Previous Page Next Page 
పిపాసి పేజి 32


    "హూ.... భార్యాభర్తల ఋణానుసంబంధం అప్పులు తీర్చుకోవడం కాదు. అనురాగాలు పంచుకొని అభిమానాలు పెంచుకుని అది నీకర్థం కాదులే. నీతో చెప్పినా వ్యర్థం."


    "అవును నా స్టాండర్డుకి మీరు చెప్పింది అర్థం కాదు." కోపంతో ఉడికిపోతుంది రాధిక.


    అంతలో ఇల్లొచ్చేసింది, ఇద్దరూ కారు దిగి మౌనంగా లోపలకెళ్ళారు. గబగబా బట్టలు మార్చుకుని, మంచం మీద పడుకుంది రాధిక. మధన్ కూడా బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న రాధికకి దగ్గరగా కూర్చున్నాడు. ఛెంగున లేచింది రాధిక.


    "పడుకో" నవ్వుతూ అన్నాడు మధన్. ఆ నవ్వు ఆమెను చూసి హేళన చేస్తూన్నట్టుగా అనిపించింది ఆమెకి. లేచి అవతలి గదిలోకి వెళ్ళబోయింది.


    "ఏం? నేనఖ్కర్లేదా?"


    "నా అవసరం వుంటేగా?"


    "ఎందుకులేదు? ఈ మదనుడికి, ఆ మదనుడిలాగా, అష్టభార్యలులేరు పదహారువేలగోపికలూ లేరు. ఒక్క ఈ రాధ తప్ప." అన్నాడు కృష్ణుడు లాగా ఫోజుపెట్టి నుంచుని.   


    "ఏమో! ఎవరికి తెలుసు?"


    "ఓహో.... అదీ అనుమానమేనన్నమాట. అన్నీ అనుమానాలే అయితే జీవించడం కష్టం."       


    "అవును కష్టమయినా జీవించదలచుకున్నాను. నా లక్ష్య సాధన కోసం." కసిగా అంది రాధిక.


    "ఏమిటో ఆ లక్ష్యం."


    "మీరే చూస్తారుగా, అంటూ అవతలిగదిలోకెళ్ళి తలుపులు దభాలున మూసుకుంది." రాధీ తలుపు తియ్యి అని మధన్ ఎంత బతిమాలినా తియ్యలేదు.


    "ఛీ.... అజ్ఞానురాలు" అనుకుంటూ కలత మనస్సుతో ఏ అర్థరాత్రికో నిద్రపోయాడు మధన్.


    "ఛీ..... ఛీ... ఎంత కఠినుడు. నా మనస్సు తెలుసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నం చెయ్యకుండా తనమాటే వేదం అనుకునే మూర్ఖుడు. కళకోసమే నాట్యం చెయ్యాలిట  కళ కోసమే బ్రతకాలిట. పెద్ద కళాప్రియుడు అయితే అతను ప్రేమించింది నా కళనే కాని నన్నుకాదన్నమాట. మొహం" అని చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.


    ఏడ్చి ఏడ్చి అలసిపోయిన రాధిక ఏ అర్థరాత్రికో నిద్రలో జారుకుంది.


    "టెలిగ్రామ్ అన్న కేక విని నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు సత్యం. ఎక్కడ ఏం కొంపలంటుకున్నాయో అని భయపడుతూనే విప్పి చదివాడు. తన కళ్ళను తాను నమ్మలేనట్టు ఒకటికి నాలుగు సార్లు చదివాడు. కల కాదు కదా అని గిల్లి చూచుకున్నాడు. సంతోషంతో ఎగిరి గంతేశాడు. తను ఏనాడో అప్లై చేసిన పి.హెచ్.డి కోర్సుకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందని గవర్నమెంటు ఆఫ్ ఇండియా వాళ్ళు పంపిన టెలిగ్రాం అది ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్ళడానికి సరిగ్గా వారంరోజులు టైముంది. వెంటనే వెళ్ళి ఈ శుభవార్త మధన్ కీ చెప్పాలనుకున్నాడు. గడియారం చూస్తే నాలుగవుతోంది." ఇప్పుడు వెళ్ళి నిద్దరలేపడమెందుకులే" అని మళ్ళీ పడుకున్నాడు. రకరకాల ఊహలు భావిజీవితాన్ని గురించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నిద్దరపట్టక పక్కమీద దొర్లుతూ కూర్చున్నాడు.


    చూస్తుండగానే గడియారం ఆరుగంటలు కొట్టింది. లేచి మొహం కడుక్కుని కాఫీ చేసుకు తాగి ప్రయాణానికి బట్టలు సర్దుకున్నాడు. తిన్నగా మధన్ దగ్గరి కొచ్చాడు. పొద్దున్నే పెళ్లికొడుకులా ముస్తాబైవచ్చిన సత్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మధన్ ఇంట్లో వాళ్ళంతా, రాత్రంతా నిద్దర సరిగాలేదేమో మధన్ కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. రాధిక కూడా అలాగే వుంది. వారి వాడిన మొహలకి కారణాలు మరోలా ఊహించుకుని నవ్వుకున్నాడు సత్యం. "ఏవిరా పొద్దుటే వచ్చావ్. అన్నాడు మధన్ కాఫీ తాగుతూ "ఒరేయ్ గుడ్ న్యూస్ రా" అంటూ టెలిగ్రాం చూపించాడు సత్యం.


    "కంగ్రాచ్యులేషన్స్" అంటూ అమాంతం కౌగలించుకున్నాడు మధన్. "ఏమిటిరా..... ఏమిటిదంతా? ఏం జరిగిందసలు పప్పన్నం పెట్టిస్తున్నావేమిటి?" అంటూ వంటింట్లో నుంచి రాజేశ్వరమ్మ సాంబశివరావుగారూ వచ్చారు. వెనకాలే రాధిక కాఫీ పట్టుకొచ్చి సత్యానికిచ్చింది. సత్యం అమెరికా వెళ్తున్నాడమ్మా  పై చదువుకి స్కాలర్ షిప్పు వచ్చింది. ఒక రెండేళ్ళు మనకి కనిపించడు." అన్నాడు మధన్.    


    "చాలా సంతోషం నాయనా" అంది రాజేశ్వరమ్మ.


    "నువ్వూ మధన్ అన్నదమ్ముల్లా తిరిగేవారు. మధన్ ఒంటరివాడయిపోతాడు." అన్నాడు సాంబశివరావుగారు.


    "భలేవారే మీరు ఒంటరివాడెందుకవుతాడు? జంటగా మా చెల్లెమ్ముండగా. ఒరేయ్ మధన్ నేతిరిగొచ్చేసరికల్లా మీరిద్దరూ ముగ్గురవ్వాలి తెలుసునా?" రాధిక మొహంలోకి చూస్తూ అన్నాడు సత్యం. నేలచూపులు చూసింది రాధిక.


    "అవునురా. రాత్రి టెలిగ్రాం వచ్చిందో లేదో అప్పుడే ప్రయాణం కట్టావేమిటి?" అన్నాడు మధన్.     


    "ఒరేయ్ ముందు ఢిల్లీలో ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంటుకి వెళ్ళి వివరాలు తెల్సుకోవాలి. చూచుకోవాలి. దానికే ఓ రెండు మూడురోజులుపోతాయి. అక్కడి నుంచి ఇంక ఎంత టైముంటుందమ్మా. సరే కాని శాంక్షన్ చేయించుకోవాలి. ఓ.కే" అయిదు నిమిషాలు అంటూ సబ్బూ తువాలు తీసుకుని బాత్ రూమ్ లోకెళ్ళాడు మధన్.  


    "క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆమె.


    "అమ్మా..... చిన్నప్పటి నుంచి అమ్మా అన్న ఆ పిలుపుకే నోచుకోని నేను మీలో అమ్మని చూసుకున్నాను. మీ కుటుంబంలో ఒకణ్ణయిపోయాను. కన్నీళ్ళు పెట్టుకోక, నన్నాశీర్వదించండమ్మా" అన్నాడు సత్యం తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ.     


    చేతి రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు మధన్.

 Previous Page Next Page