Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 33


    "అవును బాబూ ! నేను ఆ భూతరాజునే !" తాపీగా సమాధానం ఇచ్చాడు.

 

    "నువ్విక్కడి కెలావచ్చావ్ ?" బెదురుగా చూస్తూ వంగి నంగిగా అడిగాను.

 

    "అదేంటి బాబూ ! నేను ఇక్కడికి రాక ఎక్కడి కెళ్తాను?"

 

    "భూతరాజు నా దగ్గరే ఉంటాడు. నీ కోసం స్టేషన్ కు పంపించాను" అన్నాడు భైరవమూర్తి.

 

    "నా మాట మీరు నమ్మలేదు. నేను ఎప్పుడో ఇంటి కొచ్చాను."

 

    "ఎట్లా వచ్చావ్ ఇంత త్వరగా?" అయోమయంలో నుంచి బయట పడకుండానే ప్రశ్నించాను.

 

    "అడ్డదోవన ! నా మాట మీరు వినలేదు."

 

    అప్పటికి నాకు ధైర్యం వచ్చింది. అరచేత్తో నొసలు రుద్దుకున్నాను.

 

    "ముందు మరో గ్లాసు మంచి నీళ్ళివ్వు !" ధైర్యంగా అడిగాను.

 

    భూతరాజు ఇచ్చిన మంచినీళ్ళు గట గట తాగేశాను.

 

    "ఇంకా కావాలా బాబూ ?" ఖాళీ గ్లాసు అందుకొంటూ అడిగాడు.

 

    "వద్దు !"

 

    "భూతరాజూ"! గ్లాసు తీసుకొని లోపలకు వెళ్ళబోతున్న భూతరాజు ఆగి నాకేసి చూశాడు.

 

    "నువ్వు నాతో వస్తూ అకస్మాత్తుగా అలా మాయ మయ్యావేం?"

 

    "మాయం అవడానికి నేనేం దయ్యాన్నా బాబూ?"

 

    "మరి ఏమయ్యావ్ ?"

 

    "గబగబా అడ్డదారిన పడి వచ్చేశాను."

 

    "అదే ఎందు కంటున్నాను ?"

 

    "ఆ రహమాన్ గాడు వస్తున్నట్టు తెలిసి..."

 

    "వస్తే ఏం ?"

 

    "బాబోయ్ ! వాడు దయ్యం అని మీకు తెలియదు కనక వాడితో మీరు ఇంత దూరం ప్రయాణం చేశారు. తెలిసి తెలిసీ నేనెట్టా వాడితో ప్రయాణం చేస్తాను బాబూ ?"

 

    నేను భూతరాజు కేసి వెర్రివాడిలా చూశాను.

 

    "రహమాన్..."

 

    నా గొంతులో నుంచి పై మాటలు పెగల్లేదు.

 

    అసలు దయ్యాలు వీళ్లా లేక రహమానా?


                                                     *    *    *


    "ఇంకా ఏమిటా రాతలు, పడుకోక?"

 

    ఆడగొంతు.

 

    శివప్రసాద్ కుర్చీలోనే ఇంతెత్తున ఎగిరిపడ్డాడు.

 

    "ఏమిటండీ అంత భయపడిపోయారూ?"

 

    శివప్రసాద్ భార్య ముఖంలోకి ఓ క్షణం "ఇదీ దయ్యమేనా?" అన్నట్టు చూశాడు.

 

    "ఏమిటలా చూస్తారు ? ఈ ముదనష్టపు నవల ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో గాని మనిషి మనిషిలో లేరు!"

 

    తన భార్యే ! కృష్ణవేణి !

 

    తను ఇంట్లోనే ఉన్నాడు.

 

    "పది లంఖణాలు చేసి నిన్ననే పథ్యం తీసుకున్నారు. మళ్ళీ పొద్దుటినుంచి ఒకటే రాత!" కృష్ణవేణి నస.

 

    శివప్రసాద్ భార్య ముఖంలోకి చూశాడు.

 

    "మరి రాయకపోతే ఎలా ? ఆ అడ్వాన్సు కాస్తా నా జబ్బుకే సరిపోయినట్టుంది!" అన్నాడు దిగులుగా.

 

    "ఇక చాల్లే, పడుకోండి పదకొండు దాటిపోయింది" అన్నది కృష్ణవేణి.

 

    "పడుకుంటాలే! నువ్వు పడుకో!"

 

    "మళ్ళీ రాస్తారా?"

 

    "ఓపిక లేదు. ఇక పడుకుంటాను. కాగితాలన్నీ సరిగా సర్దాలి. రేపు పొద్దుటే 'వెలుగు-చీకటి' ఆఫీసుకెళ్ళాలి" అన్నాడు. వ్రాసిన కాగితాలను బొత్తిగా పెట్టి పేజీనంబర్లు చూసి, టాగ్ గుచ్చాడు.

 

    "బియ్యం పప్పులూ రేపటికి అయిపోతాయి."

 

    "కిరాణా కొట్లో అప్పు తీసుకో!"

 

    "ఇవ్వనంటున్నాడు."    

 

    "పాత బాకీ తీర్చాంగా!"

 

    "ఎక్కడా? ఆరొందలకు మూడొందలేగా ఇచ్చాం! మొత్తం ఇస్తే గాని మళ్ళీ ఇవ్వడట"

 

    "సరే, రేపు చూస్తాలే! రాసినంతవరకు తీసుకెళ్ళి ఇస్తాను. మరో వెయ్యి రూపాయలు అడుగుతాను."

 

    "ఇస్తాడంటారా?" అపనమ్మకంగా అడిగింది.

 

    "ఎందుకివ్వడూ?" చాలా ఆత్మ విశ్వాసంతో అన్నాడు ప్రసాద్.

 

    కృష్ణవేణి వెలుగారిపోయిన కళ్ళల్లోకి ఓ క్షణం వెలుగొచ్చింది. అంతలోకే ఇట్టే ఆరిపోయింది. భర్త మాటల్ని నమ్మలేనట్టు ముఖంలోకి చూసింది.

 

    శివప్రసాద్ కు భార్యమీద జాలివేసింది.

 

    "బాధపడకు, త్వరలోనే మంచి రోజులొస్తాయి. వెళ్ళి పడుకో" అన్నాడు శివప్రసాద్.

 

    ఆమె భర్తను ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయింది.

 

    శివప్రసాద్ కాగితాలు బొత్తిగా బల్లమీద సర్దిపెట్టి వెయిట్ పెట్టాడు.

 

    లేచి వెళ్ళి పక్కమీద నడుం వాల్చాడు.

 

    వళ్ళంతా విరగ్గొట్టినట్టుగా ఉంది.

 

    కళ్ళు మూసుకొన్నాడు.

 

    నిద్రపోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు.

 

    భూతరాజు, రహమాన్, భైరవమూర్తి, ఈజిఫ్టు యువరాణి హెలెన్, ఫిరోన్ తీతాన్- ఒక్కొక్కరే బుర్రలో అల్లరి చేస్తున్నారు.

 

    నిజంగానే మనసులో భయంగా ఉంది.

 

    తను రాస్తున్న కథకు తనే భయపడ్తున్నాడా?

 

    పాఠకులు తప్పక పిచ్చెక్కినట్టు చదువుతారు.

 

    తన పేరు బ్లో ఆన్ అవుతుంది.

 

    ఛ! ఏమిటి? తను ఇలా ఆలోచిస్తున్నాడు.

 

    లేచి వెళ్ళి రెండు కాంపోజ్ టాబ్ లెట్సు వేసుకొన్నాడు.

 

    అయినా బుర్రలో ఏదో ధనాధనా తిరుగుతూనే ఉంది.

 

    కణతలు అదురుతున్నాయి.

 Previous Page Next Page