"దొరగోరూ....అమ్మగోరు చచ్చి..పోయారు" అన్నాడు జీతగాడు ఏడుస్తూ.
సీతాపతికి ఏమీ అనిపించలేదు. మామూలు మాట విన్నట్లే విని వూరుకున్నాడు. తల్లి మంచం దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. మాధవి నాయనమ్మమీద పడి ఏడుస్తూంది. సీతాపతి కళ్ళల్లో చెమ్మ ఏనాడో ఇగిరిపోయింది. పొడికళ్ళతో నిర్వికారంగా చూస్తూ వుండిపోయాడు.
క్రమంగా ఇరుగు పొరుగులు వచ్చారు. ఎక్కువమంది దృష్టి చనిపోయిన శాంతమ్మమీద లేదు - బ్రతికున్న మాధవిమీద వుంది!
33
"నీ బట్టలు సర్దుకో. కావాల్సిన సామాను కూడా సర్దు."
మాధవి భయంగా తండ్రి ముఖంలోకి చూసింది. సీతాపతి ముఖంలో కోపం లేదు ఆ ముఖంలో ఏ భావమూ లేదు.
"లే, లేచి ముఖం కడుక్కొని కాఫీ పెట్టు. అన్నం వండు. రెండు రోజులయింది తిని. భోజనం చేసి బయలుదేరదాం" అన్నాడు.
తండ్రి మాధవితో ఏనాడూ మాట్లాడలేదు. ఆ రోజు అంత సాత్వికంగా మాట్లాడుతుంటే మరీ భయంవేసింది మాధవికి. లేచింది. తండ్రి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ఏనాడూ లేదు.
వంట పూర్తి అయింది. సీతాపతి సామానులు సర్దుతున్నాడు. మాధవి భయం భయంగా వచ్చి తండ్రి ప్రక్కగా నిల్చుంది. సీతాపతి తల ఎత్తకుండానే, "అన్నం తిన్నావా?" అని ప్రశ్నించాడు.
"ముందు మీరు తినండి, వడ్డిస్తున్నాను." కుంగిపోతున్న నవనాడుల్నీ కూడదీసుకుంటూ అంది మాధవి.
"నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను" అన్నాడు సీతాపతి.
మాధవి అక్కడనుంచి కదలలేదు. సీతాపతి చేస్తున్న పని ఆపి వెళ్ళి పీటవాల్చుకొని కూచున్నాడు. మాధవి వడ్డించిన పళ్ళెం తెచ్చి అతని ముందు వుంచింది.
"నువ్వుకూడా పెట్టుకో!" అన్నాడు సీతాపతి అన్నం కలుపుకుంటూ.
మాధవికి తండ్రి ప్రవర్తన కొత్తగా అనిపించింది. ఏదో అజ్ఞాత భయంతో గుండెలు దడదడలాడాయి. అన్నం పెట్టుకొని తండ్రి ఎదురుగా కూచుంది. ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోబోయి బావురుమంది.
సీతాపతి తలెత్తి మాధవి ముఖంలోకి నింపాదిగా చూశాడు.
"ఊరుకో. ఏడ్చినందువల్ల లాభం యేమీలేదు. గుంటూరు వెళదాం. ఇక ఈ ఊళ్ళో మనం ఉండలేం" అన్నాడు నిర్లిప్తంగా.
మాధవికి తండ్రి గుండెల్లో తలదాచుకొని తనివితీరా ఏడవాలనిపించింది. తండ్రి పాదాలకు చుట్టుకుపోయి తనను క్షమించమని అడగాలనిపించింది. అతని చేతులమీదగా ఇంత విషం ఇవ్వమని వేడుకోవాలనిపించింది. కాని అందులో ఏదీ చెయ్యలేదు. ఉబికివస్తున్న దుఃఖంతోపాటు అన్నం ముద్దను బలవంతంగా మింగేసింది.
ఇద్దరూ భోజనం అయిందనిపించి లేచారు. మాధవి తన బట్టలు సర్దుకుంది. సీతాపతి-జీతగాణ్ణి, వెంకన్న కోసం పంపించాడు.
"ఏం దొరా! ఎక్కడికో వెళుతున్నారంటా?"
"అవును వెంకన్నా! గుంటూరు వెళుతున్నాం. ఈ ఇల్లూ, గొడ్లూ, పొలం నీకే అప్పగించి పోతున్నాను" అన్నాడు సీతాపతి.
"అదేం బాబూ? అక్కడే వుండిపోతారా?" విస్మయంగా ప్రశ్నించాడు వెంకన్న.
"అవును. అక్కడే వుండిపోదాం అనుకుంటున్నాను. పొలం నువ్వూ నీ పిల్లలూ చేసుకోండి. నీకు తోచిందేదో ఇవ్వు. నేను అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాను" అన్నాడు సీతాపతి.
"ఊరు వదిలేసి వెళ్ళిపోతారా బాబూ?" దాదాపు ఏడుస్తూనే అన్నాడు వెంకన్న.
"ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? వస్తూనేవుంటాగా?" అన్నాడు సీతాపతి.
"ఎట్లాంటి కుటుంబం ఎట్టా అయిపోయిందో!" అనుకున్నాడు వెంకన్న కళ్ళు వత్తుకుంటూ.
జీతగాడు సవారిబండి తీసుకొచ్చి వాకిట్లో నిలబెట్టాడు. మాధవి బండి ఎక్కింది. వెంకన్నా, జీతగాడూ సామాను బండిలోకి సర్దారు. సీతాపతి తలుపు తాళంవేసి బండి దగ్గరకు వచ్చాడు. ఏదో దూరతీరాల్లోకి చూస్తున్నవాడిలా ఇంటికేసి ఒకసారి చూసి, యాంత్రికంగా వచ్చి బండి ఎక్కాడు.
జీతగాడు ఎడ్లును అదిలించాడు. బండి కదిలింది. వెంకన్నకు కడుపులో ఏదో కదిలినట్లయింది. కనిపించినంతవరకూ చూస్తూ, కన్నీళ్ళతో వీడ్కోలు ఇచ్చాడు.
34
ప్రకృతి నిట్టూర్చింది. ఇంటి ముందున్న వేపచెట్టు కొమ్మలు ఊగి ఊగి నిట్టూర్చాయి. అరుంధతి నిట్టూర్చుంది. ఆ ఇల్లూ, ఆ ఇంటి ప్రతి వస్తువూ, ఆ వాతావరణం- పోటీలుపడి చెప్పిన కథ అది. అది తన కథే. అవును ఆ ఇంటి కథ తన కథే.
అతను కదిలాడు. అరుంధతి మళ్ళీ మళ్ళీ చూసింది. అవును అతను కదులుతున్నాడు. లేచి నిల్చుంటున్నాడు. నిల్చున్నాడు. అతని కళ్ళు నిప్పుకణాల్లా మండిపోతున్నాయి. అతను తననే చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఆ వ్యక్తేనా? అవును - అతనే! కాని ఈ రూపంలో ఆ మనిషి కనిపించటంలేదు ఎక్కడా. ఎంత భయంకరంగా చూస్తున్నాడో! ముఖం పీక్కుపోయి, కఠోరంగా వుంది. రాతి యుగంలోని మనిషి, అతి క్రూరమృగాల మధ్య బతికిన మనిషి సరిగ్గా ఇలాగే వుండివుంటాడు.
అతను ఆమె ముఖంలోకి....కళ్ళలోకి...కాదు, సూటిగా గుండెల్లోకి చూస్తున్నాడు. ఏభయ్ ఏళ్ళు నిండిన అతను కొన్ని వందల ఏళ్ళుగా బరువుగా జీవిస్తున్నవాడిలా వున్నాడు. అతన్ని చూస్తుంటే ఆమెకు జాలివేసింది. అతను అలా కావటానికి కారణం ఎవరు? తనే, తనవల్లనే ఎదుటి వ్యక్తి జీవితం దారుణ హింసకు గురిఅయిందని తెలుసుకోవడం, తెలుసుకొని బాధపడటంకంటే నరకం మరోటి లేదేమో!
ఆ వ్యక్తి ముఖంలోకి మళ్ళీ చూసింది. ఆ మసక వెలుగులో అతని కళ్ళు మిణుగురు పురుగుల్లాగా- యుగాలుగా అంధకారంలో సంచరిస్తున్న మిణుగురు పురుగుల్లాగా ఎర్రగా కాలిపోతున్నాయి. అతని పెదవులు కదిలాయి. చిరునవ్వులాంటిది ఏదో ద్యోతకం అయింది. అది నవ్వేనా! శిలలు నవ్వగలవా? ఆ నవ్వుపొరల వెనక ఏదో నిగూఢరహస్యం దాగి వున్నట్లనిపించింది అరుంధతికి.
ఈ ఇంట్లో మనుషులు వున్నట్టులేదు, మృత్యువులోని నిస్తబ్దత ఆ ఇంటిని చుట్టేసివుంది. అతను తనకు ఎందుకు రమ్మన్నట్లు? బహుశా తనను చంపి కసి తీర్చుకోవాలనేమో? ఇన్ని సంవత్సరాల కసి అతని కళ్ళల్లో కరడు కట్టుకొని కనిపిస్తూనే వుంది. సందేహం లేదు, ఆ కసి నుంచి విముక్తి పొందటానికే తనను రమ్మన్నాడు. కానీ ఒకసారి తన బిడ్డను చూడగలిగితే ఆ తరువాత తను ఏమయినా తనకు దిగులులేదు.
"ఏం భయపడుతున్నవా?" పర్వతం గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చిన ధ్వనిలా వచ్చాయి ఆ మాటలు అతని కంఠంలోనుంచి.
ఆమె త్రుళ్ళిపడింది. ఇది మనిషి స్వరమేనా?
"లేదు," అన్నట్లు తల ఆడించింది.
"అలా కూచో!" వరండాలో వున్న బల్లకేసి చూస్తూ అన్నాడు సీతాపతి.
ఆమె కూచోలేదు, "మాధవి ఏదీ?" ఎలాగో అడగ గలిగింది.
"చూస్తావు. తొందరేం? పదిహేను సంవత్సరాలు చూడకుండా వున్నదానివి పదిహేను నిముషాలు ఓపిక పట్టలేవా?" అతని పెదవులు కదల్లేదు. కళ్ళే మాట్లాడాయి.
అతను గిర్రున తిరిగి లోపలకు అడుగుపెట్టాడు. అరుంధతి యాంత్రికంగా అతన్ని అనుసరించింది. మెల్లిగా ఇంట్లో కాలు పెట్టింది. ఆ ఇంట్లోని ప్రతి అంగుళంతో తనకు ఒకనాడు అనుబంధం వుండేది. ఆమెకు దుఃఖం వచ్చింది. ఆ ఇంటిమీద తనకు ఏర్పడిన మమకారం, జీవితపు అరుణోదయంలో ఏర్పడిన ఆ మమత తాలూకు రంగులు, తన హృదయపటలం నుంచి పూర్తిగా తుడిచి వేయబడలేదని అర్ధం చేసుకుంది.
లోపల ఆడుగు పెడుతూనే ఆమె కళ్ళు బిడ్డకోసం ఆత్రంగా నలుమూలలా గాలించాయి. ఎక్కడా మనుషులున్న అలికిడే లేదు. అతని ముఖం బిగుసుకొని వుంది.
"కూచో!" అన్నాడు.
అక్కడ రెండుమూడు కుర్చీలు వున్నాయి. అవి తను ఉన్నప్పుడు కూడా అక్కడే వుండేవి. వాటినిండా దుమ్ము వుంది. చాలాకాలంగా ఆ కుర్చీలలో ఎవరూ కూచున్నట్లులేదు. ఆమె నిలువెల్లా కంపించిపోయింది. తను వూహించింది నిజమే. ఇక్కడ మనుషులు నివసించటంలేదు. ఇతను అతనేనా? లేక అతని....అతని ప్రేతమా? కాదు అతనే....కాని తన బిడ్డ?
"కూచో!"
గబుక్కున యాంత్రికంగా కూచుంది. ఆమె జీవితంలో మొదటిసారిగా ఒకరి శాసనానికి లొంగిపోయింది. ఆమెను ప్రేమతో జయించగలరే కాని అధికారంతో ఇంతవరకూ ఎవరూ జయించలేదు.
"మాధవి ఎక్కడ? అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు?" బలవంతంగా గొంతు పెకలించుకుంటూ అంది అరుంధతి. అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా వుంది.
అతను పెద్దగా నవ్వాడు. ఆ నవ్వులో అతని హృదయంలో ప్రేలటానికి సిద్ధంగావున్న అగ్నిపర్వతాల తాలూకు పొగలు వెలువడ్డాయి.
అరుంధతి భయంగా చూసింది. "నన్నెందుకిలా చిత్రహింస చేస్తున్నావు?" అంది.
ఆమెకు వెంటనే తెలుగులోకి తర్జుమా అయిన ఒక ఇంగ్లీషు నవల గుర్తొచ్చింది. "వెండెట్టా" అవును- అందులో కూడా భర్త భార్యను ఇలాగే హింసిస్తాడు. చివరకు ఆమె భయంతో గుండెపగిలి చచ్చిపోతుంది.
"హుఁ చిత్రహింస! నీకు ఆ మాటకు అర్ధం కూడా తెలుసా?"
"కనీసం మీ అమ్మగారినైనా చూపించండి, మీకు పుణ్యం వుంటుంది. అలా నవ్వకండి!" అంటూ అతని పెదవులమీద కదిలిన చిరునవ్వును చూడలేక కళ్ళు మూసుకుంది.
"మా అమ్మగారు ఈ లోకంలో లేరు, కనుకనే నీకు ఈ గడప మరోసారి తొక్కే అదృష్టం కలిగింది."
"అత్తగారు చచ్చిపోయారా?"
"కాదు, ఆమె చంపబడింది!"
అరుంధతి అదిరిపడింది. "చంపబడిందా? ఆ చంపింది మీరేనా? అవును మీరే అయివుంటారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతోమంది మనుషుల్ని చంపినట్లు కనిపిస్తున్నారు." గబగబా అనేసింది దెయ్యం పూనినదానిలాగా.
"నేను కాదు చంపింది, నువ్వే!"
"నేనా?"
"అవును నువ్వే!"
అరుంధతి మాట్లాడలేదు. మౌనంగా తలవంచుకొని కూచుంది.
"మాధవి ఏమయింది? మాధవిని చూపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను." ఉద్వేగంతో ఉక్కిరిబిక్కరయిపోతూ అంది. దిగ్గున లేచింది. అతని దగ్గరకొచ్చింది. మరుక్షణంలో ఉక్కిరిబిక్కరయిపోతూ అంది. దిగ్గున లేచింది. అతని దగ్గరకొచ్చింది. మరుక్షణంలో తన కాళ్ళను పట్టుకుంటుందణి అతనికి తెలుసు.
"ఆగు! నన్ను ముట్టుకోకు!"
"నా బిడ్డ ఇక్కడలేదు. ఇంట్లో ఎవరూ లేరు. అసలు నన్ను చంపటానికి కాకపోతే ఎందుకు పిలిచావు?" అంది ఆమె ఉద్రేకంగా.
"నిన్ను చంపటానికా? నిన్ను చంపితే నాకు కసి ఎట్లా తీరుతుంది? నువ్వు బతికే వుండాలి. బతికివుండి చిత్రహింస అంటే ఏమిటో తెలుసుకోవాలి." తనకుతనే చెప్పుకుంటున్నట్లు అన్నాడు.
"మీ కాళ్ళు పట్టుకుంటాను, మాధవి ఏమయిందో చెప్పండి, ఎక్కడ వుందో చెప్పండి."
"ఇక్కడే వుంది - ఇప్పుడే చూస్తావు."
అరుంధతి కళ్ళు ఆనందంతో తళతళలాడాయి. హృదయంలో వాత్సల్యం పొంగి పొరలింది.
"ఒక షరతుమీద చూపిస్తాను."
భర్త ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఎన్ని షరతులకయినా ఒప్పుకుంటాను. త్వరగా చెప్పండి" అంది ఆత్రంగా.
"చెబుతాను అలా కూచో!" అన్నాడు సీతాపతి బరువుగా వున్న కంఠంతో.
అరుంధతి గత్యంతరంలేక మళ్ళీ కూచుంది. అసహాయమ్గా అతనికేసి చూసింది.
"మాధవికి తండ్రి ఎవరు?" అతని గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చాయి ఆ మాటలు. అరుంధతి అకస్మాత్తుగా వెన్నుదెబ్బ తిన్నదానిలా ఉలిక్కిపడింది. అర్ధంకానట్లు అతని ముఖంలోకి చూసింది. అతని ముఖం మీద ఇనుప పదార్ధాలు కనిపించాయి. అతని పిడికిళ్ళు బిగించివున్నాయి. ముఖంలో, మెడమీద పచ్చని నరాలు తేలివున్నాయి. ఆమె భయంతో వెర్రిచూపులు చూసింది.
అతను లేచి ఆమె దగ్గరకువచ్చి నిలబడ్డాడు. ఆమె ముఖంలోకి వంగి, ఆమె కళ్ళలో దాగివున్న రహస్యాన్ని పెకలించి వెలికి తియ్యాలన్నట్లు సూటిగా, తీక్షణంగా, లోతుగా చూశాడు.
ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఆనాడు తను అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు కసిగా ఏదో అనేసింది. ఆ తరువాత ఆమె పూర్తిగా ఆ విషయాన్నే మర్చిపోయింది. అందుకే అతను అడిగిన ప్రశ్నను వెంటనే అర్ధం చేసుకోలేకపోయింది.
ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తల వాలిపోయింది.
"చెప్పు - నిజం చెప్పు!" అరిచినట్టే అన్నాడు.
"మాధవి మీ కూతురే!" తాపీగా తొణక్కుండా అంది అరుంధతి.
"అబద్ధం! నిజం చెప్పు."
"నిజమే చెబుతున్నాను."
"అబద్ధం!" గట్టిగా అరిచాడు. అతని గొంతు ఉబికింది. నరాలు తేలివున్న చేతుల్తో ఉద్రేకంగా ఆమె గొంతు పట్టుకున్నాడు.
ఆమెకు ఊపిరి సలపలేదు. పెనుగులాడింది. అతను ఆమెను వదిలేశాడు.
"చంపేస్తాను, నిజం చెప్పు!"
"నిజమే చెబుతున్నాను. అసలు మాధవి ఎక్కడ?" ఈ ఇంట్లో మనుషులు వున్నట్లే" లేదు.
"అవును. ఈ ఇంట్లో మనుషులు లేరు. ఈ ఇంట్లో మనుషులు చచ్చిపోయి పదిహేను ఏళ్ళు అయింది."
"నన్నెందుకు రమ్మన్నారు?"
"నువ్వే వస్తానని రాశావుగా?"
"నా బిడ్డను ఒక్కసారి చూపించమని రాశాను."