"ఎలుగు కన్పించకుండా గుప్పెట్లో ఎలిగించుకున్నాను బాబూ! చెయ్యిమూసే దమ్ములాగాను. కుతి వుండబట్టలేక చేశా! తప్పయిపోయింది."
"కొండయ్యా! ప్రమాదం జరగనంతవరకూ ఎన్ని తప్పులు చేసినా నష్టమేమీ లేదనుకో. కాని మన చిన్న చిన్న తప్పులే ప్రమాదాలకు దారి తీస్తాయి. అందువల్ల క్రమశిక్షణ పాటించడం మాత్రం మర్చిపోకూడదు!"
"తప్పయిపోయింది బాబూ! మళ్ళీ పొరపాటు చెయ్యను!"
"సరే పడవను నీళ్ళలోకి తోయ్!"
"ముందు మీరెక్కండి బాబూ! త్వరగా తోస్తాను."
"లేదు. ముగ్గురం ఎక్కితే నీకు నీళ్ళలోకి తొయ్యడం కష్టమవుతుంది."
"అయితే అమ్మాయిగారిని ఎక్కనివ్వండి. అంతా బురద. దిగిపోతావుంది."
జ్యోతి పడవలోకి ఎక్కి కూర్చుంది. ఒడ్డున వున్న పడవ ఎక్కడం తను అనుకున్నంత తేలిక కాదని అనిపించింది జ్యోతికి. కొండయ్య నాలుగడుగులు నీటిలోకిలాగి, పడవను ప్రవాహానికి అడ్డం తిరిగిపోకుండా గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. సుందరం, సత్యం, నీళ్ళలోకి దిగి చెరి ఒక వైపునుంచీ ఎక్కి కూర్చున్నారు. కొండయ్య పడవను మరోసారి గట్టిగా లోపలకు తోసి అంచుపట్టుకొని మెల్లగా పడవలోకి పాకాడు. కొండయ్య ఎక్కుతున్నప్పుడు పడవ ఒరిగింది. జ్యోతి పళ్ళు బిగించి బింకంగా కూర్చుంది. వాలుకుపోతున్న పడవను తెడ్డువేసి ఎగువకు నడపసాగాడు కొండయ్య.
ప్రవాహానికి ఎదురు నడుస్తున్న పడవ ఎంతటికీ ముందుకు సాగుతున్నట్టని పించలేదు జ్యోతికి. వాలుకు వెళితే త్వరగా ఒడ్డుకు చేరవచ్చు గదా? ఎందుకు మరి ఎదురు నడుపుతాడు? ఆ ప్రశ్న అడగాలనే వుంది. కాని - ఆ మాత్రం కామ్రేడ్సుకు తెలియదా?
"చూశారా బాబూ ఏరు ఎట్లా పొంగుతావుందో? మనం వచ్చినప్పుడు ఇంత పొంగూలేదు. దూకుడూలేదు!" అన్నాడు కొండయ్య.
"పొంగిన వరద ఊరూ ఏరు ఎట్లా పొంగుతావుందో? మనం వచ్చినప్పుడు ఇంత పొంగూలేదు. దూకుడూలేదు!" అన్నాడు కొండయ్య.
'పొంగిన వరద ఊరూ నాడూ ఏకం చేసినట్లు విప్లవోద్యమాలు ముందుకు సాగే ఈ సామాజిక వ్యవస్థను నేలమట్టం చేస్తాయి.' జ్యోతి మనసులోనే అనుకుంది.
"అవును కొండయ్యా! రేడియోలో ఫ్లడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు" అన్నాడు సత్యం.
"ఏంది బాబూ?"
'రేడియోలో వరద ప్రమాదం గురించి హెచ్చరిక చేశారట!" అనాలోచితంగా అని జ్యోతి సత్యం ముఖంలోకి చూసింది. మధ్యలో తను కల్పించుకొని చెప్పకూడదేమో! సత్యం అదేమీ పట్టించుకోనట్టుగా కూర్చున్నాడు.
'విప్లవకారుడు ప్రజల భాషలోనే మాట్లాడటం నేర్చుకోవాలి!' ఎక్కడో చదివిన వాక్యం జ్యోతి స్మృతి పథంలో మెదిలింది.
'ఎగువన వానలు ముమ్మరంగా దంచితే ఈడ కిష్టమ్మ తల్లి పొంగుతుంది. ఇంత వరద ఈ పదేళ్ళుగా నేను చూడలేదు. గురకొయ్యలు పొడిచేదాకా ఈ వజాన వరద పొంగిందంటే కరకట్ట తెగొచ్చు!" తెడ్లతో కొండయ్య తెగ శ్రమపడుతూ అన్నాడు. పడవ చీమలా నడుస్తున్నది.
"వాలుకు తిప్పితే పడవ వేగంగా నడుస్తుంది గదా!"
సుందరం కనుబొమలు కలిపి చూశాడు.
సత్యం పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది.
"పిచ్చితల్లీ! వరదలో వాలుకుపడ్డ పడవ అలివి తప్పుతుంది. అలివి తప్పిన పడవ బోల్తాకొట్టినా కొట్టొచ్చు!" బలంతో తెడ్లు గుంజుతూ అన్నాడు కొండయ్య.
వెన్నెల్లో సత్యం నవ్వడం గమనించింది జ్యోతి. జ్యోతి చెయ్యి పడవలోంచి బయటకు పెట్టి నీటిలో ముంచింది. చేతి వేళ్ళను ఒరుసుకుంటూ నీరు ప్రవహిస్తూ వుంటే ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతూ వుంది.
"కామ్రేడ్ ప్రతిభా! విప్లవం వరదలాంటిది. గాలి వాటుకూ నీరు వాలుతూ కొట్టుకుపోయేవాళ్ళనే మనం రివిజనిస్టులు అంటాం. నిజాయితీపరుడైన విప్లవకారుడెవడో, విప్లవోద్యమాలు సాయుధ పోరాట దశ చేరుకున్నప్పుడే తెలుసుకోగల్గుతాం. అంతవరకూ విప్లవోద్యమాలలో అన్ని రకాలవాళ్ళూ వుంటారు." కామ్రేడ్ సుందరం గంభీరంగా చెప్పుకుపోతున్నాడు.
జ్యోతి మంత్ర ముగ్ధలా కూర్చుని వుంటున్నది. పండు వెన్నెల్లో, నిండు నీటిలో, పడవ ఊగుతూ పోతూ వున్నది. తన ముందున్న విప్లవ జీవితాన్ని ఊహించుకుంటున్న జ్యోతి మనసులో ఆనందానుభూతులు కృష్ణ వరదనీటి కెరటాల్లా లేచి పడుతున్నాయి.
దూరం అయిపోతున్న ఒడ్డు - తన వదిలి వచ్చేసిన ఒడ్డు - గుడ్డి వెన్నెల్లో కలిసిపోయి కన్పించడంలేదు. పడవ నదిలో దాదాపు నాలుగో వంతు దాటింది. పడవ నడుపుతున్న కొండయ్య చెమటలు కక్కుతున్నాడు. క్షణ క్షణానికీ ప్రవాహం వేగం పెరుగుతూ వుంది. ప్రవాహానికి వో మూలంగా నడుస్తున్న పడవ వేగం రానురానూ తగ్గిపోతున్నట్టుగా వుంది.
సుందరం బాబూ! మీరు చెప్పే పేదోళ్ళ రాజ్యం ఎప్పుడొత్తాదోగాని పోలీసోళ్ళ బెడద పడలేకుండున్నాం బాబూ!"
"ఏమైంది కొండయ్యా! పోలీసులు నీ పైన కూడా నిఘాపెట్టారా?" సుందరం ఆదుర్దాను అణుచుకుంటూ అడిగాడు. అలాంటి పరిస్థితుల్లో కొండయ్య పడవ ఎక్కడం ఎంత ప్రమాదమో ఆలోచించసాగాడు.
"మీ ఊరు - ఈచుట్టుపక్కల ఏ ప్రమాదమూ లేదనుకున్నాం. ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు కొండయ్యా!" సత్యం తన గాభారాను అణచుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
"మా ఊర్లో ఏంలేదు సత్యంబాబూ! మా బావమర్ది ఊరు కిష్టాయిపాలెంలో పోలీసులు పడి జనాన్ని బతకనియ్యడంలేదు. మా బావమర్ది ఊరొదిలేసొచ్చి మా ఇంట్లో దాక్కున్నాడు."
"కిష్టాయిపాలెంలో పోలీసు క్యాంప్ పెట్టారా!" జ్యోతి ఆదుర్దాగా అడిగింది.
"అవునమ్మా! రెడ్డప్పనాయుడ్ని మనోళ్ళు పంపినప్పట్నుంచి ఊళ్ళో మనుషుల్ని బతకనివ్వడం లేదంట! ఇప్పటికే పదిమందిని పట్టుకెళ్ళారంట! వాళ్ళనేం చేశారో అజాపజా లేదంట!"
"రెడ్డప్ప నాయుడెవరూ?" ఎవడై వుంటాడో ఊహించుకుంటూనే అడిగింది.
"వర్గ శత్రువు!" సత్యం సమాధానం ఇచ్చాడు.
"ప్రజాద్రోహినే ఖాతం చేసి ప్రజలను వాడి పీడననుంచి విముక్తుల్ని చేశాం!" సుందరం అన్నాడు.
"ఊళ్ళో పెద్ద భూస్వామి అయిన రెడ్డప్పనాయుణ్ణి, వర్గశత్రు నిర్మూలన కార్యక్రమంలో మనవాళ్ళు చంపేశారుగద! మరి ఊళ్ళో ప్రజలంతా మనం చేసిన దాన్ని మెచ్చుకోలేదా! దుర్మార్గుడి పీడ విరగడైందని బీదజనం అంతా మనవైపు మొగ్గు చూపలేదా కొండయ్యా?" జ్యోతి అడిగింది.
"ముందు ముందు అట్లానే అనుకున్నారు. రెడ్డప్పనాయుణ్ణి చంపిన తరువాత,ఆయన పెద్దకొడుకు దొరయ్యాడమ్మా! సుబ్బుల్నాయుడు పోలీసోళ్ళను ఎంటేసుకొని ఇల్లిల్లూ దూరి, పెద్దా - చిన్నా, ఆడా - మగా, అన్నది కూడా సూడకుండా జనాన్ని సీతక బాదించేశాడు. మనోళ్ళు తగలపెట్టిన వేలిముద్దర్లు ఏయించికున్నాడంట! మా బావమర్ది దొరికితే నిలువునా పాతి పెట్టిత్తానంటున్నాడంట తల్లీ!"
"ఇంత ఘోరం జరుగుతుంటే జనం ఎదురు తిరగడం లేదా కొండయ్యా?"
"ఏం తిరుగుతారు తల్లీ! పెళ్లాం బిడ్డల్తో ఊళ్ళో బతకాల్సినోళ్ళు, తెల్లారి లేస్తే ఆసాముల పొలాలమీద కూలీ నాలీ సేసుకొని బతకాల్సిన జనం! కుయ్ కుయ్ మంటే పోలీసోళ్ళు! నాయుడుగారి పోలీసులు మక్కెలిరగ తంతుంటే ఎంతకని ఎదురు తిరుగుతారో నువ్వే సెప్పమ్మా!" ముందుకు వంగి రెండు చేతులతో తెడ్లు లాగుతూ అన్నాడు కొండయ్య.
జ్యోతికి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు. సుందరం ముఖంలోకి చూసింది.
"సుబ్బల్నాయుణ్ణి కూడా ప్రథమశ్రేణి వర్గశత్రువుగా ప్రకటించి వెంటనే కార్యక్రమం అమలు జరపాలి!" సత్యం ఉద్రేకంగా అన్నాడు.
"ఇప్పట్లో అది సాధ్యం కాదు. పోలీసు క్యాంపు ఉన్న ఊళ్ళో ప్రవేశించే బలం ప్రస్తుతానికి మనకు లేదు. ఇంకా మనం కొంతకాలం ఆగాలి!" సుందరం సాలోచనగా అన్నాడు.
"అయితే సుందరంబాబూ! నాకు తెలవకడుగుతా! రెడ్డప్పనాయుణ్ణి సంపితే పోలీసులు ఆరికి వత్తాసు వస్తారని తవరికి తెలవదాబాబూ!"
"తెలుసు."
"మరి తెలిసీ ఆ పనెందుకు చేశారు బాబూ!"