అవును - మాధవి తల తన తలకంటే ఎత్తుగానే వుంటుంది!
మాధవి రూపాన్ని మూసుకున్న కళ్ళతో వూహా లోకంలో చూస్తూంది. మంచి ముత్యంలా నీడలు తేలే తెల్లని రంగు, బొద్దుగా, లంగా ఓణిలో వుంది. గోరింటాకుతో పెట్టిన పారాణితో ఆ తెల్లటి పాదాలు కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళలో ఎంత కుతూహలం దాచుకున్నదో! చెవులకు వేలాడుతున్న జుమికీలు చెంపలతో సయ్యాటలాడుతున్నాయి. కళ్ళచుట్టూ వున్న కాటుక ఆ కళ్ళకు మరీ పెద్దవిచేసి చూపిస్తుంది. ఎర్రగా కెంపులా వున్న పెదవులు, కళ్ళలో కాంతి, హృదయంలో ఆర్తి, పెదవుల్లో అగ్ని-
కారు ఒక్కసారిగా ఆగి కదిలింది, అరుంధతితోపాటు ఆమె కళ్ళలోవున్న రూపంకూడా కదిలిపోయింది.
ఆ వయస్సులో తనకూ అలాగే వుండేది. ఆ వయసులోవున్న ఆడపిల్లలందరికీ అలాగే వుంటుంది. తెలిసీ తెలియని తలపులూ, కోరికలూ, బుర్రలో అల్లిబిల్లిగా తిరుగుతూ వుంటాయి. కాదు.... తనకూ తన కూతురి స్వభావానికీ చాలా భేదం వుండి వుండాలి. తనకు చాలీచాలని విద్యతో లభించిన తెలిసీ తెలియని జ్ఞానం వుండేది. మమకారం, ప్రేమా, వాత్సల్యాలకు దూరంగా, బస్తీ ఆకర్షణల్లో తను పెరిగింది.
తన బిడ్డ అలాకాదు. కావటానికి వీల్లేదు. తనను వున్నపాటున అలా రమ్మనటానికి కారణం ఏమిటో? ఉండి ఉండి ఆ ప్రశ్న ఆమె మనస్సులో పురుగులా తొలుస్తున్నది.
మాధవిని తను పెళ్ళికూతురులా చూస్తుందేమో! బుగ్గన కాటుక చుక్కతో, మోకాలిమీద గడ్డం ఆనించి కూర్చున్న మాధవి కనిపించి తనువెల్లా పులకించిపోయింది అరుంధతికి. వాత్సల్యంతో హృదయం తొణికిసలాడింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కారు అరవై మైళ్ళ వేగంతో పోతూంది.
32
"వాడెవడో చెప్పు!" నిలువెల్లా వణికిపోతూ ఓ మూల నిల్చున్న మాధవి చెంప చెళ్ళుమంది.
"నువ్వు నా కూతురివి కాదు. నిజమే. నా బిడ్డయితే, నా రక్తం పంచుకొని పుట్టిన దానివైతే ఇంత నైచ్యానికి పాలుపడవు." సీతాపతి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. కోపంతో ముక్కోళ్ళు అదురుతున్నాయి.
"నువ్వు ఆ అమ్మ కూతురివే! ఇద్దరూ నా వంశానికి రెండుమచ్చల్లా దాపరించారు" కోపంతో మాటలు రావడంలేదు.
శాంతమ్మ మంచంలో పడివుంది. లేవలేనిస్థితిలో వుంది. అసహాయంగా, గాజు కళ్ళలా వున్న కళ్ళలో నీరు నింపుకుని కప్పుకేసి చూస్తూ పడుకొని వుంది.సీతాపతి మాధవి గొంతు పట్టుకున్నాడు రెండు చేతుల్తో. కోపంలో పిచ్చివాడే అయిపోయాడు. మాధవి వుక్కిరిబిక్కరవుతూ విడిపించుకోవటానికి పెనుగులాడుతూంది.
"బాబూ సీతాపతీ!" ఓపిక ఏనాడో ఉడిగిపోయిన ఆ కంఠంలోకి ఎక్కడనుండి వచ్చిందో పిచ్చిబలమే వచ్చింది. గావుకేక పెట్టింది శాంతమ్మ.
సీతాపతి చేతులు ఆ కేకకు అప్రయత్నంగానే విడిపోయాయి. తను చేస్తున్నదేమిటో అర్ధం చేసుకొనే స్థితికి వచ్చాడు. మాధవి నీరసంగా గోడవారకు జారగిలపడి కూచుంది. ఉక్కిరి బిక్కిరవుతూంది కొద్ది క్షణాలు మాధవివైపు కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు.
ఈ పిల్ల నిజంగానే తన పిల్ల కాదు. తన బిడ్డయితే నిజంగానే ఇంత పాడుపని చెయ్యదు. ఇంతకాలం ఈ బిడ్డ తన బిడ్డ అవునా కాదా అనుకుంటూ- అనురాగం, అసహ్యం, ఈ రెండు విరుద్ధభావాల మధ్యపడి తనహృదయం పళ్ళచక్రం క్రిందపడ్డ చెరకుగడలా విలవిల్లాడిపోయింది. ఇప్పుడు తనకు సందేహనివృత్తి అయింది. ఈ బిడ్డ తన బిడ్డకాదు. కాని లోకానికి ఈ సత్యాన్ని ఎలా తెలియచేస్తాడు? లోకం తనను పిచ్చివాడి కింద కట్టేస్తుంది. తను నిజంగానే తనదిగాని వస్తువును తనది చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆనాడే తల్లితో పంపించేస్తే తనకు ఈనాటి నరకయాతన తప్పేది. స్వయంకృతాపరాధం, అనుభవించక తప్పదు.
"చెప్పు! ఎవడు వాడు?" గర్జించాడు సీతాపతి.
దెబ్బతిని పడిపోయిన లేడి వేటగాని వైపు చూసినట్లు మాధవి తండ్రి ముఖంలోకి చూసింది. ఆ చూపు అతి దీనంగా వుంది.
"చెబుతావా లేదా?" సీతాపతి చెయ్యి గాలిలోకి చివ్వున లేచింది.
"ర....మేష్!"
అర్ధం చేసుకోవటానికి సీతాపతికి ఒక్క నిముషం పట్టింది. "ఎవడూ! ఆ పరంధామయ్య కొడుకేనా? పట్నంలో చదువుతున్నవాడు?"
ఔనన్నట్లు తల వూపింది మాధవి.
సీతాపతి రెండు చేతుల్లోనూ తల పెట్టుకుని కూలబడిపోయాడు నట్టింట్లో. తను ఆ పిల్లను వీధి ముఖం ఎరక్కుండా పెంచాడే? ఎంత కట్టుబాట్లలో పెంచినా ఇలా జరిగిందేమిటి? అన్నీ తల్లి గుణాలే!
"వాడు నీకెలా తెలుసు? ఇక్కడికెలా వచ్చాడు?" సీతాపతి కంఠం కంచులా ఖంగ్ మంది.
మాధవి తల వంచుకొని కూచుంది మూర్తీభవించిన కరుణలా.
"చెప్పు!" గర్జించాడు సీతాపతి.
"మధ్యాహ్నం ఏమీ తోచకపోతే అప్పుడప్పుడు వీధిగడపలో నిల్చునేదాన్ని. ఒకటి రెండుసార్లు అతను నాకు ఎదురుగా వచ్చి నిల్చుని అదోలా నవ్వాడు. నేను వెంటనే తలుపులు వేసి లోపలకు వచ్చేశాను. ఒక రోజు వాళ్ళ తమ్ముడు ఒక వుత్తరం పట్టుకొచ్చాడు. అతను నన్ను ప్రేమిస్తున్నానని రాశాడు. నేను చాలా అందంగా వుంటానని, పెళ్ళి చేసుకుంటానని కూడా రాశాడు. నేను జవాబివ్వలేదు. వారంరోజుల తరువాత ఎంతో బాధను వ్యక్తంచేస్తూ రాసిన మరో వుత్తరం పంపించాడు. నేను అంగీకరించకపోతే-నల్లమందు తినేస్తానని రాశాడు. నాకు భయం వేసింది. అందుకే నేను కూడా అతన్ని ప్రేమించాను." బెక్కుతూ అమాయకంగా జవాబిచ్చింది మాధవి.
"అప్పుడే నాకెందుకు చెప్పలేదు?"
"నువ్వంటే నాకు భయం. నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడవుగా?" అంది మాధవి.
"ఆ ఉత్తరం వుందా?" సీతాపతి ఆలోచిస్తూ అడిగాడు.
"లేదు. రమేషే అడిగి తీసుకొని చింపేశాడు."
సీతాపతి తల పంకించాడు. ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా దిగ్గున లేచి నిల్చున్నాడు.
"మనం ఆడపిల్లవాళ్ళం. నిదానంగా, మంచిగా, అవసరమైతే ప్రాధేయపడి అయినా వాళ్ళను ఒప్పించాలి" అంది శాంతమ్మ నీరసించిన స్వరంతో.
పరంధామయ్యను తను ప్రాధేయపడాలా? ఒకప్పుడు తినటానికి లేని పరంధామయ్య దగ్గర తను దేవురించుకొని నిలబదాలా? తన ఇంట్లో చిన్నపనీ, పెద్దపనీ చేసిన పరంధామయ్య ముందు తను దీనంగా నిలబడాలా? కాళ్ళు ముందుకు పడటం లేదు. మనస్సు అభిమానంతో ఎదురు తిరుగుతూంది. అలసటగా వీధి అరుగుమీద కూలబడిపోయాడు.
మాధవి అమాయకురాలు. ప్రపంచం తెలియకుండా పెరిగింది. చదువు సంధ్యలు లేవు. తల్లి నీడనుంచి దూరం అయింది. తండ్రిప్రేమకు కూడా నోచుకోలేదు. తను ఒక్కనాడూ ఆ పిల్లను కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలుకరించలేదు. తల్లిమీద కసి పసిదాని మీద తీర్చుకుంటూ వచ్చాడు. ఆ పసిప్రాణం ఎదుటపడితే నిలువెల్లా కంపించిపోయేది. ఆ పిల్ల అలా వణికిపోతుంటే తనకు జాలి కలిగేదికాదు. కనీసం నాయనమ్మ ప్రేమకుకూడా నోచుకోలేదు. ఆమెకు ఏనాడో విరక్తి వచ్చేసింది. ఎప్పుడూ జబ్బుతోనే తీసుకుంటూ వుండేది. మాధవిని ఎన్నడూ మనసారా పిల్చినట్లు తను వినలేదు. తన పిల్ల కాదని తనకు తెలిసినప్పుడే ఆ పిల్లను తల్లితో పంపించి వుండాల్సింది. ఆ పసిప్రాణాన్ని నరకంలోకి తోసే హక్కు తనకేముందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. తన తల్లికి కాలూ, చెయ్యీ కూడా పడిపోయాయి. మంచం పట్టిపోయింది. తను పొద్దున పొలం వెళితే రాత్రికి కాని వచ్చేవాడుకాడు. ఆ పిల్లకు వయసు వచ్చిందని తను ఆలోచించనే లేదు. తనకు అన్నం వడ్డించి అవసరమైన వస్తువులన్నీ పక్కన పెట్టేసి తను తప్పుకునేది. ప్రేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన అమాయకురాలు! ఎవరో ప్రేమిస్తున్నారంటే నమ్మింది. సీతాపతి మనస్సుకు తన కర్తవ్యం తోచింది. అరుగు దిగి పరంధామయ్య ఇంటికేసి నడవసాగాడు.
పరంధామయ్య ఇంటిముందు నిల్చుని కేకవేశాడు. పరంధామయ్య "ఎవరూ?" అంటూ బయటకు వచ్చాడు. సీతాపతి చూసి ఆశ్చర్యపోయాడు. పద్నాలుగు సంవత్సరాలుగా రచ్చబండ వైపుకు కూడా రావటం మానేసిన సీతాపతి తన యింటికి ఎందుకు వచ్చాడా అని ఆలోచనలో పడ్డాడు పరంధామయ్య.
"మీరా? రండి లోపలకు." ఇష్టం లేకపోయినా ఆహ్వానించాడు పరంధామయ్య.
"నీ కొడుకు చేసిన ఘనకార్యం విన్నావా?"
"ఏమిటి! ఏం జరిగింది?" ఆదుర్దాగా ప్రశ్నించాడు పరంధామయ్య.
"వాడెక్కడ?"
"కాలేజీలు తెరిచారుగా! వెళ్ళిపోయాడు. అసలు సంగతేమిటో చెప్పండి."
"నీకేమీ తెలియదా?" పరంధామయ్య ముఖంలోకి గుచ్చిచూస్తూ ప్రశ్నించాడు సీతాపతి.
"అసలు సంగతేమిటో చెప్పండి." విసుగ్గా అన్నాడు పరంధామయ్య.
"మా అమ్మాయికి ఉత్తరాలు రాశాడు."
పరంధామయ్య గుడ్లు మిటకరించి చూశాడు.
"తియ్యటి కబుర్లు చెప్పి మోసం చేశాడు. పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడట. ఇప్పుడు దానికి మూడో నెలట!" అన్నాడు సీతాపతి సగం చచ్చిపోయి.
పరంధామయ్యకు మాటలు దొరకలేదు. అయోమయంగా చూశాడు.
"పరంధామయ్యా! ఇవి చేతులు కావు కాళ్ళనుకో! నా పరువు కాపాడు!" అన్నాడు సీతాపతి, పరంధామయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా.
"క్షమించండి! మావాడు అలాంటివాడు కాడు" అన్నాడు పరంధామయ్య సీతాపతి చేతుల్నుంచి తనచేతుల్ని లాగేసుకుంటూ.
సీతాపతి నెత్తిన పిడుగుపడినట్లయింది. తను భయపడినట్లే జరిగింది. విచ్చిపోతున్న గుండెల్ని కూడదీసుకోవటానికి ప్రయత్నించాడు.
"అలా అనకు పరంధామయ్యా! నా బిడ్డ ఇంటి బయట కాలుపెట్టింది కాడు. అమాయకురాలు. దాన్ని జీవితాన్ని నాసనం చెయ్యకు." అతి దీనంగా వుంది అతని స్వరం.
"కాలు బయట పెట్టకుండానే కడుపొచ్చిందా?"
"పరంధామయ్యా!"
"మీ రంకెలకు భయపడతా ననుకున్నారా? మీరు ఒకప్పుడు నాకు సాయం చేశారు. కాదనను. అది ఆధారంగా తీసుకొని మీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యాలని చూస్తున్నారా?"
"అలా అనకు పరంధామయ్యా! నీ చిన్న కొడుకును పిలువు అడుగుదాం. పసివాళ్ళు అబద్ధం ఆడరు. నీ కొడుకు మా పిల్లకు ఉత్తరాలు రాసేడో లేదో కనుక్కో!"
"కావచ్చు. కాని నా కొడుకులాంటి వాళ్ళను ఎంతమందిని చూసిందో నీ కూతురు."
"పరంధామయ్యా!" బెబ్బులి గర్జించింది.
మాటలు పూర్తి అయి కాకుండానే పరంధామయ్య జుట్టు సీతాపతి చేతిలో వుంది. పరంధామయ్య పిట్టంతమనిషి. సీతాపతి అతన్ని చాకలివాడు బండకు బట్టను బాదినట్లు నేలకు బాదగలడు. పరంధామయ్య భయంతో కేకలు పెట్టాడు.
రెండు నిముషాల్లో చుట్టూ జనం చేరారు. పరంధామయ్యను సీతాపతి బారినుండి విడిపించారు.
"ఏం జరిగింది?" నాలుగు కంఠాలూ ఒకేసారి ప్రశ్నించాయి కుతూహలంతో. చుట్టూవున్న జనం ఆసరా చూసుకొని పరంధామయ్య రెచ్చిపోయాడు.
"ఈయన కూతురికి, అదే ఆ లేచిపోయిన మనిషి కూతురికి, నెల తప్పిందట! ఆ తప్పు నా కొడుకు తలకు కట్టి నా యింటికి ఆ పిల్లను కోడలుగా తోలాలని చూస్తున్నాడు" అన్నాడు పరంధామయ్య.
ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సీతాపతి ఎవరి ముఖంలోకి చూడలేక నిర్విణ్ణుడై నిలబడ్డాడు.
"ఎంత అన్యాయం?"
"అన్నీ ఆ తల్లి బుద్దులేట? మా ఆవిడ అంటూ వుంది."
"మన ఊళ్ళో ఏనాడన్నా ఇంత దారుణం జరిగిందా?"
"అసలు ఆ గుంట కళ్ళు ఎప్పుడూ రోడ్డుమీదే వుంటాయి. ఆ యింటి ముందునుంచి వెళుతూ ఎన్నోసార్లు చూశాను."
"దొంగకు తెలు కుట్టినట్లు ఏ డాక్టరుకో చూపించుకోక ఈ జబర్దస్తీ ఏమిటి?"
"అయినా లేచిపోయినదాని కూతుర్ని పరువుగలవాళ్ళు ఎలా కోడల్ని చేసుకుంటారనుకున్నాడు?"
రకరకాల మాటలు సీతాపతి మనస్సుకు కంకరరాళ్ళలా వచ్చి తగులుతున్నాయి. బరువుగా అడుగులు వేసుకుంటూ ఇంటికేసి నడుస్తున్నాడు. ఆ మాటలు కోటి కంఠాలతో అరుస్తున్నట్లు చెవుల్లో గింగురుమంటున్నాయి. బుర్రంతా మంచుగడ్డలా చైతన్య రహితంగా వుంది. ఇంటికి ఎలా చేరాడో, ఏ స్థితిలో చేరాడో అతనికే తెలియదు. అడుగులో అడుగు వేసుకుంటూ లోపలకు వస్తున్న సీతాపతిని చూస్తుంటే శవం నడచి వస్తున్నట్లనిపించింది శాంతమ్మకు. ఆమెకు పరంధామయ్య జవాబు ఏమిటో కూడా అర్ధం అయింది. పక్షవాతం షాక్ వచ్చింది. అది గమనించటానికి అక్కడ ఎవరూ లేరు. సీతాపతి వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు.
రాత్రి ఇంట్లో పొయ్యి వెలగలేదు. ఎవరి సంగతీ ఎవరూ పట్టించుకోలేదు. మాధవి గదిలో ఓ మూల చాపమీద పడుకొని ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. సీతాపతి రాత్రంతా కళ్ళు తెరుచుకుని అలా మంచంమీద నిలువునా కూచునే వున్నాడు.
ఉదయం శాంతమ్మకు ముఖం కడిగించటానికి వచ్చిన మాధవి "కెవ్వు"న కేక వేసింది. అది విని ముంగిలి వూడుస్తున్న జీతగాడు పరుగెత్తుకొచ్చాడు. శాంతమ్మ కళ్ళు తెరిచేవున్నాయి. నోటి చుట్టూ ఈగలు ముసురుకుంటున్నాయి.
"అయ్యగోరూ! అయ్యగోరూ!" జీతగాడు సీతాపతి గది తలుపుల్ని గబగబా బాదసాగాడు. సీతాపతి యాంత్రికంగా లేచివచ్చి తలుపులు తెరిచాడు.