Previous Page Next Page 
అనూహ్య పేజి 32

    అది వెంటనే "ఆఁ....చెన్నైలో కొన్నాను...." అంటూ వాటి గురించి చెప్పడంలో మునిగిపోయింది. టాపిక్ డైవర్ట్ అయి  నందుకు సంతోషించాను!
    స్టైలుగా  రోజుకో డ్రెస్సుతో మోడలింగ్ చేస్తున్నట్లు తిరిగే షీలా నల్లబడి చిక్కిపోయి , కాళ్ళక్రింద వలయాలతో కనిపించింది ఏవో టీ.వీ సీరియల్స్ లో వేషాలేస్తోందిట.
    నీలూ పోగరంతా ఏవైందో గానీ, అమాంతం వచ్చి కౌగలించుకుంది. "ఆప్టర్ ఏ లాంగ్ టైమ్!" అంటూ పట్టుకుని వదలలేదు.
    ఏదో కాలేజ్ లో ఎకనమిక్స్ లెక్చరర్ గా  వుందిట ఇద్దరు పిల్లలుట.
    వాగుడుకాయ శ్రీలక్ష్మీ కూడా  మారిపోయింది. చాలా  బలహీనంగా తయారయింది. తూనీగలాగా ఎగిరేపిల్ల. నత్తనడకలు నడుస్తూ  వచ్చింది పెద్ద ఉమ్మడికుటుంబంలో పడిందిట భర్త కాస్త చాదస్తం మనిషని చెప్పింది కళ్ళల్లో కాంతి టార్చివేసి వెతికినా కనిపించేటట్లు లేదు.
    "విజయలా  పెళ్ళిచేసుకోకుండా హాయిగా ఎంచక్కా చదువుకుంటూ వుండాల్సింది. ఉన్నదంతా ఊడ్చి మా వాళ్లు పెళ్ళి చేశారు. ఎంత పెట్టిన  వాళ్లు తృప్తిపడలేదు. ఇంకా  తెమ్మని సతాయించుకుని తింటున్నారు. మన బంగారు రోజులు మళ్ళీ  వస్తే  బావుండ్నే...." అంటూంటే దాని కళ్ళల్లో నీళ్లు ఊరాయి.
    నేను దాని భుజంమీద చెయ్యివేసి ఓదార్పుగా నొక్కాను. ఇంతలో కాత్యా నా చెవిలో "అదిగో! వెకిలి మాటలు మాట్లడ్తూ, బూతు పాటలు పాడుతూ, మనని ఏడిపించేవాడు చూడు సుబ్బారావు....ఇటే వస్తున్నాడు" అంది.
    సుబ్బారావు లాల్చీ పై జామా  వేసుకుని, కళ్ళద్దాలతో చాలా పెద్దమనిషిలా కనిపిస్తున్నాడు! మమ్మల్ని గుర్తుపట్టి మా దగ్గరకి వచ్చి "బాగున్నారా అమ్మా!" అంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు.
    మేం పెదాల మాటున నవ్వు బిగించి ప్రతి నమస్కారం చేశాం.
    నాకు ప్రేమలేఖ వ్రాసి ప్రిన్సిపాల్ తో తిట్లుతిన్న రామకృష్ణ, తనభార్యని  తీసుకొచ్చి "మీట్ మై వైఫ్ అర్చనా బరువా..." అంటూ  పరిచయం చేశాడు. అర్చనా పాలరాతి  శిల్పంలా వుంది! అతను  కలకత్తా లోనే స్ధిరపడి టాక్స్  కాన్సెల్టన్నీ చేస్తున్నాడట.
    విహాయ పెద్దగా నవ్వుతూ  "బాలకృష్ణని చూడండర్రా....బానలా  బొజ్జ  పెంచేసి  ఎలా తయరయ్యాడో!" అని అరిచింది.
    అందరూ ఎవరి  గోలలో  వాళ్ళున్నారు ప్రోగ్రామ్ ఏం జరుగుతోందో ఎవరూ  పట్టించుకోడంలేదు.
    నేనంటే పడి చచ్చిపోతుండే జానకీరాంకి అప్పుడే  బట్టతల వచ్చేసింది. ఈ నాలుగేళ్ళల్లో అందరూ  చాలా మారిపోయారు.
    జానకీరాం నన్ను చూసి  నవ్వి "ఎక్కడవుంటున్నారూ? నేను రైల్వేలో క్లార్క్ గా చేస్తున్నాను. సిస్టర్!" అన్నాడు. గతం అందరూ  చెరిపేసి వర్తమానం లో పరుగులు పెడ్తున్నారు. భవిష్యత్తు భూతంలా భయపెడ్తున్నట్లుంది!
    మేం అందరం డేవిడ్, ఎమ్.ఎఫ్. హు స్సేన్ అంత  ఆర్టిస్ట్ అయిపోతాడు అనుకునేవాళ్ళం! ఖమ్మంలో కిరాణాషాప్ పెట్టుకున్నాడట.
     విజయ నవ్వుతూ "ఇంకా బొమ్మలువేస్తున్నావా?" అంటే- "పొట్లాలు కట్టడంలోనే సరిపోతోంది!" అంటూ నవ్వాడు. ఆ నవ్వులో జీవంలేదు.
    ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూవుండే సలీం అసలు నవ్వే మరిచిపోయినట్లు అయిపోయాడు.
    బలవంతంగా నవ్వితే మూతిపక్కన గీతలు పడి ముసలివాడిలా కనిపిస్తున్నాడు. "ఆర్.టీ.సి.లో వర్క్ చేస్తున్నాను" అన్నాడు.
    మనసుల్లోని అలజడులనీ, ఆలోచనలనీ, ఆవేదననీ, ఆరాధనలనీ  దాచే జలతారు ముసుగు దరహాసం! ప్రపంచంలోని కుళ్ళునీ, రొచ్చునీ, మూర్ఖత్వాన్నీ దాచడానికి పైన వేసే మేలిముసుగు కవిత్వం! అందరి మొహాలూ పలకరించగానే నవ్వుతున్నాయి. కానీ మనసుల్లోంచి నవ్వేవాళ్లు ఎంతమంది?
     అందరూ అప్పటి రూపూ, రుత్తా లేకుండా రంగు వెలసిన బొమ్మల్లా  తయరయ్యారు.
    నేను కలుసుకొవాలనుకున్న నా  ప్రియ స్నేహితులంతా మరబొమ్మల్లా మారిపోయారు! నా స్వప్న సౌధం బీటలు వారి పగుళ్ళుతీసింది. అసలు ఇక్కడికి రాకపోయినా బాగుండేదేమో!!!
    అప్పటి ఆ ఉత్సాహవంతులైన యువకుల స్ధానంలో ఇప్పుడిక ఈ నిరుత్సాహపూరితపు ముఖాలే దర్శనం ఇస్తాయి కాబోలు!
    అప్పటి అల్లరీ.... చనువులూలేవు!' అమ్మా ....తల్లీ....సిస్టర్....' అంటూ  తెచ్చిపెట్టుకున్న పెద్దరికాలూ! పెద్దవాళ్ళని సంబోధించినట్లు 'మీరు.... మీరు' అను కొవడాలూ  నాకు ఎబ్బెట్టుగా అనిపించింది.
    విజయ సడెన్ గా "నీ పర్సు ఏదే?" అంది.
    "అక్కడ కుర్చీమీదే పెట్టాను. ఉండు తెస్తాను" అంటూ వెనక్కి వెళ్ళాను.
    నేను వదలివెళ్ళిన పుస్తకంలో పెన్ క్యాప్ తీసి పెట్టి వుంది. నేను వ్రాసిన కవిత క్రింద  గ్రీన్ ఇంక్ తో  ఇంకో  పంక్తి వ్రాసి వుంది! నేను ఆశ్చర్యంగా చదివాను.
    'తీయ తేనియ తలపులే బోయీలై....
    మల్లెల మధురోహల మేనాలెత్తిన వేళ....
    స్వప్నవీధుల గుండా  స్వర్గం  దారి వెతుకులాడు చుండగా....
    భూమ్మీద నువ్వు కనపడ్డావు...చటుక్కున తిరిగొచ్చాను' -ఎస్.
    క్రింద ఆ 'ఎస్' అన్న సంతకం చూడగానే నా గుండె గుభేలుమంది.
    ఈ 'ఎస్' ఎవరు? ఇంత అద్భుతమైన భావుకత్వం ఒలికించగల ఈ 'ఎస్' ఎక్కడ?
     విజయ నా భుజం మీద కొట్టి "ఈ రోజు స్పెషల్  ఎట్రాక్షన్ మన శరత్ చంద్ర! అదేనే మనకి సీనియర్... ప్రెసిడెంట్ గా  వుండేవాడు చూడూ! ఇప్పుడు సినిమాలలో పాటలు వ్రాస్తున్నాడట!" అంది.
    "శరత్ చంద్ర!" అపనమ్మకంగా అడిగాను.
    "ప్రొద్దుటి నాకు ఫోన్ చేశాడు. ఆఁ...అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. నీ ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు! గొప్పపేరు సంపాదించినా ఇంకా గర్వం రానట్టుంది పాపం!" అంది.
    ఎస్... ఎవరూ అన్న సస్పెన్స్ మంచు విడిపోయినట్లు విడిపోయింది.
    నాకు నెమ్మదిగా  అతని రూపం గుర్తొచ్చింది.
    కాలేజి రోజున' తెరచివుంచేవు సుమాత్వరపడీ నీ హృదయమూ' అని పాడి నేను స్టేజ్ దిగి వచ్చేస్తుంటే, అతను ముందుకి వచ్చి "అద్భుతం!" అన్నాడు.
    మరునాడు క్యాంటిన్ లో....నాకోసం 'కృష్ణపక్షం' పుస్తకం పంపిస్తూ 'మీ కోసం....నాకోసం...కృష్ణశాస్త్రి గారి ఆత్మసంతృప్తికోసం ఈ పుస్తకం తీసుకోవాలి!' అని  వ్రాసి పంపించాడు.
    నేను తీసుకోలేదు. వెనక్కి పంపించేశాను.
    ఆ తర్వాత  అతను తరచూ  ఎదురవుతున్నాడో.... లేక నేనే  ఎక్కువగా అతన్ని వెదుకుతున్నానో అర్ధమయ్యేది కాదు! కానీ  అస్తమానం కనిపించేవాడు.
    మాట్లాడేవాడు కాదు! అదోరకంగా చూసేవాడు. ఆ చూపు నన్ను చిత్రమైన బాధకి గురిచేసేది!
    మేం డిగ్రీ   సెకండ్ ఇయర్ తో  వుండగానే అతను డిగ్రీ అయి వెళ్ళిపోయాడు.
    ఆ తర్వాత నేను మరిచి పోయాను.
    యవ్వనం తొలిరోజుల్లో ప్రేమలూ... రైలు ప్రయాణంలో కలిసే స్నేహాలూ ఎంత త్వరగా కలుస్తాయో.... అంత త్వరగా మాసిపోతాయి!
     "గుర్తొచ్చాడా?" భుజంతట్టి నన్నీ  లోకంలోకి తెస్తూ అడిగింది విజయ.
    నేను  అప్పటికే ఆత్రుతగా కళ్ళతో అతన్ని గాలించడం మొదలు పెట్టాను.
    "మీ పక్కనే వున్నాను" అని వినిపించి, గిరుక్కున తిరిగి చూశాను.
    శరత్ చంద్ర  నవ్వుతూ నిలబడ్డాడు. మనిషీ ఇది వరకు కంటే అందంగా , హుందాగా కనిపించాడు.
    అప్రయత్నంగా "నమస్తే" అన్నాను.
    అతను తలఊపి నన్ను పరీక్షగా ఆపాదమస్తకం చూడసాగాడు.
    విజయ "హాయ్..." అని పలకరించింది.
    అతను ప్రతిగా "హాయ్...." అని నాతో" అనూహ్య గారూ ఎలా వున్నారూ? ప్రొద్దుట నేను పంపిన పువ్వులు తిప్పికొడ్తారేమోనని భయంవేసి ఎడ్రెస్ రాయలేదు!" అన్నాడు.
    నేను సిగ్గుతో  తలవంచుకున్నాను.
    అతనింకా 'కృష్ణపక్షం' మరిచిపోలేదన్నమాట!
    నేను అతికష్టంమీద-
    "మీరు ఈ కవిత చక్కగా పూరించారు" అన్నాను.
    "అసంపూర్తిగా వదిలెయ్యడం మీకు  అలవాటేగా" అన్నాడు.
    అలా అంటాడని నేను అస్సలు ఊహించలేదు. ఇబ్బందిగా చూశాను.
    "పెళ్ళైందా?" అడిగాడతను.
    "ఆఁ!మీకూ...." అడిగాను.
    "ఉహూ! కాదుకూడా... ఎందుకంటే త్వరపడి హృదయాన్ని తెరచివుంచాను....ఓ సుందరి బిరబిరా  జొరబడిపోయింది... ఇంక స్ధలం లేదు" గంభీరంగా అన్నాడు అతను.
    నేను ఊపిరి  అందనట్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. తలఎత్తి అతనివైపు చూసే దైర్యం చెయ్యలేక పోయాను! నేను  ఎత్తయిన పర్వత శ్రేణిమీదో....లేక  జలగర్భంలోనో ఆక్సిజన్ లేక విలవిలలాడుతున్నట్లుగా ఫీలయ్యాను.
    సమయానికి విజయ వచ్చి రక్షించింది.
    శరత్ చంద్ర తో  సినీఫీల్డు గురించీ , అతను వ్రాసిన లిరిక్స్ గురించీ సంభాషణ ప్రారంభించింది.
     నేను మాత్రం వేయికళ్ళు  నన్ను ఆపాదమస్తకం గుచ్చిగుచ్చి చూస్తున్నట్లుగా అయి స్దిమితంగా వుండలేకపోయాను.
    సభాకార్యక్రమంలో ప్రిన్సిపాల్ గారు  శరత్ చంద్రని స్టేజిమీదకి పిలిచి  పొగిడారు.
    శరత్ చంద్ర  తను స్వయంగా  వ్రాసిన ఓ పాట  కూడా పాడాడు.
    ఆ పాటలో చరణాలు నన్ను గురించేనేమోనన్న పూలిష్ ఆలోచనలతో నేను ఉద్వేగానికి లోనయ్యాను. స్లైట్ గా నా టెంపరేచర్ పెరిగింది.
    మల్లెలూ, మకరందాలూ, తెలివెన్నెలలో కొబ్బరాకు చందం.... ఇటువంటి భాష విని ఎన్నాళ్ళయిందీ? అనిపించింది.
    వచ్చేస్తుంటే శరత్ చంద్ర తన  జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అందిస్తూ "ఫోన్ చేస్తారని నమ్మకం లేదనుకోండీ" అన్నాడు అదోలా చూస్తూ.
    నేను ఒక్కమాటన్నా మాట్లాడలేదు మౌనంగా అందుకొని "బై" అన్నాను.  
                

 Previous Page Next Page