"అలా కూర్చోండి." గోడ పక్కగా ఉన్న పాతకాలపు పడక కుర్చీ చూపించాడు.
"ముందు భైరవమూర్తిని చూడాలి."
"నేనేనని చెప్పడం లేదూ ?"
"అబద్ధం !"
"ఎందుకలా భావిస్తున్నావ్ ?"
"భైరవమూర్తికి తొంభయ్ రెండేళ్ళు."
"అవును! నాకు తొంభయ్ రెండేళ్ళే!"
"నేను నమ్మను !" అంటూ అతన్ని చూశాను.
అతను చిరునవ్వు నవ్వాడు.
ఇతను నవ్వకుండా ఉంటే బాగుండును అన్పించింది.
అతన్ని పరిశీలనగా చూశాను.
ఇతను భైరవమూర్తా ?
ఇతనికి తొంభయ్ రెండేళ్ళా ?
జుట్టు నల్లగా ఉంది. వత్తుగా కూడా ఉంది.
శరీరం వ్యాయామం చేసినట్టు బలిష్టంగా ఉంది.
నలభై ఏళ్ళకంటే ఎక్కువ అని నమ్మకం అసంభవం.
అసలు నలభై ఏళ్లే ఉంటాయి. తనను తమాషా పట్టించడానికే అలా రాసి ఉంటాడు.
మళ్ళీ అతనికేసి చూశాను.
అతను ఉయ్యాల గొలుసులు పట్టుకొని చిన్నగా ఊగుతున్నాడు.
అతని శరీరపు రంగు గోధుమ రంగు.
జరీ అంచు పంచె కట్టుకొని. కంటెమెడ కోటు వేసుకొన్నాడు. అచ్చం గోడమీద చిత్రాలలో ఉన్నవారి వేషధారణలాగే ఉంది ఇతని వేషధారణ కూడా.
"కూర్చో!" అధికారం ఉట్టిపడే స్వరం నా తలలో లేస్తున్న ఆలోచనల మీద దెబ్బ చరిచింది.
నేను యాంత్రికంగా వెళ్ళి కూర్చున్నాను.
"నేనే భైరవమూర్తిని ! నిన్ను రమ్మని రాసింది నేనే !"
నేను చూడడం మినహా ఏమీ అనలేదు.
"ప్రయాణం బాగా సాగిందా ?" అతని గొంతు అదోలా ధ్వనించింది.
"బా.....బా....." ఆపైన మాటలు పెగల్లేదు.
నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానో వీడికి ముందే తెలిసినట్టుగా ఉంది.
ఎలా తెలిసింది ?
రహమాన్ మాటలు గుర్తొచ్చాయి.
'భైరవమూర్తికి కోపం వస్తే నన్నూ, నా బండిని ఎత్తి పారెయ్యగలడు' అని అన్నాడు.
"ఎలా వచ్చావ్ ?"
ఉయ్యాల ఊపు వేగం పెరిగింది.
"బండిలో!" ధైర్యం కూడదీసుకొంటూ అన్నాను.
నాకు నాలుక ఎండిపోతున్నట్టుగా ఉంది.
"ఏం బండి ?"
"గుర్రం బండిలో !"
"గుర్రం బండిలోనా ? ఇక్కడదాకా రాలేదా ?"
"లేదు. ఊరి బయటే వదిలేశాడు."
తల పంకించాడు భైరవమూర్తి.
అతని చూపుల్లో అంతకుముందులేని క్రూరత్వం తొంగిచూసింది.
"రహమాన్ బండా?"
"కా.....కాదు."
"ఎందుకంత భయం ? అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకేమిటి?" అన్నాడు అదోలా నవ్వుతూ.
నేను వెర్రిచూపులు చూశాను.
వీడికెలా తెలిసింది నేను రహమాన్ బండిలో వచ్చినట్లు?
నా అనుమానం నిజమేనేమో ?
ఆ రహమాన్ ను పంపించింది కూడా వీడే అయి ఉండాలి.
"వాడికి నేనంటే భయం !"
"అవును! వాడూ ఆ మాటే అన్నాడు." నేను గబుక్కున అన్నాను.
"అన్నాడా ! ఇంకా ఏమన్నాడూ ?" తీవ్రంగా చూస్తూ అడిగాడు.
"ఇంకేమీ అనలేదు. దాహం వేస్తోంది. కొంచెం మంచి నీరు ఇప్పించండి." పెదవులతో నాలుక తడుపుకొంటూ అన్నాను.
"రాజా ! మంచి నీళ్లు తీసుకురా !" లోపలకు చూస్తూ కేక పెట్టాడు.
అమ్మయ్య ! ఫర్వాలేదు. ఈ ఇంట్లో ఇంకా జనం ఉన్నారు. నేనే అనవసరంగా ప్రతిదానికీ బెదిరిపోతున్నాను.
ధైర్యంగా కుర్చీలో సర్దుకుని రిలాక్స్ డ్ గా కూర్చున్నాను.
వాకిలికున్న నల్లటి బరువైన పర్దా కదిలింది.
అప్పటివరకూ నేను ఆ హాలు కిటికీలకూ, వాకిళ్లకూ నల్ల పర్దాలు ఉన్నట్టు గమనించనే లేదు.
'ఇదేం టేస్టు బాబూ!' అనుకొన్నాను.
మంచినీళ్ల గ్లాసు చెయ్యి నాకేసి వచ్చింది.
గ్లాసు అందుకొంటూ అతడ్ని చూశాను.
నా చేతిలోని గ్లాసు ఎగిరి అల్లంత దూరానపడి శబ్దం చేస్తూ దొర్లింది. అది గ్లాసు దొర్లిన శబ్దంలా అన్పించలేదు నాకు. ఎవరో స్త్రీ అతి దారుణంగా ఆర్తనాదం చేసినట్టుగా అన్పించింది.
నేను గాభరాగా లేచి నిల్చున్నాను.
"ఏమైంది ? ఎందుకలా బెదిరిపోతున్నారు?"
భైరవమూర్తి అడుగుతున్నాడు.
కాని నా కళ్ళు మాత్రం మంచి నీళ్లు తెచ్చినవాడి ముఖం మీదనే ఉండిపోయాయి. శిలాప్రతిమలా నిల్చిపోయాను.
"ఏంటి బాబూ ! అంత బెదిరిపోయారు ?"
"నువ్వు..."
"నేనే బాబూ !"
"నువ్వు...ఆ..."