"అయ్యో! నేనేం చెయ్యడం ఎంత మరిచిపోదామన్నా నాట్యం అనగానే. ఆ పేరుతో ఆ దొంగవెధవే జ్ఞాపకం వస్తున్నాడు. తన నాట్యాన్ని డబ్బుగా మార్చుకున్న కిరాతకుడు. అందుకే, నాట్యం మీదే అసహ్యం పట్టుకొంది." బాధపడింది రాధిక.
"కానీ, మధన్..... తన భర్త..... కాదు తనపాలిట దేవుడు. పూర్తిగా బురదలోపడి మునిగిపోకముందే, తనకి పునర్జన్మనిచ్చి, కాపాడాడు. అటువంటి మహానుభావుడికి, మాట నిలబెట్టేందుకుగానూ ఒక్కసారి నాట్యం చేస్తే ఏమవుతుంది? భర్తకోరిక తీర్చడం భార్య బాధ్యత. ఆపాటి చెయ్యననడం తన బలహీనత, మూర్ఖత్వం" అనుకుంది. తనని తానే నిందించుకుంది. బాగా ఆలోచించాక నాట్యం చెయ్యడానికే నిశ్చయించుకుంది. అలా ఒక నిర్ణయానికి రాగానే. మనసు తేలికపడింది. హాయిగా నిద్రపోయింది.
ఆరోజు రానే వచ్చింది. గజ్జెకట్టి, మయూరిలా స్టేజి అంతా ఆక్రమించుకుంది రాధిక, ఆమె హావభావాలని తన్మయత్వంతో చూస్తున్నారందరూ ఏ రంభో, ఊర్వశో దివి నుండి దిగి వచ్చి నాట్యం చేస్తున్నట్టుగా మధన్ కూడా, ఆమెనిదివరకెన్నడూ చూడనంత కొత్తగా చూస్తున్నాడు. ఆమెలోని అద్భుతమైన నటనా కౌశల్యానికి ఆశ్చర్యపోతూ.
కరతాళధ్వనులమధ్య నాట్యం పూర్తయింది. జనం గొల్లున స్టేజీవైపుకు వెళ్ళారు, ఆటోగ్రాపులు పుచ్చుకుని, ప్రెస్ వారు క్యూలో నుంచున్నారు ఇంటర్వ్యూలకోసం, వారందరికీ తానే ఏదో ఒక విధంగా సమాధానం చెప్పి, పంపించేశాడు మధన్.
అనేకవిధాల అభినందిస్తూ సెలవు పుచ్చుకున్నారు రామచంద్రరావు దంపతులు.
చల్లనిపిల్లగాలులు మొహానికి తగిలి హాయిగలిగిస్తూ వుంటే, డ్రైవ్ చేస్తూన్న మధన్ భుజాలమీదికొరిగి సేదదీర్చుకుంటోంది రాధిక. మధన్ కోరిక తీర్చానన్న తృప్తి ఆమెను ఆనందంతో ముంచేస్తోంది. కానీ మధన్ ఇవేవీ గమనించకుండా దీర్ఘాలోచనలలో వుండడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
"ఏమిటి? అంత ఆలోచన?" అతని చెంపలకి తన చెంపలానిస్తూ అంది.
'హాయిగా విచ్చలవిడిగా తిరుగుతూ, తన నాట్యంతో యావత్ ప్రపంచాన్నీ మురిపించే మయూరిని, పంజరంలో బంధిస్తే ఏం బాగుంటుంది?" క్రీగంట రాధికని చూస్తూ అన్నాడు మధన్.
రాధిక మొహం ముడుచుకుపోయింది. ఉత్సాహమంతా నీరుగారిపోయింది. మధన్ మీద తొలిసారిగా ఒక రకమైన కోపం కూడా వచ్చింది.
"ఎండకి ఎండుతూ, వానకి తుడుస్తూ, ఏ చెట్టుకిందో. ఏ గుట్టమీద తలదాచుకుంటూ, అడవిలో ఆడే మయూరి నాట్యం అందరూ ఆనందిస్తారు. ఆ అడవిలో అది తిందో తినలేదో. ఎవరికీ పట్టదు. అంతకన్నా, వేళకింత తిండిపెట్టి. నీడపాటున పంజరంలో దాచిపెట్టే యజమాని నీడుంటే చాలు"
"ఆ యజమాని తన ఆనందం కోసం, ఆ మయూరి ఆడమంటే పాపమా?
అదొక నేరమా?
"తన ఆనందం కోసం ఆడించుకుంటే పాపముకాదు. నీచమూ కాదు. కానీ, పదిమందిలో ఆడించడం సమంజసంకాదు."
"ఏం?.... ఆ సంతోషంలో పదిమంది పాలుపంచుకుంటే ఆ యజమానికి గర్వం కదా?"
"తన స్వార్థం కోసం. పక్షిని బలిచెయ్యడం అన్యాయమే అవుతుంది. మధన్! ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు? నీ మనస్సులో వున్నది నిర్భయంగా చెప్పండి. తాళికట్టి నన్ను కాపాడి యాజమాన్యం వహిస్తూన్న మీకు, ఈ దాసీ కృతజ్ఞతతో ఏమైనా చేస్తుంది. నాట్యప్రదర్శనలిస్తుంది. డబ్బు సంపాదించి పెడుతుంది సరేనా?" ఆవేశంతో చెప్పుకుపోతోంది.
"రాధీ..... ఆపు నీ ఉపన్యాసధోరణి. కామెర్లరోగిలాగా, ఒకే దృష్టితప్ప మరోలా ఆలోచించలేకపోతున్నావు. ఎంతసేపూ డబ్బూ.... డబ్బూ..... ఎవరిక్కావాలి నీ డబ్బు..... ఇంత కళాశక్తి నీలోవుండి పనికిరాకుండా పోతోందే అనే నా ఆవేదన కానీ, నీ నాట్యంతో నేను లక్షలు సంపాదించాలని కాదు." ఉద్రేకంతో మందలించాడు మధన్.
"హూ.... నాలోని కళ నాశనమైపోతోందనే, తపన తప్ప నేనేమైపోతానో నన్న బాధ మీకులేదు. గొర్రెను కోసిదాని మాంసాన్నమ్ముకుని, ఈ జీవనం సాగించే కసాయివాడికి, ఆ మాంసం ఎంత రుచికరమైనదో చెప్పి ప్రచారం చెయ్యడం తప్ప. కోస్తున్నప్పుడు ఆ గొర్రె పడ్డ బాధ, దానిరోదన వాడి కనవసరం."
"రాధీ ఆ..... చివరికి నన్నొక కసాయివాడికింద జమకట్టావన్నమాట నిన్ను నాట్యం చెయ్యమని ప్రోత్సహించడం, నీకొక గుర్తింపు రావాలని అనుకుంటున్నాను కదూ!" ఈ జన్మలో మరోసారి నిన్ను నాట్యం చెయ్యమని అడగను. అభిమానమంతుడెవడూ, నీలా వక్రంగా ఆలోచించే వారి ముందు మళ్ళీ మాట్లాడడు. నీ ముందు ఆదర్శాలు వల్లెవెయ్యడం చెవిటివాడి చవిలో శంఖం ఊదినట్టే, ఛీ..... ఛీ" కారు స్పీడు హెచ్చించాడు విసుగ్గా మధన్.
"అభిమానం మీ ఒక్కరికే కాదు. నాకూ వుంది. పైగా మీరు నన్ను ఆపదలో నుంచి రక్షించి, పెళ్ళి చేసుకుని ఆదరిస్తున్నందుకు మీకోరిక తీర్చే బాధ్యతా, నా పైన వుంది. రేపటి నుంచి ప్రతిచోటా నాట్య ప్రదర్శనలివ్వడానికి ఒప్పుకుంటాను."
"వీల్లేదు."
"ఏం?"
"నా పర్మిషన్ లేకుండా నీవలాంటి పనిచెయ్యలేవు."
"ఓ.... భర్తగా అధికారం చెలాయిస్తున్నారా?
"అవును."
"అయితే భార్యగా నా హక్కును వినియోగించుకుంటున్నాను. తప్పకుండా నాట్యం చేస్తాను."
"నాట్యం చేసి, నేచేసిన సహాయానికి ఋణం తీర్చుకుంటావా? ఎంత డబ్బిచ్చి తీర్చుకుంటావేమిటి ఋణం?"
"నేబ్రతికున్నంతవరకూ సంపాదించి ఋణం తీర్చుకుంటాను.