ఆమె తృళ్ళిపడి వెనక్కు జరిగింది.
"ఏమిటి అలా చూస్తావ్ భూతాన్ని చూసినట్టు" మెత్తగా అడిగేడు.
"ఔనుఁ నువ్వు భూతానివే" అరవాలనుకుంది. గొంతు పెగల్లేదు.
"చెప్పు... ఏం జరిగింది?"
"సా... సా... విత్రి... వచ్చింది"
"సావిత్రి వచ్చిందా? ఏం చెప్పింది? అదో పిచ్చిది. నిజముగానే ఆ అమ్మాయికి ఎప్పుడో పిచ్చిపడుతుంది."
"ఔను. పిచ్చివాళ్ళు ఎప్పుడు ఎదుటివాళ్ళకు పిచ్చి అనుకుంటారు."
రమణ భార్య ముఖంలోకి కోపంగా చూశాడు.
"ఏమిటి నువ్వనేది? నాకు పిచ్చి అనా?"
"ఉదయం మీరు సావిత్రి హాస్టల్ కు వెళ్ళారా?"
ఓ క్షణం మౌనంగా వుండిపోయాడు.
"అవును, వెళ్ళాను"
"ఎందుకెళ్ళారు? అది బతికుండగా మీ గుట్టు రచ్చకెక్కుతుందనేగా?"
"అనూ!"
"అందుకే దాన్ని చంపబోయారు."
రమణమూర్తి మౌనముగా వుండిపోయాడు.
"పైగా దానికి పిచ్చి అంటారు."
అతను ఆలోచిస్తున్నాడు.
"అది చెప్పింది నిజమేనన్నమాట"
"ఏం చెప్పింది?"
"దాన్ని చంపటానికి హాస్టల్ కు వెళ్ళారని"
"అబద్ధం"
"మరి మీరు హాస్టల్ కు ఎందుకు వెళ్ళారు?"
"సావిత్రి నీతో అబద్ధాలు చెప్పింది. ఆమెను నీ దగ్గిరకు తీసుకొచ్చి నీ అనుమానాన్ని దూరం చెయ్యాలనుకున్నాను."
"కాదు. దాన్ని బెదిరించి దానిచేత అబద్ధం చెప్పించి నన్ను మభ్యపెట్టాలనుకున్నారు."
"అనూ!"
"కాని అది మీతో రానన్నది. అందుకే చంపబోయారు" తన ధోరణిలో చెప్పుకుపోతున్నది.
"అంతా అబద్ధం. ఆవిడ అన్నీ అబద్ధాలే చెప్పింది. అలా చెప్పడానికి కారణం నీ ముందు చెప్పించాలనుకున్నాను."
"మీరే అబద్ధాలు ఆడుతున్నారు. మీరు మీ మొదటి భార్యను చంపారు."
గవదల ఎముకలు కదిలాయి.
"ఆ విషయం దానికి ఒక్కదానికే తెలుసు. మీమీద కేసు రాకుండా చూసుకున్నారు. అది బతికి ఉంటే ఎప్పటికైనా మీకు అపాయమే. అందుకే..."
"అనసూయా!" పిచ్చికోపంతో వూగిపోతూ అరిచాడు.
అనసూయ భర్త రూపాన్ని చూసింది.
నిలువెల్లా వణికి పోసాగింది.
"నీకూ పిచ్చెక్కింది."
"నాకేం పిచ్చిలేదు. మీకే అప్పుడప్పుడు మతి చలిస్తుంది" హిస్టీరియా రోగిలా మాట్లాడుతూంది.
"నోరు ముయ్" అరుస్తూ రెండడుగులు ముందుకు వేశాడు.
అనసూయ "కెవ్వున" అరిచి పారిపోతూ గుమ్మం తగిలి బొక్కబోర్లా పడింది.
రమణమూర్తి ఒక్క దూకులోవచ్చి అనసూయను లేవదీయబోయాడు.
అనసూయకు స్పృహలేదు.
ఆమెను ఎత్తుకొచ్చి సోఫామీద పడుకోబెట్టాడు. ముఖం తడిగుడ్డతో తుడిచాడు. కొంతసేపటికి కళ్ళు తెరిచింది.
"ఎలా ఉంది?" రమణమూర్తి మెత్తగా అడిగాడు.
అనసూయ కళ్ళు మూసుకుంది.
"మంచినీళ్ళు తాగుతావా?"
అనసూయ పలకలేదు.
రమణమూర్తి లేచివెళ్ళి గ్లాసుతో నీళ్ళు తెచ్చాడు.
"అనూ! మంచినీళ్ళు తాగు" లేవదీశాడు.
అనసూయ వణుకుతున్న చేతులతో గ్లాసు అందుకుంది. మంచినీళ్ళు తాగింది. ఖాళీగ్లాసు క్రిందపెట్టాడు రమణమూర్తి.
"కాఫీ తాగుతావా?"
"ఇప్పుడేమీ వద్దు" అంటూ అలసటగా కళ్ళు మూసుకుంది.
అనసూయ వంట చెయ్యలేదు.
పడుకునే ఉన్నది.
రమణమూర్తి కాఫీ కాచి భార్యచేత బలవంతంగా తాగించాడు. భర్త ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉన్నది అనసూయకు.
ఆరాత్రి ఎవరూ భోజనం చెయ్యలేదు.
నిద్రలో మధ్యమధ్య తృళ్ళిపడి లేచి కూర్చుంటుంది.
రమణమూర్తి నిద్రపోతున్నట్టు నటిస్తూ అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను పలకరిస్తే భయపడుతుందని అతనికి తెలుసు. తను మెలుకువగా ఉన్నట్టు తెలిస్తే అసలు నిద్రపోదని కూడా అర్ధం చేసుకున్నాడు.
కొన్ని రోజులు గడిచాయి.
రమణమూర్తి ఎంత సౌమ్యంగా ఉన్నా అనసూయకు అదంతా నటన అనీ అనిపిస్తున్నది.
రమణమూర్తి విసుక్కుంటే చాలు బెదిరిపోతుంది.
రాత్రిళ్ళు ఆదమరిచి చిద్రపోవడం లేదు.
నిద్రలో ఎవరో గొంతు నులుపుతున్నట్టు ఉక్కిరిబిక్కిరి అవుతూ అరుస్తూ లేస్తుంది.
రోజురోజుకూ అనసూయ రమణమూర్తికి ఓ సమస్యగా తయారైంది.
ఆరోజు అర్ధరాత్రి "నన్ను చంపకండి. మా అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతాను. ప్లీజ్ నా గొంతు వదలండి" అరవసాగినది.
"అనూ! అనూ!" రమణమూర్తి అనసూయను కుదిపిలేపాడు.
అనసూయ తృళ్ళిపడి లేచి కూర్చుంది.
"ఏమిటి అనూ పీడకల వచ్చిందా?" జాలిగా అడిగాడు.
రోజురోజుకూ రమణకు ఇల్లు ఒక నరకంగా కన్పించసాగింది.
అనసూయ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది,
రమణ నవ్వితే పిచ్చివాడు నవ్వినట్టు అన్పిస్తుంది అనసూయకు.
అతను ఆమెకేసి చూస్తే ఆ చూపులు పిచ్చివాడి చూపులుగా కనిపిస్తున్నాయి.
అతను మృదువుగా మాట్లాడితే అనుమానంగా చూస్తున్నది.
అతను విసుక్కుంటే భయంతో బిగుసుకుపోతోంది. హంతకుణ్ణి చూసినట్టు ఏవగింపుగా చూస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో రమణ చివ్వునలేచి బయటికి వెళ్ళిపోతాడు.
తిరిగితిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి వస్తాడు.
ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉన్న రమణను చూస్తూ అనసూయ తనను ఎప్పుడు ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాడు అనుకుంటూ "నేను నీకు చిక్కుతానా!" అన్నట్టు తనలో తనే నవ్వుకునేది. అంతలో భయంతో బిగుసుకుపోయేది.