"కామ్రేడ్ కొండయ్యా! వర్గ శత్రు నిర్మూలనం మన ముఖ్యక కార్యక్రమం. ఈ బూర్జువా ప్రభుత్వానికి మూలస్థంభాలుగా వున్నభూస్వామ్య వర్గాన్ని ముందు దెబ్బతియ్యాలి. ఈ బడా భూస్వాముల్లో అగ్రశ్రేణిలో వుండి ప్రజా ద్రోహులుగా గుర్తించబడిన వారిని ముందుగా ఏరిపారెయ్యాలి. ఆ తర్వాత... ఇప్పుడు చెప్పాలంటే చాలా వ్యవధి కావాలి. మన వ్యూహం, ఎత్తుగడ, రాజకీయ పంథా వివరంగా నీకు తెలిస్తే ఇలాంటి అనుమానాలు రావు!"
"నిజమేలే బాబూ! ఆయన్నీ నాకేం తెలుస్తయ్! మాబోటి బీదా బిక్కీ జనం కోసం, పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి, పెద్ద సదువులు సదువుకొని ప్రాణాన్ని కూడా లెక్క సెయ్యకుండా అడవుల్లో అగషాట్లు పడుతున్న మీలాంటి బాబులు మాకు దేవుళ్ళే! మీకోసం నా ప్రాణాన్నయినా ఇస్తా బాబూ!'
సుందరం కొండయ్యను చూసి గర్వపడ్డాడు. ఇలాంటి కొండయ్యలు దేశంలో ఎంతోమండి తయారు కావాలి. ఆ రోజు ఎంతో దూరం లేదు. కొండయ్య వెనక్కి వంగి తెడ్లు పైకి గుంజుతూ జ్యోతికేసి చూశాడు.
"కాలు కిందెడితే కందిపోయేట్టుంది. ఈ గొప్పింటి బిడ్డకు ఏం తరుగైందనీ కట్టాలను కోరి తెచ్చుకుంది! ఇదంతా మా అసుమంటోళ్ళ కోసమే గదా సుందరం బాబూ!"
జ్యోతి కళ్ళల్లో వెలిగిన వెలుగులు వెన్నెల్ని మింగివేశాయి. పడవ నది సగానికిపైగా దాటింది. ఆవలివడ్డు బాగా కన్పిస్తోంది. కొద్దిసేపట్లో పడవ ఒడ్డు చేరుతుంది. నిముష నిముషానికి దగ్గరౌతున్న ఒడ్డును చూస్తూ కూర్చుంది క్యోతి. ఆ ఒడ్డు చేరగానే తన విప్లవ జీవితంలో రెండోఘట్టం ప్రారంభం అవుతుంది. తనువదిలేసిన ఒడ్డును కుళ్ళు కంపు కొడుతున్న బూర్జువా సమాజంతో పోల్చుకుంది. తను చేరబోయే ఒడ్డు తనను మరో ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది జ్యోతికి.
"కొండయ్యాఅ౧ కొండయ్యా! పడవను ముందుకు పోనివ్వకు!" కొండయ్య భుజం పట్టుకొని ఊపుతూ అన్నాడు సత్యం.
"ఏం బాబూ?"
"అటు చూడు! కట్టమీద మనుషులు!"
సత్యంతోపాటు ముగ్గురూ గట్టుకేసి చూశారు. బ్యాటరీ లైట్లు వెలిగి ఆరిపోతున్నాయ్. కట్టకింద నుంచి లాంతర్లు పట్టుకొని ఇద్దరు కట్టమీదకు వచ్చారు. మొత్తం పదిమందిదాకా కట్టమీద అటూ ఇటూ తిరుగుతూ కన్పించారు.
"కామ్రేడ్ సత్యం! మన మూవ్ మెంటును శత్రువులు పసిగట్టారు!" అన్నాడు సుందరం.
"చాలా జాగ్రత్తలు తీసుకున్నాం! శత్రువుకు సమాచారం అందడానికి అవకాశమేమీలేదు. మరి ఇది ఎలా జరిగిందో!"
"కామ్రేడ్ ప్రతిభను వెన్నాడివుంటే మనం అవతలి ఒడ్డునే దొరికిపోయేవాళ్ళం!"
"అయితే ఈ ఒడ్డున కొండయ్యను వెంటాడి ఉంటారు!"
"అలా అయితే మనం ఈ ఒడ్డున పడవ ఎక్కినప్పుడే శత్రువులు మనల్ని పట్టుకొని వుండొచ్చుగా?"
సుందరం క్షణం ఆలోచించాడు.
"కాదు మనం తిరిగి వస్తామని కూడా వాళ్ళకు తెలిసి వుండాలి!"
"అయితే కొండయ్యా?"
జ్యోతి గుండె వేగంగా కొట్టుకోసాగింది. అంతా అయోమయంగా వుంది. ఒళ్లు చెమటలు పట్టి చల్లబడింది. కొండయ్య మోసం చేశాడా? అమాయకుడైన కొండయ్య ఇంత నీచానికి ఒడబడతాడా? తమకోసం ప్రాణాన్నయినా అర్పిస్తానన్న కొండయ్య ఇంతపని చేస్తాడా?
"ఎందుకు సత్యం బాబూ కంగారుపడ్తారు? నేను పడవ ఎయ్యడం తవరికి తప్ప ఎవరికీ తెలివదు. ఆఖరికి మా ఇంటిదానికికూడా తెలవదు. ఊళ్ళో బాగోతులు రుక్మిణీ కళ్యాణం ఆడుతుంటే కాసేపు ఆడ కూకుని శడీ సప్పుడు కాకుండా లేచొచ్చాను!" అన్నాడు కొండయ్య.
"మరయితే ఆ కట్టమీద జనం ఎవరూ!" సత్యం కంఠం తీవ్రంగా వుంది.
"ఆళ్లు మనకోసం వచ్చినోళ్ళు కాదుబాబూ! కట్టమీద కాపలా వున్న కలాసీలు బాబూ! నడి వరదమీదున్నప్పుడు కట్ట ఎక్కడన్నా కోస్తదేమో అని చూసుకుంటూ తిరుగుతారు. అది మామూలే బాబో౧ ఇప్పుడాళ్ళున్నారు సూడండి, అక్కడే పదేళ్ళనాటి వరదలప్పుడు కట్ట తెగింది. ఆడ నదికోత ఎక్కువగా వుంటది!"
సత్యం సుందరం ముఖముఖాలు చూసుకున్నారు. జ్యోతివాళ్ళిద్దర్నీ మార్చి మార్చి చూసింది.
తొందరపడి కొండయ్యను వీళ్ళు అనుమానించారు. అందులో వీళ్ల తప్పేమీ లేదు. విప్లవ జీవితమే అలాంటిది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీళ్ళు తనను అపార్థం చేసుకున్నట్టూ, అనుమానిస్తున్నట్టూ కొండయ్య అర్థం చేసుకున్నాడా? అతని మాటల్లో అలాంటిదేమీ కన్పించడంలేదు. లేక అర్థం చేసుకొనికూడా అంత ఉదారంగా ప్రవర్తిస్తున్నాడా? తనే అలా అనుమానించబడితే? తనను అనుమానించిన వాళ్ళతో మనసు విప్పి మాట్లాడగలదా? మనస్పూర్తిగా మళ్ళీ వాళ్ళకు సహాయం చెయ్యగలదా?
నదిలో టార్చ్ లైట్ కాంతి ప్రతిఫలిస్తూ వుంది. మనుషులు దాదాపు నీళ్ళమీద నిలబడినట్టే కన్పిస్తున్నారు. వరద వుబికి వుబికి అంచుల వరకూ పొంగింది. నదీ ఒడ్డూ కలిసిపోయినట్టే కన్పిస్తూంది. టార్చిలైట్ వెలిగినప్పుడల్లా.
"అవును కొండయ్యా! ఇప్పుడేం చేద్దామంటావ్?" అని అడిగాడు సత్యం.
"మనకొచ్చిన ప్రమాదమేమీలేదులే సత్యంబాబూ! మీరట్లా కూచోండి, తీసుకెడతాగా!" అన్నాడు కొండయ్య.
"అది కాదు కొండయ్యా! వాళ్ళవల్ల మనకు ప్రమాదం ఏమీ లేకపోయినా, ఈ అర్థరాత్రి వరదలో పడవమీద నదిదాటడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే అనుమానానికి దారి తీస్తుంది. ఆ నోటా ఈ నోటా పడి పోలీసులదాకా వెళుతుంది. ఇక ఈ ప్రాంతంలో మనం తిరగలేం గదా? ఇంతవరకూ, నది దాటడానికి ఈ ప్రాంతం మనకు చాలా అనువుగా వుంది. అందుకని వాళ్ళ కళ్ళ బడకుండా నది దాటడమే మంచిది!"
అని సత్యం సుందరం వైపు చూసి "అంతేగదా కామ్రేడ్!" అన్నాడు.
"ఖచ్చితంగా అంతే! ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళ కళ్ళబడకూడదు" అన్నాడు సుందరం.
"మనం వాళ్ళకు దూరంగా వెళ్లి దిగడం మంచిది!" జ్యోతి అడక్కుండానే తన అభిప్రాయం చెప్పింది.
కాని కామ్రేడ్స్ ఇద్దర్లో ఏ ఒక్కరూ ఆమె చెప్పింది విన్నట్టులేదు. విన్నా పట్టించుకున్నట్టులేదు. తను అనవసరంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నది.
"వాళ్ళు చూస్తుండగా పడవ దిగడం మంచిదికాదని నాకు మాత్రం తెలీదంటారా బాబూ! బొత్తిగా నన్ను పిచ్చాడికింద కట్టేసినట్టున్నారేం బాబూ! నేను చెప్పిందల్లా వాళ్ళు మనసు పట్టుకోటానికి వచ్చినోళ్ళు కాదనే! వాళ్ళముందే పడవ దిగుదామని నేనన్నానా బాబూ! అందేకేగా పడవను బాగా ఈవలకు తోస్తున్నాను. చూట్టంలేదా?"
"అవును కొండయ్యా! నువ్వు మమ్మల్ని సురక్షితంగా ఒడ్డు చేరుస్తామని మాకు తెలుసు. నీమీద మాకా నమ్మకం వుంది. కాని ఎంతసేపని పడవను ప్రవాహానికి ఎదురు నడపగలవు?" అన్నాడు సుందరం.
"ఇట్లాగయితే మనం ఒడ్డు చేరేసరికి తెల్లవారిపోతుంది కూడా!" అన్నాడు సత్యం.
"అదే నేనూ ఆలోచిస్తున్నా! మరి ఏం చేద్దాం?" అన్నాడు కొండయ్య రెండోచోట తెడ్డువేస్తూ.
"సత్యం బాబూ! ఇటొచ్చి తెడ్డేస్తారా? చెరోవైపున వేశామంటే తొందరగా లాగించెయ్యొచ్చు ఒడ్డుకు!" కొండయ్య మళ్ళీ అన్నాడు.
సత్యం గభాలున లేచాడు. పడవ అటూ ఇటూ ఒరిగింది.
"బాబూ! నెమ్మదిగా! పడవలో వంగి పట్టుకొని లేవాలి. రెండో కాలు మోపేదాకా మొదటి కాలుమీద బరువెయ్యకూడదు. పైగా నిండు పడవ!" తెడ్లను మోపు చేసి పడవ ఒరగకుండా పట్టుకుని సత్యాన్ని హెచ్చరించాడు కొండయ్య.
సత్యం వచ్చి కొండయ్య వెనక పక్కన కూర్చున్నాడు. సత్యం చేతికి తెడ్డు అందించి "బాబూ! ఇదివర కెప్పుడయినా పడవ నడిపారా?" కొండయ్య అడిగాడు.
"లేదు." రెండు చేతుల్లో తెడ్లు అమిరేట్లు పుచ్చుకొని అన్నాడు సత్యం.
"అయితే కష్టమే బాబూ! సర్వీసు లేకపోతే తెడ్డు సరిగా పడదు బాబూ!"
"పర్వాలేదు కొండయ్యా! ఎన్నోసార్లు నదిదాటాను. తెడ్లు ఎలా వెయ్యాలో తెలుసు. నువ్వేస్తుంటే చూస్తేనే ఉన్నాగా?" అన్నాడు సత్యం.