Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 31


    ఆ భూతరాజుగాడూ, రహమాన్ గాడూ, నా మైండును వశం చేసుకొని అనేక భయాల్ని కలుగ చేశారు.

 

    మన ఆలోచనలే అన్ని భయాలకూ ఉద్గమ స్థానం.

 

    మనసులోనే అంతా ఉంది.

 

    ఇలా నిలబడే ఆలోచిస్తున్నానేం?

 

    గబగబా ముందుకు అడుగులు వేశాను.

 

    పెద్ద పెద్ద మెట్లు ఎక్కుతున్నాను.

 

    ఇదో పెద్ద జమీందారు దివాణమే! సందేహం లేదు. ఆ గేటేమిటి? ఈ మెట్లేమిటి?

 

    తలుపుల దగ్గర ఓ క్షణం నిల్చున్నాను.

 

    లోపల ఎలాంటి అలికిడి లేదు.

 

    తలుపుల మీద చెయ్యి వేశాను.

 

    గట్టిగా తట్టనేలేదు.

 

    రెండు తలుపులూ బార్లా తెరుచుకున్నాయి.

 

    లోపలంతా చీకటి.

 

    మరో నీడ!

 

    చీకట్లో ముందుకు పోతోంది.

 

    నేను దాన్ని అనుసరించాను.

 

    మళ్ళీ తలుపులు తెరుచుకున్నాయి. అదొక పెద్ద హాలుగా కన్పించింది.

 

    తలుపులు తెరిచిన నీడ హాల్లో నుంచి ఎటు వెళ్ళిందో చూడలేదు.

 

    ఈ నీడ లేమిటి? ఈ గొడవేమిటి?

 

    నీడలు కాదు.

 

    మనుష్యులే!

 

    కాని ఒకడూ మాట్లాడి చావడేం?

 

    మళ్ళీ వెనకనుంచి తలుపులు మూసుకున్న కిర్రు శబ్దం.

 

    గిర్రున వెనక్కు చూశాను.

 

    ఎవరు మూశారు?

 

    ఆ నీడగాడేడీ?

 

    వాడే మూసి బయటికెళ్ళిపోయాడా?

 

    వాడు వెనక్కు వెళ్ళినట్టు లేడే ! నా ముందే వెళ్ళాడుగా?

 

    స్ప్రింగ్ డోర్స్ అయివుంటాయి.

 

    ఈ ఇంటికి స్ప్రింగ్ డోర్సేమిటి ? నాకూ మతిపోయినట్టుంది.

 

    ఉన్నట్టుండి సన్నటి వెలుగు ఎక్కడ్నుంచో నేను నిల్చున్న హాలులో పరుచుకుంది.

 

    పాతకాలపు చెక్క ఉయ్యాల హాలుకు మధ్యగా వేలాడుతోంది.

 

    ఎంత పెద్ద ఉయ్యాల?

 

    ఆ గొలుసులు కూడా ఏనుగుల్ని కట్టేసే గొలుసుల్లాగే ఉన్నాయ్.

 

    హాలంతా కలయజూచాను.

 

    గోడల మీద రంగులు మాసిపోయిన కొన్ని చిత్రాలున్నాయి. భైరవమూర్తిగారి పెద్దల చిత్రాలు కాబోలు! ఆ ఉయ్యాలా, ఆ గోడ మీది చిత్రాలూ, అక్కడున్న ఫర్నీచరూ గత వైభవాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఉన్నాయి.

 

    ఎదురుగా ఉన్న గోడకేసి చూసి తృళ్ళిపడ్డాను.

 

    వాడెవడు?

 

    నా పోలికలున్నట్టుగా ఉన్నాడు !

 

    "ఎవరు నువ్వు?"

 

    అతడూ పెదవులు కదిలించాడు. అయితే ఆ మాటలు నాకు విన్పించలేదు.

 

    ఒకడుగు ముందుకు వేశాను.

 

    అతనూ ఒకడుగు ముందుకు వేశాడు.

 

    నేను చెయ్యి ముందుకు చాచాను.

 

    అతడూ చెయ్యి ముందుకు చాచాడు.

 

    'కెవ్వు' మణి అరిచి రెండడుగులు వెనక్కు వేశాను.

 

    వెనక నుంచి చిన్నపాటి ఉరుములాంటి నవ్వు విన్పించింది.

 

    గిర్రున వెనక్కు తిరిగాను.

 

    అతను నవ్వుతున్నాడు. విరగబడి నవ్వుతున్నాడు.

 

    "ఏం, ఎందుకలా నవ్వుతావ్?" కీచుమన్నది నా గొంతు.

 

    "అద్దంలో నీడ చూసుకొని భయపడేవాడివి ఇంత అర్దరాత్రి ఇంతదూరం ఎలా ప్రయాణం చేశావ్?"

 

    అది అద్దమా? అడగలేదు. మనసులోనే అనుకున్నాను.

 

    వెనక్కు తిరిగి మళ్ళీ చూశాను.

 

    అప్పటికి ఆ హాల్లోకి పూర్తిగా వెలుగు వచ్చింది. ఇంత వెలుగు ఎక్కడ్నుంచి వచ్చింది?

 

    ఎదురుగా అద్దం!

 

    అద్దంలో నా ప్రతిబింబం చూసుకొని గతుక్కుమన్నాను.

 

    ఒక్కరాత్రికే నాలో ఇంత మార్పు వచ్చిందా?

 

    ఇది నా ప్రతిబింబమా?

 

    నా మానసిక స్థితిలో వచ్చిన మార్పే నా ముఖంలోనూ కన్పిస్తోంది.

 

    రాత్ర్మతా దయ్యాలతో సహవాసం చేశాను. దయ్యాల మధ్య నుంచి ప్రయాణం చేశాను. విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనైనాను.

 

    "ఇంకా నమ్మకంగా లేదా?" వెనకనుంచి కంఠం గంటలా మోగింది.

 

    అవును. అది అద్దమే!

 

    గోడకు సమతలంలో బిగించి ఉంది. ఆ సమయంలో హాలులో మసక వెలుగు మాత్రమే ఉంది. అందుకే మోసపోయాను.

 

    నేను వెనక్కు తిరిగాను.

 

    అతను నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు.

 

    ఆ కళ్ళేమిటలా ఉన్నాయ్? పిల్లి కళ్ళు మనిషి కళ్ళు కావు. అచ్చం పిల్లి కళ్ళే!

 

    "ఎవరు నువ్వు?" అన్నాను.

 

    "ఎవరికోసం వచ్చావ్ !"

 

    "భైరవమూర్తిని చూట్టానికి."

 

    "నేనే ఆ భైరవమూర్తిని" అంటూ వెళ్ళి ఉయ్యాలలో కూర్చున్నాడు.

 

    నేను కళ్ళు వెడల్పు చేసుకొని చూశాను.

 

    మళ్ళీ ఇక్కడో సస్పెన్సు కాబోలు !

 Previous Page Next Page