురించి ఎవరూ ప్రశ్నించరు. అతనికి వివాహం అవుతుంది. సంఘంలో గౌరవం లభిస్తూంది. మాధవిని పూర్తిగా మర్చిపోతాడు. మాధవి తిండి తినకుండా కుమిలిపోతూందని తెలిసీ తను పట్టించుకోలేదు. అంతరాంతరాల్లో ఎక్కడో మాధవి చచ్చిపోతే బాగుణ్ణు అని తనకు అనిపించకపోలేదు. తన చిట్టితల్లి తన మనసులోని భావాన్ని గ్రహించే అలా చేసిందేమో! అరుంధతిని కేవలం తన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించిందనే ఇంటి నుంచి గెంటేశాడు. అలా ఆనాడు తను చేసి వుండకపోతే ఇలా జరిగేది కాదు. తను నిజంగానే హంతకుడు. ఎంతో కాలంగా అతని మనస్సును చుట్టివేసిన చీకటి తెరలు తొలగిపోతున్నట్లనిపించింది. కాని ఈ వెలుగులో తను చూడటానికి ఏమీ మిగలలేదు.

 Previous Page Next Page