12 వవారం సీరియల్
నేను భరించరాని ఆవేశంతో "ఏం పోతుందని అడుగుతున్నావా? నీలాంటి నీతీ జాతీ లేనివాళ్లందరూ స్కూళ్ళు పెట్టి, పిల్లలకి కనీస మర్యాదలూ, పద్ధతులూ నేర్పకుండా, రేపటి గూండాలుగా, దేశానికి పట్టే చీడపురుగులుగా తయారుచేస్తుంటే... అందులో పనిచేసే ఉద్యోగులకి ఇంక పోవడానికి ఏమీ మిగలదు!
వాడో పెద్దమనిషీ... నీదో విద్యాలయం... ఆవిడో ప్రధానోపాధ్యాయురాలూ! ఛీ...ఛీ... మూడురోజులు మీ మధ్యన వున్నందుకే నాకు కంపరంగా వుంది!" అని నేను ఆ పిల్లవాడివైపు చూశాను.
వాడు భయంగా వెనక్కి జరిగాడు!
"ఇందాక నన్ను వేసిన ప్రశ్న ఇంటికి వెళ్ళి మీ అమ్మనీ, నానమ్మనీ, అక్కనీ , వాడిననీ అడుగు, జవాబు చెప్తారు!" అని వాడికి ఆ జన్మనిచ్చిన తండ్రివైపు పరమ చీత్కారంగా చూశాను.
"ఎక్కువ మాట్లాడుతున్నావ్... ఏదో అంటూ వేలు ఊపబోయాడు కౌన్సిలర్. నేను అతడి కళ్ళల్లోకి సూటిగా చూసేసరికి వేలు ముడిచేశాడు.
నేను ప్రిన్సిపాల్ వైపు వెళ్లి "ఏ స్టేట్ నికి డిగ్రి ప్రదాసం చేసిందో అక్కడికెళ్లి దాభా పెట్టుకుని బ్రతుకు! అంతేగానీ ఇక్కడ పిల్లల భవిష్యత్తుని అన్యాయం చెయ్యకు... వస్తా!" అని విసురుగా వెనక్కి తిరిగ వస్తూ వుంటే, కౌన్సిలర్, సారూ షాక్ లోంచి కోలుకుండానే ప్రక్కకి తొలగి దారిచ్చారు.
నేను స్టాఫ్ రూమ్ లోకి నడిచి బ్యాగ్ అందుకుని "గుడ్ బై ఫ్రెండ్స్!" అన్నాను.
టీ చర్లంతా దిగులుగా చూస్తూ లేచి నిలబడ్డారు.
గెట్ వైపు అడుగులు వేస్తుంటే "మేడమ్" అన్న పిలుపు వినిపించింది.
తలతిప్పాను కొందరు పిల్లలు నిలబడి బిక్క మొహాలతో "రేపట్నించీ రారా మేడమ్?" అన్నారు.
ఆ మూడురోజుల అనుబందానికే వారి కళ్ళల్లో నా పట్ల ఏర్పడిన ఆరాధన తడిగా మెరుస్తూ కనిపించింది. పిల్లలు లతల్లాంటివారు.
సరైన ఆధారం చూపించి పైకి ఎగబాకించాల్సిన బాధ్యత పెద్దలదే! వారిని చూసి నేను నవ్వబోతే కంట నీరు తిరిగింది! ఈ వ్యవస్ధలో ఏవిటి వారి భవితవ్యం? అనిపించింది.
'నెలరోజులు నిలకడగా చేసి జీతం అందుకున్నాక చెప్తాను కంగ్రాట్స్! అన్న విజయమాటలు గుర్తొచ్చాయి ఆటోపిలిచి ఎక్కి కూర్చున్నాను ఏడుపు రావడంలేదు కానీ చాలా దుగ్దగా వుంది!
కళ్ళు మూసుకుంటే ఖద్దరు లాల్చీవాడూ, స్కూల్లో సారూ, తన్మయీ, వివేక్ అందరూ నన్ను చూసి వెక్కిరిస్తున్నట్లే అనిపిస్తోంది!
స్కూల్లో ఉద్యోగపర్వం అలా ముగిసింది.
ఇంటికి వెళ్ళి తలకి అమృతాంజనం రాసుకుని పడుకుండిపోయాను.
ఫోన్ మోగితే మెలకువొచ్చింది.
విజయ గొంతు "హలో.... ఏవిటి కాలేజ్ విషయం మర్చిపోయావా?" అంది.
నేను భారంగా "ఒంట్లో బాలేదు" అన్నాను.
"ఏవైందీ?"
బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది"
"ఏవిటీ? బెడ్ ప్లెజర్ ఎక్కువైందా?" అది చిలిపిగా నవ్వుతూ అడిగింది.
"నీకన్నీ జోక్సే "విసుక్కున్నాను.
"పావుగంటలో మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను. రెడిగా వుండు" విజయ ఫోన్ పెట్టేసింది.
నాకు నిజ్మగా ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ విషయం అప్పటిదాకా గుర్తె రాలేదు! తప్పదని లేచి తయారవుతుంటే, పక్కింటి ఉష వచ్చింది.
"రండి" అన్నాను.
ఉషచేతిలో ప్లవర్ బొకే వుంది. "ప్రొద్దుట ఎవరో మీకోసం పంపారు" అంటూ అందించింది.
నేను అది చేతిలోకి తీసుకుని దానికి పిన్ చేసిన స్లిప్ చూశాను.
'ఈ కుటీర ముఖద్వార మందే వ్రేలాడి సగము వాడి విరహ తోరణమ్మునై వలవంత సడలి నేల జీ రాడి ఎన్నినాళ్ళు మనుదునో!'
నీ ఎస్.... నాకు ఆ 'ఎస్' ఎవరో అర్ధం కాలేదు. సారథా? సమీరా? లేక ఎదురింటి శ్యామలరావా? అసలు తనకి కృష్ణశాస్త్రి గారంటే ప్రాణం అని తెలిసిన ఆ 'ఎస్' ఎవరూ?
బోకేలోని రజనీగందాపూలు నన్ను చూసి నవ్వుతున్నాయి. వాటిని మరోసారి పరీక్షిస్తుండగా విజయవచ్చేసింది. బ్యూటిపార్లర్ నుండి వస్తున్నట్లుంది చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది.
"ఏవిటే పది లంఖణాలు చేసినట్లు ఆ ముఖం?" అని అడిగింది.
రెడిగా వుంచిన కాఫీ ప్లాస్కులోంచి పంచి అందిస్తూ "ఉద్యోగం మానేశాను" అన్నాను.
విజయ కాఫి సిప్ చేస్తూ నెమ్మదిగా నవ్వి "రిజైన్డా? టెర్మినేటేడా?" అంది.
నేను ముఖం చిట్లించి "ఎలాగూ తీసేస్తారు అందుకే నేనే త్వరపడి మానేస్తున్నానని చెప్పాను. ఎపాయింట్ మెంట్ ఆర్దర్లూ. రిజిగ్నేషన్ లెటర్లూ అవసరంలేదు ఇలాంటి చిన్నచిన్న ఉద్యోగాలకి....అసలూ ఏవైందంటే...." అని చెప్పబోయాను.
అదినాకు చేయి అందిస్తూ "ఎనీ హౌ కంగ్రాట్స్! మరి ఎప్పుడిస్తున్నావు పార్టీ?" అంది.
నేను కినుకగా చూశాను.
అది పక్కున నవ్వి "నా లావణ్య ;లతికా... పద... కాలేజ్ కి వెళ్ళాలి" అంది.
"ఎందుకో ఏవిటో వివరాలు తెలుసుకునే పని లేదా?" చిరాగ్గా అడిగాను.
"నాను ఆ విషయం ప్రయారిటి కాదు!" అంది.
వివేక్ కూడా ఇంతే! ఇద్దరికిద్దరూ మొండిఘటాలు. నా సున్నితమైన మనసుని అర్ధం చేసుకోరు.
ఇద్దరం క్రిందకి దిగి కారు ఎక్కాక, సార్ట్ చేస్తూ అంది విజయ-" వివేక్ చాలా గ్రేట్!"
"ఏం?" అన్నాను.
"ఆ బాస్ ఎవడో గానీ నిన్ను మూడురోజులు భరించలేకపోయాడు. పాపం వివేక్ ఏడాదిపాటు భారించాడుగా!" అంది.
నేను మాట్లాడలేదు బయటికి చూస్తూ కూర్చున్నాను. "కోపం వచ్చిందా?" అడిగింది.
"కాదు బాధగా వుంది" అన్నాను.
"లీవిట్! కమాన్ చీర్ అప్ బేబీ...ఈ రోజున మన ఓల్డ్ గేంగ్ నీ కలవబోతున్నాం. ఆఁ.... నీకు రామకృష్ణ గుర్తున్నాడా? నీకు ప్రేమలేఖ అందించాడని బెదిరిపోయి ఏడిచావు చూడూ... అతనూ వస్తాడనుకుంటా! నీ బొమ్మ బ్లాక్ బోర్డుమీద వేసి తిట్లుతిన్న డేవిడ్, నీమీద కవిత్వం అల్లి చెప్తూ నీ చుట్టూ తిరిగిన జానకీరాం...." అని విజయ చెప్తూంటే.
నేనూ టీజింగ్ నవ్వుతూ "నువ్వు అడిగావని మేడమీద నుండి క్రిందకి దూకి కాలు విరగ్గొట్టుకున్న బాలకృష్ణా, క్లాసులో ఎప్పుడూ కోతిపనులు చేసే సలీం..." అని అందించాను.
అది ఇంకా హుషారుగా రెచ్చిపోతూ, ఆఁ....ఆఁ... మన రైవల్ పొగరుమోతు నీలూ, శమంతకమణీ, వాగుడుకాయ శ్రీలక్ష్మీ, మోడలింగ్ భామ షీలా అందరూ వస్తారనుకుంటా!" అంది.
ఇద్దరం కాలేజీనాటి పాతరోజులు నెమరేసుకుంటూ కిలకిలా నవ్వుకున్నాం.
పిచుకలు చేసే ఇసుకస్నానాలు, బాల్యంలో మధుర క్షణాలూ, సముద్రపుటోడ్డున రాసీన రాతలూ... గడ్డి పరక ధరించే మంచుముక్కెరా.... ఆవిరైపోవడం అరక్షణం! అనుభూతి మాత్రం జీవితాంతం! ఎన్నో రోజులకి నాలోని భావుకత్వం పురులు విప్పుకుంది!
కమలానెహ్రూ కాలేజ్ కోలాహలంగా వుంది.
విజయ కారు పార్క్ చేశాక ఇద్దరం లోపలికి వెళ్తూంటే...
"వన్ మినిట్ మేడమ్...." అని ఓ అబ్బాయి చిన్న పుస్తకం, బాల్ పాయింట్ పెన్నూ అందించాడు.
"లోపల మీ పాత ఫ్రెండ్స్ కనిపించినప్పుడు మీ అడ్రెస్ లూ , ఫోన్ నెంబర్లూ మార్చుకోవడానికి!" నవ్వుతూ చెప్పాడు.
"ఎక్సిలెంట్ ఐడియా!" విజయ మెచ్చుకుంది.
నేను కళ్ళతో అదే భావాన్ని వ్యక్తీకరించాను.
ఇద్దరం లోపలికి నడిచాం. కుర్చీలన్నీ నిండిపోయి వున్నాయి.
అందరూ తెలిసినట్లే పలకరింపుగా నవ్వుతున్నారు.కానీ ఎవర్నీ గుర్తు పట్టలేకపోతున్నాం.
విజయ ఎవరెవర్నో పలకరిస్తూ అలా ముందుకి సాగిపోయింది. నేను చివరే మిగిలిపోయాను దానికి పుషింగ్ నేచర్ ఎక్కువ! నేను ఖాళీకుర్చీ ఒకటి చూసుకుని కూర్చున్నాను.
అక్కడ వరుసగా వున్న అశోకా చెట్లకి రంగురంగుల బల్బులు పెట్టారు. ఆ చెట్లు మేం చదివేరోజుల్లో చాలా చిన్నవిగా వుండేవి!
అప్పట్లో ఇంకా బిల్డింగ్ పూర్తవక చెట్లక్రింద కూడా క్లాసులు తీసుకునేవారు. ఆ రోజులు గుర్తుకు రాగానే నాకు ఒళ్ళంతా పులకించింది.
టీనేజ్... చాలా తీయని ఏజ్! ఎన్నెన్ని ఊహలూ? ఎన్నెన్ని కబుర్లూ? బస్ స్టాపుల్లో కబుర్లు చెప్పుకుంటూ వుంటే బస్ వచ్చి వెళ్ళిపోయేది!
క్లాస్ రూమ్ లో కబుర్లలో పడ్తే లెక్చరర్స్ వచ్చి వెళ్లిపోయేవారు! సినిమాహల్లో చెవులు కొరుక్కుంటుంటే సినిమా శుభం కార్డు పడిపోయేది! అయినా తెగని కబుర్లు.... అంతులేని అల్లరి!
ఊహలన్నీ విహంగాలై నామనోవీధిలో స్వేచ్చగా సంచరిస్తున్న అనుభూతి కలిగింది! చేతిలో వున్న పుస్తకంలో ఇలా వ్రాశాను.
'తీయ తేనియ తలపులే బోయీలై....
మల్లెల మధురోహల మేనాలెత్తిన వేళ...
స్వప్నవీధుల గుండా స్వర్గం దారి వెతుకులాడుచుండగా....'
ఆ తరువాత ఓ వాక్యం వ్రాస్తే కవిత అర్ధవంతమవుతుంది. కానీ....అందడంలేదు. ఆలోచిస్తుంవుండగా-
"అనూ...అనూ..." అని విజయ దూరంనుండి క్లాప్స్ కొడుతూ నన్ను పిలిచింది.
ఒడిలో వున్న పర్సూ , పుస్తకం కుర్చీమీదే పెట్టి నేను దానివైపు నడిచాను.
అది ఓ లావుపాటి ఆవిడతో మాట్లాడ్తోంది.
"మన కాత్యాని గుర్తుపట్టావా? గాలి వీస్తే ఎగిరి పోయేట్లు వుండేది. ఎంత లవైందో చూడు!" అంటూ విజయ నవ్వుతోంది.
నేను కాత్యాయనిని గుర్తుపట్టి స్నేహపూరితంగా చేయి పట్టుకున్నాను.
"అనూహ్య మాత్రం అసలు మారలేదు! అదే నాజూకుతనం ...నెమ్మదీ!" అంది కాత్యాయని.
కాత్యాయని భర్త సినిమాలు తీస్తాడుట. మొదటి కాన్పులోనే కవలపిల్లలుట. "మీ ఆయనేం చేస్తారూ?" అడిగింది.
నేను దాని చెవులదుద్దులు పట్టుకుని "రవ్వలా?" అని అడిగాను.